"నా అవస్థ ఏదో నేను పడతాను. ముందు నువ్వు నా ఇంట్లోంచి వెళ్లిపో!"
"అలాగే పోతాను. ముందు మీరు లేచి ఆఫీసుకు తయారుకండి!"
"ఉహుఁ. నేనీరోజు ఎక్కడికీ వెళ్లను!"
"నాలాంటి భార్య దొరకడం మీ అదృష్టమన్నారు!"
" ఇప్పుడనుకొంటన్నాను చాలా దురదృష్టమని!" విసురుగా అన్నాడు.
"ఆ నిర్ణయానికి రావడానికి ఏడాదిలో రెండువారాలే గడిచిపోయాయి!" స్వప్న నవ్వుతూ మాధవ్ మీదినుండి బ్లాంకెట్ లాగేసింది. "లేవండి! ఏకాంతంలో వ్యధ అధికమౌతుంది! అలా నలుగురిలోకి వెళ్ళిపడితే మిమ్మల్ని మీరు మరిచిపోగలుగుతారు!"
మాధవ్ లేచి గబగబా తన పనులు పూర్తి చేసుకొని భోజనం చేయకుండానే వెళ్లిపోయాడు. నిన్నటిదాకా నడిచిన దినచర్యకు భిన్నంగా. ఇద్దరూ ఒకేసారి భోజనంచేసి ఇంటికి తాళం పెట్టి ఇద్దరూ ఒకేసారి బయలుదేరేవారు!
స్వప్న నుండి ఒక నిట్టూర్పు గుండెల్ని చీల్చుకు వచ్చింది. మాధవ్ కి ఎదురుతిరగడంవల్ల అతడిలో ఆకర్షణ పెరుగుతోందా?తరుగుతోందా?
స్వప్నతో మాటలు మానేసేవాడు మాధవ్. ఇంట్లో తినడం మానేశాడు. స్వప్న కలుగజేసుకోకబోతే విదిలించివేస్తున్నాడు.
9
సాయంత్రం బడి వదిలాక బస్ స్టాప్ లో నిలబడింది స్వప్న. బస్సుకోసం చూస్తూ ట్రాఫిక్ చాలా రద్దీగా వుంది. రిక్షాలు, ఆటోలు, స్కూటర్లు అన్నీ లైన్ లో వెళ్లిపోతున్నాయి!
అంత రద్దీలోనూ........
స్కూరట్ మీద వెడుతున్న అతడిని చూసి గుండె జల్లుమంది స్వప్నకు. అతడుకూడా ఇటుచూశాడు కాని, ఆగలేదు స్కూటర్.
అతడు స్వరూప్ కదూ? స్వరూపే! లక్షమందిలోనైనా అతడిని గుర్తించగలదు! స్వరూప్ తనని చూశాడు. అయినా ఆగలేదు. తనని గుర్తించలేదా? గుర్తించకపోవడమే తన అదృష్టం! తిరిగి అతడు తనకు దగ్గరైతే............ ఊహించుకోవటానికే ఇష్టపడలేదు స్వప్న.
కాని, అయిదారు నిమిషాలు గడవకముందే అతడు తిరిగివచ్చి స్వప్న ముందు నిలబడ్డాడు. నేలమీద కాలానించి "నువ్వు..... ఇక్కడ జాబ్ చేస్తున్నావా, స్వప్నా? వచ్చి ఎన్ని రోజులైంది?" అతడి ముఖంలో కొండంత సంభ్రమం.
జవాబు గొణిగినట్లుగా వచ్చింది స్వప్ననుండి.
ఆమె ముఖం వెలవెలబోతూ వుంటే, జీవితంలో ఇంకెప్పుడూ చూడనేమో అనుకొంటున్న తన స్వప్నను మళ్లీ ఇంత తొందరగా, ఆకస్మికంగా చూడడంవల్ల కలిగిన ఆనందం అతడి ముఖాన్ని చేటంత చేసింది. "ఎక్కడ పని చేస్తున్నావు? నువ్వుండడం ఎక్కడ? నీతో ఎవరొచ్చారు?"
హడావుడిగా ప్రశ్నలవర్షం కురిపిస్తున్నాడు స్వరూప్.
స్వప్న గుండెలమీద పాలిస్టర్ చీర వెనకాల ధగ ధగలాడుతున్న కొత్త మాయని మాంగల్యాలు లక్ష వోల్టుల కరెంట్ షాక్ లా తగిలాయి అతడిని.
నెత్తురుచుక్క లేకుండా పాలిపోవడం ఇప్పుడు స్వరూప్ వంతు అయిందియ. "నువ్వు ...నువ్వు ఇంత తొందరగా పెళ్లి చేసుకోగలిగావా, స్వప్నా?" దెబ్బతిన్న వాడిలా ఆక్రోశిస్తున్నట్టుగా అడిగాడు. గుండెలో బాగు దిగినబాధ అతడి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంటే స్వప్న అపరాధిలా తలవాల్చుకొంది.
"ఏ వూరిచ్చారు నిన్ను? మీ ఆయన కూడా ఇక్కడే పనిచేస్తున్నాడా?"