కొంతసేపు అలా ఉండి లేచాడు. ఆమెచేతిని తనచేతిలోకి తీసుకొని "లేఖా! చేసిన మోసం చాలు. ఇంక ఈ వ్యాపారం చేయలేను. పద పొద్దున్నే వెళ్దాం" అన్నాడు.
"వెళ్ళిపోవడమా? ఎక్కడికి" అబ్బురంగా అడిగింది.
"కర్మ ఎటుతీసికెళ్తే అటు."
ఆమెకళ్ళు అతన్ని ఇముడ్చుకున్నాయి. మనసు బాగున్నట్లులేదు. బాధపెట్టొద్దు అనుకుంది.
మౌనంగా ఇంటికి నడిచారు. వాడు లేఖను గుర్తించాడా? అనే విషయాన్నీ గూర్చి కాలూ ఆలోచిస్తున్నాడు. ఆనాడు లేఖ భీతాహంచెంది వణికిపోతూ ఉండింది. నాటిలేఖకు నేటిలేఖకూ పోలికేమిటి? అలాంటప్పుడు గుర్తించడం ఎలా సాధ్యం? పోనీ పోలిక కనిపించినా పోలిక గలవారుండరా అనుకుంటాడు.
పోరాటం సులువైపోయింది. ఇంతసేపూ గాలిని పేనుతున్నాడు. తన ధ్యేయం గుర్తువచ్చింది. ఆయుధాలు మళ్ళీ పదును పెట్టుకున్నాయి. అతని చేతులకు బలంవచ్చి పగతీర్చుకోవాలని బుసలు కొడ్తున్నాయి.
నాటిరాత్రి వాడిముఖం సరిగా చూడనేలేదు. జనపవ్యాపారంలో ప్రముఖుడు అన్న మాటలు మాత్రమే ఆధారం. ఆ మహానగరంలో జనపవ్యాపారంలో ప్రముఖులు ఎందరో? గంగానది ఒడ్డున అనేక నార ఫ్యాక్టరీలు ఉన్నాయి. తాను పొరపడ్డాడు. అతడు నాటివ్యక్తి కాదు.
అతని ఆలోచనల వేగం తగ్గింది. నాటివాడు ఇంకాస్త లావూ, పొట్టి, ముఖం ఇంతకంటే కొన్ని చాయలు నలుపే. అదే నిజంకదూ?
వాస్తవం ఎలా తెలియాలి?
11
ఈ బూటకం నా గుండెమీద కొండ పెట్టినట్లుంది" అన్నది ఒకనాడు లేఖ. ఆమెలో ఎలాంటి మార్పూ రాలేదు. తండ్రి ఉత్సాహం ఆమెకు ఏమాత్రం అంటినట్లు లేదు. కాలూ ఎదురుదెబ్బ తీయడంలో ఆమెకూడా భాగస్తురాలే అనుకుంటూ ఉన్నాడు.
ఇది తాను సాగించేపోరాటం అనేవాడు కాలూ. లేఖ ఆ పోరాటాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమె రెక్కలు కట్టుకుని ఝార్నాలో వాలింది బుజానమూట వ్రేలాడుతూ. వీధిమలుపు దాకా వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ కాళ్ళను లాక్కుపోయినకాలూ కనిపించాడు. ఇల్లంటే ప్రాణంకంటే మిన్నగా చూసుకునే తండ్రి మైళ్ళకొద్ది నడిచి, నాటిరాత్రి ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేశాడు. అది నగరానికి వెళ్ళి ఉద్యోగం సంపాదించుకునే పోరాటంలో ప్రథమదశ. పోలీసు అతని సున్ని ఉండల్ను లాఠీతోకొట్టి నేలమీద చెల్లాచెదురుగా పడేశాడు. కాబట్టే మండేడొక్కతో ధనికుని వళ్ళు దొంగిలించాడు. ఆకలికి అర్ధంతెలియని న్యాయమూర్తి మామూలు దొంగలాగే తన తండ్రికి జేలుశిక్ష విధించాడు.
తాను మూడునెల్లు జేల్లో ఉన్నానని మొట్టమొదటిసారిగా తండ్రి చెప్పినప్పటి భీతాహం ఆమెకు గుర్తుకు వచ్చింది. అప్పుడు తాను గోడుగోడున ఏడ్చింది. అలాంటి సమయంలో తండ్రి యీ విషయం చెప్పడానికి కారణం? తన దుఃఖాన్ని మరిపించడానికే అయి ఉంటుంది?
తండ్రిని దొంగల్లో ఒక దొంగగా చేశారు. అయితే తనకు అసహ్యం అయ్యే పేరుగానీ, గుర్తులుగానీ అతనికేమీలేవు.
ఆమె తన ఊహతో ఒక దొంగను సిద్దం చేసుకుంది. కారు చీకట్లో దొంగఇంట్లోకి దూర్తాడు. అతని రాకను తెలుసుకుని పడుకున్న వారు మెసిలారో ఛాయలాంటిరూపం మంచందగ్గరికి వచ్చి, మీ గొంతునుంచి ఒక్క పదమైనా బైటికి రాకుండానే మీ రక్తం చల్లపడేస్తుంది. కాబట్టి దొంగ గదిలోకి వచ్చినప్పుడు వాడికి కావాల్సినవన్నీ తీసికెళ్ళేదాకా కిక్కురుమనకుండా కళ్ళూ చెవులూ మూసుకుని నిద్ర నటించాలి. వీధిలో కాపలా కాస్తూ ఉండే పోలీసు దొంగను పట్టుకొని జేల్లో వేస్తాడు. అక్కడ వాడు రాళ్ళను బద్దలు కొట్తాడు. వడ్లపనీ, చాపలల్లడం నేర్చుకొని చెమటోడ్చి నీతిగా జీవితంగడిపే విధానం అలవర్చుకుంటాడు.
అదీ దొంగలను గురించి లేఖకు ఉన్న అభిప్రాయం. తన తండ్రి చెమటోడ్చి పనిచేసేవాడు. ప్రతి పైసా కోసం ఎముకలు విరుచుకునేవాడు. అలాటి శ్రమజీవి నేరస్థుడు అయినాడు. దొంగలతోపాటు తింటూ, వారితోపాటు కబుర్లు చెప్పుకుంటూ, వారితోపాటు పడుకున్నాడు.
తన తండ్రి దొంగతనం చేశాడు. అంటే మంచివారి శత్రువులైన ఇతర ఖైదీలకూ అతనికీ ఏమీభేదం లేదన్నమాట. అలాంటివారందరికీ గుణపాఠం నేర్పాల్సిందే. అయితే తానుకూడా దొంగతనం చేసిందే!
ఒకనాడు లేఖ బామ్మతోకలిసి రైలురోడ్డుదాటి పచ్చిక బయళ్ళులోకి వెళ్ళింది. అక్కడ ఏమైనా దుంపలూ, అల్లిపూలు దట్టంగా పూసిన గుంటల్లో ఏమైనా చేపలు దొరుకుతాయని వారు అక్కడికివెళ్ళారు. గుంటల్లో చేపలు రోజురోజుకూ తగ్గిపోవడం మూలాన చేపలు తేలిగ్గా దొరకడంలేదు. ఆలస్యం అవుతూంది. బామ్మ గుంట పక్క కూర్చొని చేపలు పట్టే ప్రయత్నంలో ఉండగా లేఖ అలా తిరగడానికి బైల్దేరింది. ఆమెకు అంటరానివాళ్ళుండే పూరిగుడిసెలు కనిపించాయి. మాలగూడానికి గూడెమూ ఖాళీచేసి వెళ్ళిపోయింది. గుడిసెలన్నీ కుప్పగా ఒకచోట పడి ఉన్నాయి. ఆ స్థలం అంతా శ్శశానంలా బావురుమంటూంది. గబగబా నడిచింది. ఏదో వింత కనిపించినట్లు ఆమెకాళ్ళు అమాంతంగా ఆగిపోయాయి. తల పైకెత్తిచూస్తే పచ్చని పెద్దపెద్ద ఆకుల్తో గుమ్మడితీగ ఒక గుడిసె మీద పాకి ఉంది. పసిడిపూలు చూసి ఆమె కళ్ళకు పండుగైంది. చిక్కని ఆకులమాటున ఒక గుమ్మడికాయ దాగి ఉంది. ఆమె ఆ కాయను చూసి ఎగిరి గంతేసింది.
నాలుగువైపులా చూసింది. ఎవరూ కనిపించలేదు. ఆమె గుండె రెపరెపా కొట్టుకుంటూ ఉండగా ఏదో ఒక శక్తి ఆమెను ఆ తీగవైపు ఆకర్షించింది. ఆమె అడుగులు యాంత్రికంగా తీగవైపు వెళ్ళాయి. గుడిసె ఎక్కుతుంటే కాలుజారి మురికిగుంటలో పడినంత పనీ అయింది.
గుడిసె కప్పుదాకా ఎక్కిందోలేదో "ఆగు" అనే ఒక నీరసధ్వని వినిపించింది.
ఆమె గడ్డికప్పుమీద కూలబడి గడగడ వణికిపోయింది.
ఇంతవరకూ అదృశ్యంగా ఉన్న వంగినబెత్తంలాంటి నడుంగల ముగ్గుబుట్ట తల ముసల్ది కర్రనేలకు కొట్టుకుంటూ బైటికి వచ్చింది. కనుబొమలకింద ఎక్కడో అగాధంలో ఉన్న మిణుకుమిణుకుమనే కంటిమెరుపు లేఖను చూసింది.
కరుణించమని ప్రార్ధిస్తున్నట్లుగా అతిహీనస్వరంతో 'ఆకలి' అన్నది లేఖ.
ముసల్ది తల ఊపి "ఔను. ఆకలి" అంటూ లేఖను అలాగే చూస్తూ ఉండిపోయింది.
"బిడ్డా, నువ్వెవరు?"
లేఖ తడబడ్డది. జవాబు చెప్పేదానికంటే ముందు కప్పుమీది నుంచి దూకి పారిపోదామనుకుంది.
ముసల్ది అరచేత్తో ముఖాన బాదుకొని "అంతా వెళ్ళిపోయారు. కొడుకులూ, కోడళ్ళూ, మనవళ్ళూ, మనువరాళ్ళూ అంతా వెళ్ళిపోయారు. నేను ఒక్కర్తెనే ఈ గుడిసెలో ఉంటున్నా. 'అవ్వా ఝార్నాలో ఏముంది? మట్టి. రా. మాతోపాటువెళ్దాం' అన్నారు కొడుకులు. ఊరు దూరం కారు దగ్గరైంది. ఈ కట్టెను ఇంకెక్కడికి తీసికెళ్తారు. ఇక్కడే ప్రాణాలు వదుల్తా, అన్నా. పొద్దుకూగ్గానే దీపం వెలిగించుకుంటూ ఇక్కడే ఉంటున్నా"
"ఇంకవెళ్ళేదా?" లేఖ అడిగింది ఆదుర్దాగా.
"వినుబిడ్డా. గుమ్మడికాయ ఇంకా సగమే పండింది. ఇంకో పది రోజులు తీగకు ఉంటేనేగాని అది పండదు. అప్పుడు కాయ ఇంతకంటే రెండింతలు అవుతుంది." ఆమెకళ్ళల్లో ఒక వెలుగు కనిపించింది. "నీకు ఇంకోటి చూపుతా, చూడు. అదిగో, అక్కడచూడు కనిపిస్తూందా?"
లేఖకు ఇంకో గుమ్మడిపిందె కనిపించింది. అది కోడి గుడ్డంతే ఉంది.
"జాగ్రత్త వేలుపెట్టి చూపకు"
వేలుతో చూపుతే పూలూ, కాయలూ - పెరిగేవన్నీ - వాడిపోతాయని లేఖకు తెలుసు.
"అది పండుపండడానికి ఇంకోనెల పడ్తుంది. దాన్ని అప్పటిదాకా చెట్టుమీదే ఉంచాలి. ఇప్పటికి కాసిన్ని చిక్కుళ్ళున్నాయి. పెడ్తాతీసుకెళ్ళు" అన్నది.
"వద్దు" సుమారు కేకలేసినట్లుగా అన్నది.
"బిడ్డా! నన్నెందుకేడిపిస్తావు. నామీదకోపంరాలేదుగదా?"
"కోపం ఎందుకూ?"
ముసల్ది నవ్వింది. ఆమెపళ్ళులేని చిగుళ్ళు బయటపడ్డాయి.
"అయితే రా కాసిన్ని చిక్కుళ్ళు కొంగున కట్టుకో. కాటికి కాళ్ళు చాచుక్కూచున్నదాన్ని. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతా? కొడుకులు ఎంత బాధపడుతున్నారో? వారిమీద నేను ఇంకో బరువు వేయడం ఎందుకూ?" ఆమె ముక్కుచీదుతూ రద్దకంఠంతో అన్నది.