Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 1 పేజి 22


    3. అత్రి బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు. పురాణములందు అత్రి భార్య అనసూయ.

    4. శుష్ణ, శంబర, అర్బుదులు రాక్షసులు. బలవంతులు.

    5. 'పిప్రు' అనువాడు గోవులను దాచినాడు. ఇంద్రుడు వానిని విముక్తులను చేసినాడు. ఈ ఉదంతము ఇది వరకు వచ్చినది. మరల మరల వచ్చుచుండును.

    6. శుక్రుడు దస్యులకు ప్రథముడు. పురోహితుడు.

    7. శర్యాతి వైవస్వత మనువు పుత్రుడు.

    8. కక్షీవంతుని వృత్తాంతము తొలుత 18వ సూక్తమున కనిపించినది. అతనిని గురించి ఒక కథ ఉన్నది.

    'దీర్ఘతముడు' అనువాడు పిల్లలను కనుట తప్ప వేరుపని చేయువాడు కాడు. అతని భార్యాపుత్రులు అతనికి కట్టెలుకట్టి నదిలో పారవేసినారు. అంగరాజు అతనిని నది నుండి బయటకు తెచ్చినాడు. తన భార్యకు సంతానము కలిగించవలసినదని ప్రార్థించినాడు. అంగరాజు భార్య అందుకు ఒక దాసిని నియమించినది. ఆ దాసికి పుట్టినవాడు కక్షీవంతుడు.

    కక్షీవంతుడు స్వయంప్రతిభతో దేవతల అంతస్తుకు ఎదిగినాడు. యజ్ఞము చేయుటకు భార్య కావలెను. అతనికి ఎవరును పిల్లను ఇచ్చినట్లులేరు.

    అప్పుడు ఇంద్రుడు కక్షీవంతునకు 'వృచ'ను ఇచ్చినాడు.

    9. ఆర్యులకు దస్యులకు ఘర్షణ ఏర్పడినట్లు కనిపించుచున్నది. ఇది బహుశః విశ్వాసముల ఘర్షణకావచ్చును. దస్యుల విశ్వాసము, వారి జీవన విధానము మనకు తెలియవు. ఆర్యుల జీవన విధానమును వ్యతిరేకించినవారుగా మాత్రమే మనకు తెలియును.

          ఏబది రెండవ సూక్తము, ఋషి - అంగిరస పుత్రుడు సవ్యుడు,
             దేవత - ఇంద్రుడు, ఛందస్సు - జగతి, 13,15 త్రిష్టుప్.


    1. ఇంద్రుడు ఒక్కమారే నూరుగురితో స్తుతింపబడువాడు. నూరు అశ్వములవాడు. శత్రువుతో యుద్ధముచేయువాడు. స్వర్గమునందు ఉన్నవాడు. మమ్ము రక్షించుమని మంచిస్తవముల ఇంద్రుని నుతింతుము. యాగములకు ఇంద్రుని తీసికొనుపోవు ఇంద్రుని రథమును కూడ నుతింతుము.

    2. ఇంద్రుడు హవిస్సులకు హర్షించును. నదులను బంధించిన వృత్రుని హతమార్చినాడు. ఇంద్రుడు జలముల మధ్య కొండవలె నిలిచినాడు. అప్పుడు అతని బలము ఎంతగానో పెరిగినది.

    3. ఇంద్రుడు యుద్ధములో తనకు ఎదురు వచ్చిన వారిపై దాడిచేయును. నీరులేని ఆకసమున మబ్బులను నింపును. వర్షము కురిపించును. అతడు బలవంతుడు. ధనవంతుడు. అతడేకదా అందరికి ఆహారము ప్రసాదించువాడు! అట్టి ఇంద్రుని ఋత్విజుల సహితుడనయి ఆహ్వానించుచున్నాను.

    4. నదులన్నియు సముద్రమున చేరును. సకల యజ్ఞములు సోమములు స్వర్గమందున్న ఇంద్రుని చేరును. మరుత్తులు శత్రువును శుష్కింప చేయువారు. ఎదురులేని వారు. నిష్కపటులు. వారు వృత్ర సంహారమున ఇంద్రుని అనుసరించి నిలిచినారు.

    5. నీరు పల్లమునకు పారినట్లు, మరుత్తులు ఇంద్రునివెంట ఉండి వృత్రుని ఎదిరించినారు. వృత్రుడు ఉదకస్థానము. అయినను వానిని లెక్కచేయలేదు. 'త్రితుడు' పూర్వము మూడు పరిధులను ఛేదించినాడు. అట్లే ఇంద్రుడు 'బలడు' అణు వానిని హతమార్చినాడు.

    (రాక్షసులు త్రితుని బావిలోత్రోసి మూడు మూతలు పెట్టినారు. త్రితుడు ఆ మూడు పరిధులను భేదించి బయటపడినాడు.)

    6. వృత్రుడు నీటిని పట్టి పెట్టినాడు. ఆకసమున ఆవరించినాడు. అదృశ్యుడు అయినాడు. ఎవరికంట పడలేదు. అట్టివానిని ఇంద్రుడు వజ్రాయుధముతో దవడ పగులకొట్టినాడు. అప్పుడు ఇంద్రుడు విజయుడు అయినాడు. అతని బలము ప్రదీపించినది.

    7. పిల్లకాలువను మడుగులు నింపును. అట్లే స్తుతులు అన్నియు ఇంద్రుని చేరుచున్నవి. అతని బలమును పెంచుచున్నవి. త్వష్ణ వజ్రాయుధమునకు పదును పెట్టినాడు. ఇంద్రుని బలమును మరింత పెంచినాడు.

    8. ఇంద్రుడు కర్మలకు ఆధారభూతుడు. మానవులకు మేలు తలపెట్టువాడు. అశ్వారూఢుడు అయినాడు. వృత్రుని వధించినాడు. వజ్రమాయసమ్ ఇనుముగల వజ్రమును రెండు చేతుల పట్టినాడు. వర్షము కురిపించినాడు. జగములు చూచునట్లు సూర్యుని ఆకసమున నిలిపినాడు.

    9. జనులు వృత్రునికి భయపడినారు. యజమానులు హర్షము, బలమును ఇచ్చు బృహత్ మంత్రములను పఠించినారు. అవి స్వర్గమును చేరినవి. ఇంద్రుని బలపరచినవి. నరులకు ప్రాణప్రాయములు అయిన మరుత్తులు సహితము ఇంద్రుని బలమును పెంచినారు.

    (వృత్రవధలో ఇంద్రునకు నరులు సహితము సాయపడినారు).

    10. వృత్రుని భీకరధ్వనికి దృఢమయిన ద్యులోకము సహితము కంపించినది. ఇంద్రుడు సోమము త్రావినాడు. వజ్రాయుధము ధరించినాడు. భూమి, అంతరిక్షమును బాధించు వృత్రుని తల నరికినాడు.

    11. అప్పుడు భూమి పదిరెట్లు అభివృద్ధి చెందినది. నరుల దినములు విస్తరించినవి. ఇంద్రుని బలము పెరిగినది. వృత్రుని వధవలన ఇంద్రుని కీర్తి పెల్లుబికినది.

    12. ఇంద్రా ! నీవు శత్రువులను ధిక్కరించు మనోబలము కలవాడవు.బలవంతులకు బలవంతుడవు. అంతరిక్షమునకు ఆవల ఉన్నవాడవు. అంతరిక్షమును స్వాధీనపరచుకున్నవాడవు. నరులను నిలుపుటకు భూలోకమును నిర్మించినావు.

    13. ఇంద్రా ! నీవు భూమి అంతటి విస్తారుడవు. దర్సనీయులగు వీరులకు తావయిన ద్యులోకమునకు అధిపతివి. నీవు మహిమాన్వితుడవు. అంతరిక్షమునందంతటము విస్తరించి ఉన్నావు. కావున నిన్ను మించినవాడులేడు. ఇది సత్యము. సత్యమద్దా నకిరన్యస్త్వావాన్

    14. ఇంద్రుని వ్యాప్తిని వహించుటకు భూమి, అంతరిక్షము చాలలేదు. ఇంద్రుని తేజమును దివియందలి ప్రవాహములు పర్యాప్తములు కాకున్నవి. యుద్ధమున వర్షమును బంధించిన వృత్రాదులు సహితము ఇంద్రునిముందు నిలువలేకపోయినారు. కావుననే నీవు ఒక్కడవే సకల లోకములను ఆక్రమించుకున్నావు. ఏకో అన్యచ్చకృషే విశ్వమానుషన్

    15. ఇంద్రా ! యుద్ధములందు మరుత్తులు నిన్ను అర్చించినారు. సకల దేవతల యుద్ధమున నిన్ను అనుసరించినారు. బలములు పెంచుకున్నారు. అప్పుడు నీవు పదునైన వజ్రముతో వృత్రుని ముఖమును బాదినావు.

          ఏబది మూడవ సూక్తము, ఋషి - సవ్యుడు, దేవత - ఇంద్రుడు.
                      ఛందస్సు - 1-9 జగతి, 10-11 త్రిష్టుప్.


    1. నిదురలో ఉన్నవాని సంపదనువలె ఇంద్రుడు అసురుల సంపదను హరించును. కావున ఇంద్రుని సేవించు యజమాని ఇంట స్తుతులు వినిపించుచున్నవి. మేము సహితము ఇంద్రుని కీర్తింతుము. దాతలను చెడుగా స్తుతించరాదు దుష్టతి ర్ద్రవిణోదేషు శస్యతే

    2. ఇంద్రా ! నీవు ధనాధిపతివి. అశ్వదాతవు. గోదాతవు. ధనదాతవు. పాలకుడవు. సనాతనుడవు. అడిగినది లేదననివాడవు. మిత్రులకు ప్రియుడవు. కావున ఈ వచనములచే నిన్ను స్తుతించుచున్నాము.

    3. ఇంద్రా ! నీవు ప్రజ్ఞగలవాడవు. కార్యశూరుడవు. అంతటి సంపద నీవద్దనే ఉన్నది. నీ బలమున శత్రువును జయింపుము. శత్రువు ధనము గ్రహింపుము. అట్లు గ్రహించినది మాకు ప్రసాదింపుము. యజమాని నిన్ను ఆశ్రయించినాడు. అతను కోరినవాటిని తగ్గించకుము.

    4. ఇంద్రా ! నీవు ప్రకాశమానములు అయిన హవిస్సులను, సోమములను స్వీకరించుము. ఆనందించుము. మంచి మనసు కలవాడవు. అగుము. మాకు అశ్వములను, గోవులను, ధనమును ప్రసాదించుము. లేమిని పోగొట్టుము. ఇంద్రుడు శత్రువులను హింసించగా మేము అన్నము కలిగి సుఖింతుము.

    5. ఇంద్రా ! నీ అనుగ్రహమున మాకు సంపదలు కలిగినవి. ఆనందము, దీప్తి కలిగించు అన్నము కలిగినది. గోవులను అశ్వములను కలిగి ఉన్నాము. సద్భుద్ది కలిగి ఉందుము.

    6. ఇంద్రా ! నీవు మంచివారిని పోషించువాడవు. వృత్రుని వధించినపుడు మరుత్తులు నిన్ను బలపరచినారు. చరుపురోడాశాదులు నిన్ను బలపరిచినవి. సోమము నిన్ను బలపరచినది. నీవు యజమానికి పదివేల శత్రుబాధలు తొలగించినావు.

    7. ఇంద్రా ! నీవు శత్రుంజయుడవు. నిరంతరము యుద్ధములు చేయువాడవు. అసురుల పురములను, శత్రువుల పురములను ధ్వంసము చేసినావు. నీవద్ద శత్రు సంహారకమగు వజ్రమున్నది. దానితో దూరదేశమున ఉండి మాయా శీలుడయిన 'నముచి'ని వధించినావు.

    8. ఇంద్రా ! నీవు 'అతిధిగ్వు'ని రక్షించుటకొఱకు 'కరంజు'ని 'పర్ణయు'ని తేజోవంతమయిన 'వర్త'ని ఆయుధముచే వధించినావు. 'ఋజిశ్వి'ని ఓడించినావు. 'వంగ్రు'ని వందలకొలది పురములను భగ్నము చేసినావు.

    9. ఇంద్రా ! నీవు 'సుశ్రవు'ని రక్షించదలచినావు. సుశ్రవుని ఎదరించిన ఇరువది మంది రాజులను 60,099 మంది భటులను, రథికులను చక్రాయుధము ప్రయోగించి హతమార్చినావు.

    10. ఇంద్రా ! నీవు సుశ్రవుని రక్షించినావు. నీ భటులు 'తుర్వయాణు'ని రక్షించినారు. 'కుత్సు'ని 'అతిధిగ్వు'ని ఆయువును నీ అధీనమున ఉంచుకున్నావు.

    11. మేము యజ్ఞములు చేయుచున్నాము. దేవతలు మమ్ము పాలించుచున్నారు. ఇంద్రా! నీకు మిత్రులమయి ఉన్నాము. నీ అనుగ్రహమున మాకు శుభములు కలుగుచున్నవి. పుత్రవంతులము, ఆయుష్మంతులము అగుచున్నాము. సుఖముగా జీవించుచున్నాము.

               ఏబది నాలుగవ సూక్తము, ఋషి - సప్యుడు, దేవత - ఇంద్రుడు.
                    ఛందస్సు - 6,8,9,11 త్రిష్టుప్ - మిగిలినవి జగతి.


    1. ఇంద్రా ! నీ బలమునకు అంతము లేదు. నీవు ధ్వనించుచు నదులను దాటుదువు. నదులను ధ్వనింపచేతువు. నీ భయమునకు ముల్లోకములు గడగడలాడుచున్నవి. మమ్ము పాపములందును, యుద్ధములందును పడనీయకుము.

    2. ఇంద్రుడు శక్తిమంతుడు. ప్రజ్ఞావంతుడు. స్తోత్రప్రియుడు. శత్రువును ఓడించగల బలసంపన్నుడు. భూమ్యాకాశములకు అలంకారమయినవాడు. వర్షమును ఇచ్చుదేవర. ఋత్విజా ! ఇంద్రుని పూజింపుము. అభిముఖముగా స్తుతించుము. ఇంద్రుడు కోర్కెలు తీర్చగలవాడు.

    3. ఇంద్రుడు గొప్పవాడు. దీప్తిమంతుడు. బలవంతుడు. కీర్తిమంతుడు. శత్రుంజయుడు. అశ్వసేవితుడు. కోరికలు తీర్చువాడు. యుద్ధమునందు కఠిన మనసుగలవాడు. ఋత్విజా! అట్టి ఇంద్రుని సుఖప్రదములగు వాక్కుల నుతింపుము.

    4. రాక్షసులు, రాక్షస సేనలు మాయలు గలవి. ఇంద్రుడు దృఢ చిత్తమున వాడి అయిన వజ్రాయుధమును రాక్షస సేనలమీద విసరినాడు. అప్పుడు ద్యులోకము వడకిపోయినది. ఇంద్రుడు తనంతతానే శంబరుని సంహరించినాడు.

    5. ఇంద్రా ! మేఘములను గర్జింపచేయు వాయువుకన్న పైనను, ఫలములను పండించి ఎండించు సూర్యునికన్న పైనను జలమును నిలుపుచున్నావు. అడ్డులేక తిరుగు శత్రువులను బాధించుచున్నావు. వర్షము కలుగచేయుచున్నావు కావున నిన్ను మించినవాడు లేడు.

    6. ఇంద్రా ! నీవు 'నర్యుడు', 'తుర్వశుడు', 'యదువు' అణు రాజులను రక్షించినావు. వయ్యకులమున పుట్టిన 'తుర్వీతుని', ధననిమిత్త యుద్ధముల 'రథుడు', 'ఏతశుడు' అను ఋషులను రక్షించినావు. శంబరుని తొంబది తొమ్మిది నగరములను నాశము చేసినావు.

    7. ఇంద్రునకు హవిస్సులు అర్పించువాడు, ఇంద్రుని స్తుతించువాడు, ఉక్థలు పఠించువాడు, ఇంద్రునకు అభిముఖముగా అన్నమును సమర్పించువాడు సత్పురుషుల పోషించువాడు అగును. తనను అభివృద్ధి పరచుకున్నవాడు అగును. అట్టివాని కొఱకు ఇంద్రుడు మేఘములను వర్షింపచేయును.

    8. ఇంద్రుని బలము అపారము. ఇంద్రుని బుద్ధి అపారము. ఈ సోమము త్రావువారు తమ కర్మలచేత అభివృద్ధి చెందవలెను. ఇంద్రునకు హవిస్సులను ఇచ్చువారు మహత్తును, బలమును, స్థిరపుంస్త్వమును పొందుదురు.

    9. ఈ సోమము రాతితోనూరి, పిండి చమసపాత్రలందు నింపబడినది. ఇంద్రా ! ఇది నీ కొఱకు తెచ్చినాము. స్వీకరించుము. తృప్తి చెందుము. ధనములను ప్రసాదించుము.

    10. వర్షము జలమును నిరోధించిన తమస్సు అగు వృత్రుని ఉదరమున మేఘము ఉన్నది. వృత్రుడు నీటిని కట్టిపెట్టినాడు. వరుసలు తీరిన సకల జలములను ఇంద్రుడు పల్లపు నేలకు పారించినాడు.

    11. ఇంద్రుడు మాకు సుఖకరము, కీర్తిదము, శత్రుంజయము అగు బలమును ప్రసాదించవలెను. అతడు మమ్ము సంపన్నులనుచేసి పాలింపవలెను. విద్వాంసులను పాలింపవలెను. మాకు ధనము, అన్నము, సంతానము ప్రసాదించవలెను.

        ఏబది అయిదవ సూక్తము, ఋషి-సవ్యుడు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-జగతి.

    1. ఇంద్రుని ప్రాభవము ద్యులోకమును మించినది. అతని మహత్వము భూమిని మించినది. అతడు అరి భయంకరుడు. నరుల శత్రువులను తపింపచేయును. ఆబోతు తన కొమ్ములను వాడి పెట్టునట్లు ఇంద్రుడు తన వజ్రమును వాడి పెట్టుచున్నాడు.

 Previous Page Next Page