అతను అప్పటికి ఊరుకున్నాడు. కానీ, తరువాత మళ్ళీ ఆ పిల్ల చేతిలో వందరూపాయలు పెట్టి "మా సర్వెంట్ క్వార్టర్స్ కి రా!" అన్నాడు. వందరూపాయలు చేతిలో పెట్టగానే అది పొంగిపోయి తన వెంటబడుతుందని అతని నమ్మకం. అది ఆ డబ్బు వాడి ముఖాన కొట్టి బండ తిట్లు తిట్టింది. ఆ తరువాత ఆ పిల్లనూ, ఆ పిల్ల తండ్రిని ఏదో కుంటి సాకుతో పనిలోంచి తీసి పారేశారు. అక్కడితో కూలీలలో ఉద్రిక్తత పెరిగింది. అందరూ సమ్మె ప్రారంభించారు.
అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితినంతా పరిశీలించిన యతి పాపం, ఆ కూలి జనుల మండే మనసులతో పాటు కాలే కడుపులను చూసాడు . రెక్కాడితే గాని డొక్కాడని జాతి౧ దాచుకోవటం తెలియని జాతి! ఎంత సంపాదించినా అప్పటికప్పుడు తిని, త్రాగి ఖర్చు పెట్టేస్తారు. పసిపిల్లలు ఆకలికి తెగ ఏడుస్తున్నారు. కాస్త జ్ఞానం వచ్చిన పిల్లలు తిండి కోసం ఊరి మీద పడ్డారు. ఎవరి ముఖం చూసినా దైన్యం తాండవిస్తోంది ఆయినా వాళ్ళు పళ్ళ బిగువున సమ్మె కొనసాగిస్తూనే వున్నారు.
జరిగినది అన్యాయమే! సందేహం లేదు. ఈ అన్యాయం అరికట్ట వలసిందే! కానీ, ఆందోళన వల్ల ఇంతవరకూ జరిగిందేమిటి? అన్యాయం అన్యాయంలాగే ఉండిపోయేది! ఆందోళన ప్రారంభం కావటమూ , దానిని అణచటమూ ద్వారా వెంకటయ్య ఎప్పటికప్పుడు ఉభయ పక్షాల నుండీ లాభం పొంది తను బాగుపడేవాడు. అంచేత ఇప్పుడు విద్యార్ధులు రంగంలోకి దిగి ఆందోళన జరపడం ద్వారా కూలీల పరిస్థితి మెరుగు పడకపోగా మరింత విషమిస్తుందని అనుభవం ద్వారా తెలుసుకున్నాడు యతి. అలాగని జరుగుతున్నా అన్యాయం చూస్తూ తనకేమి పట్టనట్లుగా ఊరుకోవటానికి అతనికి మనస్కరించలేదు. తన జట్టులోని మరో అయిదారుగురు కుర్రాళ్ళతో కలిసి తిన్నగా ఆ యువకుడి ఇంటికే వెళ్ళాడు. ఇంటికేప్పుడు వెళ్ళినా ఎవరూ ఉండేవారు కాదు. అయ్యగారు ఒక మీటింగ్ కి, అమ్మగారు మరో క్లబ్ కి పిల్లలు ఊరిమీదకి ఇలా వెళ్ళిపోయేవారు. ఇంట్లో ఎప్పుడు పదిమంది నౌకర్లు అరచుకుంటూ గోల చేసుకుంటూ ఉండేవారు. ఎప్పుడు వెళ్ళినా కనిపించేది నౌకర్లే! చివరకు ఎలా అయితేనేం ఆ రోజు రాత్రి పదకొండు గంటలకి పెద్దయ్యగారు ఇంటికి భోజనానికి వస్తారని చెప్పాడు నౌకరు. యతి స్నేహితులతో వెళ్ళాడు. పెద్దయ్యగారు బాగా "మందు" వేసుకుని మంచి ,మూడ్ లో ఉన్నాడు. వీళ్ళు పగలంతా క్షణం తీరిక లేకుండా డబ్బు సంపాదించేది రాత్రి అయ్యేసరికి ఇలా తగలబెట్టాటానికే! ఆ పరిస్థితుల్లో ఉన్న పెద్దయ్యగారితో మాట్లాడటం ఏమంత ప్రయోజనం అనే ఆలోచన రాకపోలేదు యతికి కానీ, మరోసారి అతడు అసలు కనపడడు. పొద్దున్న ఎప్పుడు లేస్తాడో తెలియదు. లేవగానే ఎటు వెళతాడో తెలియదు. పోనీ, పొద్దున్నే వచ్చి కాచుకు కూచుందామన్నా నౌకర్లు కూచోనియ్యరు.
పెద్దయ్యగారికి నమస్కారం చేసి యతి తనను తాను పరిచయం చేసుకున్నాడు. తన మిత్రులను పరిచయం చేసాడు. అతను కూచోమనైనా అనకుండా కనుబొమలు చిట్లించి "నాతో ఏం పని?" అన్నాడు. యతి ముందుకు వచ్చాడు.
"యశోదను, ఆమె తండ్రిని పనిలోంచి తీసెయ్యటం అన్యాయం. తిరిగి పనిలోకి తీసుకోండి!" అన్నాడు.
పెద్దయ్య ముఖం జేవురించి కళ్ళు ఎర్రబడ్డాయి.
"మా వ్యవహారాలలో కలిగించుకోవటానికి మీరెవరూ? గెట్ వుట్!" అన్నాడు.
ఈ ప్రవర్తనతో యతిలోనూ సహనం నశించింది.
"మీ కొడుకు పాశవిక వాంఛలకు ఒక మర్యాద గల ఆడది లొంగకపోతే , మీ కొడుకును మందలించ వలసినది పోయి , పాపం ఆ ఆమయకురాలినీ, ఆమె తండ్రినీ పని లోంచి తీసేస్తారా?" అన్నాడు కోపంగా.
"షటప్? నువ్వేం వాగుతున్నావో నీకు తెలుసా? రుజువు చెయ్యగలవా, నా కొడుకు ఆ పిల్లతో అమర్యాదగా ప్రవర్తించాడని! నా కొడుక్కు ఆ కూలిమనిషే కావలసి వచ్చిందా? బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే కూలి వాళ్ళను తొలగించే హక్కు యాజమాన్యానికి కుంది. కూలీల ఈ సమ్మె వెనుక సంఘ విద్రోహకారుల చెయ్యి ఉందని మాకు తెలుసు. దానిని ఎలా అణచాలో కూడా తెలుసు!"
"ఇది చాలా అన్యాయం. మీ కొడుక్కి మీరు బుద్ది చెప్పకపోతే వాళ్ళే బుద్ది చెపుతారు. న్యాయం కోసం జరుగుతున్న పోరాటం . ఇందులో సంఘ విద్రోహక చర్య ఏమి లేదు."
"ఏమన్నావ్? నా కొడుక్కి వాళ్ళు."
పెద్దయ్య చెయ్యి ఎత్తాడు. యతి ఆ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. పెద్దయ్య అనబడే యాదవదేవ్ అంగరక్షకులు కర్రలతో యతి బృందం మీద పడ్డారు. ఎవరో పోలీసులకు ఫోన్ చేశారు. యాదవ దేవ్ ఇంటి మీదకి గుండాలు వచ్చి పడ్డారని-----అది చూసి యతి మిత్రబృందం పారిపోయారు. పారిపోక నిలబడ్డ యతిని యాదవదేవ్ గారి నౌకరొకడు పాత కత్తితో ఎదుర్కొన్నాడు. వంటినిండా కత్తి పోట్లతో గాని బయట పడలేక పోయాడు. నరక బాధ - పోలీసుల భయం. ఇక బ్రతకనను కున్నాడు యతి. ఇక ఆ సమయంలో ఎంతకాలంగానో తనకు తెలిసినా ఏనాడూ వెళ్ళటానికి ప్రయత్నించని మయూర ఇంటి తలుపు తట్టాడతను.
18
ఆందోళనలు! ఎటు తలతిప్పినా ఆందోళనలు! విశాలాంద్ర కోసం - ప్రత్యెక తెలంగాణా కోసం! హిందీకి వ్యతిరేకంగా - జీతాలు పెరగాలని - బోనసులు రావాలని ........
ఇంపీరియాలిజాన్ని - కేపిటలిజాన్ని పడగొట్టడానికి సాయుధ విప్లవం కంటే మరో మార్గం లేదని నిశ్చయించుకున్నారు కొన్ని వర్గాల వారు. అయితే తెలంగాణాలో వెనుక బడిన వర్గాలలోనే అనేక మంది అంతరంగికంగా , సాంఘికం గానూ కూడా సాయుధ విప్లవానికి అనుకూలంగా లేరు. అంచేత ప్రధమదశగా జాతిలో చైతన్యం కలిగించటానికి ఈ ఆందోళనలు అవసరమయ్యాయి. ఈ ఆందోళనలలో విద్యార్ధులు చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు, దేశమంతటా ..... అయితే, కొన్ని స్వార్ధ శక్తులు రాజకీయ రంగులు పులుముకొని, ఈ ఆందోళనలలో ప్రమేయం కలిగించు కుంటున్నాయి. విద్యార్ధులను తమ సోపానాలుగా వాడుకుంటున్నాయి. నిస్వార్ధ దేశ సేవకులెవరో , స్వార్ధ పూరిత నయవంచకులెవరో తెలుసుకోలేక విద్యార్ధులు నలిగి పోతున్నారు వ్యర్ధంగా.
ఎక్కడ పులి?- ఎక్కడి వెంకటయ్య?
ఎక్కడి లలిత? - ఎక్కడి మిసెస్ జ్యాలాకుమారి?
యతి , ప్రభాకర్ ఇద్దరి మనసులలోనూ ఇవే ఆలోచనలు!
నిండా పాతికేళ్ళు కూడా లేకుండా చదువులో ఎంతో ఆసక్తి , ఉత్సాహం ఉండి కూడా దురదృష్టవశాన వెంకటయ్య లాంటి స్వార్ధపరుల చేతుల్లో పడి ఉద్యమాల పేరుతొ అటు చదువూ, ఇటు జీవితమూ కూడా నాశనం చేసుకొన్న యతిని చూస్తే చాలా జాలి కలిగింది ప్రభాకర్ కి.