కానీ దానికోసం వేణు నుండి నువ్వు అనుభవిస్తున్న చివాట్లు చీదరింపులూ .....దెబ్బలు"
మయూర కొంచెం సేపు సమాధానం చెప్పలేక పోయింది. ఆ తరువాత నెమ్మదిగా అంది.
"నేను వేణుని ఒక మనిషిగా చూడను. అందుచేత అతని చివాట్లూ, చీదరింపులూ, నాకే మాత్రం బాధ కలిగించవు. నువ్వు "నేను వెళ్ళిపోతాను" అన్నప్పుడు కలిగే బాధలో వెయ్యో వంతు కూడా కలిగించవు. అతని దెబ్బలు శారీరకంగా బాధ కలిగిస్తాయనుకో! కానీ అవి మనసుకి ఒక విధమయిన వూరట గానే వుంటాయి. ఒక భార్యగా అతనికి నేనే విధంగానూ పనికిరాక పోతున్నాను. దానికీ ఈ దెబ్బలకి సరి అనుకుంటాను......."
నవ్వుతూ చెప్పుతుంది మయూర.
ఆ శాంతమూ, ఆ స్థిమితమూ చూసి నివ్వేరపోతున్నాడు యతి. మరీ ఆ నవ్వు మయూరను ఏ శిఖరాల మీదకో ఎత్తేస్తోంది.
సంకోచిస్తూనే "అయితే , నువ్వు జీవితమంతా ఇలా వ్యర్ధం చేసుకుంటావా!" అన్నాడు యతి.
"వ్యర్ధం చేసుకుంటానా? అలా అని ఎవరు చెప్పారు? జీవితమంటే ఏమిటి యతీ? తినటం, బట్టలు కట్టుకోటం పెళ్ళి చేసుకోవటం, పిల్లల్ని కనడం , ఇంతేనా? ఇలా యాంత్రికంగా బ్రతికేస్తే జీవితం సఫలమయి పోయినట్లేనా?
కాదనిపిస్తోంది, ఇంతకంటే జీవితంలో అందుకోవలసింది ఏదో ఉంది. శరీరానికి కాక. ఆత్మకు కూడా తృప్తి నిచ్చేది బాధలో సైతం ఆనందాన్నే అందించేది అది అందుకోవటానికే ప్రయత్నిస్తున్నాను. వ్యర్ధం చేసుకోవటం లేదు"
యతికి ఉక్రోషం వచ్చింది.
"మరి నన్ను వెళ్ళవద్దనడం దేనికి? ఈ క్షోభంతా దేనికి?" అన్నాడు.
మయూర అతి ప్రేమగా యతి కళ్ళలోకి చూసింది. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక: నీ సహచర్యంలో నా మనసు అనందం పొందుతుంది కనుక. బలహీనంగా వున్న నా మనసు ఈ కొద్దిపాటి ఆనందంతో బలాన్ని పుంజుకుటుంది కనుక యతీ. "ప్రేమంటే ఏమిటి? కేవలం శరీరాలు పరస్పరం కోరుకోవటాన్నే ప్రేమ అంటున్నారు. హృదయం గిదయం అని పెద్ద పెద్ద మాటలు వాడతారు. హృదయం అంటే రక్తాన్ని ప్రసారం చేసే యంత్రం తప్ప మరేం కాదు!" అని నాకు తెలుసు. అది అవునని కానీ కాదని కాని, నేను వాదించను లోకంలో ఎవరైనా తమ మానసిక స్థాయిని బట్టే అలోచించి సిద్దాంతాలు చేసేస్తూ వుంటారు. నాకేమో ఉనికి ఆధారమైన ఊపిరి లాగ మానసిక చైతన్యానికి ప్రేమ అవసరమనిపిస్తుంది. ప్రేమతో అర్ద్రమైన హృదయాలే కర్తవ్యాలను సునాయాసంగా నిర్వర్తించగలవనిపిస్తుంది నీ ప్రేమ శారీరకం కాదంటున్నావు కదా. నేను వెళ్ళిపోతేనేం?" అనవచ్చు కానీ భావనకైనా ఆధారం కావాలి యతీ! ఆ ఆధారమే నువ్వు. వెళ్ళిపోకు! ఇప్పుడిప్పుడే జీవిస్తున్న నా మనసును చెదరగొట్టకు....."
యతి భోజనం పూర్తయింది. వాష్ బేసిన్ లో చెయ్యి కడుక్కుని టవల్ తో తుడుచుకుంటూ ఉండగా "వెళ్తావా? అంది మయూర జాలిగా.
"వెళ్ళను" అని ముందు గదిలోకి వెళ్ళిపోయాడు యతి.
కమలమ్మ హై బ్లడ్ ప్రషర్ తో ఆస్పత్రిలో వుంది. ప్రభాకర్ ఆమె దగ్గరే వున్నాడు. వేణు తప్పతాగి వున్నాడు. ఆ సమయంలో ముందు గదిలో యతి, లోపలి గదిలో మయూర. ఒక విధమయిన ప్రశాంతతతో సుఖ నిద్రలో కి జరుకోగలిగారు.
21
మయూరలో వచ్చిన మార్పు కమలా ప్రభాకర్ లిద్దరికీ కూడా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. నిలబడటానికి కూడా శక్తి లేక తూలిపోయే మనిషి యంత్రం లా ఎన్ని పనులైనా చకచక చేసేస్తోంది. ఇంట్లో వంట చేస్తోంది. కమలకు కేరియర్ మోసుకేళ్తుంది. కమలకు దగ్గిరుండి ఉప్పు తక్కువగా వేసిన ఆహారం కబుర్లు చేప్తూ తినిపిస్తుంది. మధ్యాహ్నం మళ్ళీ వచ్చి పళ్ళ రసం లాంటివి తీసి అందిస్తుంది. మయూర ఉత్సాహం ముందు కమలమ్మ తన దుఃఖాన్ని కూడా మరచిపోయింది. ఊరుకోలేక ఒక్కసారి "అబ్బాయి నువ్వూ బాగుమ్తున్నారా అమ్మా?" అని అడిగేసింది. మయూర నవ్వి "మేం బాగుండనిది ఎప్పుడు?" అంది. ఆ వెర్రిబాగుల తల్లి అందుకే పొంగిపోయింది. ప్రభాకర్ లో కూడా మయూర వుత్సాహం కొత్త ప్రోత్సాహాన్ని కలిగించ సాగింది.
"మావయ్యగారూ ! ఇంత ప్రేమగా చూసుకొనే మీరుండగా అత్తయ్యగారిని ఆ దేవుడు కూడా ఏమి చెయ్యలేడు. అలా దిగులుపడుతూ కూచుంటే ఎలా? లేవండి - ఇవాళ మీ స్టూడెంట్స్ దియా సాఫికల్ మిడిల్ స్కూల్ లో గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తున్నారు. మీరు లేకపోతే వాళ్ళకు ఉత్సాహం ఏముంటుంది? వెళ్ళరా?" అని బయలుదేరదేసేది. ఏ విషయాన్ని గుర్తుంచుకోలేని మయూర , ప్రభాకర్ అపాయింట్ మెంట్స్ అన్నీ గుర్తుపెట్టుకుని పి.ఏ. లాగా అతనికి గుర్తుచేసేది. కొందరు మంత్రులతో, అధికారులతో, అతడు మాట్లాడాలనుకొని వ్రాసిపెట్టుకున్న విషయాలను సమయానికి గుర్తుచేసేది. ఊపిరాడకుండా పనిచేసే ప్రభాకర్ ఆస్పత్రిలో వుండిపోవటం వల్ల మూలపడ్డ పనులన్నీ వరసగా దృష్టిలోకి తెచ్చేది.
ప్రభాకర్ ఆనందంతో "నీలో ఈ మార్పు చాలా ఆశ్చర్యంగా వుంది. ఇదంతా ఏ కారణమూ లేకుండా అంటే నమ్మను" అన్నాడు హాస్యంగా అన్నట్లు.
మయూర అతనికి కోటు అందిస్తూ.
"కారణం ఎందుకు లేదూ? ఉంది" అంది. ప్రభాకర్ కుతూహలంగా "ఏమిటా కారణం?" అని అడిగాడు.
"అంతరాంతరాలలో ఒక ఆశ."
"ఆశా? ఏమిటా ఆశ?"
"తీరా చెప్తే మీరు కాదంటారేమో!"
"అంత కోరరానిదా?"
"కోరరానిది కాదు. నామీద అభిమానంతోనే మీరు కాదనవచ్చు."
"ఏమిటి చెప్పు. ఏ మాత్రం అవకాశం వున్నా నీ ఆశ నేరవేర్చతానికే ప్రయత్నిస్తాను."
"ఏం లేదు, మీ గ్రూప్స్ లో ఆడపిల్లలు కూడా వున్నారు కదా! నాకు కూడా ఆ గ్రూప్స్ లో చేరి గ్రామాలకు వెళ్లి జాతిని చైతన్యవంతం చేసే కార్యక్రమాలలో పాల్గొనాలని వుంది."
ప్రభాకర్ ముఖం మలినమైపోయింది. అతడు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. "నాకు - తెలుసు , మీరు ఒప్పుకోరు. వూళ్ళో అందరినీ ప్రోత్సహిస్తారు కాని, ,మీ సొంత కోడలు వెళ్తానంటే మాత్రం ఒప్పుకోరు."
నిష్టూరంగా అంది మయూర.
"పిచ్చిపిల్లా! అంతేనా? నన్ను అర్ధం చేసుకొన్నది? నువ్వు యింకా మానసికంగాను, శారీరకంగాను కూడా పూర్తిగా కోలుకోలేదు. - గ్రామాలలో తిరిగే కార్యక్రమం అంటే, అటుకూ పోటుకూ అగగలగాలి! నువ్వెలా తిరగగలవూ? నా మాట విని ఇవాళ నుంచి సరిగ్గా నెలరోజులు నేను ఇచ్చిన మందులు వేసుకుని నేను చెప్పిన ఆహారం తీసుకో. ఆ తరువాత తప్పకుండా నిన్ను గ్రూప్స్ లో చేర్చుకుంటాను.
"అలాగే ! తప్పకుండా తీసుకుంటాను" ఎంతో ఆశగా, ఉత్సాహంగా అంది మయూర. ప్రభాకర్ కూడా చాలా సంతోషించాడు ----- అంతకుముందు ప్రభాకర్ ఎన్ని విధాలుగా బ్రతిమాలినా, మయూర వేళకు మందులు తీసుకొనేది కాదు, ఒక పూట తింటే మరోకపూట తినేది కాదు. బ్రతిమాలి కాని బలవంత పెట్టి కాని ఆమె చేత ఎవరూ ఏమి చేయించలేరనేది ప్రభాకర్ అనుభవ పూర్వకంగా తెలుసుకొన్న సత్యం. అంచేత ఆస్థి పంజరంలా తయారయి కళ్ళలో ప్రాణాలు పెట్టుకొని తిరుగుతోన్న మయూరను చూస్తూ కూడా ఏమి చెయ్యలేక ఊరుకోవలసి వచ్చేది. మయూర ఈ రకంగానయినా బాగుపడితే , అంటే చాలనుకున్నాడు ప్రభాకర్.
ఆ రోజు అనుకోకుండా ఒక రోజు ముందుగా ఊరి నుండి వచ్చాడు ప్రభాకర్. ఇంట్లో నుంచి కేకలు, అరుపులు, గోల నవ్వులు వినిపిస్తోంటే , కారణం తెలియక చికాగ్గా, కోపంగా లోపలికి వచ్చి అక్కడి దృశ్యం చూసి స్థంభించి పోయాడు . మెయిన్ హలో వేణు, అతని స్నేహితులు మరో ముగ్గురు వున్నారు. ఇద్దరమ్మాయిలు అర్ధ నగ్నంగా వెకిలిగా నవ్వుతూ సోఫాలో పడి దోర్లుతున్నారు. విస్కీ సీసాలు, గ్లాసులూ, ప్లేట్లూ, తినుబండారాలు, వగైరా సరంజామా అంతా వుంది. వీటన్నింటి కంటే బీభత్సకరమైన దృశ్యం, అక్కడి నుండి వెళ్ళిపోవాలని గింజుకుంటున్న మయూరను వేణు భుజాలు పట్టుకొని బలవంతంగా అక్కడే కుచోబెడుతున్నాడు.
"వేణూ!" అని గర్జించాడు ప్రభాకర్. ఎవరి లోకంలో వాళ్లున్న అక్కడి వాళ్ళందరూ ఆ గర్జనకు అడిరిపడ్డారు. సోఫాల్లో వున్న అమ్మాయిలూ ఎగిరిపదినట్లు లేచి కుర్చుని బట్టలు అడ్డదిడ్డంగా వంటి మీదకు లాక్కుని అటూ ఇటూ పరిగెట్టబోయి ఎటూ దారి కనిపించక వణికిపోతూ నిలబడ్డారు. వేణు స్నేహితులు అప్పటివరకూ ప్రభాకర్ ముందు ఘరానా పెద్ద మనుష్యులుగా చెలామణి అవుతున్నావారే. యిప్పుడు ఆయనకు దొరికిపోయినందుకు వణికిపోతున్నారు.
"సారీ సర్! వేణు రమ్మనాడు సార్! రానంటే వూరుకోడు సార్...." అని అర్ధం పర్ధం లేకుండా యేదేదో వాగటం మొదలు పెట్టారు.
వేణు మూర్ఖుడిలా తండ్రిని చూడసాగాడు. అతని చేతులు మాత్రం అప్పటికి మయూర భుజాలను వదిలి పెట్టలేదు.
ప్రభాకర్ చూపులు మొదట మయూర మీదనే పడినాయి. మయూర అప్పటికే పిచ్చి చూపులు చూస్తోంది. వేణు చెంప చెళ్ళు మనిపించి , మయూర భుజాల మీద నుంచి వేణు చేతులు తొలగించి "అమ్మా మయూరా?" అన్నాడు. మయూర అలాగే పిచ్చి చూపులు చూసింది. అప్పుడప్పుడే స్థిమితపడుతోన్న మయూర మనసు మళ్ళీ చెదిరిపోయిందని అర్ధం చేసుకున్నాడు ప్రభాకర్. అతని గుండెల్లో రాయి పడింది. కొడుకు మీద పట్టరాని కోపం వచ్చింది.
"దుర్మార్గుడా! ఏమిట్రా, ఇదంతా! ఈ నరకమంతా ఇంట్లోనే ఎందుకు సృష్టిస్తున్నావ్? మయూరను బలవంతంగా ఇక్కడ ఎందుకు కూచో బెడుతున్నావ్?" అని అరిచాడు.
ఆ అరుపులకి మిగిలిన అందరూ వణికారు కాని, వేణు మాత్రం కొంచెం కూడా లక్ష్య పెట్టలేదు.