Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 1 పేజి 30


    4. ఔషధములు సుఖములు కలిగించునవి. వాయువు మాకు ఔషధములు తెచ్చి ఇవ్వవలెను. తల్లివంటి భూదేవి మాకు ఔషధములు తెచ్చి ఇవ్వవలెను. తండ్రివంటి ద్యులోకము మాకు ఔషధములు తెచ్చి ఇవ్వవలెను. సోమమును అభిషవించు శిలలు కూడ మాకు ఔషధములు తెచ్చి ఇవ్వవలెను. బుద్ధిమంతులగు అశ్వినులారా ! మీరును మాకు అట్టి ఔషధములను ప్రసాదించవలెను.

    (భూమి, నీరు, వాయువు, శిలలు అన్నింటిలోను ఔషధములు ఉన్నవి అని అర్థము)

    5. ధనపతి, జగత్పతి, కర్మప్రియుడు అయిన ఇంద్రుని మమ్ము రక్షించుమని ఆహ్వానించుచున్నాము. శత్రుపీడలేని పూషదేవత మమ్ము రక్షింపుచు ధనములను, సుఖములను ప్రసాదించవలెను.

    6. అధిక స్తుతుల ఇంద్రుడు మాకు శుభములను ప్రసాదించవలెను. సర్వజ్ఞుడగు పూష మాకు శుభములను ప్రసాదించవలెను. అప్రతిహతుడు, ఆయుధవంతుడు గరుడుడు మాకు శుభములను ప్రసాదించవలెను. బృహస్పతి మాకు శుభములను ప్రసాదించవలెను. స్వస్తివో బృహస్పతిర్దధాతు

    7. ఆడ లేళ్లు వాహనములుగా గలవారు. నానావిధ వర్లముల గోవులు తల్లులుగలవారు, నాలుకయందు అగ్గికలవారు, సూర్యునివంటి ప్రకాశముగలవారు, సర్వజ్ఞులయి మరుత్తులను పేరుగల సర్వదేవతలును మమ్ము రక్షించవలెను. ఇచటికి ఏతెంచవలెను. విశ్వేనో దేవా అవసాగమ న్నిహ

    8. మా చెవులు శుభములనే వినవలెను. మా కన్నులు శుభములనే చూడవలెను. దృఢమగు శరీరముతో దేవతలను స్తుతింపవలెను. దేవతలు ప్రసాదించిన ఆయువును పొందుదుము.

    9. దేవతలారా ! మానవులకు నూరు శరత్తుల ఆయువు ప్రసాదించినారు. దేహమునకు వార్థక్యము ఎపుడు ఎంతయో తెలియదు. పుత్రులు తండ్రులయి ఎపుడు ఎంత సేవింతురో తెలియదు. దయచేసి ఆయువునకు ముందును మధ్యను మమ్ము బాధింపవలదు.

    10. భూమియే స్వర్గము. భూమియే అంతరిక్షము. భూమియే తల్లి. భూమియే తండ్రి. భూమియే పుత్రుడు. భూమియే సర్వదేవతలు. భూమియే అయిదు విధముల జనులు. భూమియే పుట్టుక. భూమియే పుట్టిన వస్తువు.

    ఆలోచనామృతము :

    1. ఒకపని నిర్విఘ్నముగ జరుగుటకు అనేకుల అండదండలు, ఆశీస్సులు అవసరము అగును. ప్రకృతి శక్తులు, దేవతలు, మానవులు, పరిసరము ఇన్ని సహకరించివలసి ఉన్నది. అందరిని ప్రార్థించవలసి ఉన్నది. ఇది ఆ ప్రార్థనయే.

    2. మానవుని మనుగడకు సమాజపు నిలకడకు సదాశయములు ఉన్నవి. భద్రం కర్ణేభిః శ్రుణుయాను చెవులతో శుభములే వినవలెను.

    3. 64వ సూక్తమున శతహి హిమాః నూరు హేమంతములు అన్నాడు. అప్పుడు హేమంతము నుండి సంవత్సరము ఆరంభము అయినట్లున్నది. ఇప్పుడు సహితము ఆంగ్ల సంవత్సరము హేమంతముననే ఆరంభము అగును. ఈ సూత్రమున శతమిన్నుశరదో అన్నాడు.

    సంవత్సరము శరత్కాలము నుండి ప్రారంభము అయినట్లున్నది. ప్రస్తుతము మన సంవత్సరము వసంతమున ప్రారంభమగును.

    4. భూమియే సర్వము. భూమిని మించినది లేదు అన్నాడు.

        తొంబదియవ సూక్తము - ఋషి - రహోగణ పుత్రుడు గౌతముడు,
       దేవత - విశ్వేదేవతలు, ఛందస్సు - 9 అనుష్టుప్, మిగిలినవి గాయత్రి.


    1. పగటిదేవత మిత్రుడు, రాత్రిదేవత వరుణుడు మమ్ము మంచిదారిలో నడిపించవలెను. దేవతలందరకు సమాన ప్రియుడయి, ఆర్యముడు, సూర్యుడు మమ్ము మంచిదారిలో నడిపించవలెను.

    2. ఆ మిత్రావరుణ ఆర్యములు సంపదలను పెంచువారు. వారు తమ వెలుగులతో మారాజులను, పసులను పాలించవలెను.

    3. అమరులగు దేవతలు మర్త్యులము అయిన మాకు సుఖములు కలిగించవలెను. మా శత్రువులను బాధించవలెను.

    4. అందరకు పూజ్యులు అయిన ఇంద్రుడు, మరుత్తులు, పూష, భగుడు మమ్ము మంచి గమ్యములవైపు నడుపవలెను.

    5. పూషా ! విష్ణూ ! మరుత్తులారా ! మీరు మా సమస్త కర్మలను, ధనమును, పశువులను క్షేమముగా ఉంచవలెను.

    6. వాయువులు మధురములయి వర్షించుచున్నవి. నదులు మధురములయి ప్రవహించుచున్నవి. ఓషధులు మధుర రసమును కలిగించవలెను.

    7. రాత్రి సుఖకరము కావలెను. ఉషస్సులు సుఖకరములు కావలెను. భూమి సుఖకరము కావలెను. మాతండ్రి ద్యులోకము సుఖకరము కావలెను.

    8. వృక్షములు మధుర ఫలములను ఈయవలెను. సూర్యుడు సత్ఫలములను ఇవ్వవలెను. గోవులు మధుర రసమును ఇవ్వవలెను.

    9. మిత్రుడు సుఖకరుడు కావలెను. వరుణుడు సుఖకరుడు కావలెను. అర్యముడు సుఖకరుడు కావలెను. దేవతలను పాలించు ఇంద్రుడు సుఖకరుడు కావలెను. పెద్ద పెద్ద అడుగులు వేయు విష్ణువు సుఖకరుడు కావలెను.

        తొంబది ఒకటవ సూక్తము, ఋషి - రహోగణ పుత్రుడు గౌతముడు
      దేవత - సోముడు, ఛందస్సు 5-16 గాయత్రి, 17 వృష్ణిక్కు, తక్కినవి త్రిష్టుప్.


    1. సోముడా ! నిన్ను మా బుద్ధిచే బాగుగా తెలిసికున్నాము. మమ్ము చక్కని మార్గమున నడిపించుచున్నావు. నీవు మా పితరులను మంచి మార్గమున నడిపినావు. అందువలన వారు బుద్ధిమంతులు అయినారు. దేవతల ధనమును పొందినారు.

    2. సోముడా ! నీవు క్రతువుల చేత సుక్రతుడవు. బలములచేత మంచి బలవంతుడవు. ధనములచేత మంచి ధనవంతుడవు. వర్షములు కలిగించు మంచి వర్షివి. నరులు అందించు హవిస్సులతో మంచి అన్నవంతుడవు అగుచున్నావు.

    3. సోముడా ! వరుణ రాజు కర్మలు అన్నియు నీవియే అగును. నీ తేజస్సు విశాలమయినది. గంభీరమయినది. పగటిపూట సూర్యుడు సమస్తమును రక్షించును. వృద్ధిచేయును. అట్లే రాత్రులు నీ చల్లని కిరణములచే సమస్తమును రక్షింతువు. వృద్ధి చేయుదువు.

    4. సోముడా ! నీకు ద్యులోకము, భూలోకమునందు పర్వతములందు, జలములందు, ఓషధులందు కాంతులు ఉన్నవి. ఆ కాంతులన్నింటితోనూ సహృదయముతో, కోపములేకుండ మా హవిస్సులు స్వీకరింపుము.

    5. సోముడా ! నీవు సత్కర్మలు చేయువారికి అధిపతివి. ప్రకాశించువాడవు. వృత్రుని వధించినవాడవు. నీవు క్రతువులకు శుభప్రదుడవు. త్వం భద్రో అపిక్రతుః

    6. సోముడా ! నీవు జీవనౌషధమవు. స్తోత్ర ప్రియుడవు. వనములకు అధిపతివి. నీవు అనుగ్రహించిన మరణము మా చెంతకు చేరదు.

    7. సోముడా ! యజ్ఞకర్త వృద్ధుడు అయినను యువకుడు అయినను ధనము ప్రసాదించుచున్నావు.

    8. సోముడా ! పాపాత్ములు మాకు తల పెట్టుచున్నారు. వారి బాధలనుండి మమ్ము కాపాడుము. నీ మిత్రుడు నశింపడు.

    9. సోముడా ! యజమానికి సుఖములు కలిగించు నీ రక్షణలే మాకు ప్రసాదింపుము.

    10. సోముడా ! మేము నిన్ను స్తుతించుచున్నాము మా దరికి రమ్ము. సేవింపుము. మాకు వృద్ధి కలుగచేయుము.

    11. సోముడా ! మాకు స్తుతివాక్కులు తెలియును. మేము నిన్ను స్తుతించుచున్నాము. వృద్ధి పరచుచున్నాము. మాకు సుఖములు కలిగింపుము.

    12. సోముడా ! నీకు ధనవర్ధకులు, రోగనాశకులు, పుష్ఠిదాతలు అయిన మిత్రులు కలుగవలెను.

    13. సోముడా ! గోవులు మంచి తృణమునందును, నరుడు తన గృహము విషయమున ప్రీతికలిగినట్లు మాహృదయములందు ప్రీతి కలిగి నివసింపుము.

    14. సోముడా ! నీవు ప్రకాశవంతుడవు. జ్ఞానివి. సమర్థుడవు. నిన్ను స్తుతించిన వానిని అనుగ్రహింపుము.

    15. సోముడా ! నీవు మమ్ము నిండనుండి రక్షింపుము. పాపముల నుండి రక్షింపుము. నీవు సుఖవంతుడవు అగుము. మాకు హితము చేకూర్చుము.

    16. సోముడా ! సర్వదిశల సామర్థ్యము నిన్ను వరించవలెను. వర్థమానుడవు అగుము. అన్నము కలుగచేయువాడవు అగుము.

    17. సోముడా ! సమస్త లతలతో సమర్థుడవు అగుము. నీవు అన్నవంతుడవు అగుము. మాకు మిత్రుడవు అగుము. మాకు అభ్యుదయము కలిగించుము.

    18. సోముడా ! నీవు శత్రు సంహారకుడవు. దుగ్ధములు అన్నియు నిన్ను చేరవలెను. హవిస్సులు అన్నియు నిన్ను చేరవలెను. సామర్థ్యము సాంతము నిన్ను చేరవలెను. ద్యులోకమునందు మంచి అన్నములు ధరించి అమృతుడవయి వర్థిల్లుము.

    19. సోముడా ! యజమానులు నీ తేజస్సులను పూజింతురు. ఆ తేజస్సులు అన్నింటితో మా యజ్ఞమున వ్యాపింపుము. నీవు తరతరాల గృహమును వృద్ధిచేసినావు. పాపములనుండి తొలగించినావు. వీరులతో కూడి మా యజ్ఞగృహమునకు విచ్చేయును.

    20. యజమాని సోమునకు హవిస్సులు ఇచ్చును. సోముడు అట్టి యజమానికి పాలిచ్చు ఆవులను, వేగవంతములయిన అశ్వములను ఇచ్చును. కర్మలందు నేర్పరి, ఇంటికి ఉపయోగపడువాడు, యజ్ఞార్హుడు, సభలందు రాణించువాడు, తండ్రికి కీర్తి తెచ్చువాడు అగు పుత్రుని ప్రసాదించుము.

    21. సోముడా ! నీవు యుద్ధములందు అజేయుడవు. సేనలకు జయమును ఇచ్చువాడవు. స్వర్గమును ఇచ్చువాడవు. బలమును ఇచ్చువాడవు. యజ్ఞములందు పుట్టినవాడవు. మంచి నివాసము కలవాడవు. సత్కీర్తిమంతుడవు. నిన్నుచూచి మేము గర్వించుచున్నాము. త్వమను మదేమసోమ

    22. సోముడా ! నీవు సమస్త ఓషధులను సృష్టించినావు. గోవులను సృష్టించినావు. అంతరిక్షమును విస్తరింప చేసినావు. నీ వెలుగుతో చీకటిని పారదోలినావు.

    23. సోముడా ! నీవు బలవంతుడవు. ప్రకాశవంతుడవు. ఉదారబుద్ధితో మాకు ధనమున భాగము కల్పించుము. నిన్ను కష్టపెట్టగల శత్రువులేడు. యుద్ధమున నీవు ఉభయ పక్షముల వర్తింతువు. యుద్ధములందు మమ్ము ఉపద్రవములనుండి రక్షింపుము.

        తొంబది రెండవ సూక్తము, ఋషి - రహోగణపుత్రుడు గౌతముడు
      దేవత ఉషస్సు, అశ్వినులు, ఛందస్సు1-4 జగతి, 5-12త్రిష్టుప్, 13-18ఉష్ణిక్కు. 

    1. ఉషస్సులు వెలుగులు పరచినవి. అంతరిక్ష పూర్వార్థమున సూర్యుని వెల్లడించినవి. ఉషస్సులు మెరుగుపెట్టిన ఆయుధములవలె తళతళలాడుచు సూర్యకాంతిని కలుగచేయుచు జగత్తును ప్రతిదినము సంస్కరించుచున్నవి.

    2. ఉషస్సు కిరణములు తమంత తామే ఆవిర్భవించినవి. తొలి అరుణ కిరణ రథమును అధిరోహించినది. ఎప్పటివలెనే సకల జనులకు జ్ఞానము కలగించినది. తదుపరి శుభ్రవర్ణము దాల్చినది. ఉషస్సు సూర్యుని సేవించినది.

    3. శోభన కర్మలు చేయునట్టి ఋత్విజునకు సోమాభిషవము చేయు యజమాని ధనరూపమగు రక్షణలు ఇచ్చును. ఉషస్సు యజమానికి అట్టి ధనమును ప్రసాదించుచున్నది.

    యోధులు తమ ఆయుధ బలమున జగత్తును అంతటిని వ్యాపించినట్లు ఉషస్సు తన వెలుగును ఆకాశమున తూర్పు నుంచి పడమటి వరకు పరచినది.

    4. మంగలి వెంట్రుకలు గొరిగినట్లు ఉష చీకట్లను గొరుగుచున్నది. పాలు ఇచ్చునపుడు ఆవు పొదుగును విడిచినట్లు ఉష తనముందరి తెరను తొలగించుచున్నది గోవులు తమ మందను చేరినట్లు ఉష తూర్పున చేరి విశ్వమునకు వెలుగు ప్రసాదించుచున్నది.

    5. ఉషస్సు కాంతి తొలుత తూర్పున కనిపించి తదుపరి అంతట వ్యాపించినది. చీకటిని రూపుమాపినది. యజ్ఞములందు యూపమునందలి శకలములను నేతితో పూసినట్లు ఉషస్సు తనకాంతి సర్వత్ర పూయుచున్నది.

 Previous Page Next Page