తండ్రి కంఠంలో ఆ దిగులు గమనించి నవ్వింది సౌందర్య. "నేను నిజమే చెప్తున్నాను నాన్నగారూ!"
"కథల్లో రాజకుమారిలాగా కలలో ఒక సుందర పురుషుణ్ణి చూసి..."
"సుందర పురుషుడు కాదు నాన్నగారూ! నా కలలో హీరోకి ఏ రూపమూ లేదు. కేవలం ఒక ఆత్మ! అది మామూలు లోకంలో ఉంటే ఏ ఆకారంలో ఉంటుందో మరి! ఏ ఆకారంలో ఉన్నా గుర్తుపట్టగలను!"
"సౌందర్యా! నాకు అర్ధమయ్యేలా మాట్లాడు తల్లీ!"
"మాట్లాడతాను! మీరు అర్ధం చేసుకోగలరో, లేదో మరి!"
"నేను హైస్కూల్లో చదివే రోజుల్లో మాకొక లెక్కల మాస్టారుండేవారు! ఎంత బాగా చెప్పేవారని! ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు. సరదాగా మాట్లాడే వారు. అట్లాంటి వ్యక్తి ఎందుకో అకస్మాత్తుగా మారిపోయారు. చిరునవ్వు అనేది ముఖాన కనబడకుండా పోయింది. కొన్ని రోజులు దెయ్యం పట్టిన మనిషిలా ఈ లోకంలో లేనట్లు ఉండేవారు. ఆ తరువాత మళ్ళీ కనిపించారు. కానీ ఆ నవ్వులో ఏదో భేదం కనిపించేది. మరెవరి నవ్వునో ఆయన నవ్వుతున్నట్లు ఉండేది.
"మాస్టారూ! మీరు మారిపోయారు!" అన్నాను నేను.
"అవునమ్మా! ఇదివరకు కలిగినది తింటూ ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు కలిమిలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఆరాటపడుతున్నాను." అన్నారు.
"అప్పుడు నాకు సరిగ్గా అర్ధం కాలేదు. ఆ తరువాత తెలిసింది. మాస్టారు నిజాయితీ గల మనిషి ఆయన దగ్గరకు మామూలుగా మార్కుల కోసం వచ్చారు. మాస్టారు మొదట ఒప్పుకోలేదు. కానీ ఆయన ఉద్యోగమే ఊడే పరిస్థితి వచ్చింది. ఒప్పుకున్నారు. మార్కులు వేశారు. డబ్బు సంపాదించుకున్నారు. అందరికీ తెలుసు! అంతా మామూలే!"
మామూలు! మామూలు! మామూలు!
"ఆనాటి నుండి తరచుగా నాకొక కల వచ్చేది. ఒక రూపాయి నాణెం గుండ్రంగా ఏ ఆధారమూ లేకుండా తిరుగుతోంది. జనమంతా దాని చుట్టూ వేలం వెర్రిగా తిరుగుతున్నారు! కొందరి ముఖాల్లో భయం- మరి కొందరి ముఖాల్లో బెంగ... కోపం.. నిరాశ... నిర్లిప్తత... ఆనందం... ఆశ... దురాశ...ఎన్నెన్నో భావాలు- కానీ, ఏ ఒక్కరూ పరుగు మాత్రం మానరు. ఎవ్వరూ అందుకోరు! ఎవ్వరూ వదులుకోలేరు.
అర్ధరహితమైన ఆ మూక నాట్యం భరించలేక నాకు మెలకువ వచ్చేది!
ఇటీవల ఆ కలకు మరో చిన్న భావం తోడయింది. అది నిజంగా కలో, లేక నా భ్రమో - ఆ మూక నాట్యం భరించలేని నా మనసు భావించుకున్న ఊహాచిత్రమో- నేను చెప్పలేను.
ఈ గుంపుకి దూరంగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఇంత మందిని ఆడిస్తోన్న ఆ నాణెం అతడు చెప్పినట్లు ఆడుతోంది. రమ్మన్నప్పుడే వస్తోంది. పొమ్మన్నప్పుడు పోతోంది. అతడు నవ్వుతున్నాడు హాయిగా.....స్వచ్చంగా......ధైర్యంగా...
"ఆత్మవిశ్వాసంతో కూడిన ఆ నవ్వు ఎన్ని కోట్ల కంఠాలలోనయినా నేను గుర్తించగలను! ఆ ధీరత్వం ఏ ఆకారంలో ఉన్నా ఆనవాలు పట్టగలను. ఎప్పుడనేది చెప్పలేను. కాని..."
సహనంతో సౌందర్య మాటలు వింటున్న శశాంక ముఖంలో నిరాశ అలుముకుంది.
"ఆ లోకంలో వ్యక్తిలాగా నువ్వెప్పటికి మారగలవమ్మా!"
సౌందర్య దెబ్బతిన్నట్లు చూసింది ఒక్క క్షణం.
అంతలో నవ్వేసింది.
"సారీ నాన్నగారూ! గుడ్ నైట్!"
2
ఆనాడు మిసెస్ కామేశ్వరీ దేవి ఇస్తున్న పార్టీలో అందరి కళ్ళూ వామనమూర్తి మీదనే ఉన్నాయి. వామనమూర్తి మంచి కనుముక్కు తీరుగల వ్యక్తి. నిండైన విగ్రహం. చక్కని మాట నేర్పు అతనికి మంచి ఆకర్షణ. అతని కోటుపైన గోల్డు మెడల్ ధగధగలాడుతుంది. అందరూ దానిని గురించి అడుగుతున్నారు. సిగ్గుపడుతూ, మొహమాటపడుతూ ఇష్టం లేనట్లు ముఖం పెడుతూ ఉత్సాహంగా వివరాలు చెపుతున్నాడు వామనమూర్తి.
మిసెస్ కామేశ్వరీ దేవి సంపన్నురాలు. కానీ చాలా చిన్న వయసులోనే వితంతువయింది. పునర్వివాహానికి అవకాశాలున్నా చేసుకోలేదు. రామాయణ, భాగవతాలు, భగవద్గీత- బాగా చదువుకున్నట్లు గుర్తుగా సాధ్యమయినంత ఎక్కువగా అవి కోట్ చేస్తూ ఉంటుంది. ఆవిడ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించి పరిచయస్తులు గొప్పగా చెప్పుకుంటారు. ఆవిడ ఒక అనాథాశ్రమం నడిపిస్తోంది. ఇప్పుడు క్రొత్తగా ఒక పతిత జనోద్దరణ సంఘం స్థాపించింది. దాని ప్రారంభోత్సవానికే ఘనంగా ఈ పార్టీ ఏర్పాటు చేసింది. ఆ ప్రారంభోత్స వానికి ఎవరో సినిమాస్టార్ ను ఆహ్వానించింది. అందుకే అతిథులెప్పటి కంటే ఎక్కువగా ఉన్నారు.
మిసెస్ కామేశ్వరీ దేవి ఆహ్వానాన్ని ఎప్పుడూ వదులుకోదు సౌందర్య. అందుకే సకాలానికే వచ్చింది. సౌందర్య గుమ్మంలో అడుగు పెట్టగానే అక్కడున్న అందరి కళ్ళు.... స్త్రీ, పురుష, బాల, వృద్ధ వివక్షత లేకుండా సౌందర్య వైపు మళ్ళాయి. అలా జరుగుతుందని సౌందర్యకు తెలుసు. అందుకే ఎవరివైపూ చూడకుండా చిరునవ్వుతో ముందుకు నడిచింది.
సౌందర్యను చూడగానే మిసెస్ కామేశ్వరీ దేవి ముఖమంతా వెలిగి పోతుండగా ఎదురొచ్చి ఆహ్వానించింది.
"రా!రా! సౌందర్యా! నువ్వు లేకపోతే ఈ పార్టీకి నిండుదనమే లేదు. ఇందాకటి నుండి నీ కోసమే ఎదురుచూస్తున్నాను!"
గబగబ దొర్లిపడే ఆ మాటలలో...మరింతగా నవ్వాలనే ప్రయత్నంలో కొంత అతి ధోరణి కనిపిస్తోంది. మనసులో ఏదో భావాన్ని క్రమ్ముకోవాలనే ప్రయత్న పూర్వకమయిన ఆత్రుత వ్యక్తమవుతోంది.
ఆవిడ ఆహ్వానానికి సమాధానంగా అంతకు మించిన ఆప్యాయతతో నవ్వింది సౌందర్య.
"ఈ రోజు మరో శుభవార్త కూడా! మన వామనమూర్తికి యూనివర్శిటీ ఫస్టు వచ్చినందుకు గోల్డు మెడల్ వచ్చింది, అదిగో చూశావా?..."
గర్వంగా చూపించింది మిసెస్ కామేశ్వరీ దేవి...
సౌందర్య రాగానే చూసింది...