"ఏమంటావు వామన్?"
వామన్ గొంతు పెగలించుకున్నాడు.
"వద్దు భాస్కర్! ఈ దేశంలో అంత గొప్ప వైద్యం జరగదు! నువ్వు విదేశాలకు వెళ్ళి..."
"నీకు తెలుసుగా వామన్! అక్కడి డాక్టర్లను కన్సల్ట్ చెయ్యటం జరిగింది. తగ్గుతుందని నిశ్చయంగా ఎవరూ చెప్పలేకపోయారు. ఆపరేషన్ కు ప్రయత్నిస్తే....అయితే బాగవుతుందని, లేదా ప్రాణాలు పోతాయన్నారు...అందుకు సిద్దపడితేనే ఆపరేషన్ చేస్తామన్నారు. దేశం కాని దేశంలో నా అనేవాళ్ళు లేకుండా చావాలని లేదు!"
"అక్కడివాళ్ళే అలా చెప్పినప్పుడు"
"అదేం మాట వామన్! విదేశాలలో ఉన్నంత మాత్రాన అందరూ గొప్పవాళ్ళని....మన వాళ్ళయినంత మాత్రాన ఎందుకూ పనికిరాని వాళ్ళని అనుకోవాలా? నేను పేపరులో చదివిన కేస్ అంతా నా కేస్ లాగానే ఉంది. ప్రయత్నించు. పోనీ, ప్రాణస్నేహితుడి చేతుల్లో చచ్చిపోయాననే సంతృప్తి అయినా దక్కుతుంది."
చలి జ్వరం వచ్చినట్లు వణికాడు వామనమూర్తి....భాస్కరరావు చెప్పింది నిజమే! ఇదివరలో వచ్చిన కేస్ భాస్కరరావు కేస్ లాంటిదే! అది టి.బి.కి సంబంధించినదని అనుమానించిన వాడు విక్రమ్! ఆపరేషన్ చేఇస్నవాడు విక్రం. ఆ రోజు అతను ఆపరేషన్ చేస్తోంటే సరిగ్గా అటెండ్ కూడా కాలేదు తను....ఆ రోగి బంధువులకు....వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు....ధైర్యం చెప్పటంలో మునిగిపోయాడు.
"భాస్కర్! ఎంతయినా ఇది రిస్క్ తీసుకోవటమే అవుతుంది. పోనీ"
"ఫరవాలేదు వామన్. ఇలా జీవచ్చవంలా మంచంలో పడి ఉండటం కంటే చావటమే మంచిది. అయినా నీలో నాకు విశ్వాసం ఉంది. నువ్వు నన్ను బ్రతికిస్తావు. నేను చావను."
ఎంత ప్రయత్నించినా వామనమూర్తి తనను తను నిగ్రహించుకోలేక పోయాడు. ఇతరుల దగ్గర చెప్పినట్టు అతని దగ్గర "ఏం ఫరవాలేదు. నయమయిపోతుంది" అనలేకపోయాడు.
"అయామ్ సారీ భాస్కర్! ఈ పని నా వల్ల కాదు" అనేశాడు. అలా అనటానికి ఎంతో కష్టపడవలసి వచ్చింది.
అయినా భాస్కరరావు కోసం...తాను నిజంగా అభిమానించే ఒకరిద్దరు వ్యక్తులలో ఒకడయిన భాస్కరరావు కోసం....ఎన్నడూ తాను మాట్లాడని ధోరణిలో మాట్లాడేశాడు.
భాస్కర్ విస్తుపోయి చూశాడు.
"వామన్! నీ మనసులో ఏముందో స్పష్టంగా చెప్పు"
"నువ్వు సుఖంగా ఉండాలని తప్ప మరేమీ లేదు!"
"అయితే ఆపరేషన్ చెయ్యటానికి ఒప్పుకునేవాడివి!"
"ప్లీజ్ భాస్కర్! అర్ధం చేసుకో. నేను..."
"నువ్వు డబ్బు మనిషివని నాకు తెలుసు. మన స్నేహాన్ని బట్టి నీకేమీ ఇయ్యననుకుంటున్నావా? నాకు నయమయితే నీకు రెండు వేలు బహుమానంగా ఇస్తాను చాలా"
వామనమూర్తి గడ్డకట్టుకుపోయాడు. అతనికి మాటలు కరువయ్యాయి.
"వామన్! సే యస్ ప్లీజ్"
వామనమూర్తి బరువుగా ఊపిరి పీల్చి వదిలాడు.
"ఆల్ రైట్!"
ఆ రాత్రి వామనమూర్తి కంటికి కునుకురాలేదు. కన్ను మూయగానే భాస్కర్ దీన స్వరూపం కళ్ళ ముందుకు వచ్చి ఉలికిపడి లేచి కూచునేవాడు. ఆ నరకం భరించలేక కొట్టుకుపోతున్న సమయంలో మనసులో తళుక్కున మెరిశాడు విక్రం.
విక్రమ్ సమర్ధుడని ఒప్పుకోవలసిరావటం....అది ఒక్క భాస్కర్ ముందైనా సరే, ఎంత కష్టం! అయినా భాస్కర్ కు విక్రమ్ గురించి చెప్పటానికే నిర్ణయించుకున్నాడు.
"భాస్కర్! డాక్టర్ విక్రమ్ అని గొప్ప డాక్టర్ ఉన్నాడు" అంటూ మొదలు పెట్టబోయాడు.
భాస్కర్ పకపక నవ్వాడు.
"ఈ మంచంలో పడి ఉన్నంత మాత్రాన నాకేమీ తెలియదనుకున్నావా? ఆ గొప్ప డాక్టర్ గురించి అంతా విన్నాను. మీరంతా మంచి పనిచేశారు. నిండు ప్రాణాలతో అలా నిర్లక్ష్యంగా ఆడుకోగలిగే నీచులు వైద్య వృత్తిలో ఉండటం సంఘానికి ఎంత అపకారం! ఏదో రీసెర్చ్ చేస్తున్నాడటగా! ఎలా చెయ్యనిస్తున్నారు?"
వామన్ గొంతు పొడారిపోయింది.
"కానీ అతడు చాలా గొప్పవాడు. నిజంగా తెలివైనవాడు!"
"ఎంత స్నేహితుడైనా అంతగా పొగడకు! ఎందుకో అతడిని తలచుకుంటే కోపంగా ఉంది!"
ఇంక మాట్లాడటానికి వామన్ కేమీ మిగలలేదు. చివరి ప్రయత్నం చెయ్యబోయాడు.
'భాస్కర్! నా మాట విను! డబ్బు కలవాడివి. నువ్వు విదేశాలకు వెళ్ళి..."
భాస్కర్ అడ్డు తగిలాడు.
"వామన్! ఇంక అడ్డు చెప్పకు! ఏదో అపశకునంలా ఉంటుంది. భగవంతుని మీద భారం వేసి ఆపరేషన్ చెయ్యి. ఇంత పేరు ప్రఖ్యతహులు సంపాదించుకున్న నువ్వే చెయ్యలేకపోతే ఎవరు చెయ్యగలరు?"
లాభం లేదు. ఏ మాత్రం లాభం లేదు! "భగవంతుడి మీద భారం వేసి" సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు! ఇంక అదే మిగిలింది!
మిసెస్ కామేశ్వరీదేవి పూజా మందిరంలోని విగ్రహానికి కొబ్బరికాయకొట్టి గోల్డ్ మెడల్ మీద పేరు ప్రఖ్యాతుల్ని పదును పెట్టి ఆపరేషన్ చెయ్యవలసిందే!
ఆపరేషన్ చేశాడు వామనమూర్తి.
భాస్కరరావు చచ్చిపోయాడు.
వామనమూర్తి పదిరోజులు సెలవు పెట్టాడు. తన గదిలో కూచుని గది తలుపులు మూసేసుకున్నాడు. భరింపరాణి ఆకలి వేసినపుడు బయట కొచ్చి ఏదో తినటం.....మళ్ళీ గదిలో కూచుని గది తలుపులు మూసేసుకోవటం-ఎవరో గది తలుపులు కొట్టారు. వామనమూర్తి తెరవలేదు. మరింత గట్టిగా బాదారు. వామనమూర్తి తలుపులు తెరిచాడు.