Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 27


    వివేక్ సమాధానం చెప్పలేదు. అతని తల గిరగిర తిరుగుతోంది. యశోదకి?.... అతడి మనసులో అసహనం బుసలు కొట్టసాగింది. మనసంతా చేదుగా అయిపోతోంది.
    "అమ్మ! అంటున్నది..... అది నిజమేనా?"
    కళ్ళు పూర్తిగా తెరిచింది యశోద.
    "ఏది నిజం?"
    "అదే నీకు తండ్రి! ఎవరూ?"  
    ఫక్కున నవ్వింది యశోద "ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకున్నది? అలాంటిది ఏమైనా ఉంటే, ధైర్యంగా మీకు చెప్పి నేను మీ జీవితంలోంచి వెళ్ళిపోతాను. కానీ మీ వీపు వెనుక దొంగ నాటకాలాడతానా? మీ అమ్మగారి సంతోషం చూస్తూ, ఆవిడ మాటలు వింటూ, అలాంటిదేదీ. చెప్పలేకపోయాను అంతే! అదీగాక పిల్లలంటే నాకూ ఇష్టమే! నేనూ తేలిపోయాను. తొందర్లోనే ఆవిడ కల నిజమవుతుంది లెండి! నాకా నమ్మకం ఉంది"
    అతడికి ఏ నిరుత్సాహమూ కలగకుండా ఎంకరేజింగ్ గా అతడి చేతి మీద చేయి వేసింది.

    పైకి చిరునవ్వు నవ్వాడు వివేక్, కానీ అతడి మనసు అల్లకల్లోలంగా అయిపోయింది. "చాలా సంసారాలు నిలబడేది పిల్లలవల్లే..." తల్లి మాటలు..." పిల్లలంటే నాకూ ఇష్టమే! నాకు తెలియకుండానే మీ అమ్మగారి బంగారు కలల్లో నేనూ తేలిపోయాను" యశోద మాటలు యశోద తనను వదిలి వెళ్ళిపోతోందేమోననే భయం వివేక్ లో ఎక్కువ కావటానికి కారణమయింది.  
    యశోద తనను వదిలి వెళ్ళిపోతోందేమోననే భయం వివేక్ లో ఎక్కువ కావటానికి కారణమయింది.
    యశోద సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ గా డిగ్రీ తీసుకుంది. తొందర్లోనే క్లినికల్ సైకాలజిస్ట్ గా ఉద్యోగమూ వచ్చింది.   
    "నీకు ఉద్యోగం అంత అవసరమా?" అడిగాడు వివేక్ ఆమె ఉద్యోగం చెయ్యటం ఇష్టంలేదు. స్పష్టంగా ఆమె కోరికని కాదనే ధైర్యం లేదు.

    "అవసరమే! డబ్బు కోసం కాదు. ఒకటి: నేను డల్ గా బ్రతకలేను. రెండు: నాకు సైకాలజీలో ఇంటరెస్ట్! ఆ ఫీల్డ్ లో నేను ఇంకా కృషి చెయ్యాలని ఉంటుంది."
    "ఇంటి వ్యవహారాలు చూసుకుంటే నీకు చాలదా?"
    "వాటిల్లో నాకస్సలు ఇంట్రెస్ట్ లేదు!"
    "మీతో పరిచయానికీ ఈ పెళ్ళికీ కూడా సైకాలజీలో ఇంటరెస్టే కారణమనే" చెప్దామనుకుంది. కానీ అతడు హర్ట్ అవుతాడేమోనని భయపడింది.  
    దేవిశంకర్ కి యశోద ఉద్యోగం చెయ్యటం ఇష్టం ఉండదని వివేక్ కి తెలుసు. అప్పుడు తండ్రిని అడ్డు పెట్టుకుని, యశోద చేత రాజీనామా ఇప్పించాలని అనుకున్నాడు...
    కానీ యశోద మామగారితో తను ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పలేదు. చిత్రంగా అతడు ఆ విషయంలో కలగజేసుకోలేదు. తన మనసులో ఉన్న ఆలోచనలు బయటపెట్టే అలవాటు ప్రసూన కెప్పుడూ లేదు.  
    అంచేత యశోద తన జాబ్ కి వెళ్ళి వస్తూనే ఉంటుంది. అంతేకాదు, తరుచుగా తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్ళొస్తూ ఉంటుంది. ఆ వివరాలన్నీ వివేక్ కి చెపుతుంది కూడా. తన మనసులో ఉన్న భయాలు మాటల్లో పెట్టలేదు వివేక్.   

    తండ్రి వ్యాపార వ్యవహారాలే చూసుకుంటున్నాడు వివేక్. రోజూ తండ్రితోనే వెళ్తాడు. రావటం మాత్రం తండ్రితో రాడు తిన్నగా ఏదో ఒక బార్ కో, క్లబ్ కో వెళ్తాడు. బాగా తాగి వస్తాడు.
    త్రాగటం వల్ల వివేక్ మనసుకి నరకలోకపు దృశ్యాలు కనపడటం మాయమయినా అతడు చాలాసార్లు వంటి మీద తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నాడు.
    ఒక్కొక్కసారి అకారణంగా ఏడుస్తాడు. మరోసారి ఎవరినో కసిగా తిడుతూ ఉంటాడు. అప్పుడప్పుడూ తండ్రి వ్యాపార విషయాలను మాటలాడేస్తుంటాడు.     

    అంచేత తాగుడు మాన్పించాలని చాలాసార్లు ప్రయత్నించింది యశోద. వరసగా వారం రోజులు తను కూడా అతనితోబాటు తాగింది. అయినా వివేక్ తాగుడు మాలేదు. యశోద తను బార్స్ కీ, క్లబ్స్ కీ, వెళ్ళటం మానేసింది. కానీ వివేక్ చేత మానిపించలేకపోయింది.
    అతడికీ, అలవాటు కావటానికీ తనే కారణమన్న గిల్టీ కాన్షస్ తో బాటు. అపారమైన సానుభూతితో అతడి అలవాటు మాన్పించటానికి ప్రయత్నిస్తోంది.  
    ఈ అలవాటు మంచిది కాదని వివేక్ కి తెలుసు. కానీ మనసు ముందుకు తోసుకోచ్చే ఆ భయంకర దృశ్యాల నుంచి విముక్తి కలుగుతుంది. అతనికది హాయిగా ఉంది. సంసార జీవితం గడపలేకపోయినా, నిశ్చింతగా యశోదని దగ్గరిగా అదుముకోగలుగుతున్నాడు వివేక్. ఆ సాహచర్యమే అతడికి స్వర్గతుల్యంగా ఉంది.

    పాపం! యశోద, మానసిక, శారీరక హింసలు, రెండూ అనుభవిస్తోంది. వివేక్ ఇంత తాగుబోతుకావటానికి తనే కారణమా అనే మానసిక వ్యధ! అతడూ రెచ్చగొడుతున్న శరీరాన్ని శాంతింపజేసుకోలేక శారీరక బాధ.     
    సైక్రియాటిస్ట్ అనంత పద్మనాభ స్వామిగారిని కలిసి ఈ సమస్య డిస్కస్ చేసింది యశోద.
    "సైకలాజికల్ అబ్సెషన్ గురించి బయటపడటం ప్రధానం. ఈ తాగుడు అలవాటు నుంచి నెమ్మదిగా మరలించుకోవచ్చు..." అన్నాడు. తన సజెషన్ పొరపాటని ఏ డాక్టరూ ఒప్పుకోడు.
    "వివేక్ సైకలాజికల్ అబ్సెషన్ నుంచి బయటపడలేడేమో? త్రాగుడు నుంచి బయటపడలేడేమో?"
    మాట్లాడలేకపోయాడు అనంత పద్మనాభ స్వామి, తనతో మాట్లాడుతున్నది సైకాలజీ స్టూడెంట్?.
    "అతడి చిన్నతనంలో జరిగినవి... ప్రత్యేక కారణాల వల్ల.... స్మృతి పధంలో ,మరుగున పడినవి, నరక దృశ్యాలు కనపడటానికీ ఏదైనా కారణమైనవి అయిన సంఘటనలూ, తెలిస్తే తప్ప మనం ఏం చెయ్యలేం!." అది నిజం కానీ ఆ చీకటి తలుపుల తాళం చెవి తన చేతికి ఎలా చిక్కుతుందో ఏమో?  

                                    * * *
    పాలగ్లాసు తీసుకుని వివేక్ బెడ్ రూంలోకి వచ్చింది ప్రసూన. తలుపులు దగ్గరిగా వేసి ఉండటం వల్ల తొయ్యగానే వచ్చేశాయి.
    "సారీ!" అని ఒకడుగు వెనక్కి వేసింది.... బాగా తాగి వచ్చిన వివేక్, నిద్రపోతున్న వాడిలా కళ్ళు మూసుకున్నాడు.  
    యశోద లేచి కూచుని, "ఫర్వాలేదు.... రండి!" అని అంది.
    "తలుపులు వేసుకోలేదేం?" అని అడిగింది ప్రసూన.
    "ఇప్పటివరకూ, ఏదో చదువుకుంటున్నాను..."

 Previous Page Next Page