Previous Page Next Page 
రాక్షసుడు పేజి 30


    "అయిదుకోట్లు అతడికో లెక్కలోనిది కాదు".

 

    "అవును. అదీ నేను ఆలోచించాను. అందుకే- బోట్ ని పేల్చి వేయబోయే ముందు.... దూరంగా మరొక మోటార్ బోట్ నుంచి రాబోట్ ఈ తతంగాన్నంతా రహస్యంగా ఫోటోలు తీస్తాడు. పోలీసులకి ముందే ఫోన్ చేస్తాం కాబట్టి- అదే సమయానికి అక్కడ వాళ్ళుకూడా వుంటారు. దాంతో రామ్మూర్తిపని అడకత్తెరలో పోకచెక్క అవుతుంది!"

 

    "అదంత సులభం అనుకోను. సాక్ష్యాధారాలు- ముఖ్యంగా మోటార్ బోట్ బ్లాస్ట్ అయిపోతుంది కాబట్టి పోలీసులు అతడిమీద కేసు పెట్టలేరు. అఫ్ కోర్స్ మనం ఫోటోలుతీస్తాం అనుకో- కానీ రామ్మూర్తికున్న పలుకుబడితో పోలీసుల్ని కొనెయ్యగలడు".

 

    "కొనెయ్యగలడు, మొత్తం పోలీసు జాతినంతా కొనెయ్యగలడు. కానీ ఒక్కరినిమాత్రం కొనలేడు. ఆ దీవి జ్యూరిస్ డిక్షన్ వున్న ప్రాంతపు ఇన్ స్పెక్టర్ ని!"

 

    "ఏ జ్యూరిస్ డిక్షన్ అది?"

 

    "రొయ్యల గూడెం".

 

                                       *    *    *

 

    వీరు ఇది మాట్లాడుతున్నప్పుడు  పక్కగదిలో మరోవ్యక్తి శ్రద్ధగా దీన్ని వింటున్నాడు. అతను తమ మనిషేకాబట్టి, తమకి కావల్సిన వ్యక్తి కాబట్టి వాళ్ళు దానిగురించి అంతగా పట్టించుకోలేదు.

 

    అతడు చెప్పుకుపోతున్నాడు.

 

    "దొంగతనంగా రవాణా చేస్తున్నందుకు ఇన్ స్పెక్టర్ విజయ్ తన తండ్రిని అరెస్ట్ చేస్తాడు. అది నిర్వివాదాంశం. ఇంతలో రామ్మూర్తి బోటుని నేను పేల్చేస్తాను. ఇది రామ్మూర్తికి రెండో షాకు. పోతే- బోటు పేల్చివేయబడింది కాబట్టి రామ్మూర్తి వెంటనే ప్లేటు ఫిరాయిస్తాడు. విజయ్ కూడా దీన్ని సులభంగా వదిలిపెట్టడు. ఇదే విజయ్ కాకుండా ఇంకెవరన్నా అయితే కూడా దీన్ని సులభంగా వదిలిపెట్టడు. ఇదే విజయ్ కాకుండా ఇంకెవరన్నా అయితే రామ్మూర్తి అనుచరులు అతడిని తూట్లు తూట్లుగా పేల్చేస్తారు. చూస్తూ చూస్తూ కన్నకొడుకుని చంపుకోలేడు కదా. కేసు కోర్టుకి కెళుతుంది. సరిగ్గా 'అప్పుడు' మనం ఈ ఫోటోల్ని బయటపెడతాం. దాంతో పోలీసులకి చిక్కిపోయి, తన బోటుని తనే పేల్చుకున్నట్టు రామ్మూర్తిమీద కేసు మరింత బలపడుతుంది. అన్నింటికన్నా ఎక్కువగా అతని కొడుకే అతడిని అరెస్టు చేయడం.... అదీ సంచలనం. ఏ మాత్రం శిక్షపడింది అన్నదికాదు సమస్య. మనం అతడిని ఏడిపిస్తున్నాం. అదీ కావాల్సింది" లేస్తూ అన్నాడు.

 

    ఇద్దరు వెళ్ళిపోయారు. వాణిమాత్రం వెళ్తూవెళ్తూ ఆగి "కంగ్రాట్స్" అంది.

 

    "ఎందుకు?"

 

    "విజయ్ కి తిరిగి ఉద్యోగం వేయించటం వరకూ అర్థమైంది, కానీ రొయ్యలగూడెం సంగతి అప్పుడు అర్థంకాలేదు. ఈ ఎత్తుగడకి కంగ్రాట్స్"

 

    "చూద్దాం. ఇటువంటి విషయాలు పూర్తయ్యే వరకూ ఏమీ చెప్పలేం".

 

    పక్కగదిలో వున్న వ్యక్తి, ఇక వినటానికి ఏమీ అవసరంలేనట్టు అక్కణ్నుంచి కదిలాడు అతడెవరోకాదు జి.కే...! సరిగ్గా పావుగంట తరువాత వంకచెక్కా రామ్మూర్తి ప్రైవేటు గదిలో రహస్య సమాలోచన జరిగింది-

 

    "నువ్వు నాతో చేతులు కలపటం చాలా ఆనందంగా వుంది" అన్నాడు రామ్మూర్తి. "నువ్వు చెప్పిన విషయాలు వింటూంటే తలతిరిగిపోతూవుంది అతనింత గొప్ప ప్లాన్ వేయగలడని నేను కలలో కూడా వూహించలేదు సుమా! చేప తనంతట తానే వలలోకి వస్తూందన్నమాట. కానీ రొయ్యలగూడెం దగ్గిర సముద్రంలో కలిసే నీటిప్రవాహం చాలా వేగంగా వుంటుంది. శవం ఏమైనది మూడోకంటికి తెలీదు, ఏది ఏమైనా నాకు చాలా సహాయం చేశావు. నాకు సంతోషంగా వుంది. దాన్నికన్నా ఎక్కువగా ఆశ్చర్యంగా వుంది శత్రువులమైన మనం ఇలా మిత్రులైపోవటం..."

 

    "నేను చాలాకాలంగా ఆలోచిస్తూ వచ్చాను. మనిద్దరిమధ్యా ఎందుకు శతృత్వం అని. మనిద్దరం కలిస్తే ఆ లోహియా, ముఖ్యమంత్రి గ్రూపు స్మాష్ అయిపోతారు. సరే- స్నేహాన్ని దగ్గిర చేసుకోవాలంటే పూర్వకాలం కానుకలతో వచ్చేవారట కదా! ఏ కానుక తీసుకెళ్ళాలా అని ఆలోచిస్తే ఇదిగో ఇది దొరికింది".

 

    రామ్మూర్తి బిగ్గరగా నవ్వేడు, "నీ కొడుకు శవమే నాకు కానుక. బైదిబై అతడి శవాన్ని ముక్కలుగా కోసినా నీకేమీ అభ్యంతరం లేదుగా".

 

    "లేదు" అన్నాడు జి. కృష్ణమూర్తి లేస్తూ. "మా కాంట్రాక్టు కూడా పూర్తయిపోవచ్చింది. ఇక అతడు బ్రతికి వుండటంకన్నా చస్తేనే మనకు లాభం".

 

                                      *    *    *

 

    రాత్రి పదకొండింటికి అతడి బోట్ నిశ్శబ్దంగా దీవి చేరుకుంది. ఒక్క పక్క సముద్రం, మూడుపక్కల నీళ్ళు. చిన్న చిన్న పురుగులు- పక్షులు- వాటి శబ్దాలు - కత్తుల్లాంటి కొమ్మలు.

 

    అతడు అవతలి గట్టువైపు చూశాడు. అక్కడ జనసంచారం- చీకట్లో నీడల కదలికలు అస్పష్టంగా కనిపిస్తూంది. ఇంకా పోలీసులు రాలేదు. వాణి వాళ్ళకి ఫోన్ చేయటానికి అరగంట టైముంది.

 

    నీళ్ళలో తేలుతూ బోటు కనబడుతూంది. సుమారు అయిదారు కోట్లు ఖరీదుచేసే బోటు. అతడు కెమేరా సరిచేసుకున్నాడు.

 

    అతడికి చాలా కొద్దిదూరంలో కొమ్మకి కొమ్మకీమధ్య ఈజీఛెయిర్ లా కట్టిన గుడ్డమీద విలాసంగా పడుకుని అతడు చేసే తంతుని నవ్వుతూ గమనిస్తున్నాడు రామ్మూర్తి. అతడిక్రింద ప్రతీ పొదలోనూ ఒక్కోమనిషి వున్నాడు.

 

    అతడి పక్కనే జి. కృష్ణమూర్తి వున్నాడు. తనకొడుకు చచ్చిపోతే ఒక పెద్ద బాధ్యత తీరిపోతుంది.

 

    ఈలోపులో అతడు తన కెమేరా లెన్స్ అడ్జస్టు చేసుకొన్నాడు.

 

    తనకి ఆచోటు ఎంత దూరంలో వుందో మనసులో కోలుచుకుని రెడీఅయ్యాడు. అతడి కెమేరాకి చాలా ప్రకాశవంతమైన ఫ్లాష్ జతచేయబడివుంది. ఆకాశం అంతా మేఘావృతమై ఉండటం అతడికి లాభించింది.

 

    దూరంగా మనుషులు నీడల్లా కనబడుతున్నారు. నిశ్శబ్దంగా క్రమశిక్షణతో ఆ చీకట్లో కూడా ఎక్కడా కంగారుపడకుండా తమ పనులుచేసుకుపోతున్నారు. యుద్ధరంగంలో సైనికులకున్న క్రమశిక్షణ స్మగ్లింగ్ లో కూలీలకుంటుంది. ఆ మాటకొస్తే వాళ్ళు కూలీలుకాదు. ఒక్కొక్కరు కనీసం రెండుహత్యలకు తక్కువ కాకుండా చేసివుంటారు. అవసరమయితే తలమీదవున్న పెట్టెని క్రిందపడేసి, అది నేలమీద పడేలోపులో జేబులోంచి పిస్తోలు బయటకుతీసి కాల్చగలరు.

 

    తను చేస్తున్న పని చాలా రిస్కుతో కూడుకున్నదని అతడికి తెలుసు. కానీ వాళ్ళకీ తనకీ మధ్యనున్న 'దూరం' తనని రక్షిస్తుందని అతడినమ్మకం. అదీగాక కాలువకి అవతలిపక్క చీకట్లో, పొదలమధ్య నిలబెట్టబడి వున్న బోటులో 'రాబోట్' అప్రమత్తంగా వుండి, ఏమాత్రం అవసరం వచ్చినా రంగంలోకి దిగుతాడు. కానీ అంత అవసరం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే, ఒకసారి రాబోట్ రంగంలోకిదిగుతే అక్కడ ఇరవై ముప్పై మరణాలకన్నా తక్కువ జరగవు.

 Previous Page Next Page