Previous Page Next Page 
సూపర్ స్టార్ పేజి 31


    మిస్టరీ కొండకు ఊహ అనే వెంట్రుకను కట్టిలాగటం తప్ప వేరే గత్యంతరమే లేదు.

    ఈరోజు నుంచి.... ఈక్షణం నుంచి హైదరాబాద్ నగరంలో జరగబోయే సంఘటనలపై నిఘావేస్తే మరికొన్ని ఆధారాలు దొరకవచ్చు.

    లై డిటెక్టర్..... అబద్ధాలు చెప్పే వ్యక్తిని పసిగట్టే యంత్రం..... దాన్ని తెప్పించి సిద్దంగా ఉంచుకోవటం మంచిదేమో..... తన పరిశోధనలో ప్రభు చాలా ముందుకి వెళ్ళిపోయాడు. కేవలం తనలోని మానసిక రుగ్మతల్ని...

    మెంటల్ అండ్ ఫిజికల్ టెన్షన్స్ ని దూరం చేసుకోగలిగితే ఏ వ్యక్తి అయినా తన లక్ష్య సాధనలో ఎంతైనా ముందుకెళ్ళ గలడనటానికి ప్రభు గొప్ప ఉదాహరణ.

    సమస్యను సృష్టించేది పరిస్థితులైతే.....

    సమస్యను సమస్యగా, ముందుగా, గుర్తించేది..... గుర్తించి కలవరపడేది మనిషి మెదడు. ఆ మెదడులో దాగే మేధస్సు బయటకొస్తే పరిష్కారం దొరికిపోతుంది.

    ఐడెంటిఫికేషన్..... సొల్యూషన్..... రెంటికీ మనిషి మెదడే కేంద్రస్థానం.

    ప్రభులో తిరిగి పట్టుదల రెట్టింపయింది...

    ఉత్సాహం చోటు చేసుకుంది.......

    లక్ష్యశుద్ది వేళ్ళూనింది....

    ఆత్మ విశ్వాసం ప్రోది చేసుకుంది.....

    సంయమనం తిష్ట వేసుకుంది.....

    చీకటిని అనుకొనే వెలుగు.....

    సమస్యను వెన్నంటే పరిష్కారం..

    వాటిమధ్యనున్న సన్నని, బలమైన హద్దుని గుర్తించగలిగితే.....?

    ప్రభు ఉత్సాహంగా వాలు కుర్చీలోంచి లేచాడు....

    మనసికానందమే శారీరక పటిష్టతకు - యవ్వనానికి హేతువు- అందుకే నేనిప్పటికీ యవ్వనానికి దూరం కాలేదు - బిగిసడలలేదు అని ఓ ఆంగ్లసినిమా పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన హందీ సినీనటి రేఖ గుర్తుకొచ్చింది ప్రభుకు.... చిన్నగా నవ్వుకున్నాడు...... ఒకప్పటి తన ఎడోల్ సెంట్ ఫేంటసీ వరల్డ్ కి రేఖ కేంద్రబిందువు.... రేఖ సంయమనంతో సాధించిన విజయం తన ముప్ఫైఎనిమిదవ ఏట ముప్ఫైఏళ్ళ ముఖేష్ అగర్వాల్ తో పెళ్ళి..... అచ్ఛం..... రేఖలాగే ఉంటుంది హంపీ.... బ్లాక్ బ్యూటీ. ప్రేమానురాగాలు కళ్ళలోతుల్లో తొంగిచూస్తుంటాయి.....బ్యూటీఫుల్ ఫేస్..... నల్లటి జుత్తు..... పొడవైన జుత్తు..... అందమైన పాలపుంతను కప్పే కారుమేఘాల్లాంటి కమ్మని జుత్తు.... (కమ్మని అనే పదం ఇక్కడ మనస్సుకి సంబంధించినది)... అమాయికత్వం.. స్వీట్ నెస్...... మొండితనం..... పట్టుదల.......లక్ష్యశుద్ధి.....ఉన్న రాయల్ పేస్..... సృజనాత్మకతతో పోటీపడే అమాయకత్వం ఆమె మాటల్లో కాకపోయినా.......స్ట్రక్చర్ లో వల్నర్ బిలిటీ దాగి ఉంది. కొందరి స్త్రీల శరీరాలు సెక్సీగా ఉంటాయి..... మరి కొందరివి కేవలం అందంగానే ఉంటాయి .... మరికొన్ని ఆకర్షణీయంగా ఉంటాయి..... ఇవన్నీ ఆమెలో ఉన్నాయి......

    ఉన్నట్లుండి ప్రభు ఉలిక్కిపడ్డాడు.....

    తను ఏ వేపుకు వెళ్తున్నాడు.....

    తన ఆలోచనలు ఏ పరిధిని దాటుతున్నాయి......

    "ఏం శ్రీవారు..... ఎక్కడ విహరిస్తున్నారు.....?" అంటూ తన స్వీట్ వైఫ్ నిద్రలేచి టెర్రస్ మీదకు వచ్చి ప్రశ్నించేసరికి ఊహల్లోంచి ఊడిపడ్డాడు ప్రభు.

    "ఛా.... ఛా.... అదేం లేదు" అన్నాడు ప్రభు- నిద్ర కళ్ళతో, మరింత అందంగా, మరిచిపోలేని మధురస్వప్నంలా కనిపిస్తున్న భార్యని దగ్గరికి తీసుకుంటూ.

    "భగవంతుడా.... నాభర్త..... నేరపరిశోధనలోకి ఆడనేరస్తురాలు...... అదీ అందమైన ఆడనేరస్తురాలు రాకుండా చూసే బాధ్యత నీదే" అంది నాటకీయంగా.

    "ఆ బాధ్యత ప్రతి భార్యా తన శారీరక శ్రద్ధమీదపెడితే బావుంటుందోయ్......" అంటూ భార్యను పొదివిపట్టుకొని మెట్లవేపుకు దారితీశాడు.

   
                                             *    *    *

    "మీ ప్రాత చాలా టిపికల్ గా ఉంటుంది. కూల్ గా, ఫర్మ్ గా  జీర్ణించుకోండి...." అంది హంపీ.

    ప్రశాంత్ అలాగే అన్నట్లు తలూపాడు.

    హంపీ యూనిట్ ఇప్పుడు జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్థలానికి అనుకొనివున్న గుట్టల బేగంపేట మైదానంలో ఉంది. చుట్టూ చిన్న చిన్న గుట్టలు...... దూరంగా వర్తులాకారంలో మోహర్ బాబా గుడి......  ఇంకో ప్రక్క గుట్టల బేగం పేట విలేజ్..... ఆ ప్రక్కనే కర్షక పరిషత్ కొండలు.....వాటి దిగువున పొడవాటి సరస్సు..... మనవజీవితపు ఎగుడుదిగుడుల్ని సజెస్టివ్ గా చూపించే చిన్న చిన్న గుట్టలు..... వాటిమధ్య మైదానాలు....." లైటింగ్ కాని..... బ్యాగ్రౌండ్ కాని  తీసే సీన్ కి, ఆ సీన్ లో చెప్పదలచుకున్న భావానికి ఫిట్ అవ్వాలి- ప్రేక్షకుడ్ని మూడ్ లోకి తీసుకెళ్ళగలిగేది ఆర్టిస్టులు చెప్పే డైలాగులుకాకూడదు- లైటింగ్.... లైట్ అండ్ షీడ్ కాంట్రాస్ట్...... బ్యాగ్రౌండ్..... రీ రికార్డింగ్ మాత్రమే ప్రేక్షకుడ్ని మూడ్ లోకి తీసుకువెళ్ళి ఫీల్ అయ్యేలా చేయాలి. ముఖ్యంగా లైటింగ్......

    The lighting should fit the mood and tone of a show.... అంటూ భవానీ వేపు చూసాడు విల్సన్ అర్థమైందా అన్నట్లు.

    "ఇదో మహాసముద్రం.....సృజనాత్మకతను కొలిచే బారోమీటర్ లేదేమో....." అన్నాడు భవానీ హంపీని చూసి గగుర్పాటుకు లోనవుతూ.

    "కెమెరా మూమెంట్స్ ని నేను ఫిక్స్ చేసుకుంటానుగాని - నువ్వు మేడమ్ గారి ప్రక్కకు వెళ్ళి, ఒక పాత్రలో నటించబోయే ఆర్టిస్టుకి అతని పాత్ర  ఎలా ఉంటుందనే విషయాన్ని మేడమ్ గారెలా చెబుతారో అబ్జర్వ్ చేయి. ఒకడైరెక్టర్ కి ఉండవలసిన ముఖ్య లక్షణాల్లో అదీ ఒకటి. వెళ్ళు త్వరగా అన్నాడు విల్సన్.

    భవానీని విల్సన్ ఎప్పుడూ తన సొంతసోదరుడిలా చూసుకోవటమే కాక ఎన్నో నేర్పుతుంటాడు- మరెన్నో నేర్చుకొనే అవకాశాల్ని కూడా కలిపిస్తాడు.


                       *    *    *

    "అతను ఫిజికల్ గా బలంగా, ఆరోగ్యంగా ఉంటాడు. ఒకింత రఫ్ గా కూడా ఉంటాడు. పోస్టుగ్రాడ్యుయేషన్ వరకు చదువుకుంటాడు. జీవితంపై అలక్ష్యం..... గొప్పగా జీవించటం ఒక కళ అని అతనికి తెలీదు.

    అతనో సోమరిపోతు......

    పనిచేయటం అంటే అతనికి ఏవగింపు....

    పెద్దలు కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తుల్ని కరిగించటానికి సిగ్గు పడడు.

    సిగ్గు, ఆత్మాభిమానం, ఇగో అతని డిక్షనరీలో లేవు.

    తనెదుత ఎందరో కష్టపడుతున్నా, తమకాళ్ళమీద తాము నిలబడుతున్నా, అతనికి చీమకుట్టినట్లుగానైనా ఉండదు.

    వాళ్ళంతా అతనికి పిచ్చివాళ్ళలాగా , సుఖపడటం తెలీని అమాయకులు లాగా కనిపిస్తారు.

    అదేమని ఎవరయినా ప్రశ్నిస్తే, ఈ వ్యవస్థ నాకు సరైన ఉద్యోగం ఇవ్వలేదంటాడు.

    చేతికేది దొరికితే అది తాకట్టుపెట్టో, అమ్మివేసో జల్సాచేస్తాడు....నీ అంతటివాడు లేదు చైతన్యా అనంటే అర్థంలేని గొప్పలకుపోయి వేలకు వేలు వాళ్ళకోసం తగలేస్తాడు. వాళ్ళు అవతలకు వెళ్ళి ఇతని గురించి సర్ క్కాస్టిగ్గా చెప్పుకుంటుంటారు. అలా చెప్పుకుంటున్నారని చైతన్యకి చెబితే ఏడ్చారులే అని వదిలేస్తాడు. చిన్నకష్టమొచ్చి మీదపడితే గట్టిగా ఒక్క నిమిషమైనా నిలబడలేని దుర్భాలుడు. తన అసమర్థత, చేతకానితనం, సోమరితనం అతన్ని తరుచూ న్యూనతా భావానికి గురి చేస్తుంటాయి. వాటిని భరించలేక తరుచూ  విపరీతమైన అసహనానికి గురవుతుంటాడు. ఆ అసహనాన్ని ఆసరాచేసుకొని ఆత్మవంచనచేసుకుంటుంటాడు. నేను తలుచుకుంటే కొండల్ని పిండిచేయగలనని, ఏదైనా చేయగలనని, వచ్చేనెల నుంచి చూడు మన జాతకమే మారిపోతుందంటూ ప్రగల్భాలు పలుకుతుంటాడు. అలా ప్రగల్భాలు పలకటం, ఛాలెంజ్ చేయటం అతనికి మామూలయిపోయింది.

    అతనికి చిన్న పెకుంటిల్లు ఉంది.

    అందులో అతని తల్లి, అతనే ఉంటుంటారు. అప్పుడప్పుడు ప్రక్కింటి వారికి వినిపించేలా నాలు ఇల్లుందని, ఆస్తిపాస్తులున్నాయని అరుస్తుంటాడు.....తనింట్లో పనిచేసే పదేండ్ల పిల్లవాడ్ని అప్పుడప్పుడు కేకలేస్తుంటాడు. వాడేదో తప్పు చేసాడని కాదు- వాడెక్కడ తనను యజమానిగా గుర్తించకుండా పోతాడో అని.... తనకే ఒక దారిలేని ఇతను ఎవరికో ఉద్యోగాలిస్తానని-ఫలానా చోటకు వెళ్ళి నా పేరు చెప్పమని కోతలు కోస్తుంటాడు.

    పిరికివాడు.... దుర్భలుడు.... సోమరిపోతు......పరువు ప్రతిష్టలంటే తెలీని అల్పజీవి..... ఆత్మాభిమానం ఈసమెత్తులేని అల్పుడు.... తనేం చేయలేకపోతున్నానే..... తనకేం చేతకావటం లేదే.....అనే డిప్రెషన్ తో తెలిసీ తెలీని పిచ్చిపనులు కూడా చేస్తుంటాడు.

    అతి నిద్రాలోలుడు.....

    తెలివి లేని మూర్ఖుడు....

    తల్లి మాత్రం గొప్ప శ్రమజీవి.....క్షణం తీరికలేకుండా ఏదో ఒక గౌరవమైన పనిచేసి సంపాదిస్తుంటుంది..... వ్యక్తిత్వంలేక తన కాళ్ళమీద తాను నిలబడలేక, అబ్బా, అమ్మా సొమ్ముతో బ్రతుకుతూ.... అదే గొప్ప బ్రతుకనుకుంటూ, ప్రపంచం నవ్విపోదా..... అసహ్యించుకోదా..... గేళి చేయదా....? తనముందనకపోయినా తన వెనుక తనని ఎంత హేళన చేస్తారో.....? అసహ్యించుకుంటారో.....? అని ఒక్కసారన్నా ఆలోచించకుండా అనుక్షణం ఆత్మవంచన చేసుకుంటూ, పాతికేండ్లు వచ్చినా పది పైసలు సొంతంగా సంపాదించలేక సమాజానికి, దేశానికి భారమైన అతను తల్లిచెప్పే మంచిమాటల్ని ఎప్పుడూ మెదడుకి ఎక్కించుకోడు.

    అలాంటి వ్యక్తిని అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయి ప్రేమిస్తుంది.

    అయితే ఆ అమ్మాయికి అతను పరమసోమరిపోతని తెలీదు. పిరికి గొడ్డని అంతకంటే తెలీదు.

    ఒకరోజు నలుగురు జులాయిలు చైతన్యముందే ఆ అమ్మాయి ఒంటిమీద చేయివేయగా తనప్రియుడు చైతన్య పౌరుషంగా వారికి ఎదురు తిరిగి తనను రక్షిస్తాడని ఆశపడుతుంది. అయితే అతను ఆ ప్రియురాల్ని వదిలేయమని వార్ని బ్రతిమిలాడతాడు. దాంతో ప్రియురాలు షాక్ అవుతుంది. వాళ్ళు రెచ్చిపోతారు. చివరకు తనప్రియుడు తనను రక్షించే ధైర్యశాలికాదని తెలుసుకోని హెల్ప్ హెల్ప్ అని అరచి పాదచారుల సహాయంతో బయట పడుతుందామె. అతన్ని చూసి ఆమె జాలిపడుతుంది. అప్పటినుంచి అతనిలో ఆలోచనలు మొదలవుతాయి..... క్రమంగా అతనిలో మార్పురావటం జరుగుతుంది.

    ఈ ప్రపంచంలో మొదటి దురదృష్టవంతురాలు ఎవరో తెలుసా..... ఒక సోమరిపోతుని.....పిరికివాడ్ని, జీవితంలో ఏదీ సాధించలేని అర్భకుడిని కనీసం తనవ్యక్తిగత కష్టంతో జాకెట్ గుడ్డ కూడా భార్యకు కొనిపెట్టలేని అసమర్దుడ్ని, పెళ్ళిచేసుకున్న స్త్రీ.....ఆ జీవితం నాకువద్దు..... అలాంటి వ్యక్తిని పెళ్ళిచేసుకోవటమంటే నాకు అసహ్యం..... ఏవగింపు..... అలా చేస్తే స్త్రీ జాతి ఉసురు నాకు తగులుతుందంటూ ఆమె రిటార్ట్ ఇస్తుంది. దాంతో అతను షాక్ తింటాడు...... ఈ లోపు అనారోగ్యంతో, ఒక విషయంలో ఒక దుర్మార్గుడ్ని ఎదుర్కొనే సందర్భంలో అతని తల్లి చనిపోతుంది.

 Previous Page Next Page