ఆమె అతడి మొహంలోకి కుతూహలంతో, ఆశతో చూసింది. అదే నిర్వికారమైన భావంతో అతడన్నాడు-
"-లేదు శైలజా! నువ్వు నన్ను ప్రేమించటం లేదు. ప్రేమిస్తున్నాను అన్న భావాన్ని ప్రేమిస్తున్నావు. అడాలిసెన్స్ ఇది. నీకు పెళ్ళయి, నాల్గయిదు సంవత్సరాలు పోతే పిల్లల్ని చంకనేసుకొచ్చి నేనిలానే వుండటం చూసి, 'ఇంకా పెళ్లి చేసుకోలేదా? నా మీద ఏ మాత్రం అభిమానం వున్నా వెంటనే ఒక ఇంటివాడి నవుతాను అని ప్రమాణం చెయ్యి' అని పెద్ద ఆరిందాలా మాట్లాడతావు. మనిషి తన వయసుకు సరిపడే ఆలోచన్లలో తనుండి, అవే గొప్పవన్న అభిప్రాయంతో వాటిని విపరీతంగా అభిమానించి వాటికి 'ప్రేమ', 'పెద్దతనం' లాటి పదాలు పెట్టుకొని సంతృప్తి చెందుతూ వుంటాడు శైలజా. ఆ స్థితిని దాటినవాడు ఋషి అన్నా అవుతాడు. లేక మెటీరిలియస్టిక్ రాక్షసుడు అన్నా అవుతాడు. నీ దురదృష్టం కొద్దీ నువ్వు ఆ రెండో వాణ్ని ప్రేమించావు. కనీసం ప్రేమించానని అనుకుంటున్నావు. సారీ...."
* * *
"ఓషనోగ్రఫీ-" అన్నాడు అతడు. "సముద్రం గురించి అన్ని విషయాలనీ వివరంగా చెప్పే శాస్త్రం" అతడు ఆగి, తిరిగి చెప్పసాగాడు. "ఫిషరీ హైడ్రోగ్రఫీ అందులో ఒక భాగం. చేపల గురించీ, అవి సమృద్ధిగా పెరిగే వాతావరణం గురించీ ఇది చెపుతుంది. దీనిలో మళ్ళీ ఒక భాగం ఆక్వాటిక్ ఎకాలజీ. సముద్రం అంతర్భాగంలో నదీ ప్రవాహాలుంటాయి. ఇవి సముద్రం అడుగున ప్రవహిస్తూ వుంటాయి బంగాళాఖాతంలో అతి పొడవైన (5800 కిలోమీటర్ల పొడవు, 2438 కిలోమీటర్ల వెడల్పు వున్న) రిడ్జి (అంతర్వాహిని) పేరు '60డిగ్రీస్ ఈస్ట్ రిడ్జి'. భారతదేశపు జల సంపద ముఖ్యంగా రొయ్యలు, చేపలు సమృద్ధిగా లభించటానిక్కారణం ఈ రిడ్జెసే. కానీ గత అయిదు సంవత్సరాలుగా ఈ జల సంపద ముందున్నంతగా లభ్యం అవటం మానేసింది. ముఖ్యంగా టైగర్ ప్రాన్స్ (పెద్దరొయ్యలు) దాదాపు ఈ జాతి అంతా జపాన్ వైపు వలస వెళ్ళిపోయింది. దీనికి కారణం వంకచెక్కా రామ్మూర్తి".
మామూలుగా వింటున్న ముగ్గురూ ఉలిక్కిపడ్డారు. అతడు ఎక్కణ్నుంచి ఎటు వెళ్ళాడు! అందరిలో ఉత్సుకత పెరిగింది.
"వంకచెక్కా రామ్మూర్తి ఆఫీసు గదిలోవున్న పుస్తకాల్లో చాలాభాగం ఓషనోగ్రఫీ, మారిటైమ్ మెటీరియాలజీ గురించి సంబంధించినవి- అని అతడి కూతురు శైలజ నాకు చెప్పినప్పటినుంచీ, అతడికి వీటి అవసరమేమిటా అని ఆలోచిస్తూ వచ్చాను. మొన్నే దానికి సమాధానం దొరికింది".
వాణి అతడి వైపే చూస్తూంది, ఏమిటితడు? ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోడా?
అంతలో అతడు చెప్పడం ప్రారంభించాడు.
"సముద్రాంతర్భాగాలలో కొన్ని వేల లక్షల జంతువులు.... నిజానికి ఇవి జంతువులు కావు.... క్రిడేరియన్స్ అంటారు. ఇవి ఒక దానికి ఒకటి అతుక్కొని సహజీవనం సాగిస్తాయి. ఇవి మరణించినప్పుడు వీటిఎముకలు రకరకాల అందమైన షేపుల్లో నీటి అడుగున మిగిలిపోతాయి. వీటినే 'కోరల్స్' అంటారు. ఇదిగో ... ఇక్కడే రామ్మూర్తి రంగంలో ప్రవేశిస్తూంది..." అంటూ అతడు ఆగాడు.
"మాల్ దీవులు ఇటువంటి కోరల్స్ కి ప్రసిద్ధి. వీటి భద్రతమీద ప్రభుత్వం శాసనం చేసిందికూడా. నిజానికి ఈ కోరల్స్ కి అంత విలువ లేదు. చేపల ఆక్వేరియమ్ లో పెట్టుకోవడానికి మనకు చాలా చౌకగా వీటిని అమ్ముతారు. వీటితో పోలిస్తే వీటికన్నా కొన్ని లక్షల రెట్లు విలువైనవి ముత్యాలు! సముద్రగర్భంలో దొరికే ఒక రకమైన ముత్యాపు ముత్యపు చిప్పలనుండి బయటపడవు. వీటికోసం ఎంతో శోధించాలి, కానీ ఒక రకమైన ఆసిడ్ వల్ల ఈ చిప్పలు స్వభావసిద్ధంగా పగులుతాయని రామ్మూర్తి కనుక్కున్నాడు. ఎన్నో సంవత్సరాలనుంచీ ఈ ఆసిడ్ ని రామ్మూర్తి మనుష్యులు కొద్దికొద్దిగా అంతర్వాహినులైన రిడ్జెస్ లో కలుపుతూ వస్తున్నారు. ఇది జీవరాశులకు హానికరం కాదుగానీ, వాటి ఆహారమైన, 'పాంకేటన్స్'ని మాత్రం విపరీతంగా నాశనం చేస్తుంది. భారతదేశపు తీర ప్రాంతాలనుంచి జలచరాలు గుంపులు గుంపులుగా వలసవెళ్ళిపోవటానికి కారణం అదే!! రామ్మూర్తివంటి స్వార్థపరుడికి ఇది ఒక్క లెక్కలోది కాదు".
ముగ్గురు శ్రోతలు దిగ్భ్రమతో అతడు చెప్పే విషయాలని వింటున్నారు. అతడు కొనసాగించాడు.
"ఇలా బయల్వెడలిన ముత్యం, ఆసిడ్ వల్ల కొత్త పరిణామం పొందిన కోరల్ లో చిక్కుపడుతుంది. ఏయే సమయాల్లో ఏయే సముద్రాల్లో ఈ అంతర్వాహినులు ఎటు ప్రవహిస్తాయో జాగ్రత్తగా లెక్కవేసి, పంపిన చోటికి పంపకుండా జాగ్రత్త తీసుకుంటారు. అందువల్ల ఆసిడ్ ప్రభావం తగ్గిపోగానే ఈ 'కోరల్' తిరిగి మన మామూలు స్థితిలో పెరగటం మొదలు పెడుతుంది. ముత్యం మాత్రం దానిలో చిక్కుబడి పోయి అందంగా, ఒక ఆభరణంలా మెరుస్తూ వుండిపోతుంది. ఇలా స్వభావసిద్ధంగా ఏర్పడిన ఆభరణం ఏ లండన్ లోనో, న్యూయార్క్ లోనో, ఒక కోటీశ్వరుడి డ్రాయింగ్ రూమ్ టేబిల్ మీద వెలుస్తుంది. దాని ఖరీదు రెండు లక్షలనుంచి మూడు లక్షలదాకా వుంటుంది...."
ఆశ్చర్యంతో అందరూ ఒక్కసారి ఊపిరి పీల్చటంవల్ల అక్కడ "హా" అన్న శబ్దం వినబడింది. అతడు చెప్పుకుపోతున్నాడు.
"...ఎంతో కష్టపడి ఈ ప్లాన్ వేశాడు రామ్మూర్తి. అది ఫలించింది. సముద్రగర్భంలో రామ్మూర్తి తాలూకు గజ ఈతగాళ్ళు రాత్రింబవళ్ళు శోధించి వీటిని ఏరారు. ఏరుతున్నారు. ప్రసిద్ధమైన ద్రాక్షసారా కొన్ని వందల సంవత్సరాల క్రితం భూమిలో పాతిపెడితే దాని ఫలితం యిప్పుడు అనుభవించినట్టు... అయిదారు సంవత్సరాల నుంచీ అతడు చేస్తున్న దానికి ఫలితం ఇప్పుడు కనబడుతూంది. ఈ విధమైన 'కోరల్స్' ని అన్నీ జాగ్రత్తగా ఒక పడవలో పేర్చి దాన్ని షిప్ లోకి ఎక్కించే కార్యక్రమం రేపు రాత్రి జరగబోతూంది. ఆ పడవలో వున్న కోరల్స్ విలువ అయిదునుండీ ఆరుకోట్లదాకా వుంటుందని అంచనా".
"మైగాడ్!" తనలో తానే గొణుక్కున్నాడు సింహం.
"రామ్మూర్తిమీద స్వీట్ గా పగతీర్చుకునే అవకాశం ఇక్కడే మనకు లభిస్తూంది. ఒక చిన్న ఏరు నుంచి ప్రయాణం ప్రారంభించి సముద్రం చేరుకునే ఈ బోట్ ని, పొదలచాటునుంచి ఆటోవాటర్ మిసైల్ ద్వారా పేల్చివేయ దల్చుకున్నాను నేను".
రాబోట్ అసహనంగా కదిలేడు. అది గమనించి అతడు ప్రసన్నంగా రాబోట్ వైపు చూసి, "ఈ ఆపరేషన్ లో నాతోపాటూ రాబోట్ కూడా వుంటాడు" అన్నాడు. రాబోట్ మొహం వికసించింది.
"దీనికన్నా ముఖ్యవిషయం ఒకటుంది" అన్నాడు అతడు. "-ఇంత పెద్ద వ్యవహారాన్ని రామ్మూర్తి తాను స్వయంగా దగ్గరుండే నిర్వహిస్తాడు. ఇంకొకరిమీద వదిలిపెట్టడు. సింగపూర్ వెళ్ళే ఓడకి ఈ కోరల్స్ ని అందజేయటంతో అతడి బాధ్యత తీరిపోతుంది. అంటే... అతడి కళ్ళముందే అయిదు సంవత్సరాలుగా కష్టపడి సేకరించిన విలువైన సామాగ్రి అంతా ఒక్క క్షణంలో నాశనమై పోతుందన్నమాట! .. డాక్టర్ ఫాస్టస్ ని చంపినందుకు అతడికి మనం వేసే శిక్ష అది".