అప్పటికే ఆ ఇద్దరు వ్యక్తులు బంగళా వెనుకకు వెళ్ళారు.
మరునిమిషంలో అశోక్ గది బయట తచ్చట్లాడుతూ కనిపించాడు.
రూప్ చంద్ క్షణం ఆలోచించి టార్చ్ లైట్ తీసుకుని బంగళా వెనుక వైపుకు బయలుదేరాడు.
దారిలో సమాధుల దగ్గర రెండు నిమిషాలు ఆగి పరిశీలనగా చూశాడు. అక్కడ నుంచి బంగళా పూర్తిగా కనిపిస్తున్నది. కానీ, లోపల గదులలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే బైనాక్యులర్స్, నైట్ విజన్ గ్లాసెస్ అవసరం ఎంతయినా వుంది.
కానీ, అతని చేతిలో ప్రస్తుతం టార్చిలైట్, సూట్ పాకెట్ లో రివాల్వర్ తప్ప అవిలేవు. అయినా ధైర్యం చేసి ముందుకు కదిలాడు.
బంగళా మెయిన్ గేటు దగ్గరకు వచ్చేసరికి రూప్ చంద్ చెవులకు ఆక్రందన విన్పించింది.
ఆ శబ్దం సమాధుల దగ్గర నుంచి వచ్చిందని తెలుస్తూనే వుంది.
గేటుదాటి రూప్ చంద్ లోనికి అడుగు పెట్టగానే అశోక్ గదిలో లైటు ఆరిపోవడంతోపాటు...ఆ ఆక్రందన కూడా ఆగిపోయింది.
ముసుగులో వున్న వ్యక్తులు పిల్లుల్లా నక్కినక్కి రావడం గమనించిన రూప్ చంద్ ప్రక్కకు తప్పుకున్నాడు.
అశోక్ గదిలో లైట్లు లేకపోవడం వలన బంగళా అంతా చీకటిమయంగా వుంది.
ఆలాంటప్పుడు సాహసం పనికిరాదని భావించాడు రూప్ చంద్.
తన ఉనికిని ఎవరయినా గుర్తిస్తే అసలుకే మోసం రావచ్చు అనుకొని వెళ్ళినంత వేగంగానే వెనుదిరిగి ఔట్ హౌస్ కు వచ్చాడు.
క్షణం ఆలోచించి పక్కగది తలుపు తట్టాడు.
కోటి ఆవలిస్తూ తలుపులు తెరిచాడు.
అతను మంచి నిద్రలో వున్నాడని తెలుస్తూనే వుంది__
"ఏంటి బాబూ నిద్ర లేపారు?"
"మంచినీళ్ళు కావాలి..."
"అయ్యో...రాత్రి గదిలో పెట్టానే...అయిపోయాయి కాబోలు" తనలోతనే గొణుక్కుంటూ గ్లాసుతో నీళ్ళు తెచ్చి ఇచ్చాడు కోటి.
మంచినీళ్ళు తాగిన రూప్ చంద్ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.
"ఇంత అర్దరాత్రి వరకు మెలకువతోనే వున్నాడన్న మాట..."
అనుకున్న కోటి భృకుటి ముడిపడింది.
* * *
పోర్టికోలో కారు రెడీగా వుంది.
అశోక్ వచ్చి కారులో కూర్చున్నాడు.
"కోటీ...రూప్ చంద్ సిటీకి వస్తాడేమో కనుక్కో"
అశోక్ చెప్పింది విని కోటి రూప్ చంద్ గదిలోకి వెళ్ళాడు.
అప్పటికే అతను సిటీకి వెళ్ళడానికి తయారవుతున్నాడు. కోటి వచ్చి పిలవడంతో వెళ్ళి అశోక్ కారు ఎక్కాడు.
కారు ముందుకు కదిలింది.
"బాబూ...రాత్రికి వస్తారా?"
"రాకపోవచ్చు"
కోటి అనుమానంగా బుర్ర గోక్కున్నాడు.
"ఏం భయపడకు...నేను వస్తానులే ...తోటలు చూసుకోవడానికి మనుషుల కోసం వెళుతున్నాను" అన్నాడు రూప్ చంద్.
కోటి...రూప్ చంద్ చూపులు కలుసుకున్నాయి.
కారు స్పీడ్ అందుకుంది!
వెళుతున్న కారు వేపే బొమ్మలా చూస్తూ వుండిపోయాడు కోటి.
* * *
టింకూను హాస్పిటల్ లో అడ్మిట్ చేసి రెండురోజులు అవుతున్నది.
అతని దగ్గర ఆయా ఉందన్నమాటే కానీ టింకూ ఆమె మాటలు అసలు వినడం లేదు. నానా అల్లరి చేస్తున్నాడు.