"మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి పని మీద ఎక్కువ ఏకాగ్రత వుంటుందని నిరూపించావమ్మాయ్. నేను నీ గురించి అనడంలేదు" అని చీఫ్ అంటుండగా ఫోన్ మోగింది. ఆయన అందుకుని మాట్లాడి...... "నీకు మీ నాయనమ్మ" అన్నాడు ప్రతిమతో.
"నాయనమ్మకు కూడా ఇంటర్ పొల ఫోన్ నెంబర్ ఇచ్చావా.....?" అన్నాడు నేత్ర. "మొగాళ్ళకన్నా ఆడాళ్ళకి ఇంటి మీద ఎక్కువ ఏకాగ్రత వుంటుందని నిరూపించావు."
అతడిని తినేసేలా చూస్తూ ప్రతిమ ఇబ్బందిగా ఫోన్ అందుకుని "నాయనమ్మా..... ఇది సీక్రెట్ ఫోన్. ఎంతో అవసరమైన పరిస్థితి వస్తే తప్ప వాడకూడదు. ఏమిటి విషయం చెప్పు" అంది చిన్న గొంతుతో.
అటునుంచి నాయనమ్మ" నీమొహం...... అవసరం ఏమిటి...... అనవసరం ఏమిటి......? డిప్టీ తాసిల్దారుగా వున్నప్పుడు మీ తాతగారు 'సాయంత్రం కూరేమిటి' అని అడగడానికి ఆఫీసు ఫోన్ ఉపయోగించేవారు తెలుసా.....?" అంది తీరిగ్గా మాట్లాడే కార్యక్రమానికి మొదటి అధ్యాయాన్ని ప్రారంభిస్తూ-
"ఇక్కడ మేం దేశ భద్రతకి సంబంధించిన అత్యవసర సమావేశంలో వున్నాం నాయనమ్మా, విషయం ఏమిటో త్వరగా చెప్పు " కోపాన్ని అణచుకుంటూ అంది.
"స్టీలు సామాన్లు వాడొచ్చాడమ్మాయ్. మొన్న చీర ఎక్కడ పెట్టావ్.....?"
ప్రతిమ మొహం ఎర్రటి పెనంలా తయారైంది. నేత్ర ఓరగా చూస్తున్నాడు. అతి కష్టం మీద కోపం దిగమింగుకుని. "అది అడగడానికి సమయం ఇప్పుడా నాయనమ్మా.....?" అంది.
"వాడి దగ్గర ఓ గిన్నె బావుందే. అచ్చు అటాంటి గిన్నెలోనే మీ తాతగారు నా చేత ముద్దలు కలిపించుకుని తినేవారు. ఆయన పోయాక......" అంటూ ఏడుపు మొదలు పెట్టింది. ప్రతిమ కంగారుపడి "వద్దు నాయనమ్మా.... తాతగారు నీతో కలిసి దేంట్లో ఏం చేసేవారో - ఆ పురాణం విప్పకు. చీర నా బీరువాలో వుంది- తీసుకో" అని చెప్పబోయి, "కాని అందులో చాలా ఇంపార్టెంట్ పైలుందే. నే వచ్చి ఇస్తాలే" అంది సందిగ్ధంగా.
"అప్పటివరకూ ఆ గిన్నెలవాడు వుండడే."
"ఉండకపొతే పొమ్మను. అది చాలా ముఖ్యమైన ఫైలు."
"ఏమిటి ముఖ్యం.....? చేస్తున్నావులే బోడి వుద్యోగం. మీ తాతగారు డిప్టీ తాసిల్దారుగా చేసే రోజుల్లో కూడా 'వసుంధరా...... తాళాలివిగో' అని నాకే ఇచ్చేవారు. ఈరోజు ఆయన పోయాక నా ప్రారబ్ధం ఇలా కాలింది. ఆ స్టీల్ గిన్నెలో మీ తాతగార్ని చూసుకుందామనుకున్నాను. నా బ్రతుకు....."
"వద్దు నాయనమ్మా..... తాళం చెవి గోడ గడియారంలో వుంది. తీసుకో! ఫైలు జాగ్రత్త. బీరువా లెక్కకు. అసలే నీకు నడుము మాటి మాటికీ పట్టేస్తుంది!" అంటూ ఫోన్ పెట్టేసింది. అటు నాయనమ్మ కూడా ఫోన్ పెట్టి, స్టూల్ బీరువా దగ్గిరకు లాగింది.
జాగ్రత్తగా స్టూలు ఎక్కి గడియారం లోంచి తాళం తీసుకుని, బీరువా తెరిచి అందులో నుంచి చీర తీసుకోబోయింది. చీరపైన సీక్రెట్ ఫైలుంది. బీరువా పక్కనే వాటర్ ప్యూరిఫయర్ వుంది. దానిపై మూతలేదు. ఆవిడ ఫైలు ఎత్తి, చీర తీస్తుండగా అందులో నుంచి ఒక కవర్ జారి నీళ్ళలో పడింది. ఆవిడ చూసుకోలేదు. నేత్ర జీవితంలో ఒక చరిత్రాత్మక మార్పుకు ఆ సంఘటన మూల కారణమైంది.
* * *
ప్రతిమ వచ్చి కూర్చుని ఏదో మాట్లాడబోయేంతలో నేత్ర "ఏమిటి......? ఇంటి నుంచి ఏదో ఫోన్ వచ్చినట్టుంది.....? ఏమిటంత అర్జంటట....?" అని క్యాజువల్ గా అడిగాడు.
"ఏమీ లేదు"
నేత్ర చీఫ్ వైపు తిరిగి "తోటలో ప్రయోగశాలని నేను కనుక్కోగానే దాన్ని రహస్యంగా నారాయణపేటకు మార్చారు. అంత ఖరీదైన అండర్ వాటర్ లాబ్ అంటే...... బహుశా ఇదంతా మనం అనుకునేటంత చిన్న విషయం అయ్యుండదు. క్యూ కూడా ఇందులో వున్నాడు కాబట్టి తప్పకుండా శత్రుదేశం సహాయం వుండి వుంటుంది" అన్నాడు.
"పోనీ రేఖని అరెస్ట్ చేస్తే.....?" అంది ప్రతిమ. చీఫ్ అడ్డంగా తలూపుతూ "ఏం కేసు పెడతాం.....? కావాలంటే ఆ చెరువు ఎస్.బి.ఆర్. ది కాబట్టి అతన్ని అరెస్టు చెయ్యవచ్చు. దానివల్ల మన సమస్య తీరదు" అన్నాడు. ఇద్దరూ ఆలోచనలో పడ్డారు.
ప్రతిమ మరోసారి గిల్టీగా ఫీలయింది. 'ఇదంతా నా మూలానే' అనుకుంది. నారాయణపేట్ వెళ్ళేముందు చీఫ్ కి గాని, చెరువులో దిగే ముందు 'యాదగిరి' కి గాని చెప్పి వుంటే సమస్య ఇంతవరకూ రాకపోవును.
వాళ్ళిద్దరి నిశ్శబ్దం ఆమెని మరింత ఇబ్బందిలో పడేసింది. పేపర్ వెయిట్ కేసి నిర్వేదంగా చూడసాగింది. అంతలో ఆమె తలలో ఏదో ఫ్లాష్ వెలిగినట్టయింది. "ఐడియా" అంది. ఆమె కళ్ళు ఉద్వేగంతో మెరుస్తున్నాయి. ఆ ఆలోచన రాగానే అప్పటివరకూ వున్న టెన్షన్ పోయింది. "వచ్చేసింది...... ఆలోచన వచ్చేసింది" అంది.
"ఏమిటి" అన్నాడు చీఫ్.
నేత్ర ఆమెవైపు కుతూహలంగా చూస్తున్నాడు.
ఒక్కసారిగా తనకొచ్చిన ప్రాముఖ్యతకి ఆమె పొంగిపోయింది. ముందుకి వంగి, ఒక సర్వసైన్యాధికారి యుద్ధ వ్యూహం గురించి మిగతా వారికి బోధిస్తున్న రీతిలో "ఆ రహస్యం బయట పడడానికి ఒకే మార్గం వుంది. సర్పభూషణరావు కూతురిని ట్రాప్ చేయడం" అంది.
ఆ గది ఒక్కసారిగా నిశ్శబ్ధం అలుముకుంది. ఆమె చెబుతున్న దేమిటో వాళ్ళకు వెంటనే తెలియలేదు. ఇద్దరూ ఆమెవైపు అర్థం కానట్టు చూశారు. ప్రతిమ ఆ ఇద్దర్నీ చూస్తూ మరింత ముందుకు వంగి, "ఆ అమ్మాయి పేరు రేఖ. ఆర్నెల్లు కష్టపడి నేను సర్పభూషణరావు గురించి తయారుచేసిన ఫైల్లో ఆ అమ్మాయి గురించి ప్రసక్తి కూడా వుంది. ఫైలు చదివితే తెలుస్తుంది" అంది హుషారుగా.
"ఫైళ్ళు చదవడాలు, నోట్లు పుటప్ చెయ్యడాలు మనకి సరిపడవు గాని, విషయం సరిగ్గా చెప్పు" అన్నాడు నేత్ర.
"రేఖ ఏదో ప్రాజెక్టులో నిమగ్నమై వుంది. మత్తు పదార్థాల అలవాటుంది. సొసైటీ అంటే కేరెపిన్ లా వ్యవహరిస్తుంది. అందమైన మొగవాళ్ళంటే విపరీతమైన పిచ్చి. సర్పభూషణరావు రహస్యాలన్నీ దాదాపు ఆమెకు తెలుసు. ఆమెనుంచి రహస్యాలు రాబట్టే ఏకైక ఒకే ఒక సాధనం అందమైన మొగతనం. అది మన ఏజెంట్ నేత్ర దగ్గర వుంది" అంటూ నవ్వింది ప్రతిమ.
"యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ ....... తండ్రి రహస్యాలు కనుక్కోడానికి కూతుర్ని ట్రాప్ చెయ్యాలా.....?" అన్నాడు నేత్ర.
"తప్పేముంది.....? శత్రు సైనికుడు దొరికితే రహస్యాలు రాబట్టు కోవడం కోసం చిత్ర హింస పెట్టడం లేదూ....? ప్రాణాలూ తియ్యడం లేదూ.....?"