ముఖ్యమంత్రితో అప్పుడే సమావేశం ముగించుకుని బయటకు వచ్చిన కమీషనర్ ధర్మారావు పియ్యే అందించిన "అర్జెంట్" అన్న స్లిప్ చూసి విప్పి చదివాడు. అతడి భృకుటి ముడిపడింది. ఫోన్ చెయ్యమని చెప్పాడు.
అరనిముషం తరువాత విశ్వనాథం లైన్లోకి వచ్చాడు.
"ఎక్కణ్ణుంచి?"
"చక్రధర్ ఇంటి దగ్గర్నుంచి సర్."
"ఏమైంది?"
"చక్రధర్ హత్య చేయబడ్డాడు సర్."
ధర్మారావు విసుగ్గా "అదంతా నువ్వు వ్రాసి పంపిన స్లిప్ లోనే వుంది. అదికాదు నేనడిగేది, విద్యాధరి ఇందులోకి ఎలా వచ్చింది?"
అట్నుంచి విశ్వనాథం జరిగిందంతా చెప్పాడు. ధర్మారావు మొహంలో భావాలు మారసాగాయి. అంతా విని "ఇప్పుడే వస్తున్నాను" అని కంగారుగా లేచాడు.
.........
ధర్మారావు వచ్చేసరికి అక్కడంతా హడావుడిగా వుంది.
విద్యాధరి ఒక కుర్చీలో కూర్చుని వుంది. ఆమెలో అసలు జీవం లేనట్టు మొహం పాలిపోయి వుంది. ధర్మారావుని చూసి విశ్వనాథం సెల్యూట్ చేశాడు. ఆ ప్రాంతపు పోలీసులు తమ పని తాము చేసుకుపోతున్నారు. ఆమెని అప్పుడే అరెస్టుచేసి తీసుకుపోయేవారే- ఆమె ధర్మారావుగారికి తెలిసిన మనిషి అని విశ్వనాథం చెప్పకపోతే.
మళ్ళీ ఇంకొకసారి విశ్వనాథం జరిగిందంతా ఆయనకి చెప్పాడు. అంతా విని ధర్మారావు లేచి, విద్యాధరివైపు తిరిగి "నాతో రా" అంటూ పక్కగదిలోకి తీసుకువెళ్ళాడు.
కెమెరా క్లిక్ మంది.
లోపలికి వెళ్తూన్న ధర్మారావు చటుక్కున ఆగి వెనక్కి తిరిగి చూశాడు.
పత్రికా విలేఖరి ఇద్దర్నీ కలిపి అప్పటికే ఫోటో తీసేశాడు. హంతకురాలు- పోఈసు కమీషనర్ కి కావల్సిన అమ్మాయి అన్న వార్త అప్పుడే పాకిపోయి, రాబోయే వారంరోజులపాటు సంచలనం కలిగించబోతూంది.
ఆయన విద్యాధరిని లోపలికి తీసుకెళ్ళి అడిగాడు. "ఏం జరిగింది చెప్పు"
మాటలు సమకూర్చుకోవటానికి చాలా కష్టపడవలసి వచ్చింది. నెమ్మదిగా- జరిగిందంతా చెప్పింది. అంతా విని అడ్డంగా తలూపుతూ "ఊహూ. అదికాదు. అసలు జరిగిందంతా చెప్పు" అన్నాడు. ఆమె తెల్లబోయి, 'అదే జరిగింది' అంది.
"నువ్వున్న గదిలో అతడూ నువ్వూ తప్ప మరెవరూ లేరు. ఆ గదికి వేరే ద్వారాలు ఏవీ లేవు. బయట్నుంచి కాల్చటానికి కూడా కిటికీలు తెరచి లేవు. గదిలోంచి రివాల్వర్ శబ్దం వినిపిస్తూంటే ఒకరు కాదు, నలుగురు ప్రత్యక్షంగా విన్నారు. లోపలికి ప్రవేశిస్తే పిస్తోలు దొరికింది. దానిమీద నీ వేలిముద్రలున్నాయి. అప్పుడే దానినుంచి రెండు గుళ్ళు ఉపయోగించినట్టు ఉందది. నువ్వేమో నీకేమీ తెలీదంటున్నావు. కనీసం పిస్తోలు ఎట్నుంచి పేలిందో కూడా చెప్పలేకపోతున్నావు. పేల్చినవాడు గోడలమధ్య దాక్కుని పేల్చలేడు కదా. పోనీ ఆత్మహత్యా అనుకుంటే మెడ వెనుకనుంచి ఆ పిస్తోలు పొజిషన్ లో పేల్చుకోవటం అసాధ్యం కాబట్టి ఏం జరిగిందో చెప్పు. అతడు రేప్ చేయబోయాడా? అటువంటి పరిస్థితిలో హత్య చేయటం నేరం కాదు. శిక్ష పడదు".
సలహా ఇస్తున్నట్టు అన్నాడు. ఆ సలహాలో, శిక్షనుంచి ఎలా తప్పించుకోవచ్చో 'సూచన' కూడా వుంది.
ఆమె బిత్తరపోయి అతనివైపు చూసింది. అప్పటివరకూ ఆమెలో ఏ మూలో కొద్దిగా ఆశ ఉంది. న్యాయం రక్షించబడుతుందనీ, చివరికి ధర్మం గెలుస్తుందని. పూర్వకాలం బొమ్మలు చెప్పిన కథలు తాలూకు ప్రభావం ఆమెమీద ఇంకా ఉన్నట్లుంది. కానీ ఇప్పుడు తన కళ్ళముందే తను సాలెగూడులోకి ఇరుక్కుపోవటాన్ని ప్రేక్షకురాలిలా చూస్తూ వుండిపోవాల్సి వచ్చింది. ఏం జరిగిందో ఇప్పటికీ ఆమెకి అర్థంకావటంలేదు. తన పక్కనే తనకి పది అడుగుల దూరంలో అతడు కాల్చి చంపబడ్డాడు. ధర్మారావు చెప్పినట్టు ఆ గదిలో ఇంకెవరూ లేరు. బయట్నుంచి ద్వారాలు, సందులూ కూడా ఏమీలేవు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ పిస్తోలు...
విశ్వనాథం లోపలికి వచ్చి "గదంతా క్షుణ్ణంగా వెతికాము సార్. చిన్న రంధ్రం కూడా లేదు" అన్నాడు. ధర్మారావు విన్నట్టు తలూపాడు. అతడు బయటకు వెళ్ళాక విద్యాధరితో అనునయంగా - "ఐయామ్ సారీ" అన్నాడు.
ఆమె దాన్ని అంగీకరించే స్థితిలో లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు కావల్సింది సానుభూతి అని చాలామంది అనుకుంటారు. కానీ అది నాలుక గీసుకోవటానికి కూడా పనికిరాదు. కావల్సింది పరిష్కారం. ప్రాక్టికాలిటీ.
ధర్మారావు లేచి, "నా సలహా ఏమిటంటే -ఉన్నదున్నట్టు చెప్పెయ్యమనే - నా అనుభవంతో చెప్పుతున్నానమ్మాయ్! ఎంత పెద్ద లాయరైనా 'చంపలేదు' అని నిరూపించలేడు. అనివార్య పరిస్థితుల్లో చంపవలసి వచ్చింది అంటే తప్పులేదు. అబద్ధం చెప్పి బయటపడడానికి ప్రయత్నించటం కన్నా నిజం చెప్పి బయటపడడానికి ప్రయత్నించటం మేలు. ఒక్క విశ్వనాథమే ఉన్నట్టయితే ఏదో చెప్పి చేసి ఉండేవాడిని. కానీ ఇద్దరు పోలీసులు కూడా దీన్నంతా చూశారు. కాబట్టి జరిగింది వప్పేసుకోవటం మంచిది" అన్నాడు.
ఆమె గొంతు పగిలేలా "లేదు. నేను చంపలేదు" అని అరుద్దామనుకుంది. కానీ నోరు పెగల్లేదు. కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. అతడు బయటకు వచ్చేసేడు. ఆ ప్రాంతపు ఇన్ స్పెక్టర్ అతడి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు.
ఏమిటన్నట్టు చూశాడు ధర్మారావు.
ఇన్ స్పెక్టర్ ఇబ్బందిగా చూశాడు. అతనికి చాలా ఇరకాటమైన పరిస్థితి.
"....ఫస్ట్ డిగ్రీ మర్డర్ సార్. ఆ అమ్మాయి మీద రేప్ ప్రయత్నం జరిగినట్టుంది. హతుడి భుజంమీద చాకు గీతకూడా ఉంది. అయితే ఆ చాకు పై గదిలో వుంది. హతుడు హంతకురాలిని అక్కణ్ణుంచి తరుముకుంటూ వచ్చి వుండాలి. ఆమె శరీరం మీద గుర్తుల్ని మన డాక్టర్ పరీక్షించాలి".
"ఆ అమ్మాయి చేతిమీద కూడా అతడి గోళ్ళ గుర్తు నిలువునా వుంది" అన్నాడు ధర్మారావు తాను దాన్ని గమనించినట్టు. ఇన్ స్పెక్టర్ తటపటాయించి "ఆమెని అరెస్ట్ చెయ్యాలిసార్" అన్నాడు.
విలేఖర్లు అతడేం చెపుతాడా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఆ సంగతి అతను గమనించాడు. కొంచెంసేపు నిశ్శబ్ధంగా వున్నాడు. బలంగా శ్వాస వదుల్తూ "చెయ్యండి ఇన్ స్పెక్టర్. తప్పదు కదా" అన్నాడు.
విలేఖర్లు వెళ్ళిపోయారు.
ఇన్ స్పెక్టరుతో కలిసి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. విద్యాధరి ఒక్కతే వుంది. "చూడమ్మా" అన్నాడు... "కంట్రోల్ రూమ్ కి తీసుకెళ్తారు. నువ్వు అక్కడ కొంచెంసేపు వుండాలి".
'అరెస్ట్' అన్నమాట ఉపయోగించటంలేదు ఆయన.
"చాలా తొందరగా అయిపోతుంది మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ తరువాత వదిలేస్తారు. నువ్వేం కంగారుపడకు".
ఆమె తలెత్తింది.
ఎంత "మామూలుగా" జరిగిపోతున్నాయ్ జరగవలసిన పనులు!!
"మిగతా విషయాలన్నీ మా ఇన్ స్పెక్టర్ చూసుకుంటాడు - జరిగినదానికి అయామ్ సారీ- నేను వచ్చి పలకరిస్తాను".
తను హిస్టీరిక్ గా మారి ఏడ్చెయ్యకుండా ఉండటానికి ఆమె చాలా కష్టపడవలసి వచ్చింది. రేపు జైల్లో వున్నప్పుడు కూడా ఈయన ఇలాగే వస్తాడు.
"ఎంతమ్మా? ఏడు సంవత్సరాలేకదా. నువ్వేం కంగారు పడకు. నేను వచ్చి పలుకరిస్తూ వుంటాను" అంటాడు.
ఎంత ఆపుకున్నా ఆమె కళ్ళనీరు ఆగటంలేదు. జైలు నుంచి బయటకొచ్చేసరికి తనని హేళన చేయటానికీ, గుసగుస లాడుకోవడానికీ ప్రపంచమంతా ఎదురుచూస్తూ వుంటుంది.
"అయిపోయింది! తన స్వచ్చమైన -ఆనంద ప్రదమైన- సజావైన జీవితం అయిపోయింది. ఈ క్షణంనుంచీ తను పబ్లిక్ ప్రోపర్టీ. ఫోటోలు -పేపర్లు- చూపుడువేళ్ళు -సానుభూతులూ -'ఆఁ ఏదో జరిగే వుంటుంది. లేకపోతే ఒంటరిగా ఎందుకు వెళ్తుంది' లాటి వెనుక మాటలు తల్చుకుని ఆమె గొంతులో దుఃఖం గరగరలాడుతూంది.
రమ్మన్నట్టు ఇన్ స్పెక్టర్ చూశాడు.
ఆమె తలవంచుకుని అతడిని అనుసరించింది.
హల్లో వున్న మిగతావారూ, పోలీసులూ అందరూ ఆమెవైపు కుతూహలంగా చూస్తున్నారు. ఆమె పోలీసు జీపు ఎక్కుతూ ఉంటే ఎవరో కెమెరా 'క్లిక్' మనిపించారు.
జీపు కదిలింది. ఆమె చేతులు రెండూ వళ్ళో పెట్టుకుని అలాగే కూర్చుని వుంది.
జీప్ కంట్రోల్ రూమ్ వైపు సాగిపోయింది.
కొంచెంసేపటికి అంబులెన్స్ లో శవాన్ని పోస్ట్ మార్టమ్ కోసం పంపించారు. ఇల్లు తాళం వేశారు. అయిదు నిమిషాల తరువాత ఇంటిముందు గుమిగూడిన జనంకూడా ఇక అక్కడ ఆసక్తికరమైన విషయం ఏమీ లేకపోవటంతో వెళ్ళిపోయారు. అప్పటివరకూ కళకళలాడిన ఆ ప్రాంగణం, శవం కాలిపోయిన తరువాత శ్మశానంలా నిర్మానుష్యంగా మారింది.
బాగా చీకటి పడింది.
రోడ్డుమీద కూడా ఎవరూ లేరు.
అప్పటివరకూ రోడ్డుచివరే నిలబడి ఈ తతంగాన్నంతా దూరంనుంచి పరిశీలిస్తున్న ఒక వ్యక్తి ఇక అటువైపు ఎవరూ రారని నిశ్చయించుకున్నాక నెమ్మదిగా కదిలాడు. ఇంటికి వేసివున్న తాళం తీయటానికి అతడికి అరక్షణం కూడా పట్టలేదు.
లోపలికి వెళ్ళాడు.
ఇంకా రక్తం చారలు అలాగే వున్నాయి.
ఫ్లవర్ వేజ్ ముక్కలు కూడా అలాగే వున్నాయి.
అతడు వాటిని పట్టించుకోలేదు. తనకి కావల్సింది వెతకసాగాడు. అయిదు నిముషాల తరువాత దొరికింది అది.... టేప్ క్యాసెట్.
* * *
మేజిస్ట్రేట్ ఆమెవైపు విసుగ్గా చూశాడు.
చాలా సింపుల్ కేసు ఇది. ఇద్దరూ గదిలో వుండగా పిస్తోలు పేల్చింది.పోలీసులు ప్రత్యక్ష సాక్షులు. ఇంత సింపుల్ కేసులో కూడా ముద్దాయి తనీ హత్య చెయ్యలేదనటం అతనికి చాలా చిరాకనిపించింది.
"చట్టం అంటే అందరికీ ఈమధ్య చాలా తేలికైపోయింది. ఏదో ఒకలా తప్పించుకోవచ్చు- ముందు నేరం నేను చెయ్యలేదని వాదిస్తున్నారు. ఉన్నదున్నట్టు నిజం చెప్పి వుంటే సానుభూతి అన్నా లభిస్తుందని అనుకోరు. నోనో... నేను దీన్ని వప్పుకోను. ఈమెను కస్టడీలో పెట్టి ఎంక్వయిరీ కొనసాగించండి-"
ఆమెకు బెయిల్ నిరాకరించాడు.
ఆమె తిరిగి కస్టడీలో వుంచబడింది.
ధర్మారావుకీ విషయం తెలిసి విసుక్కున్నాడు. కోపం కూడా వచ్చింది. "ఎందుకు నీ స్వంత నిర్ణయాలు తీసుకుంటావు? నేను చెప్పినట్టు చేసివుంటే కేసు లేదుకదా" అన్నాడు.
ఆమె సమాధానం చెప్పలేదు. మనసంతా దేనితోనో నొక్కేసినట్టుంది. నేరం వప్పుకుంటే- తక్కువ శిక్షో అసలు శిక్ష పడకపోవటమో జరగవచ్చు. కాని చెయ్యని నేరం ఎందుకు ఒప్పుకోవాలి...ఆమె ఆలోచించే స్థితిలోలేదు. రాత్రిపూట చిన్న దుప్పటిమీద పడక -దోమలు -నోట్లోకి వెళ్ళటానికి నిరాకరించే ఆహారం....
మొదటిరోజు ధర్మారావు కూతురు, కొడుకులు క్యారేజ్ కారులో తెచ్చారు. రెండవరోజు వాళ్ళు కాలేజీకి వెళ్ళాలికదా- దఫ్తరీ తెచ్చాడు. చక్రధర్ హత్య విషయం పేపర్లో పడింది. ఆమెను కమీషనర్ మేనకోడలిగా కొన్ని పేపర్లు చిత్రీకరించాయి. ధర్మారావు కాస్త ఇబ్బందిలో పడ్డాడు. పరిస్థితుల్ని యధాతథంగా చూడటం ఆమె ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూంది.