"అబ్బే అదేం కాదు. ఎందుకో నా మనసు మనసులో వుండటంలేదు. మన కర్తవ్యం ప్రతిక్షణం నన్ను కలవరపెడుతోంది. ఇలాంటి ప్రలోభాలన్నింటికీ దూరంగా వుండమని హెచ్చరిస్తున్నట్లనిపిస్తోంది."
"అనూ, ఏదీ నా కళ్ళలోకి చూస్తూ ఆ మాట మరోసారి చెప్పు అన్నాడు." ఆమె ధైర్యంగా తలెత్తి చూసింది. మనసు చేసుకుని కళ్ళల్లో ఏ భావం కనిపించకూడదనే నిర్ణయంతో చూసింది.
"అనూహ్యా" అతడి చేతులు ఆమెచుట్టూ బిగుసుకున్నాయి. "ఎంత మధనపడ్డానో నీకెట్లా తెలియచెప్పను? ఏ కారణంతో నిన్ను ఈ టీమ్ లో పంపుతున్నారో తెలియనంత అమాయకుడిని కాను. వీళ్ళలో ఎవరికి నువ్వు భాగస్వామివి అవుతావో అన్న ఆలోచన నన్ను పిచ్చివాడిగా చేస్తూంటే భరించలేకపోయాను. నేను గాక మరో మగవాడి చెయ్యి నీ మీద ఊహు ఇందాక యశ్వంత్ చేతులు నీ భుజాల్ని పట్టుకుంటే, నా వంటిమీద తేళ్లు, జెర్రులు ప్రాకుతున్నట్లు బాధ. అతడంటే నాకెంతో గౌరవం. అతడిముందు సరసాలాడటానికి సందేహిస్తాను. కానీ, నీ విషయంలో అతడి ఉనికిని భరించలేను. నన్ను అర్థం చేసుకోగలవు కదూ. నేను తెలివితేటల్లో అతడి కాలిగోటికి గూడా సరిపోను. కానీ నువ్వు నన్ను వదలి పెట్టటానికి అది కారణం కాకూడదు-"
యశ్వంత్ ప్రసక్తి రాగానే అనూహ్య మెల్లిగా తన చేతుల్లోంచి బయటపడటం గమనించలేదతడు. ఆ క్షణంలో ఆమె ముఖం చూస్తుంటే బహుశా ఆమెలో ఘర్షణ అతడికి కొంతయినా అర్థం అయ్యేది.
"నీకు యశ్వంత్ అంటే చాలా గౌరవం అనుకుంటాను." ఆమె స్వరం నూతిలోంచి వచ్చినట్టు వుంది.
"అవును, ఒట్టి గౌరవం మాత్రమేకాదు. భక్తికూడా. ఆ మృత్యువు చివరి అంచువరకు వెళ్ళి కాపాడుకున్నది అందుకోసమే. అతడు లేకపోతే మన ఈ ప్రయాణమే లేదు. అంటే మానవజాతికి మనుగడ లేకుండా పోతుందన్నమాట. ఆ విజ్ఞాన ఖని నాకు దేవుడిలా కనిసిస్తాడు."
చెప్పెయ్యాలి. చెప్పెయ్యాలి, అనుకుంది ఆమె. ఇక ఈ ముసుగులో గుద్దులాట తను భరించలేదు. "నా పరిస్థితి....." అంటూ అనూహ్య అనబోయేంతలో ఇంటర్ కమ్ మోగింది.
"అందరూ డైనింగ్ హాల్లోకి రండి, భోజనం టైమైంది" నిఖిల్ స్వరం వినిపించింది.
"పద పద. అంతరిక్షంలో 'కూర్చుని' తినే మొదటి డిన్నర్. సారీ ఇక్కడ లంచ్ డిన్నర్ అనే భేదాలుండవనుకుంటాను. మొదటి పార్టీ చేసుకుందాం పద.' హుషారుగా కదిలాడు వాయుపుత్ర. నిస్తేజంగా వెంట నడిచింది అనూహ్య.
మిగతా ముగ్గురూ వీళ్ళకోసమే ఎదురు చూస్తున్నారు. యశ్వంత్ చూపులో రవ్వంత బాధ తొంగి చూస్తున్నట్లనింపించిదామెకు. వెళ్ళి యశ్వంత్ ప్రక్కన ఖాళీగా వున్న కుర్చీలో కూర్చుంది. "అనూహ్యా......భోజనం తర్వాత నా గదిలోకి వస్తే మా బ్రహ్మవిద్యను పరిచయం చేస్తాను. నీకు మంచి కంపెనీ."
అనూహ్య మాట్లాడలేదు. రెండువైపులా వాయుపుత్ర, యశ్వంత్ మాట్లాడుతుంటే తనలో చెలరేగుతున్న సంఘర్షణవాళ్ళకు తెలియకుండా వుండేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఆమె ముఖంలో భావాన్ని గమంనించింది ఒక్కడే. డాక్టర్ ఫిలిప్స్!.
* * *
ఆ తరువాత అరగంటకి అనూహ్య వాయుపుత్ర గదివైపు నడిచింది. ఆమె అడుగు పెట్టగానే ఒక తియ్యటిస్వరం. "రండి. స్వాగతం సుస్వాగతం" అని వినిపించింది. అనూహ్య అదిరిపడింది. వాయుపుత్ర నిజంగానే ఎవర్నయినా పట్టుకొచ్చాడా? అని ఆమె గదంతా కలయచూసింది. ఎవరూ కనిపించలేదు.
"హలో" స్లీపింగ్ బ్యాగ్ లోంచి తల బైటపెట్టి అల్లరిగా పలకరించాడు వాయుపుత్ర.
"పరిచయం చెయ్యండి, ఆవిడ అయోమయంగా చూస్తున్నారు"-మళ్ళీ వినిపించిందా స్వరం. అనూహ్య అటువైపు తిరిగి చూసింది.
ఎదురుగా ఓ కంప్యూటర్ వుంది.
"హలో నా పేరే బ్రహ్మవిద్య. మీ అందరి సేవకూ సిద్దంగా వుంటాను" అంది స్త్రీ స్వరంలో.
"మానవ మాత్రులెవరూ చెయ్యలేని పనులు అన్నీ చేయగలదు. నీతో ఆటలాడుతుంది. పోట్లాడుతుంది. కథలు చెబుతుంది. పాటలు పాడుతుంది. ఇకపోతే ఓ విజ్ఞాన సర్వస్వం. నీ పరిశోధనలో కూడా ఉపయోగించుకోవచ్చు."
"బావుంది. చాలా పెద్ద బుర్రేనన్నమాట"
"ఆ, చాలా పెద్దది. బరువు అయిదువందల కిలోలు!" జవాబిచ్చింది బ్రహ్మవిద్య. "అది కేవలం మెదడు బరువు మాత్రమే. మొత్తం రెండువేల కిలోలు బరువు."
"నమ్మలేను. నాకంటె చిన్నగా కనిపిస్తున్నావు."
"చూడ్డానికి అయిదడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పేగాని ఈ వాయుపుత్ర ఎంత ఫీడ్ చేశాడో చెప్పలేను. రాత్రీ పలుగు విశ్రాంతి తీసుకోకుండా ఒకటే ఫీడింగ్ చచ్చాననుకో."
"అయితే మీరు సృష్టించిన దానికి మీరు తండ్రి అవుతారు గాని భర్త ఎలా అవుతారు?" వాయుపుత్రని అడిగింది అనూహ్య.
"నేను సృష్టించానని ఎవరన్నారు? కంప్యూటర్ ఇరవయ్యోశతాబ్దంలోనే పుట్టింది. నేను మెరుగులు దిద్ది విద్యలు నేర్పించానంతే. మాట్లాడటం-అనేది ఈ మధ్య నేర్చిన విద్యన్నమాట"
"అవును. ముదితల్ నేర్వగలేని విద్యగలదే ముద్దారనేర్పించినన్ అన్నారు గదండీ" అంది బ్రహ్మవిద్య.
"నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? మేము మాట్లాడుకోవలసింది చాలా వుంది" వాయుపుత్ర కసురుకున్నాడు.
"నువ్వు నా నోరు ముయ్యడం తప్ప నా అంతట నేను మూసుకునే అవకాశం లేకుండా చేశావు గదా."
"తప్పయిపోయింది. తర్వాత కార్యక్రమంగా అదే చేస్తాలే" పక్కమీదనుంచి లేచి, బటన్ ఆఫ్ చేశాడు వాయుపుత్ర.
"హమ్మయ్య ఇక మనం మాట్లాడుకోవచ్చు" అంటూ వచ్చి అనూహ్య ఎదురుగా కూర్చున్నాడు.
తలుపుమీద టక్ టక్ మన్న శబ్దం.
"ఎవరది?"
"నేను డాక్టర్ ఫిలిప్స్ ని"
"కమిన్" అన్నాడు ముఖం గంటు పెట్టుకుని.
"ఎవరిదో కొత్త స్వరం వినిపించింది. ఎవరిది?" అటూ యిటూ చూస్తూ అడిగాడు ఫిలిప్స్.
"ఊ.....ఊ.....ఊ శబ్దం చేసింది బ్రహ్మవిద్య" వాయుపుత్ర మళ్ళీ బటన్ నొక్కాడు.
"హల్లో డాక్టర్ ఫిలిప్స్. నేను బ్రహ్మవిద్యను. రండి, రండి. సుస్వాగతం."
ఫిలిప్స్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు.
"ఇంత స్పష్టంగా మాట్లాడే కంప్యూటర్ని అందులోనూ స్త్రీ స్వరంతో యింత స్పష్టంగా మాట్లాడే కంప్యూటర్ని చూడడం యిదే మొదలు. చాలా బావుంది."
"ఇప్పుడు చూస్తున్నారుగా! ఈ సృష్టి మీ వాయుపుత్రది."
"పేరు బ్రహ్మవిద్య. నీకు తెలిసిన విద్యలేమిటి?"
"అన్నీ తెలుసు. మీ గురించి చెప్పనా? 2054 జనవరి పదవతేదిన ఉదయం గ్రీన్ విచ్ టైం పదిగంటల యిరవై నిముషాల పదిహేను సెకండ్లకు ఫ్రాంక్ ఫర్ట్ లో పుట్టారు. పుట్టినప్పుడు మీ బరువు కేవలం నాలుగు పౌండ్లు. పదిరోజులపాటు ఆక్సిజన్ లో పెట్టాల్సిన అవసరం వచ్చింది........"
"చాలా బావుంది. కంప్యూటర్ వివరాలిస్తుందని తెలుసుగాని మాట్లాడుతుందని నాకు తెలియదు."
"చెప్పానుగా వాయుపుత్ర క్రియేషన్ అని! ఎదుటి వాళ్ళ స్వరాన్ని వినగానే, దాన్ని అర్థం చేసుకుని సమాధానాన్ని తిరిగి మాటల రూపంలో చెప్పగలిగే విధానం కనిపెట్టిందీయనే."
అనూహ్య చప్పున "కానీ నేను మాట్లాడాకుండానే స్వాగతం పలికావు" అంది.
"వాయుపుత్రకి సంబంధించినంత వరకూ నువ్వు ప్రత్యేకం అనూహ్యా" అంది కంప్యూటర్. ఆ గదిలో చప్పునచాలా ఇబ్బందికరమైన నిశ్శబ్దం ఏర్పడింది.
దాన్ని ఛేదిస్తూ "చాలా గొప్ప విశేషం యిది. కంగ్రాచ్యులేషన్స్ వాయుపుత్రా! కాని డాక్టర్ గా మీకు సలహా యివ్వాలి. కనీసం ఆరుగంటలపాటు విశ్రాంతి తీసుకొమ్మని చెప్పాను. ప్రస్తుతం ఆ పని చెయ్యండి ఇద్దరూ" అన్నాడు ఫిలిప్స్.
అనూహ్య లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె కెందుకో సిగ్గుగా అనిపించింది.
2
పదిరోజులు గడిచాయి. అంతరిక్షంలోకి వాళ్ళు పంపిన సంకేతాలకు ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు. సౌరకుటుంబం అంచుకి వాళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. బైలుదేరినప్పటికంటే వాహనం స్పీడ్ ఆరు రెట్లయింది. త్వరలో కాంతివేగాన్ని చేరుకుంటుంది.
నా
'శ్రీజా,
దిగంతాలకు మా యాత్ర ప్రారంభం కాబోతోంది. 'ఇక మా గురించి ఎలాంటి వివరమూ నీకు తెలిసే అవకాశం లేదు' అనుకునేదానికన్నా 'నీ గురించి ఏ విషయమూ తెలుసుకునే అవకాశం లేదు' అనుకోవడం చాలా బాధ కలిగిస్తోంది. "ఓ చిరునవ్వుకోసం రక్తాన్నంతా పిండి యివ్వగల" నన్నావు. నీ గురించి ఓ వార్తకోసం ప్రాణం అయినా యివ్వగలను. కాని అది కూడా అసంభవమిక.
అందుకే శ్రీజా,
పెళ్ళయి పట్టుమని పదిహేనురోజులు కాకుండానే ఏ భర్తా అడగనిదీ అడగకూడనీదీ నిన్నడుగుతున్నాను. ఇప్పటికయినా మించిపోయింది లేదు. అయిదో నెలలో అబార్షన్ ఈ రోజుల్లో సమస్య కాదు. ఆ తర్వాత నీకు నచ్చినవాడు దొరికితే పెళ్ళి చేసుకో. తిరిగివస్తానో రానో తెలియని నా కోసం నీ నిండు జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. నీకు చేసిన అన్యాయానికి ప్రతిక్షణం కుములుతూ వుంటాను. నన్నీ మనస్తాపం నించి విముక్తిడిని చెయ్యి. నీ నుంచి వార్త అందుకోలేనంత దూరం నేను వెళ్ళక ముందే నీ జవాబు యివ్వగలిగితే నాకు మనశ్శాంతి. నీకు అయిన వాడినో కాదో కూడా తెలియని దౌర్భాగ్యస్థితిలో వున్న - నీ నిఖిల్.'
శ్రీజ కన్నీళ్ళతో ఉత్తరాన్ని తడిపేసింది. కంప్యూటర్ ద్వారా రిలే చేయబడ్డ ఆ ఉత్తరం ఆమెకు అందడానికి నాలుగు గంటలు పట్టింది.
"అతడు చెప్పినదాంట్లో నిజం వుందమ్మా. ఇప్పటికయినా మించిపోయింది లేదు. అలా చెయ్యి. "తల్లి వేడుకుంది. ఒక్కగానొక్క కూతురి జీవితం యిలా వృధా అయిపోవడం భరించలేని వ్యధ అయిపోయిందావిడాకు.
"క్షమించమ్మా ఆ విషయం ఇక నా దగ్గర ప్రస్తావించకు. నేను వెళుతున్నాను. సమాధానం వెంటనే ఇవ్వాలి" లేచి వెళ్ళిపోయింది శ్రీజ.
* * *
"బ్రహ్మవిద్యా నా ఉత్తరానికి జవాబు లేదా?" నిఖిల్ బేలగా అడిగాడు.
"ఇది నూట ఒకటోసారి, నువ్వా ప్రశ్న అడగటం. జవాబు వస్తే నా నోరు ఊరుకుంటుందా. నువ్వు వద్దన్నా వినకుండా అరుస్తాను."
"మనం కాంతి వేగం చేరుకోవడానికి యింకా ఎంత సమయం వుంది?"
"సరిగ్గా నాలుగ్గంటల పదిహేడు నిముషాల యాభై సెకండ్లు"
"అంతసేపు నీ దగ్గరే కూర్చుంటాను."
"అలాగే! టైము తెలియకుండా వుండేందుకు బేతాళ కథలో, అరేబియన్ కథలో చెప్పనా!"
"వద్దు. వినే మూడ్ లో లేను. మనిషికీ కంప్యూటర్ కీ తేడా ఏమిటో ఇప్పుడు నాకు అర్థమయింది,"
"ఏమిటది?"
"మనిషే ప్రేమించగలడు, కంప్యూటర్ ఆ పని చేయలేదు........" కసిగా అన్నాడు.
బ్రహ్మవిద్య మాట్లాడలేదు. అది నిజం కాదని కాలం నిరూపించింది త్వరలోనే...
* * *
కళ్ళు తెరవగానే అతడు అడిగిన మొదటి ప్రశ్న.
"బ్రహ్మవిద్యా-సమయం ఇంకా ఎంతుంది?"
"పన్నెండు నిమిషాల పది సెకండ్లు వుంది. వాళ్ళ వాహనం కాంతి వేగాన్ని అందుకుంటే మరిక వార్తలు అందవు."
"నా ఉత్తరం శ్రీజకి అందలేదా? జవాబు దొరకదా నాకిక?" చిన్నపిల్లాడిలా అడిగాడు.
"అవన్నీ నాకు తెలియదు. నా డ్యూటీ నేను సరిగ్గా చేస్తున్నాను."
సమయం అతివేగంగా పరిగెడుతోంది. నిఖిల్ చేతుల్లో చెమటలు పడుతున్నాయి. అక్కడే కూర్చున్నాడు. పది నిముషాలు దాటింది. సెకండ్లలో కౌంట్ డౌన్ మొదలుపెట్టింది బ్రహ్మవిద్య.
పది.....తొమ్మిది......ఎనిమిది.....ఆఖరి సెకండ్ అవగానే నిఖిల్ అణచుకున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా రోదించాడు. మరో అయిదు నిముషాలు గడిచాయి.
"మెసేజ్ ఫర్ నిఖిల్" బ్రహ్మవిద్య స్వరానికి ఉలిక్కిపడ్డాడు ఎర్రబడ్డ కళ్ళని తుడుచుకుంటూ.
"టైం అయిపోయిందన్నావుగా, జోక్ చేసే సమయం కాదిది."
"బావుంది. మన టైముకీ, భూమి టైముకీ తేడా పెరిగి పోయింది. ఆ విషయం గురించి నువ్వు నన్నడిగితే అప్పుడే చెప్పేదాన్ని. అవేమీ ఆలోచించకుండా ఏడూస్తూ కూర్చున్నావు. నేనేం చెయ్యను?"