Previous Page Next Page 
మిస్ మేనక ఐ. పి. యస్. పేజి 23


    "చెప్పు " దిగంతాలదాకా చూస్తూ అన్నాడు.


    
     "నేను..." బాధని, దుఃఖాన్ని జయించడానికి విశ్వప్రయత్నం చేస్తూంది. " నువ్వు మలిచిన మేనకని."

 

    "థాంక్స్!"

 

    "నాకు కావలసింది అభినందన కాదు."

 

    నిశ్శబ్దం.....

 

    " నీతో జీవితాన్ని పంచుకోవడం."

 

    "కాదనలేదే?" నూతిలోలా వినిపించింది  మిత్ర కంఠం.

 

    " అనలేదు మిత్రా! కాని నేను నీ భార్యని కావాలీ అంటే  నువ్విలా బదకకూడదు."  ఓ నీటి బొట్టు ఆమె కనుకొలకుల్లో నిలిచింది. "నువ్వు చట్టాన్ని తప్పుదోవన పట్టించగల సమర్ధుడివి  కావచ్చు. కాని నేను సహించలేని విషయం అది."

 

    " నో! ఉద్విగ్నంగా అతన్ని సమీపించింది . "నువ్వు మారాలి."

 

    " అసంభవం!"

 

    " మిత్రా.... నేను లేకుండా నువ్వు...."

 

    "బ్రతకలేనేమో కాని బ్రతుకునిలా కొనసాగించగలను."

 

    " దానికి నువ్వే పేరు పెట్టినా అభ్యంతరం లేదు"

 

    " ఎంత రాక్షసుడివి నువ్వు?"

 

    "అలా మార్చారు. దానికి కారణం  నీ  డిపార్ట్ మెంటే"

 

    "డిపార్టుమెంట్ కాదు మిత్రా. అందులో ఒకడు. కాని అందరూ అలాంటివాళ్ళే అని   ఎందుకు జనరలైజ్ చేసి ఆలోచిస్తావు?"

 

    "ఇప్పటికైనా ఆలస్యం కాలేదు."

 

    " మిస్ మేనకా!" మిత్ర గొంతులో ఇప్పుడు మునుపటి మెత్తదనం లేదు.  "ఈ విషయంలో చర్చ అనవసరం. నేను కావాలీ అనుకుంటే నువ్వు  దారిలోకి పెట్టాలి."

 

    "అంటే?"

 

    " మిత్రా!" స్థాణువై చూసింది  "నేను  ఏం తప్పుచేశానని?"

 

    "ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది తప్పు ఒప్పుల సమస్య గురించి కాదు."


 
    " నేను కాకపోయినా మరో వ్యక్తి ద్వారా అయినా నీకు శిక్ష పడుతుంది."

 

    "తప్పించుకునే మార్గాలు చాలా వున్నాయి మేనకా!"

 

     అతని మొండితనానికి కళ్ళనీళ్ళ పర్యంతమవుతూంది. "తప్పుని అందమైన తర్కంతో ఒప్పుగా చెప్పొచ్చు తప్ప, చట్టాన్ని ఒప్పించలేవు."

 

    "బుల్ షిట్. ఇది చెప్పటానికి నీ అనుభవమెంతని?"

 

    "తర్కం నేరస్తుల్ని సృష్టింస్తుంది? చట్టం ఆ  నేరస్తుల్ని శిక్షిస్తుంది."

 

    " ఏడాది ఐ.పి.ఎస్. ట్రైనింగ్  నువ్వు నేర్చుకున్నది అణువంత మేనకా"

 

    "అంతకుముందు నీ దగ్గర చాలా నేర్చుకున్నాను."

 

    " ఆ గౌరవమే ఉంటే నా మార్గానికి అడ్డురాకు!"

 

    " వస్తాను"  మిస్సైల్లా గొంతునుంచి దూసుకొచ్చిందా పదం. "చట్టానికి ప్రతినిధిగా నీకు అడ్డంపడతాను. నిన్ను  సంస్కరించడానికి సిద్ధపడతాను."

 

    ఫకాలున నవ్వాడు.

 

    " నవ్వకు మిత్రా!" రోషంతో కంపించిపోయింది " నేనేమిటో నిరూపిస్తాను."

 

    " ఓ జీవితకాలం లేటుగానా ?"

 

    " కాదు" కసిగా అరిచింది.   "మూడునెలలు... కేవలం మూడు నెలల వ్యవధిలో నీకో అద్బుతమైన గుణపాఠం చెబుతాను."

 

    హఠాత్తుగా నిశ్సబ్దం ఆవరించింది.

 

    " అంటే"?   మిత్ర గొంతులో అహం, స్వాతిశయం. నన్ను చట్టానికి పట్టిస్తానంటావు?"

 

    " ఎస్!"

 

    " అదీ మూడు  నెలల్లో " వ్యంగ్యంగా అన్నాడు.

 

    "అవును"

 

    కొనగలిగే బేరసారాన్ని ఓ స్థాయిదాకా కొనసాగించవచ్చో తెలిసిన మిత్ర  నెమ్మదిగా ఆమె ముందుకు నడిచాడు  " నువ్వు ఓడితే?"

 

     "చేతకాని చట్టాన్ని పట్టుకుని వేలాడను. జాబ్ రిజైన్ చేస్తాను. నీ భార్యగాకాదు, నీ బానిసగా ఊడిగం చేస్తూ నీ వ్యవస్థలో బ్రతుకుతాను" స్ఠిరంగా అంది. " ఒకవేళ నిన్ను నేను నేరస్థుడిగా నిరూపించగలిగితే?"

 

    " నీ  నమ్మకానికి తల  ఒగ్గుతాను నా నమ్మకం తప్పని తెలుసుకుని శిక్షకి  సిద్ధపడతాను.

 

    ఓ  ఛాలెంజ్ లా ఇద్దరిచేతులా కలుసుకున్నాయి.

 

     మేనక కదిలింది పోరాటానికి సన్నద్ధమవుతున్నట్టుగా.

 

     సన్నని  వర్షపు జల్లులో నిలబడ్డ విశ్వామిత్ర సముద్రధగర్భంలోకి చూస్తున్నాడు. నిశ్శబ్దంగా అతని పాలభాగంపైన స్వేదం పేరుకుంది.

 

     అపరాత్రి దాటేక ఇంటికి రాలేకపోయాడు మిత్ర. చాలా రోజుల తరువాత మనసు బారమయిపోయింది. త్రికరణశుద్ధిగా ప్రేమించిన మేనకతో ఇలాంటి పోరాటం అతనూహించనిది. అయినా తను సిద్ధమే. ఏ  నమ్మకాన్ని కసితో జీవిత ధ్యేయంగా మార్చుకున్నాడో, దాన్ని ప్రేమకోసం బలిచేయడు.... చేయలేడు!

 

     అవినీతి సాగరంలో అడుగుపెట్టి   ఓ నీటిబొట్టు మేనక. తనే సాగరమన్నంత ధీమాగా మాట్లాడుతుంటే గట్టిగా ఎదుర్కోవాలని నిర్దారణకు వచ్చాక ఇంటికి వచ్చాను.

 

     అన్యమనస్కంగా తల్లిగదిలో అడుగుపెడుతూ చూశాడు.


    
     అప్పటికే అమ్మకి అన్నం తినిపించిన వనిత మాత్రవేసి నీళ్ళు తాగిస్తూంది.


    
     ఇది తొలిసారికాదు. చిత్రంగా ఆమెకలా సేవచేయటం వనిత దినచర్యలో ఒకటిగా మారిపోయింది.

 

    ఒక షాక్ లో మతి భ్రమిచిన  అమ్మ మరొకరి సాయంతో తప్ప ఏపనీ చేసుకోలేని పరిస్థితిలో మిగిలిపోయింది.

 

    అలాగే నిలబడ్డాడు అరనిముషంపాటు.


    
     ట్రాంక్విలైజర్ పనిచేస్తున్నట్టు అమ్మ మసకగా కళ్ళు మూసుకోగానే అప్పుడు బెడ్ పైనుంచి లేచిన వనిత ప్లెట్ తో బయటికి వస్తూ చూసింది మిత్రని.

 

     హాలులోకి వస్తూ  ప్లెట్ ని డైనింగ్ టెబుల్ పైన ఉంచి " చాలా రాత్రి అయ్యింది  మిత్రా!  భోజనం చేయండి" అంది సాలోచనగా చూస్తూ.

 

     " ఏం?"

 Previous Page Next Page