అనామిక ఆర్డ్స్ అండ్ సైన్స్ కాలేజ్, బియస్సీ మూడో సంవత్సరం క్లాస్ అది. ముప్ఫయి ఎనిమిదేళ్ళ పెళ్ళికాని లెక్చరర్...... పిల్లలు ఎలా పుడతారో హుషారుగా చెప్పుకుపోతోంది.
".....అండ్ దజ్ ది ఫిజికల్ యాక్షన్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమన్ కంప్లీట్స్ ది స్పెర్మ్ విచ్ హ్యాజ్ గాట్ ది కెపాసిటీ టు స్విమ్, ట్రావెల్స్ అండ్ రీచెస్ ది ఓవమ్ విత్ దిస్ ది ఓవమ్ స్లోలీ టర్న్స్ ఇన్ టూ ఎమ్ బ్రియో అండ్ గివ్స్ బర్త్ టు ఏ బేబీ దట్స్ హౌ రిప్రోడక్షన్ టేక్స్ ప్లేస్."
బెల్ మోగగానే స్టూడెంట్స్ లేచారు. క్లాస్ మేట్స్ తో కలిసి దార్లో వస్తుంటే హంసలేఖ అన్నది. "మేడమ్ చెప్పింది నాకొక్క ముక్క అర్థంకాలేదు".
అరుణ ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఒక్క ముక్క అర్థంకాలేదా..... అంది.
"స్పెర్ము..... ఎంబ్రియో..... ఉహూ..... నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు హంసలేఖ దిగులుగా అంది.
"నీకెన్నేళ్ళే.....?"
"ఇరవై ఒకటి ఏం.......?"
"ఇరవై ఒక్కేళ్ళొచ్చాయి. పిల్లలెలా పుడతారో తెలీదా?"
"ఉహూ....."
ఇద్దరూ అరుణ రూముకి చేరుకున్నారు. అరుణ హాస్టల్ లో వుంటూంది.
"థర్డ్ ఇయర్ బియస్సీ చదువుతున్నావు. పిల్లలెలా పుడతారో తెలీదంటే నవ్వుతారు. అఫ్ కోర్స్ ..... మా అక్కయ్యకు కూడా పెళ్ళయిన మూడో రోజు వరకూ తెలీలేదట్లే. అన్నట్టు శోభనం అంటే తెలుసా కనీసం.....?"
"మంచానికి పూలూ అవీ కడతారు అదేనా.....?" హంసలేఖ అడిగింది. ఆ వయసులో వుండే సహజమయిన కుతూహలం ఆ ఇద్దరి అమ్మాయిల్లోనూ కనపడుతుంది. ఒకళ్ళకి వినాలని, మరొకళ్ళకి చెప్పాలని.
"ఆ - అదే" అంది అరుణ.
"శోభనానికీ పిల్లలు పుట్టడానికి సంబంధం ఏమిటే? పూలు కట్టిన మంచం మీద పడుకుంటే పుడతారా?"
"నీ మొహం. చాప మీద నిలబడ్డా పుడతారు" అంటూ అరుణ దగ్గిరగా వచ్చి రహస్యం చెపుతున్నట్టు "అదే .... ఆరోజు మొగుడు పెళ్ళాన్ని గట్టిగా నోటిమీద ముద్దు పెట్టుకుంటాడు. ఆ ముద్దుతో కడుపోస్తుందన్న మాట. అర్ధమైందా పిచ్చి మొహవాఁ.....?" అంది.
హంసలేఖ అర్థమయినట్టు తలూపింది. గోడమీద కేలెండర్ లో మర్ఫీ కుర్రాడు ఇద్దరి వైపూ నవ్వుతూ చూస్తున్నాడు.
"ఫస్టు క్లాస్ స్టూడెంట్ వి. రేప్పొద్దున ఫారిన్ వెళ్ళి పెద్ద రీసెర్చ్ చేయబోతున్నావు. ఇంకెవర్నీ ఈ విషయం అడక్కు. నవ్విపోతారు!"
హంసలేఖ తలూపింది. అరుణ ఓ పుస్తకం తీసిస్తూ "ఇదిగో ...... ఇది చదువు ..... పెళ్ళయ్యాక పనికి వస్తుంది." అంది హంసలేఖ దాన్ని చూసి "ఛీ" అంది. అన్నదేగాని తిరిగి ఇచ్చే ప్రయత్నం చేయలేదు. తన పుస్తకాల మధ్య దాచుకుంది.
"ఇదేం బూతు పుస్తకం కాదు, సైన్సు! ఈ సైన్సు పెళ్ళయిన మొగాళ్ళకి సగం మందికి తెలీదట. షాపువాడు చెప్పాడు. మనలాటి మోడరన్ గర్ల్స్ అందరూ చదవాల్సిన పుస్తకమట. అనుభవం మీద చెప్తున్నాను" అంది అరుణ. ఆ పుస్తకం పేరు-
'ముద్దు పెట్టుకోవడంలో 32 రకాలు'
* * *
ఏజెంట్ నేత్ర సి.బి.ఐ. ఆఫీసులోకి ప్రవేశించేటప్పటికి పదకొండయింది.
అహొబిల కళ్ళు అరమోడ్పులు చేసి అతనిని భక్తిగా చూసింది. అతడు ఫుల్ సూట్ లో వున్నాడు. తెల్ల పాంటు, తెల్లకోటు అతడి పచ్చటి శరీరం మీద అందాన్ని సంతరించుకున్నాయి. అతని నడకలో స్టయిల్ ఎలాంటి అమ్మాయినైనా కనీసం ఒక్కసారి తిరిగి చూసేలా చేస్తుంది.
"మీ కోసం చీఫ్ గంట నుంచి చూస్తున్నారు" అంది అహొబిల.
"మంచిదేగా..... వేచి వుండడం ఆరోగ్యానికి ఆల్వేస్ బెస్ట్" అన్నాడు నవ్వుతూ.
"మీ కోసం జీవితాంతం వేచి వుంటాను మిస్టర్ నేత్ర."
"వద్దు. రాత్రికే వీలయితే డిన్నర్ కి తీసువెళ్తాను."
"నా కన్నా అందమైన అమ్మాయి ఈ రోజు మరవరూ మీక్కనపడకూడదని రాత్రి వరకూ ప్రార్థిస్తూ వుంటాను. ఇదిగో చూశారా" అంటూ బల్లమీద చూపించింది. ఎర్ర సిరా వొలికిపోయి గుడ్డతో తుడిచినట్టు వుంది.
"ఏమిటిది?" ఆశ్చర్యంగా అడిగాడు.
"మీరు బ్రతికి వున్నట్టు తెలిసింది. అప్పటివరకు నుదుట బొట్టు లేదు. ఇంకులో వేలు ముంచి నుదుట పెట్టుకోబోతుంటే సీసా పడిపోయింది."
నేత్ర నవ్వబోయాడు. ఆమె మొహంలోకి చూశాడు. అతడి మనసు జాలితో నిండిపోయింది. చెప్పినా ఆ అమ్మాయికి అర్థంకాదు. మొదట్లో తనామెతో నవ్వుతూ మాట్లాడడమే చేసిన తప్పు. అప్పటివరకు ఎవరూ ఆమెతో ఆ మాత్రమైనా ఆప్యాయంగా మాట్లాడి వుండరు. కాస్త వేడికి కరిగిపోయే మానసిక స్థితిలో వుందామె. "నేత్ర నిన్ను ప్రేమించడం ఏమిటి" అని దేవుడే సాక్షాత్తు దిగివచ్చి చెప్పినా నమ్మేస్థితిలో లేదామె. ఇలాటి అభిమానాలు తర్కానికి అందవు. ఇలాటి ప్రేమల ప్రమాదం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది.
నేత్ర నవ్వి తలుపు తీసుకుని లోపలకు వెళ్ళాడు.
లోపల ప్రతిమ కూడా వుంది. "గుడ్ మార్నింగ్ సర్" అని, ప్రతిమవైపు తిరిగి "ఏమిటి కళ్ళు ఎర్రగా వున్నాయి......? రాత్రంతా పాట పాడావా.....?" అని అడిగాడు.
"మిస్టర్ నేత్రా....... ఆర్నెల్లు ఆ నారాయణ్ పేట్లో వుండి నువ్వు చేసిందేమిటో నాకర్థం కావడంలేదు. నువ్విచ్చిన రిపోర్ట్ చదివాను. చేపల్లో రకాలెన్ని, చేపల వేపుడు ఎన్ని రకాలుగా చేస్తారు అని వుండి తప్ప, దేశానికి ఏర్పడుతున్న ప్రమాదం గురించి లేదు."
"రిపోర్టులు రాయడం నా వంటికి పడదని నేను ముందే చెప్పాను సార. ఐ బిలీవ్ ఇన్ యాక్షన్. ఆ రిపోర్టు నేను రాలేదు. మా పక్కింటి బాబుతో రాయించాను" కుర్చీలో కూర్చుంటూ అన్నాడు.
"నాన్ సెన్స్..... ఇంతింత జీతాలు ఇచ్చి మిమ్మల్ని పని చేయమంటే, చేపలమీద వ్యాసాలూ- అదీ పక్కింటి స్టూడెంట్ తో వ్రాయిస్తావా?"
"ఐ - ఐ ఆబ్జెక్ట్ ఇట్ సర్....." అంది ప్రతిమ. "ప్రాణాలకు తెగించి నేను సర్పభూషణరావు మీద రికార్డు తయారుచేశాను. అది మా ఇంట్లో బీరువాలో భద్రంగా వుంది మీరు చూశారు కూడా" అంది.