కానీ తెలుసుకోవాలి. తప్పదు - నా పగ చల్లారాలంటే అన్నీ నేర్చుకోవాలి. ఏ అమాయకత్వం నన్నీ జైలు గోడల మధ్య బంధించిందో ఆ అమాయకత్వాన్ని యిక వదిలెయ్యాలి.
నా చుట్టూ చేరిన ముగ్గురికి నేను దేవుణ్ణనే భావం కలిగింది.
"బీడీ కాల్చు గురూ" అంటూ నా నోట్లో బీడి వుంచాడు బలవంతంగా ఒకడు. ఇంకొకడు వెలిగించేడు. అప్రయత్నంగా పొగపీల్చేను. పోలమారి దగ్గొచ్చింది. వాళ్ళు నవ్వలేదు - నా మీ వారికి యెంత గౌరవం పెరిగిందో చెప్పటానికి అదే నిదర్శనం.
దూరంగా పన్నెండు కొట్టింది. "ఇక పడుకుందాం" అన్నాను. నన్ను కిటికీ క్రింద పడుకోమన్నారు - ముగ్గురూ తలోవైపూ సర్దుకున్నారు. తలక్రింద చేతులు పెట్టుకుని పైకప్పుకేసి చూస్తూ పడుకున్నాను. వెన్నెల పైనున్న కిటికీలోంచి కప్పుమీద కనపడుతోంది. ఊరు ఎప్పుడో నిద్రలోకి జారుకొంది.
ఇంకా నాలుగువేల మూడువందల డెబ్భై తొమ్మిది రోజులు! లీపు సంవత్సరాల్తో కలుపుకొంటే నాలుగువేల మూడువందల ఎనభై రెండు రోజులు!
"లక్ష్మీ నారాయణా! అంతవరకే నువ్వు నీ సుఖం అనుభవించినా? ఆ పైన క్షణం క్షణం నువ్వు ఛస్తావ్. ఏం అనుభవించినా ఈ లోపులోనే అనుభవించు."
దూరంగా రెండు కొడుతోంటే నిద్రపట్టింది.
2
జైలు జీవితం చాలా దుర్భరంగా వుండేది.
ప్రొద్దున్నే పనికి వెళ్ళేవాళ్ళం. మిట్టమధ్యాహ్నం ఒళ్ళు మాడ్చేసే ఎండలో, జుట్టుమీద నుంచి చెమట ధారాపాతంగా కారుతూ పెద్ద పెద్ద రాళ్ళను కంకరగా చేసేపని మాది.
మధ్యాహ్నం వరకూ ఎండలో వళ్ళు అరిగేలా పని చేసి వస్తే, కంచాల్లో పడేసిన తిండి మమ్మల్ని వెక్కిరించేది. పశువులు కూడా దాన్ని తినవు - కానీ బాగా ఆకలిమీద వుండేవాళ్ళమేమో, అదే అమృతంలా తినే వాళ్ళం.
అన్నిటికన్నా నాకు పెద్ద సమస్య అయింది 'నిద్ర' గరకురాళ్ళ మీద చేతులు దిండుగా పెట్టుకొని పడుకోవటానికి నేను చాలా కష్టపడవలసి వచ్చింది. ఇదిగాక నల్లులు, నిజానికి అవి నల్లులు అని చాలాకాలం వరకూ నేను నమ్మలేకపోయేను. ఒక్కొక్కటీ చింతగింజ పరిమాణంలో వుండేవి. కొద్దిగా చీకటి పడగానే నిర్భయంగా బయటకొచ్చి సంచరించేవి. ఎన్నిటినని చంపగలం? గుంపులు గుంపులుగా వచ్చేవి. అర్థరాత్రి పూట లేచి మసక వెలుతురులో వాటిని వెతికి వెతికి చంపే నన్ను చూసి నా మిత్రులు నవ్వేవాళ్ళు. వాళ్ళూ నా సాయానికి వచ్చేవారు. ఈ నల్లుల్ని చంపే కార్యక్రమం ఓ గంటసేపు నిర్వఘ్నంగా సాగేది. మేమే ఓడిపోయే వాళ్ళం ఎందుకంటే మా పనికి ప్రతిఫలం ఓ రెండు రోజులు మాత్రమె కనిపించేది తరువాత మామూలే. తెల్లటి శరీరంమీద ఎర్రగా దద్దుర్లు కనబడేవి. రాత్రిపూట నిద్ర లేకపోవటంతో మధ్యాహ్నం భోజనం చేసేక బాగా నిద్రొచ్చేది. కానీ మాతో పని చేయించుకొనే అధికారి చాలా కఠినుడు. అయినా నేనంటే అభిమానం చూపించేవాడు. అడవిలో ప్రొద్దున్నుంచీ సాయంత్రంవరకూ పని చేసే అలవాటున్న నాకు, ఈ రాళ్ళుకొట్టే పని అంత కష్టం అనిపించలేదు. కానీ మిగతావాళ్ళు మాత్రం చాలా బాధపడేవాళ్ళు. అరచేతులు బొబ్బలొక్కేవి. కాయలుకాచి స్పర్శ కోల్పోయేవి.
బయట ప్రపంచంలోంచి ఈ ప్రపంచంలోకి వచ్చేక నాకు ఎక్కువ లోకజ్ఞానం తెలిసింది. మేమున్నదే ప్రపంచంలాగా, బయట వాళ్ళందరూ జైల్లో వున్నట్టూ అనిపించేది. ఒక్కొక్కరే పరిచయం కాసాగేరు - రక రకాల మనస్తత్వాలు, ప్రతివాడి వెనుకా ఒక చరిత్ర! అన్నీ విషాదాంతాలే.
ఒక విషయం నేను గమనించలేదు - అక్కడ వున్నవారంతా జీవితంలో ఎదురుదెబ్బలు తిన్నవాళ్ళే. స్వతహాగా యెవరూ నేరస్తులు కారు. ఆకలి.....లేకపోతే మానసిక బలహీనత వారిని అలా తయారుచేస్తాయి. జైలు వారికి మానవత్వం మీద నమ్మకం పోయేలా చేస్తుంది. బయట ప్రపంచం మీదా, మనుష్యుల మీదా అంత ద్వేషాన్ని , కాసినీ పెంచుకున్న ఖైదీలు ఒక్కోవిషయంలొ చిన్న పిల్లల్లా, అమాయకంగా ప్రవర్తించేవారు. మేము పెంచే తోటలో ఆనపపాదుకి మొట్టమొదటిసారి చిన్న పిందెను కన్నుకొన్నప్పుడు వాళ్ళ చేసిన హడావుడి నేను చాలాకాలంవరకు మర్చిపోలేకపోయేను. చిన్నపిల్లల్లా గంతులేసి డాన్సు చేసేరు. ఆ పాదుకి ఎప్పుడూ నీళ్ళు పోసే ఖైదీని భుజాలమీద ఎక్కించుకొని డాన్సు చేసేరు.
ఇంత అమాయకంగా ప్రవర్తించేవాళ్ళు, మళ్ళీ విడుదలయి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టగానే మారిపోయేవాళ్ళు కాబోలు, నెల తిరక్కుండానే వెనక్కి వచ్చేసేవారు-తప్పు వీరిదో, వీరిని బంధించటానికి నిర్మించిన నిబంధనలదో నాకు అర్థమయ్యేది కాదు.
నెమ్మదిగా రోజులు గడవసాగేయి.
ప్రొద్దున్నే లేవటం, రాళ్ళు కొట్టడం, రెండుపూటలా తినడం, రాత్రిపడక.
ఇంతే దినచర్య, గానుగెద్దు జీవితం అలవాటు కాసాగింది.
ఎప్పుడైనా ఓ నిశ్శబ్దపు అర్థరాత్రి పార్వతి జ్ఞాపకం వచ్చేది. మాపల్లె, అడవీ, సెలయేరు, ఆ తిన్నెల మీద మేం గడిపిన వెన్నెల రాత్రులూ జ్ఞాపకం వచ్చేవి. కన్న తల్లి కన్నా ప్రేమగా పెంచిన అవ్వ జ్ఞాపకం వచ్చేది. కళ్ళల్లో నీరు తిరిగేది. మోకాళ్ళ మధ్య తల వుంచుకొని మౌనంగా రోదించేవాణ్ణి. మళ్ళీ పొద్దున లేస్తే మామూలే.
రెండు సంవత్సరాలు గడిచేయి.
పెద్దమార్పు ఏవీఁలేదు జైల్లో వుండదు కూడా....
నాతోపాటు వున్న ముగ్గురిలొ ఒకడ్ని వదిలేసేరు. రెండోవాడు - అందరికన్నా ఎత్తుగా దృఢంగా వుండేవాడు- చచ్చిపోయేడు.
ఆరోజు డైనమెట్లు పెట్టి కొండ బ్రద్దలుకొడ్తున్నారు అని హెచ్చరించేరు. ఖైదీలకుండే సాధారణ నిర్లక్ష్యంతో కొద్దిగా అజాగ్రత్తగా ప్రవర్తించేడు అతడు. ఫలితం మాత్రం చాలా ఘోరంగా అనుభవించవలసి వచ్చింది. ఒక రాయిముక్క దవడ ఎముకని విరక్కొట్టి వెళ్ళిపోయింది. ఇంకొకటి నుదుర్ని నిలువునా చీల్చింది. భుజం విరిగి కండ బైటికొచ్చింది. ఎడమకాలు మాంసపుముద్దలా తయారైంది. దాదాపు రెండుగంటలు నరకయాతన అనుభవించి ఈ ప్రపంచపు జైలునుంచి అతను శాశ్వతంగా శలవు పుచ్చుకున్నాడు.
అతడి మరణం నాలో చాలా మార్పు తీసుకొచ్చింది. అంతక్రితం వరకూ నవ్వుతూ మాట్లాడినవాడు, చిన్న సంఘటనతో మా మధ్య లేకపోవటం భరించలేనంత ఆత్మ విమర్శనాకు నన్ను గురిచేసింది. జీవితానికి అస్థిత్వం లేదనే మిధ్యావాదంలొ పడిపోయేను. "కర్మ" అంటే నమ్మకం కుదరసాగింది.
ఈ జీవితం ఇలాగే సాగివుంటే నేను జైలునుంచి విడుదల అయ్యేసరికి వేదాంతిని అయివుండే వాన్నేమో! నా పట్టుదలా, శపథం- అన్నీ మర్చిపోయి, ఒక విధమైన అనాసశక్తిలొ కూడుకున్న నిరాశావాదాన్ని నాలో కలిగించి వుండేది జైలు.
కానీ అలా జరగలేదు.
నాలో పట్టుదల రేపి, నాకు అన్యాయం చేసినవాళ్ళమీద కసి తీర్చుకోవాలన్న దుగ్దని మళ్ళీ కలిగించి, జీవితంమీద ఆశని రేపిన వ్యక్తి ఒకతను నా జీవితంలో ప్రవేశించేడు.
అతని పేరు ఠాకూరు బలదేవ్ సింగ్.
3
"కష్టవేఁ" అతడు చుట్టూ పరికించి చూస్తూ పైన వున్న కిటికీని పరీక్షించేడు. క్రింది గచ్చుని పరీక్షించేడు. తనలో తనే గొణుక్కుంతున్నట్టు "లాభంలేదు" అన్నాడు నావైపు చూసి చిన్నగా నవ్వి "తప్పించుకోవటం అంత సులభమయేటట్టులేదు" అన్నాడు.
నేను మాట్లాడలేదు. అతనివైపు చూస్తూ వుండిపోయాను. కొంచెం పొట్టిగా వున్నాడు, నడివయసు అరవై డెబ్భైమధ్య వుండొచ్చు. జుట్టుబాగా తెల్లబడి పీచులా వుంది. మొహం అంతా ముడతలు పడిపోయింది. కళ్ళు మాత్రం తీక్షణంగా వున్నాయి.
"బైట్నుంచే ప్రయత్నించాలి" అంటున్నాడు.
నవ్వొచ్చింది "నమస్కారం తాతగారూ" అన్నాను నవ్వుతూ.
అతడు నావైపు పరకాయించి చూసి "నమస్తే, నమస్తే" అన్నాడు." ఎందుకు నవ్వుతున్నావు?"
"వందగజాలు పరుగెడ్తే పడిపోయేలా వున్న మీరు, ఇక్కడ్నుంచి పారిపోవటం గురించి ఆలోచిస్తూ వుంటే నవ్వొచ్చింది."
"అంతేనంటావా?"
"అంతే తాతగారూ."
"మంచిమాట చెప్పేవ్ అబ్బాయ్ - ఏదీ నీ చేయి?" అని తన చేతిని ముందుకు సాచేడు. నేనూ చేతిని అందించేను.
అంతే. ఆ నిముషంపాటు నరకం అంటే ఎలా వుంటుందో అర్థమయింది. వ్రేళ్ళ ఎముకలు నలిగి పిప్పి అయిపోయాయనే అనుకున్నాను. గుండెల్లోనుంచి వచ్చినకేకని చాలా బలవంతం మీద ఆపుకున్నాను. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగేయి. అతడు చేతిని వదిలేసినా పావుగంటవరకూ మామూలు మనిషిని కాలేకపోయాను.
"కాబట్టి - ఎదురుగా కనిపించేదంతా నిజమని నమ్మకు" అన్నాడు అతడు అదే అతడు నాకు నేర్పిన మొదటి పాఠం. ఆ తరువాత నా జీవితాన్ని మార్చేసిన పాఠలన్నీ అతడి దగ్గరే నేర్చుకున్నాను.
"ఇంతకీ నీ పేరు చెప్పేవు గావు."
"కృష్ణ."
"నా పేరు సింగ్. ఠాకూరు బలదేవ్ సింగ్."
నా గొంతు తడారిపోయింది. "అంటే...... అంటే....." గుటకలు మింగేను.
"అంటే -ఏమిటి?' అతడు నావైపు చూసి నవ్వేడు. "నేనే ఆ బలదేవ్ ని."
ఠాకూర్ బలదేవ్ సింగ్ ని నేను వేరే విధంగా వూహించేను. ఎర్రటి తలపాగా, ముప్ఫె సంవత్సరాల వయస్సు, దృఢమైన శరీరం, రాజఠీవి -నా ఊహల్ని ఈ వాస్తవానికి అన్వయించుకోలేకపోతున్నాను. నల్లమల్ల అడవుల్లో మనిషి ప్రయాణం చేయటానికి, గజగజా వణికే పరిస్థితుల్నీ, అలజడినీ సృష్టించిందిమ్ నా ముందు నిలబడ్డ అరవయి ఏళ్ళ వృద్దుడు అంటే నమ్మలేకపోతున్నాను.
"ఎన్నేళ్ళు?"
చెప్పేను.
"వచ్చి ఎంతకాలం అయింది?"
"రెండు సంవత్సరాలు."
అతడి కంఠంలోంచి ఒక ఆశ్చర్యార్థకమైన కేక సన్నగా వెలువడింది. "రెం.....డు....సం...వ...త్స...రా...లు" అన్నాడు విస్మయంతో.
నాకు అర్థం కాలేదు. "అవును - ఏం?"
"రెండు సంవత్సరాలపాటు స్వేచ్చని పోగొట్టుకొని ఈ చీకటి గదిలో వుండిపోయేవా? ఇంకో పది సంవత్సరాలు వుండిపోదామనుకొన్నావా?"
మాట్లాడలేదు నేను. నా వాదాన్ని వినిపించేటంత చనువులేదు మా యిద్దరి మధ్య. మాట మార్చేను. "మీ కెన్ని సంవత్సరాలు శిక్ష?"
"ఆర్నెల్లు."
ఆశ్చర్యంతో "ఆర్నెల్లా?" అన్నాను.
"అవును. అంతకన్నా యెక్కువ కాలం పడుతుందని అనుకోకు" అన్నాడు.
నిజమే, అంతకన్నా ఎక్కువకాలం పట్టలేదు. ఈ ఆర్నెల్లలో మా యిద్దరి మధ్య బాగా సన్నిహితత్వం పెరిగింది. నన్ను "అబ్బాయ్" అని, "అబ్బీ" అని పిల్చేవాడు.
నేను "తాతా" అంటే కోపం వచ్చేది. అయినా నాకెందుకో అలానే పిలవాలనిపించేది. మొదట్లో అభ్యంతరం పెట్టినా తరువాత మా మధ్య ఆ బాంధవ్యమే నిలిచిపోయింది.
అతడితో కరచాలనం చేసిన తరువాత దాదాపు వారంరోజుల వరకూ కుడిచేయి నా స్వాధీనంలోకి రాలేదు. ఆ వయసులో అంతటి బలాన్ని అతడు ఎలా నిలుపుకోగలిగేడా అన్నది నాకు అర్థం కాలేదు మొదట్లో. కాని తరువాత తరువాత తెలిసింది.