Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 26


    ఫక్కున నవ్వింది ప్రసూన "పిచ్చిదానా! పాపాలు, శిక్షలు, పుణ్యాలు, స్వర్గాలూ, నరకాలూ ఈ కల్పనలూ ఏనాడైనా మనుష్యులను సక్రమమైన మార్గంలోకి తిప్పగలిగాయా! ఇలాంటి విశ్వాసాలున్న వాళ్ళు మరింత హాయిగా పాపాలు చేస్తారు. ఎందుకంటే పాపాలు ఇష్టం వచ్చినట్లు చేసేసినా ఏం దేవుడికి కొబ్బరి కాయలు కొట్టి. ఏవేవో వ్రతాలు చేసేసి ఆ పుణ్య ఫలంలో ఈ పాప ఫలితాన్ని బేలన్స్ చేసుకోవచ్చు! ఇంకా మాట్లాడితే మరికాస్త పుణ్య ఫలండి పాజిట్ చేసేసుకుని. స్వర్గంలో సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. నాకే నమ్మకం లేని పాప పుణ్యాల గురించి వివేక్ తో నేను ఎప్పుడు చెప్పలేదు.  
    ఉదయం వివేక్ తండ్రితో మాట్లాడిన మాటలు విన్నావు కదా. సైకాలజీ స్టూడెంట్ వి గనక నాకంటే బాగా అర్థమయి ఉంటుంది. నాకు సాధ్యమైనంత వరకూ వివేక్ ఐడియల్ సెల్ఫ్ కీ సోషల్ సెల్ఫ్ కీ హార్మనీ కుదిరేలా చూశాను.. అంతే"   
    తెల్లబోయింది యశోద. మొదటి నుంచీ ప్రసూన పట్ల ఏర్పడిన గౌరవభావం మరింత పెరిగింది.
    మొత్తం తన క్షోభ అంతా అత్తగారికి చెప్పుకుని, ఈ సమస్య ఆవిడనే పరిష్కరించమని అడగాలి అనిపించింది. కానీ మొదటి రోజే ఈ విషయం ఎవరికీ చెప్పనని వివేక్ కి వాగ్దానం చేసింది.       

    యశూ! నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకులిస్తాను! కానీ సమాజం ముందు నన్ను చిన్నబుచ్చకు. నలుగురిలో నవ్వులపాలు చెయ్యకు. నా సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం నాకు ఉంది. ఎంత దగ్గరి వాళ్లకైనా నా సమస్య చెప్పనని వాగ్ధానం చెయ్యి...." దీనంగా అడిగాడు. చాపిన అతని చేతిలో చెయ్యి వేసి వాగ్ధానం చేసింది.
    ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ వాగ్ధానం నిలబెట్టుకోవాలని ఆనాడే నిర్ణయించుకుంది.
    "ఏదో ఆలోచిస్తున్నావు... నిన్న బ్లూ స్టార్ హోటల్ కి ఎందుకు వెళ్ళారు?" అడిగింది ప్రసూన.
    "చెప్తాను! ముందు మీరిది చెప్పండి... మీ అబ్బాయి మనసులో ఏ బలహీనతలూ స్ట్రైకింగ్ గా మీకు కనిపించడం లేదా?"   
    "ఒక బలహీనత గుర్తించాను. వయసులో ఉన్న ఆడపిల్లలను చూడగానే నర్వస్ గా అయిపోవడం. వాళ్లని తప్పించుకు పారిపోవాలని ప్రయత్నించడం. ఈ సంకోచం నుంచి వాడు బయట పడాలనే, ప్రత్యేకించి జ్యోతి లాంటి పని మనిషిని పెట్టాను. వాడు నిన్ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటానంటే నేను ఎంతో ఆనందించాను. నీతో చొరవగా మాట్లాడుతుంటే వెనుకటి సంకోచం పోయిందనుకున్నాను. నీ కోసం ధైర్యంగా తండ్రిని ఎదిరిస్తుంటే, లోలోపల గర్వ పడ్డాను.

    ఎందుకీ ప్రశ్న అడిగావు ఇప్పుడు? నిన్న నువ్వు బ్లూ స్టార్ లాంటి హోటల్ కి వెళ్ళటానికీ, ఈ ప్రశ్నకీ ఏమైనా సంబంధం ఉందా?"
    "లేదు!"
    "మరి!"
    "ఊరికే! ఒకసారి వెళ్ళాలనిపించింది. వెళ్ళాం అంతే" తడబడుతూ అంది.

    "నీ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. నీ విషయంలో పొరబడ్డానని కుమిలి పోయే పరిస్థితి రానీయకు"
    వెళ్ళిపోయింది ప్రసూన... చేతిలో సైకాలజీ పుస్తకాన్ని కసిగా నేలకేసి కొట్టింది యశోద.
                                       8
    ఉలికిపడి లేచి కూచున్నాడు వివేక్. ఎప్పుడూ వచ్చే కల! తను ఏదో పూలరధంలో ఊరేగుతున్నాడు మబ్బు తెరల మీద. కింది నుంచి ఎవరో తనని చూసి నవ్వుతున్నారు. ఆ నవ్వు తెరలు తెరలుగ తనను కమ్ముకుంటోంది.

    బ్రహ్మరాక్షసిలా నోరు తెరిచి తనని మింగబోతుంది. ఆ నోట్లో బిక్కుబిక్కుమంటూ తొంగి చూస్తోంది యశోద. తన నుంచి ఎక్కడికో తప్పించుకు పారిపోవాలని ఆరాటపడిపోతుంది.
    యశోదని పట్టుకోవాలనే ఆరాటంలో మెలుకువ వచ్చేసింది. కళ్ళూ తెరవగానే ఎప్పుడు పక్కనే పడుకునే యశోద కోసం వెదుక్కుంటాడు. పక్కన నిద్రపోతున్న యశోదని చూసుకుని మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. కలవల్ల చెదిరిపోయిన మనసు స్థిమిత పరుచుకుంటాడు.
    ఆ రోజు కూడా ఎప్పటిలా కళ్ళు తెరవగానే పక్కకి చూశాడు.
    యశోద కనబడలేదు. గుండె ఝుల్లుమంది. తనకి వచ్చిన కలకి వ్యాఖ్యానం వివేక్ కి తెలుసు. యశోద తనది కావటం వల్ల కలిగిన ఆనందం.. సంతృప్తి.

    యశోద ఏ క్షణంలోనైనా తనని వదిలిపోతుందేమోననే బెంగ. అప్పుడు ఎదురయ్యే హ్యూమిలియేషన్. ఇవన్నీ ఆ కలలో, సరిగ్గా.. అలాగే కాకపోయినా యశోద తనని వదిలిపోతుందేమోనని భయం రకరకాలుగా కలల రూపంలో వస్తుందతనికి. తన కలలు నిజమయ్యాయా?  

    "యశోదా?" అరిచాడు ఆందోళనగా.
    ఆ ఇల్లంతా ప్రతిధ్వనించింది ఆ కేక. ఇంట్లో ఏదో పని చూసుకుంటున్న ప్రసూన ఆ కేక విని కంగారుగా అక్కడికి వచ్చింది.  
    "ఏం జరిగింది వివేక్? ఎందుకలా కేక పెట్టావ్?"
    "అమ్మా! యశోద.... యశోద...." వాక్యం పూర్తి చెయ్యకుండా ఆగిపోయాడు వివేక్. అటాచ్డ్ బాత్ రూం గుమ్మం దగ్గర నిలబడి ప్రసూననీ వివేక్ నీ తెల్లబోయి చూస్తోంది యశోద.  
    ప్రసూన యశోద దగ్గరిగా వచ్చి ఆప్యాయంగా యశోద చెక్కిళ్ళు నిమిరింది.
    "ఏమ్మా! ఏం జరిగింది? ముఖమంతా వడిలిపోయింది? ఆరోగ్యం బాగోలేదా?"
    "బాగానే ఉంది. ఎందుకో కడుపులో తిప్పినట్టయింది అంతే"
    "అంటే.. అంటే... నాకు మనవడో? మనవరాలో?. అంతేనా హమ్మయ్య! నా పూజలు ఫలించాయి. నా కల నిజమయింది."
    "పిల్లలు సంసార జీవితానికి కల్పవృక్షాలు తల్లీ. ఎన్నో సంసారాలు చెదిరిపోకుండా నిలబడ్డాయంటే, పిల్లలే కారణం. ఇంక మీరిద్దరు కలిసి రాబోయే బుజ్జాయికోసం పాటు పడతారు. తాతయ్యగారు అహంకారాలూ కోపాలూ పగలూ అన్నీ మర్చిపోయి బుజ్జాయికి బానిసైపోతారు. విశ్రాంతి తీసుకోమ్మా! ఎప్పటినుంచీ?" తన ధోరణిలో తను సంబరంగా మాట్లాడుకుంటూ పోతుంది ప్రసూన.   
    ఆమె ధోరణి ఆపటం గానీ, ఆమె ఆశిస్తున్న లాంటిది అసంభవం అని చెప్పటం కానీ యశోదకి సాధ్యం కాలేదు. బొమ్మలా నిలబడిపోయింది.
    "సరేలే! చిన్నపిల్లవి. నీకేం తెలుస్తుంది? డాక్టర్ కి చూపించుకుంటే అన్నీ తెలుస్తాయి. మీ అమ్మగారు దగ్గర లేరని దిగులు పడకు. నేను నీకు తల్లి లాంటిదానినే. ఏం కావాలన్నా నిస్సంకోచంగా అడుగు"
    ఆప్యాయంగా యశోద చెక్కిలి మీద ముద్దు పెట్టుకుంది ప్రసూన.

    "వివేక్! కాస్త దానికి ఎంత గందరగోళం చేశావురా! అలాగే ఉంటుందిలే! యశోదని జాగ్రత్తగా చూసుకో!" చిరునవ్వుతో ముఖమంతా వెలుగుతుండగా సంతృప్తితో కొడుకునీ కోడలినీ చూసుకుని వెళ్ళిపోయింది.

    ఆవిడ వెళ్ళిపోగానే నీరసంగా మంచం మీద వాలింది యశోద. కళ్ళు అరమూతలవుతుండగా అడిగింది... "ఎందుకలా అరిచావు? నేను బాత్రూం తలుపులు వేసుకుని పెద్దగా చప్పుడు కాకుండా, జాగ్రత్త పడుతూ, వాంతి చేసుకున్నానే! మీకు వినబడిందా? నిజంగా గందరగోళ పడ్డారా"

 Previous Page Next Page