Previous Page Next Page 
మారణహోమం పేజి 3

 

    ఆ ధైర్యంతోనే ఇప్పుడు రహస్యాలన్నీ బయటపెట్టేస్తున్నాడు జగ్ మోహన్.   
    నోరు తెరుచుకు వింటున్నారు చాలామంది. మధ్యమధ్యలో నిఖిల్ ని చూస్తున్నారు. భయమూ, కుతూహలమూ రెండు కనబడుతున్నాయి వాళ్ళ చూపుల్లో.   
    నిఖిల్ వాళ్ళెవరినీ లక్ష్యపెట్టడంలేదు. ఒకప్పటి తన అనుచరుడు జగ్ మోహన్ చెబుతున్నదంతా చాలా శ్రద్దగా వింటున్నాడు. యథాలాపంగా చూసినట్టు మధ్యమధ్య అమూల్యవైపు చూస్తున్నాడు. మధ్యాహ్నందాకా సాగుతూనే ఉంది జగ్ మోహన్ సాక్ష్యం. భోజన విరామ సమయానికి కూడా అది పూర్తి కాలేదు.   
    లంచ్ రీసెస్ కోసం లేచారు జడ్జిగారు. ఆయనతోబాటు కోర్టులో ఉన్న వారందరూ లేచారు. తుపాకులు పట్టుకుని ఉన్న ఆరుమంది పోలీసులు నిఖిల్ ని నడిపించుకుని వెళ్ళారు. ఇంకో ఆరుమంది జగ్ మోహన్ ని వలయాకారంలో చుట్టుముట్టి భద్రంగా ఒక సెక్యూరిటీ సెల్ లోకి తీసుకెళ్ళారు.   
    నిఖిల్ ఎంతమంది దృష్టిని ఆకర్షించాడో అంతమంది దృష్టిని ఆకర్షిస్తోంది అమూల్య కూడా. అందంగా తెలివిగా మెరుపుతీగలా చురుగ్గా కనబడుతున్న ఆ అమ్మాయి మీద నుండి కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు ఎవ్వరూ.   
    చేతిలో ఫైళ్ళు పట్టుకుని అంతమంది జనంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎక్కడ ఉన్నారా అని పరికించి చూస్తోంది అమూల్య. ఆమె కళ్ళు  అటూ ఇటూ తిప్పుతుంటే నల్లటి 'ఏంజెల్ ఫిష్' అనే చేపలు వేగంగా నీళ్ళలో కదులుతున్నట్లు అనిపిస్తోంది.   
    పి.పి.గారు ఎక్కడా కనబడలేదు. వెనకనుండి ఒక చెయ్యి మెల్లిగా ఆమె భుజాన్ని తాకింది. తిరిగి చూసింది అమూల్య. ఎదురుగా ఒకఅమ్మాయి నిలబడి ఉంది. పెద్ద బొట్టు, కళ్ళజోడు, చేతిలో పెద్ద ఫోల్డరు.

    "నేను జమున. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి స్టెనోని" అని, ఫోల్డరులో నుండి ఒక చిన్న కవరు బయటకు తీసింది ఆ అమ్మాయి "జగ్ మోహన్ లంచ్ తర్వాత చెప్పవలసిన సాక్ష్యం తాలూకు వివరాలు ఇందులో ఉన్నాయి. ప్రాసిక్యూటర్ గారు ఇది మీకు ఇమ్మన్నారు. మీరు జగ్ మోహన్ కి ఇచ్చెయ్యండి. నేను ప్రాసిక్యూటర్ గారితో కలిసి అర్జెంటుగా ఒకసారి ఆఫీసుకి వెళ్ళిరావాలి. ఆయన బయట జీపులో కూర్చుని ఉన్నారు."   
    "ఓకే! అలాగే ఇస్తాను" అని కవరు అందుకుంది అమూల్య.   
    జగ్ మోహన్ సెల్ దగ్గర కాపలా ఉన్న పోలీసులు అమూల్యని గుర్తుపట్టారు.   
    సెల్ లో కూర్చుని తన ముందు ప్లేట్లో పెట్టి ఉన్న చపాతీని ముక్కలు ముక్కలుగా తుంపుతూ, దీర్ఘాలోచనలో మునిగిఉన్న జగ్ మోహన్ అమూల్య తన పేరుని పిలవగానే వులిక్కిపడి గాభరాగా తల ఎత్తాడు. అతని కళ్ళలో భయం కనబడుతోంది.   
    "ప్రాసిక్యూటర్ గారు ఈ కవరు నీకిచ్చి చదవమని చెప్పారు." అంది అమూల్య.   
    "కవర్.....కవరా?......ఏం కవరు" అని వణుకుతున్న చేతులతో దాన్ని అందుకున్నాడు అతను. వెనక్కి తిరిగి వచ్చేసింది అమూల్య.   
    లంచ్ ముగిసిన తర్వాత మళ్ళీ విచారణ మొదలయింది. జగ్ మోహన్ బోనెక్కాడు.   
    "చెప్పు" అన్నాడు జడ్జిగారు.   
    "చెప్పవలసింది ఏమీలేదు. నాకేం తెలియదు" అన్నాడు జగ్ మోహన్ దయ్యాన్ని చూసి వచ్చిన వాడిలా పాలిపోయి ఉంది అతని మొహం.   
    కోర్టు మధ్యలో ఒక బాంబు నిశ్శబ్దంగా పేలినట్లయింది. కొద్ది క్షణాల సేపు అందరూ నోటమాట రాకుండా చూస్తూ ఉండిపోయారు. తర్వాత అందరూ ఒక్కసారిగా మాట్లాడడం మొదలెట్టారు. రణగొణధ్వని చెలరేగింది.   
    "ఆర్డర్.....ఆర్డర్....." అన్నారు జడ్జిగారు. తర్వాత జగ్ మోహన్ ని ఉద్దేశిస్తూ "నువ్వు పొద్దున్న నుండి చెబుతున్న సాక్ష్యం ఇంకా పూర్తికాలేదు" అని తన ముందు ఉన్న పేపర్సు వైపు చూసుకుని "నిఖిల్ బర్కత్ పురాలో చేసిన హత్య గురించి నువ్వు చెబుతూ ఉండగా కోర్టు లంచ్ కోసం వాయిదా పడింది. ఆ హత్య గురించి నీకు తెలిసిన మిగతా విషయాలు చెప్పు" అన్నారు.   
    "ఆ హత్యా గురించి నాకేం తెలియదు."    

    "నిఖిల్ ఆ హత్య చేశాడని పొద్దున చెప్పావ్?"   
    "పోలీసులు అలా చెప్పమన్నారు. చెప్పేదాకా చితకబొడిచారు లాకప్ లో"   
    జడ్జిగారు అతని మొహంలోకి పరిశీలనగా చూసి తర్వాత ఏదో నోట్ చేసుకున్నారు.

 Previous Page Next Page