Previous Page Next Page 
లవ్ స్టోరీస్ పేజి 23


                                            మొదలయిన చరిత్ర

    "నేనూ ఆ అబ్బాయీ ప్రేమించుకొన్నాం..." తలొంచుకొని నెమ్మదిగా అంది సీత.

    ప్రసూనాంబ కొద్ది క్షణాలపాటు స్తంభించిపోయింది. కూతురి నడవడి గురించి కొంత అనుమానం కలిగించినా, అది వట్టి అనుమానంగానే మిగిలిపోతే బావుండునని వెయ్యిదేముళ్ళకు మొక్కుకొంటూ వచ్చింది. ఏదయితే జరక్కూడదనుకుంటుందో అదే జరుగుతోంది.

    గోడనానుకొని నిలబడ్డ కూతురివంక చూసిందామె.

    పదహారో సంవత్సరం అప్పుడే వచ్చిందామెకి. పాలబుగ్గలు, కాటుకకళ్ళూ బాల్యం తాలూకూ చిహ్నాలు ఇంకా పూర్తిగా పోనేలేదు. ఇంకా లంగా, జాకెట్టూ, గౌన్లతో తిరిగే అవతారమే కళ్ళముందు మెదుల్తోంది. దీనికప్పుడే ప్రేమా?

    విపరీతమైన కోపం వచ్చింది ప్రసూనాంబకి. ఆ పిల్ల చెంపమీద ఈడ్చి ఒకటి పెడదామని కూడా అనిపించింది. కాని ఎంతో కష్టం మీద నిగ్రహించుకొంది. విసురుగా కూతురిచేయి పట్టుకొని దగ్గరకు లాగింది. తూలిపడబోయి తల్లిని పట్టుకొని నిలబడిపోయింది సీత. గాభరాగానూ, భయంతోనూ తల్లి మొహంలోకి చూసింది.

    "పళ్ళు రాలగొడతాను! ఇంకా చిన్నపిల్లనే గదాని, ఇష్టమొచ్చినట్లు తిరగనిస్తోంటే ఇదా నువ్వు చేసే ఘనకార్యం?"

    ఆమె రౌద్రానికి సీత కళ్లవెంబడి నీళ్ళుతిరిగినయ్! రెండు చేతుల్తోనూ మొహం కప్పుకుని బిగ్గరగా ఏడ్చేయసాగింది.

    "నీలాంటి పాడుబుద్దులున్న దానిని స్కూలుకి పంపటం కూడా అనవసరం! ఇవాళ్టి నుంచి స్కూలు మానేసి ఇంట్లో పడుండు..."

    సీత విలపిస్తూ అక్కడే కూలబడిపోయింది.

    గదిలోకెళ్ళి మంచంమీదకు వరిగిపోయింది ప్రసూనాంబ.

    ఆమె మనసంతా పూర్తిగా పాడయిపోయింది.

    గుండెలింకా వేగంగా కొట్టుకోవడం తగ్గలేదు. హఠాత్తుగా రమణ గుర్తుకొచ్చాడామెకి ఒళ్ళంతా జలదరించినట్లయింది.

    "జామకాయలు కావాలా?" రమణ అడిగాడు.

    "ఎక్కడివి?"

    "నీకెందుకు? నాతో రా!"

    వెర్రిగా అతని వెంబడి పరిగెత్తింది తను.

    దాసుగారి తోటలో తనను బయట నుంచోబెట్టి అతని గోడెక్కి జామకాయలు కోయసాగాడు. నాలుగయిదు కాయలు కోసేసరికల్లా తోటలో ఎవరివో కేకలు వినిపించినయ్! తోటమాలి పరుగుతో వచ్చి రమణను పట్టుకున్నాడు. తను పరుగుతో ఇంటిదగ్గరకొచ్చేసింది. రమణ ఎమయ్యాడో, తోటమాలి బాగా కొట్టేడేమో అని తనకి ఆత్రుతగానే ఉంది. ఆ నాలుగురోజులూ స్కూల్లో కూడా కనిపించలేదు. ఆరోజు ఇంటర్వల్ లో తను స్కూల్ ఆవరణ బయట ఉన్న పుస్తకాల షాపుకెళ్ళి నోట్ పుస్తకం కొనుక్కొస్తూంటే ఎదురుపడ్డాడు.

    "ఏయ్ రమణా!" ఆదుర్దాగా పిలిచింది తను.

    "ఏమిటి?"

    "ఆ రోజేమయింది? ఎక్కడకు పోయావిన్నాళ్ళూనూ?"

    గట్టిగా నవ్వాడు రమణ.

    "ఎక్కడికేముంది. నీ తలకాయ! తోటమాలి నన్ను పట్టుకుపోయి మా అమ్మకు రిపోర్ట్ చేశాడు. మా అమ్మేమో గదిలోపడేసి తలుపులు మూసేసి నాన్నరానీ నీ సంగతి చెప్తానంది. దాంతో నా క్కొంచెం భయం వేసింది. నాన్నతో చెప్తే నాన్న బొమికలిరిగేట్లు కొడతారు. అంచేత మధ్యాహ్నం మా అమ్మ తలుపు తీయగానే బయటకు పరుగెత్తాను. సరాసరి వెళ్ళి రైలెక్కేశాను..."

    "ఎక్కడికి?" ఆశ్చర్యంగా అడిగింది తను.

    "ఎక్కడికేమిటి? వల్లూరు! మా తాతయ్య వాళ్ళింటికెళ్ళి నాలుగు రోజులూ దర్జాగా, హాయిగా ఉన్నాను.

    "చివరకు నిన్న మా నాన్న వచ్చి బ్రతిమాలి తీసుకొచ్చాడు"

    తనకు సంతృప్తి కలిగింది.

    బెల్ అవడం మూలాన పరుగుతో స్కూల్ కి వెళ్ళిపోయింది తను.

    తరువాత కొద్దిరోజులకే వేసవికాలం సెలవులొచ్చేసినయ్! సెలవుల్లో రమణ బెజవాడ వెళ్ళివచ్చాడు. అక్కడ వాళ్ల పిన్ని వాళ్లున్నారట. వచ్చిన తరువాత బెజవాడ టౌన్ సంగతీ, అక్కడ సినిమాల సంగతి చెప్తోంటే తనకు ఎంతో సరదాగా ఉండేది వినడానికి. మరో సంవత్సరం కూడా గడిచిపోయింది. రమణలో రాన్రాను చాలా మార్పులు వచ్చినయ్. ఒక్కడే కొడుకవడం వల్ల అతని తల్లిదండ్రులు అతనేమడిగితే అది కొనివ్వడం జరుగుతూండేది. ఎప్పుడూ ఖరీదయిన దుస్తులూ, కొత్త ఫాషన్లూ- అన్నీ తమ స్కూల్ లో రమణే ప్రారంభం చేసేవాడు.

    ప్రక్క ఊర్లో సర్కస్ వచ్చిందోసారి. అమ్మానాన్నా, తనూ బయల్దేరారు ఎడ్లబండిలో సర్కస్ కి. అన్నయ్య అప్పటికే పట్నంలోని కాలేజీలో చేరిపోయాడు.

    సర్కస్ లో తమముందే కూర్చుని కన్పించాడు రమణ.

    "ఒక్కడివే వచ్చావా?" అడిగింది అమ్మ.

    "అవునండీ!" అన్నాడు రమణ తన వంకచూసి నవ్వుతూ!

    తనకు బోలెడు సంతోషం కలిగింది. తిరిగి వెళ్ళేప్పుడే సరదాగా రమణతో కబుర్లు చెప్తూ వెళ్లొచ్చని! సర్కస్ వదిలేసరికి పదిదాటింది. బండికట్టుకొని ఇంటికి బయల్దేరారందరూ. మాంఛి వెన్నెల! ఇసుకరోడ్డు మీద బండి వెనుకనే నడుస్తున్నాడు రమణ.

    "నేనూ నడుస్తానమ్మా!" అంది తను.

    తల్లి ఒప్పుకుంది.

    ఇద్దరూ బండికంటె ముందుగా కబుర్లు చెప్పుకొంటూ నడువసాగారు.

    తమ ఊరి పొలిమేరల్లో కొచ్చేసరికి బండి చాలా వెనుకబడి పోయింది. తంగేడు గుబుర్ల నీడల మధ్యగా నడుస్తున్నారు.

    "ఓ నిమిషం ఆగు...." అన్నాడు రమణ.

    "ఏమిటి?" ఆగిపోయి అడిగింది తను.

    "దగ్గరకు రా..."

    తను దగ్గరకు వెళ్ళింది.

    ఛటుక్కున కౌగిలించుకొని పెదాలమీద ముద్దు పెట్టుకున్నాడు రమణ. ఒళ్ళంతా కాలిపోతున్నట్లనిపించింది తనకి. శరీరంలో ఏదో జరుగుతోంది కాని ఏం జరుగుతుందో తెలీటం లేదు.

    "ఛీ! ఏమిటిది?" అంది తను దూరంగా జరుగుతూ.

    "ముద్దు! మా తాతయ్యగారింటి దగ్గరున్నప్పుడు ఓ అమ్మాయి నేర్పించింది. ఇంకా చాలా ఉందిలేగాని, అదంతా తర్వాత చెప్తాను..."

    మళ్ళీ ఓసారి తనకేసి గట్టిగా అదుముకొని ముద్దుపెట్టుకొన్నాడతను. సిగరెట్ వాసన గుప్పుమంది. ఈలోగా దగ్గరగానే బండివస్తున్న చప్పుడవడంతో మళ్ళీ ఇద్దరూ నడక సాగించారు.

    మరో రెండు మూడు నెలల వరకూ అతని జాడ తెలీలేదు తనకి. ఈలోగా అతన్ని కలుసుకోవాలని ఎంతో ప్రయత్నించింది తను. ఎందుకో అతనంటే ఓ విధమయిన ఇష్టం కలిగింది తనలో. ఆ రోజు ముద్దుపెట్టుకొన్న తరువాత తనకు తెలీకుండానే అలాంటి అనుభవం తిరిగి కోరుకోసాగింది తన మనసు.

 Previous Page Next Page