ఆ మాటల ద్వారా గోవిందం యొక్క విశాల హృదయం తెలుసుకుని శారద సంతోషిస్తోంది.
ఆ వ్యక్తి గోవిందయ్యని సూటిగా ప్రశ్నించేడు -
"అయ్యా! తమ రేమీ అనుకోకపోతే ఒక్క పాయింటు అడుగుతాను!"
"అడుగు!"
"మీ అమ్మాయి కూడా ఓ అనామకుణ్ని పెళ్లాడుతానని పంతం పట్టిందే అనుకోండి! అప్పుడేం చేస్తారు?"
"ఆనందంగా వాళ్ళ పెళ్లికి అంగీకరిస్తాను."
"అయితే ఇంకే? ఆ బట్టల కొట్టబ్బాయితో మీ అమ్మాయి పెళ్లి జరిపించండి చూస్తా!" అన్నాడు వ్యక్తి.
"ఆ మాటకు గోవిందం షాకు తిని ఆశ్చర్యపోతున్నట్లు నటిస్తూ అన్నాడు -
"నో! నేన్నమ్మను మా అమ్మాయి నాకు చెప్పకుండా ఏ పనీ చేయదు."
"నాన్నా!" అన్నది శారద అకస్మాత్తుగా.
గోవిందం అప్పుడే ఆమెను చూసినట్లు నటిస్తూ అన్నాడు -
"ఇతని మాటలు విన్నావా అమ్మా?"
"ఆయన చెప్పింది నిజమే నాన్నా!"
గోవిందం లిప్తపాటు మాటాడలేకపోయేడు. శారదను చేరుకొని నాటకీయంగా అడిగేడు -
"అతను ...."
"పేరు సత్యమూర్తి" అన్నది శారద.
"నా కిష్టమైన పేరు!" అన్నాడు గోవిందం.
వ్యక్తికి తన పోర్షను జ్ఞాపకం వచ్చింది కాబోలు గబగబా అన్నాడు -
"పేరిష్టమైనంత మాత్రాన సరిపోద్దేంటి? అబ్బాయి ఏం చేస్తాడో వివరాలడగండి!"
గోవిందం అతని వేపు అసహనంగా చూస్తూ ఎంతో గంభీరంగా డైలాగు చెప్పేడు -
"అనవసరం. నేను అడగను అబ్బాయి మా అమ్మాయికి నచ్చేడు. చాలు! మా అమ్మాయికి పెళ్లాడేందుకు అతనికి ఆ ఒక్క క్వాలిఫికేషను చాలు!" అని ముక్తాయింపుగా ఇంకో డైలాగు బరువుగా ప్రయోగించేడు -
"కాకపోతే, మా అమ్మాయి నాకు స్వయంగా చెప్పవలసిన విషయం పరాయి వ్యక్తి ద్వారా తెలిసినందుకు బాధపడుతున్నాను. అంతే!"
ఆ మాటకి శారద కదిలిపోతూ అన్నది
"క్షమించు నాన్నా!"
"పిచ్చి తల్లీ! నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్లి! నీ పెళ్లి నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది."
"నాన్నా!" అన్నది శారద ఆనందంగా.
"సత్యమూర్తిని మనింటికి రమ్మను. అన్ని విషయాలూ మాటాడి ముహూర్తాలు పెట్టిస్తా!" అన్నాడు గోవిందం
ఆ మాట వినగానే -
శారద తండ్రి చేతినితీసుకుని ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత గబగబా మేడెక్కుతోంది.
"కైలాసం!" అని పిలిచేడు గోవిందం.
కైలాసం వచ్చి గోవిందం ముందు వినయంగా నిలబడ్డాడు.
"ఆ పెద్ద మనిషికి కిరాయి ఇచ్చి పంపించు!" అన్నాడు గోవిందం.
అమ్మాయి పెళ్లి అనే ఉత్తుత్తి ఘట్టంలో నట్టించిన వ్యక్తికి వందనోటు ఇచ్చేడు కైలాసం. వ్యక్తి నోటు తీసుకుని గోవిందానికీ నమస్కరించి వెళ్లిపోయేడు.
గోవిందం కోపంగా గొణుక్కుంటున్నాడు -
"సత్యమూర్తీ! నిన్ను కూరవోండుకు తినకపోతే నా పేరు గోవిందమే కాదు!"
31
రోడ్డు రద్దీగా ఉంది.
ఆ రోడ్డు మీద రకరకాల వాహనాలు జోరుగా వెడుతున్నాయి.
రోడ్డు అవతల సత్యమూర్తి వున్నాడు. ఇవతల శారద వుంది. ఒకర్నొకరు చూసుకున్నారు. రోడ్డు దాటి సత్యమూర్తిని కలుసుకోవాలని ఇవతల నుండి శారద ప్రయత్నిస్తుంటే, రోడ్డు దాటి శారదను కలుసుకోవాలని అవతల్నుంచి సత్యమూర్తి ప్రయత్నిస్తున్నాడు. కానీ రోడ్డు మీద వేగంగా నడిచే వాహనాలు వాళ్ల ప్రయత్నాలకు అంతరాయం కలిగిస్తున్నాయి.
శారద దైర్యం చేసింది.
ఏమైతే అయ్యిందని ఆమె రోడ్డు దాటేందుకు ఇవతల్నుంచి స్పీడుగా నడుస్తోంది. రోడ్డు మధ్యకు వచ్చేసింది. క్షణంలో రోడ్డు దాటేసేది!
అంతలో పెద్ద లారీ ఒకటి శారద మీదకు రివ్వున వచ్చేసింది.
ఆ దృశ్యాన్ని చూచి ఆందోళనగా "శారదా!" అని పొలికేక పెట్టేడు సత్యమూర్తి. ఆ తర్వాత కళ్లు మూసుకున్నాడు.
* * *
కొండమీద కూచుని సత్యమూర్తి కథ వింటున్న జనాభాలో సింహాచలం ఉత్కంఠని ఆపుకోలేక అడిగేడు -
"ఏం జరిగింది? ఏక్సిడెంటా?"
"అట్లాంటిదే అయి వుంటుంది!" అన్నాడు భద్రాచలం.
"రోడ్డు ప్రమాదంలో శారద మరణించింది. శారద లేని జీవితం వృథా అని ఈ సత్యమూర్తి కొండ దూకి ఆత్మహత్య చేసుకోడానికి ఇక్కడికి వచ్చేడు" అన్నాడు పరమానందం.
"నీ ఊహ తప్పు శారద మరణించి వుండదు. కథలో ఏదో మెలిక వుంది. సత్యమూర్తి గట్టిగా నిట్టూర్చి కళ్లు తుడుచుకుంటున్నాడు.
పరమానందం అందుకున్నాడు-
"కథలో మెలిక ఏమిటో నేను ఊహించగలను. శారద మరణించక పోయినా, లారీ ఏక్సిడెంట్ లో తనకు బలమైన గాయం తగిలి వుంటుంది. దాంతో మతి పోగొట్టుకుని వుంటుంది. ఈ సత్యమూర్తిని పోల్చుకోలేక 'అన్నయ్యా' అని వరస మార్చి పిలిచి వుంటుంది. వరస తప్పిన ప్రేమ కథలో బతకలేక, సత్యమూర్తి కొండ దూకి ప్రాణం తీసుకుందామని వచ్చి వుంటాడు. కరెక్టేగా?" అని పరమానందం సత్యమూర్తిని అడిగేడు.
సత్యమూర్తి విసుగ్గా సమాధాన మిచ్చేడు -
"కథ మధ్యలో అడ్డం పడవద్దని తమకు ఇంతకు మునుపే మనవి చేసేను. అయినా అడ్డం పడుతూనే వున్నారు."
"ఇందాక నిట్టూర్చింది ఈ పాయింటుకేనా?" అని ఆనందం అడిగేడు.
"అవును" అన్నాడు సత్యమూర్తి.
"కథ ఆపి కూచుంటే మేము ఏదేదో ఊహించేం సరే ఇక చెప్పు!" అన్నాడు పరమానందం. సత్యమూర్తి చెప్పడం ప్రారంభించేడు.
* * *
ఆ నడి రోడ్డు మీద - సత్యమూర్తి మెల్లిగా కళ్లు తెరిచేడు.
ట్రాఫిక్ జామ్ అయింది. జనం సత్యమూర్తి చుట్టూతా మూగి వున్నారు. వాళ్లని తోసుకుంటోశారద సత్యమూర్తి దగ్గరికి వస్తోంది.
జరిగింది తెలుసుకుని సత్యమూర్తి తల దించుకున్నాడు.
"క్షేమంగానే వున్నావు కదా, శారదా!" అన్నాడు సత్యమూర్తి నేలమీదికి చూస్తో.
"నాకేం కాలేదు. మీ చుట్టూ ఇంతమందిని చూచి,మీకేమైనా ప్రమాదం జరిగిందేమోనని హడలి పోయేను. రండి, వెడదాం!"
అని సత్యమూర్తి చెయ్యి పట్టుకుని జనం మధ్య నుంచి తీసుకువెడుతున్న శారదను చూచి,బీటు కానిస్టేబుల్ టోపీ తీసి
"బాగుందమ్మా! చాలా బాగుంది! కుశలం కనుక్కోడానికి మీకింత కన్నా బెటరు ప్లేసు ఎక్కడా దొరకలేదా? వెళ్లండెళ్లండి!" తల గోక్కుంటో అన్నాడు -
గోవిందంగారి కుక్కలు రెండూ రోడ్డు పక్కనే వున్నాయి. వెళ్లిపోతున్న జంట వేపు చూసి, వాళ్లని వెంబడించే పని మీద అక్కడ్నించి మెల్లిగా కదిలేయి.
ఆ రోడ్డు మీదే -
కైలాసం రిక్షావాడి వేషంలో వున్నాడు. జంటను అతను కూడా చూసేడు. వాళ్లను ఫాలో చేయాలనే ఉద్దేశంతో అతను రిక్షాను మెల్లిగా నడిపించుకుంటో కదిలేడు.
రిక్షాని చూడగానే బీటు కానిస్టేబిల్ కి కాళ్లు నొప్పులు పుట్టేయి. ఉత్సాహంగా ఎగిరి గంతేసి రిక్షాలో కూర్చున్నాడు.
బండి బరువెక్కేసరికి ఎవరెక్కేరో చూద్దామని రిక్షాలోకి చూసేడు కైలాసం.
కమలంలో కూర్చున్న బ్రహ్మదేవుడల్లే రిక్షాలో పద్మాసన్నం వేసుక్కూర్చున్న బీటు కానిస్టేబిల్ ఆర్డరు వేసేడు -
"పోనీయ్! తిన్నగా త్రీటవున్ స్టేషన్ కి పద!"
కైలాసానికి దుఃఖం వచ్చేలాగుంది. ఏం చెప్పాలో తెలీక నీళ్లు నముల్తున్నాడు. తన ఆర్దర్సును ఖాతరు చేయకుండా నిలబడినందుకు కైలాసమ్మీద పోలీసుకు కోపం వచ్చింది. పిచ్చేక్కినట్టు అరిచేడు-
"ఏంట్రా? ఏంటా ఎదవ ఆలోచన? చెప్పింది చెయ్యి! త్రీటవున్ పోలీస్ స్టేషన్! పద!"
అప్పటికి ప్రేమ జంట సెంటరు వరకు వెళ్లిపోయేరు. ఈ పోలీసు వాలకం చూస్తుంటే తనని విడిచి పెట్టేలా లేడు. అయినా పోలీసును రిక్వెస్టు చేసేడు కైలాసం -
"తమరు ఇంకో రిక్షాలో వెళ్లండి! నాకు వేరే పనుంది."
ఆ మాట వినగానే పోలీసుకి కోపమొచ్చింది -