ఆ బాట సరాసరి భవనం పోర్టికోలోకి కవర్ వేసి వుంది.
ఇద్దరూ పోర్టికోలోకి అడుగు పెట్టగానే......
"ఎవరది?"
నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మాటలు వినిపించాయి.
"నేనే కోటి..."
వెంటనే లైటు వెలిగింది.
గుబురు మీసాలతో, పెరిగిన గడ్డంతో, గుంటలు పడిన కళ్ళతో వయసు మీద పడ్డట్లు వున్నాడు కోటి__ ఆ బంగ్లాకు వాచ్ మెన్.
సింహద్వారం తాళంతీసి హాలులో లైట్లు వేశాడు.
హాలు అంతా దుమ్ము కొట్టుకుపోయి వుంది. ఇంట్లో సామానులు అన్నీ చిందరవందరగా పడివున్నాయి. వాచ్ మెన్ వుంటున్న గదికి మినహా మిగిలిన గదులు అన్నిటికీ తాళాలు వేసివున్నాయి.
"మంచినీళ్ళు తీసుకువస్తాను బాబూ..." అంటూ కోటి బయటకు వెళ్ళబోయాడు.
"అదేమిటి... కిచెన్ లేదా?" అనుమానంగా అడిగాడు.
"మీరు వస్తున్నట్టు తెలియదుగా... అందుకే నీళ్ళు పట్టలేదు. కిచెన్ రూమ్ కు కూడా తాళం వేశాను" నిట్టూర్చాడు.
"డ్రయివరు ! నువ్వు విశ్రాంతి తీసుకో...కోటీ...ఇతనికి గది చూపించు" చెప్పుతూనే మరొక గదిలోకి వెళ్ళాడు సూట్ వాల.
గదిలో అడుగు పెట్టిన వెంటనే ఎదురుగా గోడకు వెళ్ళాడుతున్న ఫోటోలను చూడగానే అతని పళ్ళు పటపట లాడాయి.
గోడకు తగిలించివున్న రైఫిల్ తీసి ఫోటోలకు గురి పెట్టాడు.
సరిగ్గా అదే సమయానికి కోటి...గది తలుపు తీసుకుని లోపలకు వచ్చాడు.
"కోటీ...నీకు ఎన్నిసార్లు చెప్పాను...నేను గదిలో వుండగా తలుపు కొట్టకుండ లోపలకు రావద్దని..." ట్రిగ్గర్ నొక్కబోతున్నవాడల్లా రైఫిల్ ను కిందకు దించుతూ విసుక్కున్నాడు.
రైఫిల్ ను తిరిగి గోడకు తగిలించాడు.
"బాబూ...నాకు తెలియక అడుగుతాను. ఆ ఫోటోలను ఎన్నిసార్లు షూట్ చేస్తారు! అయినా మీ కక్ష తీరలేదు...పోనీ ఫోటోలను తీసి ఒక్కసారిగా తగలబెట్టనా...అప్పుడయినా మీ కక్ష తీరుతుందేమో..."
"షటప్... అతిగా మాట్లాడకుండా వచ్చినపని చూసివెళ్ళు..." అతను ఆవేశంగా అన్నాడు.
కోటి చిన్నబుచ్చుకుంటూ మంచినీళ్ళ జగ్గు అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు.
బెడ్ మీద పడుకున్నాడన్నమాటే కానీ అతనికి ఎంతసేపటికీ నిద్రట్టలేదు...లేచి షర్టు వేసుకుని గార్డెన్ వైపుకు బయలుదేరాడు.
సరిగ్గా అర్ధరాత్రికి గుర్తుచేస్తూ గోడగడియారం ఒక్క గంట కొట్టింది.
దూరంగా కనిపిస్తున్న సమాధులను ఎవరో పగలకొడుతున్న శబ్దం వినిపిస్తున్నది.
అతను ఆతురతగా సమాధుల దగ్గరకు పరుగెత్తాడు.
ఆ అడుగుల చప్పుడుకు సమాధుల దగ్గిర కూర్చుని వున్న డ్రయివరు రంగారావు తలెత్తి చూశాడు.
ఆ వ్యక్తిని చూస్తూనే కెవ్వున కేకవేశాడు...
మరుక్షణంలోనే అతని చేతిలోని బటన్ నైఫ్ రంగారావు కంఠంలోకి లోతుగా దిగిపోవడంతో ఆ కేక లోపలే పూడుకుపోయింది.
ఆ వెంటనే రక్తపు మడుగులో నేలకొరిగాడు.
అతని వెనుకనే కోటి నిలిచాడు.
"జరిగిపోయింది తలుపుచుని కుమిలిపోవడం కంటే మనముందు వున్న కర్తవ్యాన్ని నెరవేర్చుకోవడమే మన ఆశయం కావాలి. ముందు చేయవలసినపని పూర్తిచేసి ఆ తరువాత విశ్రాంతి తీసుకో. అర్దారాత్రి దాటుతున్నది...పని తొందరగా అయిపోవాలి!"
అతని మాటలకు కోటి తల వూపాడు.
"నీకు కబురుచేసే టైమ్ లేక నేనే వచ్చాను. ముందు జరగవలసిన పని చూడు. రేపు వుదయం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు..." కోటి భుజంతట్టి హెచ్చరిస్తూ కదిలాడు అతను.