Previous Page Next Page 
చెంగల్వ పూదండ పేజి 2


    "బీడీ యివ్వరా బోసిడికే" అన్నాడు అందరిలోకి ఎత్తుగా వున్నవాడు. దాదాపు గర్జిస్తున్నట్టు వుంది ఆ కంఠం.

    "ఒకటే  వుంది గురూ-"

    "ఇయ్యిబే" దాదాపు లాక్కొని నోటిలో పెట్టుకొన్నాడు. మూడోవాడు ఇదేమీ పట్టనట్టు బూతుపాట కర్ణ కఠోరంగా పాడుతూనే వున్నాడు. రెండోవాడు అగ్గిపుల్ల వెలిగించి, బీడీకి అంటించి, పుల్ల కింద పడవేయబోతూ అకస్మాత్తుగా ఆగిపోయేడు  వెలుతురు నా తెల్లటి బట్టలమీద ప్రతిబింబిస్తూ వుంది. ఒక క్షణం -  అంతే  చివరికంటా వచ్చి పుల్ల ఆరిపోయింది వదిలేశాడు.

    అరనిముషం పాటు భయంకరమైన నిశ్శబ్దం ఆ గదిలో నాట్యం చేసింది. కదలలేదు నేను! మూడు జతల కళ్ళు ఆ చీకటిని చీలుస్తూ నన్ను చూస్తున్నాయని తెలుసు.

    'ఓహ్' అన్నాడు ఒకడు వికృతంగా. ఆ ధ్వని జైలుగోడల మధ్య మార్ర్మోగింది. ఎటూ పారిపోలేని జంతువుని చూసి గర్జించిన పులి అరుపులా వుంది. మరింత మూలగా గోడకి అతుక్కుపోయాను.

    "ఎవడో వచ్చినట్టున్నాడు గురో?"

    అందరిలోకి పొడుగ్గా వున్నవాడు నా దగ్గరికి వచ్చాడు! "ఎవడ్రా నువ్వు" బొంగురుగా వుంది వాడి కంఠం.

    "........"

    "మాట్లాడు బే."

    "నేను .......... నేను ..........." తడబడ్డాను.

    నా కంఠంలో వణుకు గుర్తించినట్టున్నాడు- "కొత్తగా వచ్చావా?"

    "ఔను....."

    "మొదటిసారా రావటం?"

    "ఔను."

    "ఏం చేశావ్? జేబు కొట్టేవా?"

    "రేప్ చేశావా?"

    "లేకపోతే చోరీనా?" ముగ్గురూ వరుసగా అడిగేరు- మాట్లాడలేదు నేను.

    "చెప్పు బే."

    ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా అన్నాను.

    "హత్య!"

    "ఓ....." అన్నాడు ఒకడు. ఇంకొకడు చటుక్కున అగ్గిపుల్ల వెలిగించి నా మొహంలోకి తొంగిచూశాడు.

    "అరె-ఎంత అమాయకంగా వున్నాడో."

    "నిజంగా హత్తె చేసేవా గురో?"

    నా నిర్దోషిత్వాన్ని వాళ్ళ ముందు చెప్పుకోవటం అనవసరం అనిపించింది.

    "అచ్చు అమ్మాయిలా వున్నాడు గురో."

    "అయితే మన పంట పండినట్లే" ముగ్గురూ బిగ్గరగా నవ్వారు. నా వెన్నెముకలో సన్నగా వణుకు ప్రారంభమయింది. ఎలా నన్ను రక్షించుకోవటం?

    మనుషుల్లో దాగి వుండే రాక్షసుల గురించి నాకు అంతగా తెలియదు. బలహీనుని మీద  బలవంతుడు జులుం జరపటం, రౌడీతనం చెలాయించటం, గూడు కట్టుకున్న దుర్మార్గం, యివన్నీ ప్రత్యక్షంగా చూడటం యిప్పుడే! నా భయాన్ని వాళ్ళు గుర్తించినట్టు లేరు.

    వరండాలో లైటు వెలిగింది. కటకటాల మధ్య నుంచి వెలుతురు పడుతోంది. వెలుగులో వాళ్ళు అస్పష్టంగా కనపడుతున్నారు. అరడుగుల పైనే వుంటారు ముగ్గురూ. చాలా దృఢంగా, మోటుగా వున్నారు.

    "ఇంకా కూసుంటావేమిటి" అన్నాడు ఒకడు. నెమ్మదిగా లేచేను నేను.

    "ఒరేయ్! ఈడి కా చీపిరికట్ట ఇయ్యరా."

    విసురుగా చీపురుకట్ట వచ్చి నా మొహానికి తగిలింది. పట్టుకొన్నాను.

    "తుడవరా."

    వంగి నెమ్మదిగా తుడవటం ప్రారంభించాను. ఒకడు వెళ్ళిమూలగా గోడకి అనుకొని కూర్చున్నాడు. ఇంకొకడు కుండలో నీళ్ళు తాగుతున్నాడు.

    "ఇకనుంచీ ప్రతిరోజూ ఈ పని నీదే-"

    మాట్లాడలేదు నేను. వాళ్ళని రెచ్చగోట్టటం ఇష్టంలేదు. ఒకడు నా పేరూ, వివరాలూ అడిగేడు చెప్పేను.

    ఇంతలో గంట వినిపించింది. బొచ్చెలు పట్టుకొని బయలుదేరాం. మళ్ళీ అదే  తిండి, అన్నం అని పిలువబడే గోధుమరంగు ముద్ద. ఎలాగో పూర్తయిందనిపించి లేచాను. తిరిగి మా గాడికి వచ్చాం.

    ముగ్గుర్లో ఒకడు గది గుమ్మంలో వెల్లకిలా పడుకొని గొంతెత్తి పాడటం మొదలెట్టాడు.

    ఒక మూలగా చేరి నేనూ నెమ్మదిగా నడుం వాల్చాను. అంతే, నా వీపుమీద ఫెడేల్న ఎవరో తన్నేరు. విసురుగా ముందుకు పడ్డాను.

    "నీ బాబు సొమ్ము అనుకున్నావేమిటి బే ర్ర్ స్థలం?"

    నెమ్మదిగా లేచాను. ముక్కు వేళకు కొట్టుకొని అదిరిపోయింది.

    నన్ను కొట్టినవాడు మూలగా నేను పడుకున్న స్థానంలో పడుకున్నాడు. ఇంకోమూల ఇంకొకడు పండుకని వున్నాడు. నేను కటకటాల దగ్గిర  అడ్డంగా పడుకోవాల్సి వచ్చింది. వాటి ముందు నుంచీ సెంట్రీ నడుస్తూ వుంటే  బూట్ల చప్పుడు చెవుల్లో పొరలు బ్రద్దలుకొడ్తున్నట్టు వినిపించసాగాయ్.

    ఒక పావుగంట గడిచింది. ఊరంతా నెమ్మదిగా నిద్రాదేవి కౌగిలిలోకి జారుకోసాగింది. నాకు మాత్రం నిద్ర పట్టలేదు. కన్నుమూసినా, తెరిచినా పార్వతే! ఏం చేస్తూ వుందో?

    "ఒరేయ్! నిన్నేరా.....ఇట్రా" అరిచాడు. ఎడమవైపుగా పడుకొన్నవాడు లేచి దగ్గిరగా వెళ్ళాను.  బోర్లా పడుకొని "వళ్ళు పట్టు, అన్నాడు.' నెమ్మదిగా పట్టసాగాను. వేళ్ళ మధ్య వాడి కండలు గట్టిగా జారుతున్నాయి 'నాకు నచ్చావురా నువ్వు' అన్నాడు.

    పావుగంట గడిచింది.

    "అక్కడ చాల్లె యిట్రా" అన్నాడు ఇంకోమూల నుంచి ఇంకోడు. అక్కడికి వెళ్ళేను. మనుష్యుల్లో యింత కర్కోటకులుంటారని తెలీదు నాకు .అసలు  మనిషికీ, మనిషికీ  విరోధం  యెందుకొస్తుందో నాకు అర్థం కాలేదు. బహుశా ఈ అమాయకత్వమే నన్ను ఈ రోజు ఇలా వీళ్ళకి సేవలు చేయిస్తుందేమో! ఈ అమాయకత్వంతోనేగా  బాబాయిని నమ్మింది.

    బాబాయ్ జ్ఞాపకం వచ్చేసరికి అప్రయత్నంగా నా వ్రేళ్ళు బిగుసుకొన్నట్టున్నాయి. వాడు మూలిగి  "నెమ్మదిగా  బే" అన్నాడు. ఇంకో అరగంట గడిచేక కనికరిస్తున్నట్టు "చాల్లె.....పో" అన్నాడు.

    వచ్చి పడుకొన్నాను. సెంట్రీ బూట్ల చప్పుడు లయబద్ధంగా వినిపిస్తోంది. మాగన్నుగా నిద్రపడ్తూ, పడ్తూ హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఎవడో నా వీపుమీద చెయ్యి వేసేడు. అంతే అప్పటివరకూ అణగివున్న రోషం అంతా ఒక్కసారిగా పెల్లుబికింది.  చటుక్కున్న పక్కకు తిరిగి రెండు చేతుల్తో బలంగా వాడి  భుజాలు పట్టుకొని కాళ్ళతో తోసేను. బంతిలా గాలిలోకి లేచాడు. ఓ నిమిషం పాటు గాలిలో ప్రయాణం చేసి అవతలవైపు గోడకి కొట్టుకొని వుండలా పడిపోయాడు.

    చెరోమూల పడుకొన్న ఇద్దరూ కళ్ళముందు ఏదో వింత జరుగుతున్నట్టు చూస్తూ వుండిపోయేరు. జరుగుతున్నది యదార్థమో కాదో అన్న సంశయంతో వాళ్ళు ఏమీ మాట్లాడలేదు.

    పడిన వాడికి దెబ్బలేవీఁ తగల్లేదనుకొంటాను. నెమ్మదిగా లేచాడు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నా వైపుకు రాసాగేడు. ఏ ఎముకకా ఎముక విరుచుకు తినెయ్యాలనంత కసి ఆ మసక వెల్తుర్లో వాడి కళ్ళల్లో నాకు కనపడింది. ఎదుర్కోవటానికి పిడికిళ్ళు బిగించి సిద్ధంగా వున్నాను.

    వస్తున్నవాడు చటుక్కున ఆగేడు. అర్థం కాలేదు నాకు. ఇంతలో వెనుకనుంచి సెంట్రీ మా గది దాటి వెళ్ళటం వినిపించింది. మళ్ళీ ఇటు రావడానికి రెండు నిమిషాలు పడుతుంది. రెండు నిమిషాల్లో ఈ నిశ్శబ్ద పోరాటం అటో, ఇటో తేలిపోవాలి. లేచేను.

    వాడూ ఇంకో అడుగు ముందుకేసేడు.

    "ఆగు" నెమ్మదిగా అన్నాడు మూలనుంచి, ముందు నన్ను నడుము మీద కొట్టినవాడు. ఇద్దరం ఆగేం.

    "ఇద్దరూ కొట్టుకొని చావకండి."

    నా యెదురుగా నిలబడ్డవాడు తల  అడ్డంగా ఊపి, "వాడి రక్తం కళ్ళజూడాలి ఈవేళ" అన్నాడు.

    మాట్లాడబోయి ఆగేను. సెంట్రీ మమ్మల్ని దాటి వెళ్ళిపోయాడు. మూలనున్న వాడు లేచి నా దగ్గరకు వచ్చేడు. నా భుజాల్నీ, బహువుల్నీ పట్టి చూసి, "వీడు మనం అనుకున్నంత (ఇక్కడో బూతుమాట) కాదు" అన్నాడు అయినా అవతలివాడు అదేవీఁ వినిపించుకొనే పరిస్థితుల్లో లేడు. విసురుగా ముందుకొచ్చి, వూహించనంత వేగంగా చేయి విసిరేడు.

    మనుష్యులతో దెబ్బలాడటం, యెదుటి వాడు విసిరే దెబ్బల్ని కాసుకోవటం నాకు అంతగా తెలీదు. నా జీవితంలో ఎప్పుడూ అటువంటి పరిస్థితి రాలేదు. నన్ను మోసం చేసిన వాళ్ళందరూ అది మోసమని గ్రహించే లోపులోనే చేసేరు. ప్రత్యర్థి చేయిని మధ్యలోనే గుప్పిటతో పట్టుకొని ఆపుచేసేను. అతడూ సామాన్యుడు కాదు. విసురుగా  వెనక్కీ తోసేడు. వెళ్ళి కటకటాల మీద పడి, వాటిని గట్టిగా పట్టుకొన్నాను. వెనక నుంచి నవ్వు, "కుర్రోడి మీద నీ ప్రతాపం ఏంట్రా " అన్న మాటలు వినిపించినయ్. నా మొహం ఎర్రబడింది. ఊచల చుట్టూ నా వ్రేళ్ళు మరింత బిగుసుకొన్నాయి.

    "అబ్బో ఆ రోషం చూడు" అన్నాడు. "ఊసల వంచేద్డామనే?"

    అప్రయత్నంగా నా కండరాలు బిగుసుకొన్నాయి. అది  గమనించి వాళ్ళు ముగ్గురూ మరింతగా నవ్వేరు. నాలో పట్టుదల మరింత పెరిగింది. నా శక్తికి మించిన పని అది అని అనుకోలేకపోయేను. సరుగుడు చెట్లను నరికిన బలాన్ని  చేతివేళ్ళ  కొనల్లోకి తీసుకున్నాను. ఇంకో నిమిషం మాత్రమే వుంది  సెంట్రీ  రావటానికి. నుదుటిమీద చెమట బిందువులు పడ్తున్నాయి. అంత చలిలోనూ వళ్ళు ఆవిర్లు గక్కసాగింది. సెంట్రీ విషయం మర్చిపోయి, వాళ్ళలో ఒకడు కొంచెం బిగ్గరగా నవ్వేడు. అనుమానంతో నా హృదయం భగ్గున మండింది. ఊపిరి బిగబట్టి బలంగా లాగేను.

    వెనుకనుంచి నవ్వు ఆగిపోయింది. చీమ చిటుక్కుమంటే వినిపించేటంతగా  నిశ్శబ్దం ఆ గదిలో వ్యాపించింది. వెనక ముగ్గురూ ఊపిరి వదలటం  కూడా మర్చిపోయినట్టున్నారు.

    సెంట్రీ మా గది దాటి వెళ్ళిపోయేడు.

    ఒక దానికొకటి అరడుగుదూరంలో వుండే ఊచలు రెండు మాత్రం చెరొక పక్కకి వంగి, ఇంకొంచెం ప్రయత్నిస్తే ఒక మనిషి వెళ్ళిపోవటానికి వీలయ్యేలా  ఎడం అయి వున్నాయి....నిశ్వాస బలంగా వదుల్తూ అటే  చూస్తూ నిల్చున్నాను. వెనుక నుంచి ముగ్గుర్లో ఒకడు వచ్చి దాదాపు కౌగిలించుకొన్నంత పని  చేసేడు. మిగతా యిద్దరు మాత్రం తాము చూస్తున్నది  కలో నిజమో అన్నంత భ్రాంతిలో అలాగే నిశ్చేష్టులై వుండి పోయేరు.

    "దాదాకి నీళ్ళు యివ్వు బే!" అరిచేడు నన్ను కౌగిలించుకొన్నవాడు. ఇద్దర్లో ఒకడు  ఉలిక్కిపడి కదిలి నమ్రతగా  బొచ్చెతో నీళ్ళు అందించేడు.

    "ఇంత బలంగా వుండి అట్ల అమాయకంగా వుండిపోయినావేటి గురూ" అడిగేడు.

    "ఏం చెప్పను? నా మనస్తత్వం అదని చెప్పనా? అది నా బలహీనత అని వివరించనా? బలం వేరు - ధైర్యం వేరూ అని భావించనా? ఏం చెప్పను? ఎవరి బ్రతుకు వారు బ్రతికే ఒక అమాయకపు మారు మూల పల్లెటూరులో పుట్టి పెరిగిన నేను, క్రౌర్యం, కాఠిన్యం, జులుంలాటి పదాన్ని ఎలా అన్వయించుకోగలను? తనకన్నా బలహీనుణ్ని అణిచి వెయ్యటం - బలవంతుణ్ని నవ్వుతూ మాట్లాడి వెనుక గొయ్యి తీసి తోసెయ్యటం - ఇవన్నీ నాకెలా తెలుస్తాయి?

 Previous Page Next Page