Previous Page Next Page 
లవ్ స్టోరీస్ పేజి 24


    రిజల్ట్స్ వచ్చినయ్! తను పాసయింది. రమణ తప్పాడు. ఆ సంవత్సరం నుంచే తను లంగా ఓణీలు వేయాల్సొచ్చింది! రమణ మళ్ళీ స్కూల్లో చేరలేదు.

    ఓ ఆదివారం హఠాత్తుగా మధ్యాహ్నం పూట ఇంటికొచ్చాడు. ఆ సమయానికి తన తల్లి ఇంట్లోలేదు. ఎవరింటికో వెళ్ళింది. ఇంట్లో తనొక్కర్తే ఉంది!

    "ప్రసూనా! ఇదిగో ఈ ఉత్తరం ఎవ్వరూ లేకుండా చూసి చదువుకొని రేపు స్కూల్ కెళ్ళేప్పుడు జవాబురాసి నాకివ్వు! నేను స్కూల్ దగ్గర కలుసుకొంటాను..." అనేసి మరోసారి కౌగలించుకొని ముద్దుపెట్టుకొని పరుగెత్తుకొంటూ వెళ్ళిపోయాడు.

    ఆ ఉత్తరం భావం తన కప్పటికే అర్థమయింది.

    మూడు నాలుగేళ్ళ నుంచీ ఆ ఊరి దగ్గరగా వెలసిన టూరింగ్ టాకీస్ సినిమాలు ఆ పరిజ్ఞానాన్ని తనకు కలిగించినయ్!

    "ప్రసూనా;

    నీ అందం చూస్తూంటే నాకు పిచ్చెక్కిపోతోంది. మనిద్దరం ఏవేవో మాట్లాడుకోవాలని, ఎన్నెన్నో అనుభవించాలనీ అనిపిస్తోంది! ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలో నువ్వే దారి చెప్పాలి! వెంటనే జవాబు రాసి రేపు స్కూల్ కి తీసుకురా! నేను అక్కడ కలుసుకొంటాను.

    నీ ప్రియమైన రమణ..."

    ఒళ్ళంతా పులకరించినట్లయింది తనకి. తనూ రమణని ప్రేమించినట్లనిపించసాగింది. అతని కౌగిలీ -అతని ముద్దూ - ఇంకా అతను నేర్పబోతున్న కొత్త అనుభవాలూ అన్నీ ఎంత త్వరగా చవిచూస్తామా అన్న తహతహ పెరిగిపోయింది. తనకి రమణ కావాలి! రమణకి తనుకావాలి! ఇద్దరూ ఒకిరిని విడిచి ఒకరు  ఉండలేరు. ఇద్దరిమధ్యా అంత గాఢమైన ప్రేమ ఉంది. జవాబు రాసింది ప్రసూనాంబ. కాని ఎక్కడ ఎలా ఒంటరిగా కలుసుకోవాలో ఆమెకీ తెలీలేదు. అతనినే సలహా అడిగింది. మర్నాడు ఆ ఉత్తరం అతని కందించటం తనకేమీ ఇష్టం కాలేదు. ఎలా కలుసుకోవాలో, ఎప్పుడు కలుసుకోవాలో అనేక ఉపాయాలు సూచిస్తూ ఉత్తరాలు రాశాడతను. కానీ ఏదీ ఆచరించడానికి వీల్లేకపోయింది ఎప్పుడూ ఏదో ఒక అడ్డు! ఉత్తరాల్తోనే చాలా రోజులు గడిచిపోయినయ్. ఒకటి రెండుసార్లు కలుసుకొన్నారుగానీ ఎంతోసేపు గడపటానికి వీల్లేకపోయింది.

    రమణదీ తనదీ ఓ కులం కాదు! అతనికి చదువులేదు. వ్యవసాయం కూడా చెయ్యడు. అందుచేత ఎవ్వరూ తమ వివాహానికి ఒప్పుకోరు. తనకు తెలుసది. అయితే అందుక్కూడా రమణ ఓ ఉపాయం చెప్పేడు. ఇద్దరూ చేతికందినంత డబ్బుతో ఊరొదిలి పారిపోవడం. తరువాత అతనేదేనా ఉద్యోగం సంపాదించడం - హాయిగా బ్రతికేయడం!

    ఆ ఉత్తరమే తన తల్లిచేతిలో పడింది పొరపాటున. అంతే! మర్నాడే అన్నయ్య వచ్చి ఇంట్లో వాలాడు . తనని యస్సల్సి మధ్యలో మానిపించేశాడు. గడపదాటనీకుండా గట్టిగా కాపలా పెట్టారు. రమణ జాడే తెలీకుండా జాగ్రత్తపడ్డారందరూ. నాలుగయిదు రోజులగ్గానీ తను మామూలు మనిషి కాలేకపోయింది. ఓ రోజు రాత్రి అన్నయ్య తనని పిలచి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.  

    చూడు ప్రసూ! నేను నీ స్నేహితుడిననుకొని చెప్పు! నువ్వు రమణని ఎందుకు పెళ్ళి చేసుకోవాలనుకొన్నావ్?"

    "ఇద్దరం ప్రేమించుకొన్నామన్నయ్యా!"

    "అంటే?"

    "ఏమిటంటే?"

    "ప్రేమంటే ఏమిటి?"

    తనకేం జవాబివ్వాలో తెలీలేదు. ఎంత ఆలోచించినా తట్టలేదు కూడా!

    "మాట్లాడవేం ప్రసూ!"

    "ప్రేమంటే చెప్పటం ఎలా? మనసులో అనిపించేదది.

    "ఏమనిపిస్తంది?"

    దీనికీ తానేమీ జవాబు చెప్పలేకపోయింది.

    'రమణా నువ్వూ ఇద్దరు ఒంటరిగా ఒకేచోట ఉండి కౌగలించుకోవాలని- వగయిరా వగయిరా... అంతేనా?"

    సిగ్గుతో తలవంచుకొంది తను.

    "జవాబు చెప్పాలి! సిగ్గుపడకూడదు! ముందే చెప్పాను కదా! నేనిప్పుడు నీ అన్నయ్యను కాదు! నీ స్నేహితురాలిని!...."

    అవునన్నట్లు తలూపింది తను.

    "ఇంకా నువ్ చూసిన సినిమాలలోగా - ఇంట్లో ఎదిరించి పెళ్ళి చేసుకోవడం" పెళ్ళయిన తరువాత కొంచెం కష్టాలూ - తరువాత కలకాలం సుఖం - ఇవేగా నీ మనసులో కలిగిన భావాలూ..."

    "అవును..." అంది తను కొంచెం ఆశ్చర్యంగా.

    "దీనిని ప్రేమ అనరు ప్రసూ! ప్రేమంచే వయససలు ఇదికాదు! ఈ వయసులో మనం అనుకోనేది ప్రేమ కాదు! డిజైర్! అంటే కోరిక! వాంఛ తెల్సిందా! ఈ వయసు కేవలం యవ్వనపు అనుభవాలు కోరుతుంది అంతే!రమణే కాదు! మరే కుర్రాడినయినా నువ్ వాంఛించవచ్చు! కాని ప్రేమ అలా కాదు. మరో మనిషిని సుఖపెట్టాలనుకోవడం అతను సుఖంగా ఉండాలని కోరుకోవడం - అది ప్రేమంటే! అంతగా ఆలోచించే పరిజ్ఞానం ఈ వయసులో ఎవరికీ ఉండదు. ఇదంతా సినిమా ప్రేమ. సరే! అదలా వదిలెయ్!

    రమణ సంగతి ఆలోచిద్దాం! వాడిని నువ్ పెళ్ళాడ్డానికి కావలసిన అర్హతలు వాడికేమీ లేవు! నీలాంటి అమ్మాయిలకిద్దరికి ఇలా ఉత్తరాలు రాశాడు. నీకు తెలీదేమో! వాడికి తాగుడు కూడా అలవటయిందని తెలిసింది. అలాంటివాడిని చేసుకొని జీవితమంతా దుఃఖమయం చేసుకుంటావా?"   

    తనేమీ జవాబివ్వలేకపోయింది. రమణ అంటే ప్రేమ పూర్తిగా తుడిచి పెట్టుకుపోకపోయినా, అతనంటే కొంతవరకూ ఆకర్షణ తగ్గింది ఆ మాటల్తో.

    ఆ యేడు తనూఅన్నయ్యతో పట్నం వెళ్ళింది. అక్కడే చదువు పూర్తిచేసింది. అన్నయ్య విలువయిన మాటల అర్థం. బి.ఏ. చదువుతొండగా తన కర్థమయింది. తర్వాత ఆయనతో ప్రేమ వివాహమయింది. ఈ ప్రేమలో పరిపూర్ణత ఉంది. రమణ సంగతులు చాలా రోజులవరకూ తనకు తెలుస్తూనే ఉన్నయ్. తన స్నేహితురాలు నీరజనే అతను పెళ్ళాడడం- కొద్దిరోజుల్తరువాత - నీరజనే అతనని వదిలేయటం - ఇద్దరిమధ్యా కొట్లాటలూ - కోర్టులో దావాలూ-

    ఓసారి తను ఊరు వెళ్ళినప్పుడు నీరజే కనబడి చెప్పింది. విపరీతమయిన తాగుడికి బానిస అయిపోయి ఆస్తంతా అమ్ముతూంటే తను చూస్తూ సహించలేకపోయిందట! అలాంటి వాడితో కలిసి ఉండటం కంటె విడిపోవటం మంచిదని నిర్ణయించుకొందిట... తనకప్పుడు అనిపించింది, అన్నయ్య దేముడిలా తన జీవితం కాపాడాడని!

    అలా చక్కగా నచ్చజెప్పటం ఎంతమందికి సాధ్యమవుతుందీ రోజుల్లో! ఇప్పుడు తన కూతురు సీతకి అలా చెప్పి ఒప్పించగలదా తనూ! ఊహు! తనకు నమ్మకం లేదు! అన్నయ్యే రావాలి! వచ్చి సీతకు నచ్చజెప్పాలి! వాడిలా మనసుకి నచ్చేట్లు ఎవరూ చెప్పలేరు! ఒకో మనిషికి భగవంతుడిచ్చే విద్య అది. కాగితం కలం తీసుకొంది ప్రసూనాంబ.

    "అన్నయ్యా..."

    చరిత్ర మళ్ళీ మొదలయింది. అంతమెలా అవుతుందో తెలీదు..."     

                                          * * * * *

 Previous Page Next Page