సౌందర్య గుమ్మంలో అడుగు పెట్టగానే వామనమూర్తి కూడా చూశాడు. అందరి లాగే అతనూ ఒక్క క్షణం ఆమెను చూస్తూ చైతన్యం కోల్పోయాడు. అప్పుడే ఆవిడ దగ్గరకు రావాలని ఆరాటపడ్డాడు. కానీ, అతని చుట్టూ చేరి గోల్డు మెడల్ గురించి అడుగుతున్న జనం అతడిని కదలనివ్వలేదు. వాళ్ళకు దాన్ని గురించి వివరించకుండా కదలగలిగే శక్తి అతనికి లేదు.
వచ్చిన అతిథులందరికీ కాఫీ ఫలహారాలు అందేలా చూస్తోంది సుధ-ఎవరి వైపూ చూడకుండా తన పని తాను చేసుకుంటోంది.
ఎవరికో తన గోల్డుమెడల్ గురించి మొహమాట పడుతూనే వివరంగా చెపుతున్న వామనమూర్తి తలవొంచుకుని పని చేసుకుంటున్న సుధను చూశాడు.
అప్రయత్నంగా సుధ దగ్గరకు నడిచాడు. సుధ తలెత్తి ప్రశ్నార్ధకంగా చూశాక సుధ దగ్గరకు ఎందుకు వచ్చానా అని ఆశ్చర్యపోయాడు. ఎందుకో ఎవరి మీదో తెలియకుండా కోపం వచ్చింది.
"నాకు యూనివర్శిటీ ఫస్టు వచ్చినందుకు ఇంత మంది అభినందిస్తున్నారు, నువ్వు మాత్రం ...."
నిష్టూరంగా ఏదో అనబోయి.....అనలేకపోయాడు.
సుధ స్నేహపూర్వకంగా సమాధానమిచ్చింది.
"నువ్వు వచ్చి చెప్పక మానవు. అప్పుడు అభినందించాలని ఎదురు చూస్తున్నారు. కంగ్రాట్యులేషన్స్! రంగన్నా, చూడు! ఆ వైపు వాళ్ళకు స్వీట్స్ అందలేదు-"
"ఒక్క క్షణం ఆ వెధవ పని ఆపి నాతో మాట్లాడలేవా?"
"మాట్లాడుతున్నాగా! పని ఆపడం దేనికి? చెప్పు. సీతమ్మా! మంచినీళ్ళు పట్టుకురా!"
"ఈ గోల్డుమెడల్ నీకు బాగుండలేదూ?"
"నిజంగా నీకు బాగుందా!"
"నిజంగా" నొక్కి పలికిన సుధను వెలవెలబోయి చూస్తూ
"ఎందుకు బాగుండదూ?" అన్నాడు.
"అయితే నాకూ బాగుంది!"
ఈ సంభాషణ శ్రద్ధగా వింటోన్న సౌందర్య సుధ దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేసి ముఖంలోకి చూసి నవ్వింది.
సుధ చటుక్కున చూపులు వాల్చుకుంది. అంతలో తలెత్తి సౌందర్య చూపులను ఎదుర్కొంది. ఒక దాని వైపు మరొకటి ప్రబలంగా ఆకర్షింపబడే రెండు వ్యతిరేక ధృవాలలా ఇద్దరూ కొన్ని క్షణాలు ఒకరినొకరు చూసుకున్నారు.
సౌందర్య తనకు దగ్గరగా వచ్చేసరికి తనలో ఏదో విద్యుత్తు ప్రవహించినట్లే అయింది వామనమూర్తికి...
"హలో! సౌందర్యా!" అన్నాడు ఉత్సాహంగా...
"హలో!"
సౌందర్య చూపులు వామనమూర్తి గోల్డుమెడల్ మీద నిలిచాయి. సౌందర్య దాన్ని గురించి అడిగితే చెప్పాలని ఆరాటపడుతున్నాడు వామనమూర్తి.
సౌందర్య అడగలేదు.
"ఈ గోల్డుమెడల్ పెట్టుకోవాలనుకోలేదు. కానీ మిసెస్ కామేశ్వరీ దేవి చాలా బలవంతపెట్టారు. ఆవిడ మాట కాదనలేకపోయాను."
"కాదనటం దేనికి? గోల్డు మెడల్ పెట్టుకోవటానికి, ప్రదర్శించటానికి కాకపోతే మరి దేనికి?"
"ఆ! ఏదో వచ్చింది, మనం మహా గొప్పవాళ్ళమైనట్లు చూపించుకోవటం దేనికి?"
"ఏదో రావటం కాదు. ఆ గోల్డు మెడల్ కి నీకంటే అర్హులెవరూ లేరని నేను ఖండితంగా చెప్పగలను."
వామనమూర్తి ఆనందం పట్టలేకపోయాడు.
"నువ్వు నిజంగా అనుకుంటున్నావా? నాకు నీ అభిప్రాయం మీద చాలా గౌరవం..."
"థాంక్స్!"
"నిజానికి ఈ గోల్డుమెడల్ కోసం నేను చాలా శ్రమపడవలసి వచ్చింది."
"నాకు తెలుసు!"
"మా క్లాస్ మేట్స్ లో చాలా తెలివైన వాళ్ళున్నారు. వాళ్ళందరి కంటే పైకి రావాలంటే మాటలు కాదు."
"అవును!"
"ఎంత కష్టపడి చదివాననుకున్నావ్!"
"కానీ, ఈ గోల్డు మెడల్ నీ కొచ్చింది కష్టపడి చదివినందుకు కాదు. నువ్వు ఎంత చదివినా ఒకటే! పరీక్షలకు ముందే ప్రశ్నాపత్రాలు సంపాదించగలవు. అది సామాన్యమైన కార్యమా? ప్రాక్టికల్స్ లో మార్కులు ఎలా సంపాదించగలిగావో, అది ఇంకా అద్భుతం. ఇలాంటి అద్భుతాలు చెయ్యగలిగిన నీకంటే ఆ గోల్డుమెడల్ కు అర్హులెవరు? వెధవ చదువుదేముంది? ఎవరైనా చదువుతారు! కష్టపడి చదివిన వాళ్ళందరికీ గోల్డుమెడల్స్ అపురూపం ఏం ఉంటుందీ?"
"సౌందర్యా!...."
నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ గాభరాగా అన్నాడు వామన మూర్తి.
"ఫరవాలేదులే! నేను చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాను. ఎవరికీ వినిపించదు. విన్నా ఎవరూ పట్టించుకోరు! రోజూ ఎన్నెన్ని వింతలూ విడ్డూరాలూ వినిపిస్తుంటాయో! అవన్నీ పట్టించుకొనే తీరిక ఎవరికి? ఎవరి పనులు వాళ్ళవి! ఎవరి పరుగు వాళ్ళది! నీ గోల్డుమెడల్ కి ఢోకా లేదు. దాని వల్ల సంఘంలో వచ్చే గౌరవానికి ఎదురు లేదు. కానీ ఒక్క సందేహం! నీ గోల్డు మెడల్ పేషెంట్ల రోగాలు కుదర్చగలదా?"
"నేను ప్రయివేట్ ప్రాక్టీస్ చెయ్యను!" అనేసి నాలుక కరచుకున్నాడు వామనమూర్తి. ఇదేమిటీ? తనిలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ సౌందర్యలో ఏముందీ?
"అదీ సంగతి! నీ గోల్డు మెడల్ నీకు ఉద్యోగం కూడా సంపాదించి పెడుతుంది. ఇంక పేషెంట్సు సమగతి ఆలోచించక్కర్లేదు." పకపక నవ్వసాగింది సౌందర్య.
ఆ నవ్వు వింటోంటే ఏదో లోలోపల తనను దహిస్తున్నట్లే అనిపించసాగింది. వామనమూర్తికి. ఆ నవ్వు నుండి దూరంగా పారిపోవాలనిపిస్తుంది. కానీ, ఏదో శక్తి ఆ నవ్వు వైపుకే మనసును గాలంవేసి లాగుతుంది.
అతని అవస్థ చూసి మరింత నవ్వింది సౌందర్య.