Previous Page Next Page 
చీకట్లో సూర్యుడు పేజి 25

                               రెండవ భాగం

    భూమినుంచి బయల్దేరిన కొద్దిక్షణాల్లో "సుహృద్భావ' మేఘాలుదాటి ఆకాశంలోకి దూసుకుపోతోంది.

    దాదాపు రెండువందల అడుగుల పొడవున్న ఆ నౌక చిన్నసైజు స్కైస్క్రాపర్ లా  వుంది. నౌక క్రింది భాగం అంతా శక్తిని నిల్వచేసే స్టోరేజి టాంకులు, మధ్యభాగంలో కంట్రోలురూం. పక్కగా యశ్వంత్ కి, అనూహ్యకి లాబొరేటరీలు, డాక్టర్ కోసం ఓ  క్లినిక్. ఇవి కాకుండా అయిదుగురికీ అయిదు విడి గదులున్నాయి. వాళ్ళ జీవిత శేషభాగం అంతా ఎలాంటి లోటు లేకుండా అన్ని రకాలుగా సదుపాయాలు చేయబడ్డాయి, ప్రపంచ శ్రేయస్సు కోసం జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళకు ఎలాంటి లోటు కనిపించనివ్వకూడదని సైంటిస్టులు పడ్డా శ్రమ ఫలితం ఆ వాహనం! టిన్డ్ పుడ్స్, ట్యూబ్ పుడ్స్ స్థానంలో కంప్రెస్ డ్ పుడ్స్  వచ్చాయి. ఓ  అంగుళం చదరంముక్క వేడిచేస్తే ఆ అయిదుగురికీ ఓ రోజుకి సరిపడే అన్నం తయారవుతుంది. అలా దాదాపు వందసంవత్సరాలకు పైగా వాళ్ళకు సరిపోయేటట్లు సంపూర్ణంగా ఆహార నిల్వలు ఉన్నాయి. నోటికి కావలసిన రుచి విషయంలో కూడా వాళ్ళకే విధమైన లోటులేదు.

    వాహనానికి రెండువైపులా రెక్కలుగా విస్తరించుకున్న సోలార్ సెల్ ప్లేట్స్ వాళ్ళు సూర్యుడి దరిదాపుల్లో వున్నంతకాలం సూర్యశక్తి గ్రహించుకుని నిల్వచేస్తాయి ఆ కొద్ది రోజులూ వాహనం స్పీడు గంటకు పన్నెండు వేల మైళ్ళకు కుదించబడింది. ఈ తర్వాత, రోజు రోజుకీ అది రెట్టింపై కాంతివేగానికి(?) చేరుకుంటుంది.

    శూన్యంలో ఏ పదార్థమైనా కాంతివేగానికి చేరుకోవడం అసాధ్యమని ఇరవయ్యో శతాబ్దపు ప్రజల నమ్మకం. శూన్యంలో 'జీరో మాస' అంటే పూర్తిగా అంతర్ధామైన ధూళి కణాలుగా ప్రయాణిస్తే కాంతివేగం సాధ్యపడుతుందని తేలడంతో అలాంటి పదార్థాన్ని తయారుచేసే కార్యక్రమంలో అప్పటివరకూ వున్నరంతా. అయితే కాంతివేగాన్ని కూడా మించే శక్తినిచ్చే క్వార్డ్ జ్ వేరే  గ్రహంనుంచి వచ్చిన గాలి పళ్ళెంలో దొరకడంతో దాన్ని అన్ని రకాలుగా వినియోగించాడు యశ్వంత్. కేవలం రెండు వారాల్లో అతడు చేసిన పరిశోధన ప్రపంచ ప్రసిద్ధులైన సైంటిస్టులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తెంది.

    NEWS - Ship (నేచురల్  ఎన్విరాన్ మెంట్ విత్ ఇన్ స్పేస్ - షిప్) ప్రభావంతో వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టిన క్షణంనించీ యింట్లో వున్నట్లే వుండవచ్చుగాని వాహనం అంతరిక్షం చేరేదాకా జాగ్రత్తగా సోఫాల్లో కూర్చున్నారు. అందరూ కంట్రోలు రూంలోనే వున్నారు. అయిదుగురి అంతరంగాల్లో రకరకాల భావాలు.

    యశ్వంత్ కమాండర్ గా కంట్రోలింగు పానెల్ దగ్గర కూర్చుని ఆలోచనలో పడిపోయాడు. క్రితం సారి చంద్రుడి మీద జారిపోయినప్పటి ప్రయాణం తననెలాంటి ప్రమాదంలో పడేసిందో అతడింకా మర్చిపోలేదు. మృత్యువు చివరి అంచువరకూ ప్రయాణంచేసి వచ్చిన వ్యక్తి కాబట్టి అతడికి చావంటే భయం లేదు, కాని గుండె లోతుల్లో ఏదో తెలియని ఉద్వేగం.

    నిఖిల్ మనసు పరిపరివిధాల పోతుంది. యాభై సంవత్సరాల భవిష్యత్ జీవితాన్ని మానవాళికోసం త్యాగం చేసిన త్యాగమూర్తిలా ప్రపంచం అంతా తనను కొనియాడుతోంది. ఓ చిన్న అబార్షన్ తో భవిష్యత్తుని ఆనందమయం చేసుకోగలిగే స్థితిలో వుండికూడా తనకోసం జీవితాన్ని త్యాగం చేసిన శ్రీజ గొప్పతనాన్ని గుర్తించ గలిగిందెంతమంది? ఆమె రూపు అతడి కంటి రెప్పలమాటున ప్రతిష్టించుకుపోయి కదలనంటోంది. కాంతి వేగంగా పయనించే మనసు అతడి కర్తవ్య నిర్వహణకి సహకరించే మార్గంలోకి మళ్ళడం లేదు. శ్రీజ గురించి పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తున్నాడతను.

    అనూహ్య మనసు అల్లకల్లోలంగా వుంది. అంతరిక్షంలో మానసిక, శారీరక వత్తిడులను తట్టుకోవడానికి ఆరువారాల ట్రైనింగు యిచ్చారామెకు. కాని ఆమె సమస్య మనిషి యిచ్చే ట్రైనింగుకి అతీతమయింది. మొదటిసారిగా అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్న ఉత్సాహం, ఆరాటం, ఆనందం - తన పరిస్థితి ప్రతిక్షణం గుర్తుచేస్తున్నా ఆ యిద్దరి రూపాలచాటున మరుగుపడి పోతున్నాయి. కళ్ళు మూసుకుని కూర్చుని మనసుని అదుపులోకి తెచ్చుకుని, ఆత్మస్థయిర్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో వుంది.

    ఆ నలుగురిమీ గమనిస్తూ వాళ్ళ వాళ్ళ  మనోభావాలను తెలుసుకునే  ప్రయత్నంలో వున్నాడు ఫిలిఫ్స్. ఆ బృందంలో అందరికన్నా పెద్దవాడతడు. యాభై సంవత్సరాల వయసుంటుంది. కాని యింకా పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. వృత్తిరీత్యా డాక్టర్. ప్రవృత్తులను పరిశీలించడం అతడి హాబీ.

    తన ఎదుటకూర్చున్న ఆ నలుగురి మనసుల్లో ఈ క్షణంలో కదలాడుతున్న ఆలోచనల గురించి ఆలోచిస్తున్నాడతను.

    అయిన వాళ్ళందరికీ దూరమయి తిరిగి వాళ్ళను చూస్తామో లేదోనన్న సందిగ్ధం- వాళ్ళ మనసులని ఎలాంటి ఉద్వేగాలకు లోనుచేస్తోందో అతడికి తెలుసు. భారం నిండిన హృదయం కన్నీటితో కుదుట పడుతుంది. కాని వారా స్టేజీ దాటిపోయినవాళ్ళే. భావరహితంగా మనసుల్ని అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నంలో వున్నారు.

    వాయుపుత్ర అన్నాడు - "భూమిమీద రెండువేల కోట్ల జనాభా వున్నారు. వాళ్ళతోపాటూ మన ఆత్మశాంతికోసం ప్రార్థించడానికి మనం కూసా యిప్పటినుంచే మొదలుపెట్టాలా?" ఆ మాటలకు గదిలో టెన్షన్ కొద్దిగా తగ్గింది.

    "థాంక్యూ వాయుపుత్రా, బయలుదేరినప్పటినుంచీ మీ అందర్నీ చూస్తూ చాలా అనీజీగా  ఫీలవుతున్నాను. ప్రయాణం మొదలుపెట్టి గంటకూడా కాలేదు. ఇప్పటినుంచే బాధని మూటకట్టుకోవడం మొదలుపెడితే ముందు ముందు భారం ఎక్కువయిపోతుంది. ఛియర్ ఆప్ ఫ్రెండ్స్" అన్నాడు డాక్టర్ ఫిలిప్స్.

    "ఈ క్షణం నుంచి నేను నిద్రలో  కూడా నవ్వుతూనే వుంటానని, నా పెదాలు  సాగిపోయి వికృతంగా తయారయినా మానననీ హామీ యిస్తున్నాను. అంతేకాదు నా తోటి వాళ్ళందర్నీ కూడా ఎల్లప్పుడూ నవ్విస్తూ వుండేలా శాయశక్తులా ప్రయత్నిస్తాను. చక్కిలిగింతలు పెడుతూ అయినా సరే" వాయుపుత్ర సీరియస్ గా అన్న మాటలకు  అందరి మొహాల్లోనూ నవ్వులు విరిసాయి.

    "మరొక విషయం. మా బ్రహ్మవిద్య వద్దన్నా వినకుండా నాతోపాటు వచ్చేసింది. ఆమె మీ  కందరికీ మంచి  ఎంటర్ టెయిన్ మెంట్ యివ్వగలదని నా నమ్మకం."

    "బ్రహ్మవిద్యా? ఎవరు?" ఆశ్చర్యంగా అడిగాడు నిఖిల్.

    "నా మొదటి భార్య, నా ప్రాణం" సీరియస్ గా అన్నాడు వాయుపుత్ర అనూహ్య చప్పున అతనివైపు చూసింది, ఒక్కసారిగా ఆ గదిలో సస్పెన్స్ తో కూడిన స్వల్పకాల టెన్షన్.

    "అంటే రెండో భార్యని భూమిమీద వదలి వచ్చేరేమిటి?"

    "లేదు. నేను ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాను. ఏ గ్రహంమీద అనుగ్రహిస్తుందో మరి" ఓరకంట అనూహ్యవైపు చూస్తూ అన్నాడు.

    "బావుంది. ఆ వాయుపుత్రుడు ఆజన్మ బ్రహ్మచారి. ఈ వాయుపుత్రుడికి యిద్దరు భార్యలు. ఇద్దరిమధ్యా ఇక  అంతరిక్షంలో సమరం మొదలన్నమాట."

    "అవును. అదీ మన  మంచికే" అన్నాడు వాయుపుత్ర.

    "అదెలా?"

    "ఆ యుద్ధం చూపించి మాయాస్ ని కూడా భయపెట్టవచ్చు. వాళ్ళిద్దరినీ వాళ్ళ గ్రహంమీద వదిలేస్తామని బెదిరిస్తే మన జోలికి రారిక."

    "మీరు ఆడవాళ్ళని అలా గేలిచేయడం భావ్యంగా లేదు" అంది అనూహ్య కలగజేసుకుంటూ.

    "సారీ. నేను స్త్రీ శక్తిని వెక్కిరించడంలేదు. భార్యల శక్తిని....అందునా ఒకే భర్తని భరించే యిద్దరు భార్యల గొప్పతనాన్ని వివరిస్తున్నానంతే."

    "ఆ టాపిక్ వదిలెయ్యండి. అనూహ్యగారూ ఇలా రండి" పిలిచాడు నిఖిల్.

    "ఇప్పుడేగా  అనుకున్నాం, ఒక  కుటుంబ సభ్యులమని. ఒకే వయసు వాళ్ళం మనలో మన్నన లెందుకు? అనూహ్య అని పిలువు" అంది అనూహ్య.

    "సరే అనూహ్య, ఈ బృందంలో నువ్వొక్కదానివే అంతరిక్షంలోకి మొదటిసారిగా ప్రయాణం చేస్తున్నాదానివి. భూమిమీద మనకు యిచ్చిన శిక్షణ వేరు. అంతరిక్షంలో ఎలాంటి వాతావరణం వుంటుందో - కృత్రిమంగా తయారుచేసి యిచ్చిన శిక్షణ అది. ఇప్పుడు అసలైన ప్రయాణం ప్రారంభమయింది. నీ శిక్షణలో అనుభవంలోకి రాని విశేషాలు యిప్పుడు చూపిస్తాను" అంటూ లేచాడు. NEWS వల్ల  ఒక గదిలో వున్నట్టుగానే వుంది. కనీసం విమానపు కుదుపు కూడా లేదు. నిఖిల్ కి ఆ వాహనం తాలూకు ప్రతి భాగము తెలుసు.

    "సుహృద్భావ్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించటానికి అరగంట వుంది. చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. కాని వేగం ఏ మాత్రం తగ్గలేదు. కాకపోతే యిక మనం  కుర్చీల్లోంచి లేచి నడవడం మొదలుపెట్టొచ్చు" నిఖిల్ ఒక పక్కకు వెళ్తూ అన్నాడు.

    అనూహ్య అతడి దగ్గరగా వెళ్ళింది. నిఖిల్ వాహనానికి మెటల్ కిటికీ  తెరను పక్కకు కదిలించాడు. దానికి స్పేస్ ప్యూయర్ బిగించబడి వుంది. ఓ  కిటికీలోంచి బయటకు చూస్తున్న అనుభూతి కలిగిస్తుందది. అందులో కనిపిస్తున్న దృశ్యాల్ని చూసి అప్రతిభురాలై నిలబడి పోయిందామె. భూతద్దంలో చూసినట్టు వుంది.

    ఎదురుగా భూమి దిగంతాలకు వ్యాపిస్తున్నట్టుగా కనబడింది. బ్రహ్మాండం అంటే యిదేనేమోననే భావం కలుగుతుంది. ఆమె శరీరం ఉద్వేగం అప్రయత్నంగా వణికింది.

    "కిటికీలోంచి చెయ్యిపెడితే అందుతుందేమో నన్నట్లుగా అనిపిస్తోంది గాని మనం దాదాపు కొన్నివేల మైళ్ళ దూరంలో వున్నాం. ఇంకా దూరం పెరిగేకొద్దీ రకరకాల రూపాల్లో కనిపిస్తుంది. చూస్తూవుండు" నీలం రంగుల్లో సముద్రాలు, ముదురు గోధుమ, జేగురు రంగుల్లో భూభాగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఓ పెద్దగ్లోబుని చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. యుద్ధప్రభావానికి కూడా తట్టుకొని నిలబడ్డ గ్రేట్ వాల్ ఆఫ్  చైనా, సహారా ఎడారి స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    "మన వాహనానికి ఎనిమిది కెమెరాలు బిగంచబడ్డాయి, మనం స్క్రీన్ మీద ఏ భాగాన్ని చూడాలనుకున్నా చూడొచ్చు" అంటూ నాలుగడుగుల చదరపు స్ర్కీన్ చూపించాడు నిఖిల్.

    "తెరమీద క్లోజ్ ప్ లో భూమి వివరంగా కనిపిస్తోంది గాని యిలా ఈ కిటికీలోంచి చూస్తుంటేనే సహజంగా చూస్తున్న అనుభూతి కలుగుతోంది" అంది అనూహ్య.

    "బీ కాషియస్, అలీన్ బెల్ట్ ఎ హెడ్" అన్న అక్షరాలూ కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించాయి.

    "వెళ్ళి కూర్చుందాం. ఈ ప్రాంతమంతా చాలా శక్తివంతమైన రెడియేషన్ వుంటుంది. వాహనానికి ఎ విధమైన ప్రమాదం లేదుగాని అటూ ఇటూ వూగవచ్చు" అంటూ  వాయుపుత్ర వెళ్ళి కూర్చున్నాడు.

    రెండు వైపుల నుంచీ లాగుతున్న అయస్కాంత శక్తిలో ఇరుక్కుపోయినట్లున్న అనూహ్య వెంటనే కదలలేకపోయింది. అంతలోనే వాహనం ఒక పక్కకు వొరగడం, అది గమనించగానే యశ్వంత్ ఆమెను పట్టుకోవడం జరిగిపోయాయి. ఆ జర్కుకు వెనక్కు వెళ్ళాల్సిన ఆమె, ముందుకు పడిపోయింది. భయంతో కళ్ళు మూసుకుని తెరిచేసరికి ఎదురుగా యశ్వంత్ ముఖం దగ్గిరగా  వుంది. తను అతడి వొడిలో పడివున్న సంగతి గమనించగానే సిగ్గుతో మరోసారి కళ్ళు మూసుకుందామె. పదిహేను సంవత్సరాల క్రితం.....

    గాఢనిద్రలో అతడుండగా అతి మృదువుగా అతడి బుగ్గల్ని నిమిరేది. నిద్రలోనే అతడామెను దగ్గరగా తీసుకుంటే అతడి ఊపిరిలో ఊపిరై అలా ఆ ముఖంలోకి చూస్తుండిపోయేది. ఆ స్పర్శ యిచ్చిన ఆనందం జీవితంలో మరేది యివ్వలేదామెకు. నిద్రపోతే ఆ స్పర్శలోని  అనుభూతిని అనుభవించడం తగ్గిపోతుందనే భయంతో అలాగే రాత్రంతా జాగారం చేసేది. ఆ తరువాత....

    యశ్వంత్ మృదువుగా ఆమెను లేపాడు. మరోమాట మాట్లాడకుండా లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది అనూహ్య. వాయుపుత్ర వెనుకనుంచి తమనే చూస్తున్నాడని ఆమెకి తెలుసు.


       
                                                              *    *    *

    గాజు ఫలకంమీద కీటకాలు అటూ ఇటూ తిరుగుతున్నాయి. అనూహ్య చూపులు వాటిమీదే వున్నాయిగాని మనసు మాత్రం సహకరించడం లేదు.

    "ఈ ప్రయోగాలు మనుష్యులమీద కూడా చేస్తే బావుంటుందేమో. స్పెసిమన్ గా వుండమంటే నేను సిద్ధం" వెనుకనించి దగ్గిరగా వినిపించిన వాయుపుత్ర స్వరం ఆమెని ఉలిక్కిపడేలా చేసింది.

    "సారీ అనూహ్యా. ఆ రోజు నా ప్రేమను నువ్వు సందేహించావన్న నా అనుమానం నిజమే ననుకుంటాను. నిన్ను వెళ్ళమని చెప్పగలిగానే కాని ఆ తర్వాత నా హృదయంగాడు నన్ను కాల్చుకు తిన్నాడనుకో, పాపం వాడిని బ్రతికించడం కోసం ఎంత అవస్థపడ్డానో తెలుసా?"

    "అంటే?" అనుమానంగా అడిగింది అనూహ్య.

    "ఈ ప్రయాణంలో రావలసిన వాడి ప్రయాణం ఆపి, ఆ స్థానంలో నేను రావడానికి అడ్డదారులే తొక్కాను. కానీ దానికి సిగ్గుపడటంలేదు అనూహ్యా" వున్నట్లుండి అతడి స్వరం మార్దవంగా మారిపోయింది. "నువ్వులేని ఆ లోకంలో బ్రతకడం నాకు అసాధ్యమనిపించింది. శ్మశాన వైరాగ్యంలా జీవితంమీదే  నైరాశ్యం ఏర్పడింది. నా గురించి నువ్వేమనుకుంటున్నాసరే పెడత్రోవనే ఎన్నుకున్నాను. నికోలవస్కీలోని బలహీనతను క్యాష్ చేసుకోవడానికి 'నాది' అనుకున్న ఆస్థి అంతా ఖర్చుపెట్టాను. అఫ్ కోర్స్ ఇక నాకు ఆస్థితో పనేముంటుంది. నాకు కావలసింది నీ సాన్నిహిత్యం. జీవితం చివరి అంచుదాకా నీ చేయిపట్టుకుని అంతరిక్ష మార్గాల్లోకి దూసుకుపోవడం కన్నా సాఫల్యం ఏముంది చెప్పు."

    "వాయూ" ఆమె కంఠం వొణికింది ప్రేమతో, సందిగ్ధంతో.

    "అనూ" అతడామె దగ్గరగా  వచ్చి భుజాలమీద చేతులువేసి బలంగా దగ్గరకు లాక్కున్నాడు. అనూహ్య శరీరం జలదరించింది. ఆమె శరీరం మీద యశ్వంత్ వదలిన స్పర్శ తాలూకు అనుభూతి వాయుపుత్ర చెయ్యి తగలగానే వికర్షిస్తున్నట్లు ఆమె ఒక అడుగు వెనక్కు వేసింది.

    "ఏం నామీద యింకా కోపం పోలేదా?"

 Previous Page Next Page