Previous Page Next Page 
మరో ముందడుగు పేజి 23

 

    జ్వాలాకుమారి, వెంకటయ్య నవ్వారు.
    "అతడిని గంటకోసారి నువ్వెలా చూస్తావయ్యా!" అన్నాడు వెంకటయ్య.
    "అదేనండి సార్! కాస్త కవిత్వ భాషలో చెప్పాను. అస్తమానూ వచ్చి ప్రోజు మాట్లాడుతుంటే విసుగొస్తుంది."
    మళ్ళీ అందరూ నవ్వుకున్నారు. ఇంతలో ఖద్దరు కట్టుకున్న నడివయసావిడ వచ్చి అందరికీ నమస్కారం చేసింది.
    "ఏంటమ్మా! ఖద్దరు కడితే గాని దేశభక్తి వుట్టి పడదా ఏం?" అని వేళాకోళం చేసింది. జార్జెట్ చీర కట్టుకున్నా జ్వాలాకుమారి . ఆవిడ శాంతంగానే అస్తమానూ నాయకులతో ఏదో ఒక మీటింగ్ కి తిరగాలి ఏదో ఇలానే అలవాటయి పోయింది" అంది జ్వాలాకుమారి వ్యంగ్యం పట్టించు కోకుండా.
    అంతలో ఫోను మ్రోగింది. జ్వాలాకుమారి అందుకుని మాట్లాడి సత్యమూ - రాధాకృష్ణా రారట! ఇంకా మనమే!" అని వంటింటి వైపు తిరిగి "రత్నా! నాలుగు కాఫీలు తీసుకురా! మొన్న బొంబాయిలో కొన్నాను చూడు, ఆ కప్పుల్లో తీసుకురా!" అని మళ్ళా మిత్రులవైపు తిరిగి "ఈ మధ్య మా వారు ఏదో పనిమీద బొంబాయి వెళుతుంటే నేను వెళ్ళాను లెండి - అయిదువేలు పట్టు కెళ్ళినా, కావలసిన సామాను కొనుక్కోవడానికి  సరిపోలేదు. అక్కడ ఆ కప్పుల డిజైన్ , గోల్డ్ కలర్, నాకెంతో నచ్చి సెట్ నూట యాభై చెప్పినా కొనేశాను" అంది - ఖద్దరు చీర కట్టుకున్నావిడ ఏం కొన్నారని అడిగింది . జ్వలాకుమారి ఏదో చెప్పసాగింది. యతికి ఆ సంభాషణ ఆసక్తి లేక వినిపించుకోలేదు. కుమార్ కూడా సిగరెట్ కాలుస్తూ ఎటో చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఇంతలో రత్న అనబడే ఆ పనిమనిషి ట్రేలో కాఫీ కప్పులు సర్ది తీసుకు రాసాగింది. జ్వలాకుమారి ఏదో చెప్పి నవ్వుతుంటే, అనుకోకుండా కుతూహలం కొద్ది ఆ మాటలు వింటూ కాలికి స్టూలు తగిలి పడిపోయింది. ట్రే కిందపడింది. కప్పులు ఫేణిళ్ళున పగిలిపోయాయి. కాఫీ ఒలికి పోయింది. అందరూ "అయ్యో " అంటుండగా - క్రిందపడి లేచిన రత్న బిత్తరపోయి చూస్తుండగా కాళీక లాగా లేచింది జ్వాలా కుమారి!
    "రాస్కెల్! వొళ్ళు పైనా తెలియటం లేదు. తెగ తిని బలిసి పొగరెక్కి కొట్టుకుంటున్నావు. చెంప పేలగొట్టి పళ్ళు రాలగోడితే కాని నీకు బుద్ది రాదు. మదమెక్కి చస్తున్నావు. నూటయాభై పట్టి కొన్నాను అరడజను కప్పులు. అయిదు పగలగొట్టేశావు. నీ జీతంలోంచి విరగ్గోడతాను. ఆ డబ్బులు ఏంటి. ఇంకా అట్టా బొమ్మలాగ చూస్తా నిలబద్దావ్! ముందా గాజు పెంకులు పారబోసి. ఆ కాఫీ అంతా తడిగుడ్డ పెట్టి తుడు. మళ్ళీ కాఫీ చేసి ఈసారైనా వయ్యారాలు వలక బోయ్యకుండా పట్టుకురా! మెడ్రాస్ కప్పుల్లో పట్టుకురా. పో! లోపలికి చావు."
    ఒక పురుగును విదిలిస్తున్నట్లు చీదరించుకుంటూ, నిప్పులు కురిపిస్తున్నట్లు కసురుకుంటున్న జ్వాలా కుమారిని కన్నీళ్ళు అపుకొంటూ దీనంగా చూసి లోపలికి ఈడ్చుకుంటూ పోయింది రత్న, గాజు పెంకు ముక్కను చేతిలో ఎత్తుకుని -------
    రత్న పనిమనిషే కావచ్చు. చేసింది తప్పే కావచ్చు. అందువల్ల జ్వాలాకుమారికి నష్టం కలిగి వుండవచ్చు. కానీ, అంతమాత్రాన అంతమందిలో అంత నిర్దాక్షిణ్యంగా అలా చీదరించుకుంటే ఆ వ్యక్తీ ఏమయిపోతుంది? ఎంత పనిమనిషి అయినా, అది మనిషి కాదా? దానికి మనసు లేదా? అదేనా ప్రోగ్రెసివ్ ఔట్ లుక్-
    జ్వాలా కుమారి ధోరణిలో పెత్తనం చెయ్యటానికి అలవాటు పడ్డ ధోరణి, ఏదో పొడిచే ధోరణీ కనిపిస్తుంది. అయితే అందరితోనూ అలా వుండదు. కాస్త లోకువగా ఉన్న వాళ్ళతోనే అలా మాట్లాడుతుంది. ఖద్దరు- చీరావిడని ఎప్పుడూ పొడుస్తూనే మాట్లాడుతుంది. పాపం! ఆవిడ సర్దుకుపోవదానికే ప్రయత్నిస్తుంది. కుమార్ ని ఆటలు పట్టిస్తూ సరదాగా మాట్లాడుతుంది. అతడు అదొక ఆటలాగ సరదాగానే సమాధానాలు చెపుతాడు. వెంకటయ్యతో గౌరవంగా మాట్లాడుతుంది. యతి మాట్లాడిన నాలుగైదు మాటల్లోనూ అతడి శక్తిని అంచనా వేయటానికి ప్రయత్నిస్తూ అతడి విషయాలు అరా తీయటానికి ప్రయత్నిస్తుంది. ఈ చాతుర్యానికి ఆవిడను మనసులో మెచ్చుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ చర్చ ప్రస్తుత రాజకీయాల మీదకు మళ్ళింది. అప్పుడు ఆ నలుగురూ యతి మనసు చాలా సంతృప్తి పడింది. ఎందుకంటె ఆ నలుగురూ మంచి రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళే. అందరికీ ప్రస్తుత రాజకీయరంగంలో జరుగుతున్న అవకతవకలు తెలుసు. తెరమీదవీ, తెరవేనకవీ భాగవతాలు తెలుసు. ప్రస్తుత వ్యవస్థను అందరూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ అక్రమాలన్నీ బయటపెట్టాలని నిర్ణయించుకున్నారు. గొర్రెల్లా తలలాడిస్తూ బ్రతికే మూర్ఖులున్న సమాజంలో - "నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష" అనుకొంటూ తమ జీవితమే తాము చూసుకునే మధ్య తరగతి మహానుభావులున్న సమాజంలో - అన్నీ తెలిసి అక్ర్మాలనే సమర్ధించే స్వార్ధపరులున్న ఇలా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ కార్యాచరణలనూ నిశితంగా నిర్భయంగా విమర్శించే వారు ఎంతేనా అవసరం.  
    ఆ చర్చలు దగ్గర దగ్గరా రెండు గంటల పైగీ సాగాయి. అందరూ మహోద్రేకంతో మాట్లాడుతున్నారు. వీరావేశంతో ఊగిపోతున్నారు.
    అంతా పూర్తయి ఇంటికి బయలు దేరు తున్నప్పుడు కారులో (వెంకటయ్య ఎక్కడికి బయలుదేరినా కారులోనే వెళతాడు) యతి వెంకటయ్యను అడిగాడు. ఈవిడ కూడా మీ ఆందోళనలో పాల్గొంటారా అని. వెంకటయ్య నవ్వాడు.
    "వాళ్ళ ఆయనది గవర్నమెంట్ వుద్యోగం . ఆవిడ ఏ ఉద్యమాలలోనూ పాల్గొనదు."
    "అయితే మీ రెందుకు ఈవిడ చుటూ తిరగుతున్నట్లు?"
    వెంకటయ్య దగ్గర ఏర్పడిన చనువుతో నిర్భయంగా అడిగేశాడు యతి. వెంకటయ్యకు కూడా యతి అప్తుడయిపోబట్టి అతడు నిస్సంకోచంగా సమాధానం ఇచ్చేసాడు.
    "మన వూళ్ళో కాలేజీ ప్రారంభించాను కదూ! దానికి గగర్నమేంట్ గ్రాంట్ రాలేదు. ఈవిడకి ఎడ్యుకేషన్ సెక్రటరీ తెలుసు. ఏదైనా సహాయం చేస్తుందేమో నని...."
    "ఆ!...."అన్నాడు యతి . అంతే! ఇంకేమి మాట్ల్దలేకపోయాడు. అతనికి ఆలోచించే శక్తి నశించిపోయింది.

    
                                                           17

    వెంకటయ్యకి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో సమాచారం అందించేవాళ్ళు చాలామందే వున్నారు. సమాచారం అందిన వెంటనే అతడు గోరంతను కొండంతగా చేసి ఆందోళన లేవదీయటానికి అవకాశాల కోసం చూస్తూ వుంటాడు. గొడవ ప్రారంభం కాగానే యతికి చెపుతాడు. విద్యార్ధుల ప్రవేశంతో ఎంత చిన్న గొడవ అయినా పెద్ద ఆందోళనగా మారిపోతుంది. ఇటీవల యతి మనసులో ఈ ఆందోళనల పట్ల వ్యతిరేకత ఎక్కువ కాసాగింది. వెంకటయ్యతో సన్నిహిత పరిచయం పెరిగిన కొద్దీ - అతని "బహుముఖ వ్యక్తిత్వం" అర్ధమవుతున్న కొద్ది ఈ ఆందోళనలోని నిజాయితీ ఏ మాత్రమనే ప్రశ్న అతనిని వేధించసాగింది. జనపనార మిల్లులోని కూలీలకి, యజమాని కొడుకుకూ మధ్య ఏదో ఘర్షణ జరిగిందని తెలుసుకున్నాడు వెంకటయ్య. ఆ విషయమేదో తెలుసుకుని రమ్మని యతిని పంపించాడు. కూలీల గుడిసెల దగ్గరకు వెళ్ళి విషయం తెలుసుకున్న యతి తన చెవులను తను నమ్మలేకపోయాడు. ఈ నాగరిక సమాజంలో ఇలాంటిది సాధ్యమా? అని నివ్వెరపోయాడు. యాజమాన్యానికి సంబంధించిన ఒక అధికారి కొడుకు కంటికి కాస్త అందమైన ఆడపిల్ల కనిపించింది. అతడు నలుగురిలోనూ ఆ అమ్మాయిని చూసి కన్నుకొట్టి నవ్వాడు. ఆ అమ్మాయి మండిపడింది. ఛీ అని చీదరించుకుంది. చుట్టూ వున్న కూలీలు ఊరుకోలేదు. తిరగబడ్డారు. మా అడకూతుళ్ళ జోలికోచ్చావంటే జాగ్రత్త - అని బెదిరించారు.

 Previous Page Next Page