జవాబు : నిజమే. భూమ్మీదే వుండాలనుకునే పాఠకులకు విస్తృతమైన ఖగోళ జ్ఞానావశ్యకత లేదు.
ప్రశ్న : "ప్లయింగ్ సాసర్స్' వున్నాయంటూ గతంలో కొన్ని పత్రికలు రాశాయి. అవి కొన్ని ప్రాంతాలలో కనిపించాయి కూడా. వాటిని పట్టుకోవడానికి అన్ని దేశాలు ప్రయత్నించి వాటివేగానికి అందుకోలేక విఫలమయ్యాయి. ప్లయింగ్ సాసర్స్ వున్నాయా? ప్రపంచ పటంలోని దేశాలు కాకుండా మరో గోళం(?) పై ప్రజలున్నారా? ప్రపంచంలోని ఏ దేశస్తులూ వాటిని ట్రేస్ చేయలేదంటే, ఆ ప్లయింగ్ సాసర్స్ ను తయారుచేసిన వాళ్ళు మనకన్నా బ్రిలియంట్స్ అని అనుకోవాలా? (విజేంద్రనాథ్ ప్రసాద్, ఆదోని)
జవాబు : ఈ విషయాలన్నీ మీ రెక్కడ చదివారు? అదిగో పులి అంటే ఇదిగో తోక అని వ్రాసే వ్యాసాలు చదివి నిర్ణయానికి రాకండి. ఇంతవరకూ ఏ గ్రహాంతర జీవీ భూమి గోచర పరిధిలోనికి రాలేదు.U.F.O (Unidetified Flying Objects) అనబడేవి అన్నీ ఎగిరే గాలిపళ్ళేలు కావు.
ప్రశ్న : నా ప్రశ్న చూసి మీరు నవ్వుకోకండి. భూమి గిర్రున తిరుగుతూంది కదా! చార్మినార్ మీద నుంచి శూన్యంలోకి గెంతి ఆరు గంటల తరువాత క్రిందపడితే అరేబియా సముద్రంలో పడతామా? ఈ ప్రశ్న నన్ను చిన్నప్పటినుంచీ వేధిస్తుంది. ఎవర్నైనా అడగాలంటే నవ్వుతరేమోనని సిగ్గు.(ఎమ్. అనంతబాబు, గడ్డి అన్నారం)
జవాబు : "శూన్యంలోకి గెంతి" అనుకుండా "గాలిలోకి గెంతి" అని మీరు అడిగివుంటే నవ్వుకోవచ్చేమో గానీ, ప్రస్తుతం మీ అనుమానంలో తప్పేమీ లేదు. వేగంగా ప్రయాణం చేస్తున్నా రైల్వే కంపార్టుమెంటులో గెంతినా, నిల్చున్నచోటే పడతాము కదా. భూమికూడా అంతే. దానితో పాటే వాతావరణం పయనిస్తుంది. కాబట్టి వేగం లెక్కలోకి రాదు. చార్మినార్ మీదనుంచి గెంతితే చార్మినార్ కిందే పడతారు. కానీ మీరు "శూన్యంలోకి గెంతి" అన్నారు. అప్పుడు తప్పకుండా భూవేగాన్ని లెక్కలోకి తీసుకోవాలి. సూర్యుడు నవలలో ఎక్కడో ఒకచోట ప్లానెటరీ ప్రోబ్స్ ప్రసక్తి వస్తుంది చదవండి. భూమినుంచి అంతరిక్ష నౌకలు పైకి వెళ్ళాక, మరే ఆకర్షణ శక్తికి లోనుగాకపోతే తిరిగి బయల్దేరిన చోటుకే వస్తాయి. కానీ అప్పటికి భూమి అక్కడ వుండదు. అందుకని శూన్యంలోకి గెంతి ఆరు గంటల తరువాత మీరు క్రిందికి వస్తే ప్లాట్ ఫాంలో ప్రయాణికుడిని వదలి వెళ్ళిపోయినట్టు మిమ్మల్ని వదిలేసి భూమి వెళ్ళిపోతుంది. ఆరు గంటలు కాకుండా, ఆరు నిముషాల తరువాత అయితే అరేబియాలో వుంటారు.
ప్రశ్న : మనిషి పుట్టుకమీద గ్రహాల ప్రభావం వుంటుందా? జ్యోతిషశాస్త్రానికి ఖగోళశాస్త్రానికి సంబంధం వుందా? (వి. దక్షిణామూర్తి, నాజర్ పేట; టి.వి. సత్యనారాయణ, సిర్పూర్ కాగజ్ నగర్; కె. చక్రవర్తి, పొద్దుటూరు: యు. ఉరుకుందు, ఎమ్మిగనూరు)
జవాబు : ఎండాకాలం రాత్రిపూట డాబామీదనో, పెరట్లోనో పడుకునే అలవాటు చాలామందికుంటుంది. ఓ అమావాస్య నాడు అలా పడుకుని ఆకాశంలో నక్షత్రాల గుంపులని చూడండి. రకరకాల ఆకారాలు కనిపిస్తాయి. రాత్రిపూట ఆకాశం చాలా ఆసక్తిని కలిగించే అపురూపమయిన దృశ్యం. ఈనాడే కాదు. యుగాల క్రితం నాడు కూడా.
ఈనాడు మనకు టెలివిజన్లు, వీడియోలు వున్నాయి. వీటికి ముందు సినిమా, అంతకుపూర్వం రేడియో, అదీ తెలియనప్పుడు పుస్తకాలు......ఇలా ఆలోచించుకుంటూ వెనక్కుపోతే ఒకానొక కాలంలో మనిషి తిండి కోసం ఏదో వేటాడి, తిన్న తర్వాత చేసేదేంలేక చీకటి పడుతుండగానే ఏ చెట్టు నీడనో పడుకునేవాడు. ఎదురుగా ఆకాశంలో నక్షత్రాలు గుంపులు గుంపులుగా! ఓ పక్క ఒక గుంపు అంతకుముందు రోజు తను చంపి తిన్న జంతువులా కనుపిస్తే, మరొకటి వేటకు వెళుతున్న మనిషిలా, ఇంకొకటి తను చూసి భయపడ్డ ఎలుగుబంటిలా, ఇంకో పక్కతను చూసి మనుసుపడ్డ యువతిలా కనిపించేవి.
సంవత్సరాల కొద్దీ ఆ విధంగా ఆకాశంలో చూసి చూసి, కృషిచేసి మానవుడు కనుక్కున వాస్తవం ఏమిటంటే, ఈ నక్షత్రాల దశ ఫలానా దిశలోకి మారినప్పుడు వర్షం పడుతుంది. ఆ తర్వాత కొంతకాలానికది మరో దిశకు ప్రయాణించి వెళుతుంది. అప్పుడు విపరీతమైన చలి పుడుతుంది. దానికోసం మనం ముందుగానే జాగ్రత్త పడాలి. ఇలా ఆనాటి మానవుడికి ఆకాశమే ఒక పెద్ద క్యాలెండరు అయింది. అందరికీ అందుబాటులో వుండే తారీఖులేని క్యాలెండరది. ఆ విధంగా ఆకాశాన్ని చదివి మనిషి విజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు. తన తర్వాత తరాల వాళ్ళకు అతడు బోధించిన విద్య అదే. సూర్య, చంద్ర నక్షత్ర గమనాన్ని బట్టి : ఏ కాలం వేటాడాలి? ఏ కాలంలో విత్తులు నాటాలి వగైరా విషయాలు. ఈ విషయాలు మర్చిపోకుండా వుండేందుకు అతడు ఏదో బొమ్మరూపంలోనో, మరో ఆకారంలోనో చిత్రీకరించి గుర్తుగా పెట్టుకొనేవాడు.
తర్వాత కొద్దికాలానికి మానవుడు మరో విషయం గమనించాడు. ఆకాశంలో నక్షత్రాలలా కనిపించే గ్రహాలు కొన్ని వున్నాయి. వాటికీ, నక్షత్రాలకు వుండే తేడా ఏమిటంటే నక్షత్రాలు కదలవు. అవి కదులుతాయి. ఇవ్వాళ ఒక నక్షత్ర మండలంలో వున్న గ్రహం కొద్ది నెలల్లో మరో గుంపులోకి చేరుతోంది. ఇలాంటి నక్షత్రాలు అయిదున్నాయి. (అప్పట్లో వాళ్ళకు తెలిసింది అయిదు గ్రహాలే). ఆకాశంలో తిరిగే సూర్యుడు, చంద్రుడూ మనిషిమీద ప్రభావం చూపిస్తున్నాయి. మరి ఈ గ్రహాలకున్న శక్తి ఏమిటి? అవి మనిషి జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? మానవుడి ఈ ఆలోచనకు పర్యవసానంగానే జ్యోతిష్య శాస్త్రానికి రూపకల్పన జరిగింది.
ఆపదలో వున్న మనిషి ధైర్యం కోల్పోతాడు. పక్కనే వున్న జ్యోతిష్కుడు అతడికి ధైర్యం చెప్పి డబ్బు తీసుకుంటాడు. అదే ఈ శాస్త్రంయొక్క 'ఉపయోగం.' ఈనాడు ఏ దిన, వార, మాసపత్రిక తీసినా అందులో వారఫలాల శీర్షిక ఒకటుంటుంది. విజ్ఞాన శాస్త్రవేత్తల కంటే పదిరెట్లు జ్యోతిష్య శాస్త్రజ్ఞులున్నారు. ఆ విషయాన్ని మూర్ఖంగా నమ్మే ప్రజలు కోట్ల కొద్దీవున్నారు. విద్యాధికులు, శాస్త్రజ్ఞులు, డాక్టర్లు కూడా ఏ పత్రికైనా కనుపిస్తే ముందుగా వారఫలాలను చూసుకుంటారు. వీటిలో ఎంత నిజం వుంది? ఒకే రాశికి చెందిన లక్షలమందికి భవిష్యత్తు ఒకే రకంగా వుండటం నమ్మతగ్గదేనా అని తార్కికంగా ఆలోచించలేరు. ఈ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక సమయంలో ఏ నక్షత్ర సముదాయంలో ఏ గ్రహాలు చేరతాయో దాని ప్రభావం మనిషి మీదా, అతడి భవిష్యత్తు మీద వుంటుందని భావించి, కొన్నివేల సంవత్సరాల క్రితం గ్రహాల స్థితిగతుల మీదే చక్రవర్తుల అదృష్టం, రాజవంశాల భవిష్యత్తు నిర్ణయించేవారు. ఉదాహరణకు 'శుక్రగ్రహం మేషరాశిలో వున్నప్పుడు ఇలా జరిగింది. తిరిగి అదే విధమైన గ్రహ చలనం కలగబోతోంది. కాబట్టి అలాటి సంఘటనే జరుగుతుంది' అని జ్యోతిష్కుడు చెప్పడం రివాజయింది. వాళ్ళు చెప్పినట్లు జరగకపోతే వాళ్ళ ప్రతిష్టకు భంగకరం కావడం కాకుండా ఒక్కోసారి ప్రాణహాని కూడా జరిగేది. అందువల్ల వాళ్ళు ముందుజాగ్రత్తగా కొన్ని అనుమానాలని వ్యక్తంచేస్తూ, భవిష్యత్తు గురించి అస్పష్టమైన వివరణ ఇచ్చేవారు. ఆ తర్వాత సమయానుకూలంగా దాన్ని విశ్లేషించడం జరిగేది. మనుష్యుల మూర్ఖత్వం, బలహీనతల మీదా తెలివైనవాడు ఆడుకునే అలవాటు అప్పటి నుంచే మొదలయింది. గ్రహాల స్థితిగతులు మనిషి అదృష్టాన్ని, భవిష్యత్తుని నిజంగా శాసించగలవా? ఒకే సమయంలో పుట్టిన వాళ్ళందరి భవిష్యత్తూ ఒకేరకంగా వుంటున్నదా? ఒక విమాన ప్రమాదంలో చనిపోయిన మూడువందల మంది భవిష్యత్తూ ఒకేరకంగా నిర్ణయించబడిందా? అంతవరకూ ఎందుకు? ఈ శాస్త్రం పూర్తి అబద్ధం అని చెప్పడానికి కవలల గురించి తెలుసుకుంటే చాలు. మన కథల్లో కవలలంటే వాళ్ళకు ఒకేసారి కడుపునొప్పి రావడం, ఒకేసారి జబ్బు చేయడం, ఒకేవిధమైన విజయాల్ని అపజయాల్ని ఎదుర్కోవడం, ఒకేసారి చనిపోవడం లాంటివి. వీటిని మనం ఎంతో ఆసక్తికరంగా చదువుతాం. ఆశ్చర్యపోతాం. వెంటనే జ్యోతిష్యశాస్త్రం మీద అపారమైన గౌరవాన్ని పెంపొందించుకుంటాం. అయితే ప్రపంచంలో పుడుతున్న వేలాది కవలల్లో ఒక శాతం గురించే మనం చదివేది. పరిశీలనల్లో తేలిన విషయం ఏమిటంటే కొంతమంది కవలల్లో ఒకరు చిన్నతనంలోనే ఏ జబ్బో చేసి లేదా ప్రమాదానికి గురై మరణిస్తారు. మరొకరు వృద్దాప్యం వరకు జీవిస్తారు. చాలావరకు ఇద్దరి జీవనగతులు వేరే మార్గాలలోనే నడుస్తాయి. వీటి గురించి మనం చదవం కాబట్టి మనకు తెలియదు. మరి ఒకే సమయంలో పుట్టిన ఇద్దరి భవిష్యత్తు రెండు రకాలుగా ఎలా చెదిరిపోతుంది? జవాబు లేని ప్రశ్న ఇది.
ఇక పత్రికల్లో వచ్చే వారఫలాన్ని చూడండి. ఏ ఇద్దరు జ్యోతిష్కులూ ఒకే రకమైన ఫలాన్ని చూపించరు. వారిచ్చే వివరణలు కూడా అస్థిరంగా, అస్పష్టంగా వుంటాయి. ఉదాహరణకు 'ఈ వారంలో దూరప్రయాణం చేసే అవకాశం వుంది' అంటారు. ఏమిటి దీని అర్థం? ప్రయాణం అంటే మరొక ఊరికా లేక హైదరాబాద్ ఆ చివరనుంచి సికింద్రాబాదు ఈ చివరి వరకు కూడా దూరప్రయాణం కిందకే లెక్కవస్తుందా? అవకాశం వుంది' అనేకంటే వెళతారు వెళ్ళరు అనే ఖచ్చితమైన అభిప్రాయం ఎందుకు వెలిబుచ్చలేరు? అదీ ఒక శాస్త్రమే అయినప్పుడు ఏ రెండు వారఫలాలకైనా సమన్వయం కుదరదెందుకు? సంజయ్ గాంధీ చనిపోయినప్పుడు ఆ విషయాన్ని సంవత్సరం క్రితమే నేను చెప్పగలిగాను అన్నాడో జ్యోతిష్కుడు. పత్రికా ప్రకటన లిచ్చాడు. అలాగే సంజయ్ చనిపోకముందు వారంరోజుల క్రితమే అతడు ఇరవై సంవత్సరాలపాటు అధికారంలో వుంటాడని జ్యోతిష్యం చెప్పాడు మరొకడు.
ఒకనాడు కేవలం అయిదు గ్రహాలే మనిషి కంటికి కనిపించేవి. వాటి గమనాన్ననుసరించి భవిష్యత్తు లెక్కకట్టేవాడు. గెలీలియో టెలిస్కోపు కనుకున్న కొద్దికాలంలోనే మరో రెండుగ్రహాల ఉనికి మానవుడికి తెలిసింది. అప్పుడని నవగ్రహాలయ్యాయి. మనకు తెలియని పదోగ్రహం కూడా వుందని నిరూపించారు శాస్త్రజ్ఞులు ఇలా ఒకో కొత్త గ్రహాన్ని కనుక్కోగానే జ్యోతిష్కులు కూడా చాలా కన్వీనియంట్ గా తమ శాస్త్రాన్ని మార్చుకుంటూ వచ్చారు. మరి కొంత కాలానికి ఎనిమిది గ్రహాలే అనవచ్చు శాస్త్రజ్ఞులు. ఈ విశాల విశ్వంలో గాలక్సీలోనే మనం శోధించాల్సింది ఎంతో వుంది. వాటి ఉనికి కూడా తెలియకుండానే భవిష్యత్తుల్ని నిర్ణయం చేసుకోవడమంత అవివేకం మరొకటుండదు అంతెందుకు మనుష్యులను పరిచయం చెయ్యకుండా కేవలం జన్మ నక్షత్రం, వివరాలు ఇచ్చి జ్యోతిష్కుణ్ణి భవిష్యత్తు చెప్పమనండి. నూటికి తొంభై తొమ్మిదివంతులు తప్పే అవుతుంది. కొద్దిమంది తెలివిగలవాళ్ళు అనేకమంది బలహీనతలను కేష్ చేసుకునే వ్యాపారమిది. అనాదిగా జరుగుతున్న విద్యావంతుల్లో, విజ్ఞానశాస్త్రవేత్తల్లో చివరకు డాక్టర్లలో కూడా ఈ మూర్ఖత్వం ఎంత ప్రబలిపోయిందంటే ఈ రోజున బ్రహ్మండమైన ముహూర్తంలో వివాహం చేసుకుని, ప్రతి నిముషం కొట్లాడుకునే దంపతులు కూడా సుముహూర్తం, జన్మనక్షత్రం, తిధి నిర్ణయించుకుని నెప్పులు రాకుండానే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా నిర్ణీత సమయంలో బిడ్డల్ని ప్రసవించేంతవరకూ.
ఖగోళ శాస్త్రం ఒక సైన్సు. జ్యోతిష్యం గ్రహాల చలనంతో లెక్కకట్టే భవిష్యత్తు......ఒక సూడో సెన్సు, కేవలం ఒక నమ్మకం! చేతి వేళ్ళ ముడతలకి అనువుగా ఏర్పడిన గీతల ఆధారంగా ఒకశాస్త్రం (హస్తసాముద్రికం), ఇంట్లో ధారాళంగా గాలి రావటం కోసం ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలి అన్నది ఆధారంగా ఒక శాస్త్రం (వాస్తు) ఏర్పడ్డాయి. చాలా మందికి అవి జీవనాధారం కలిగించాయి.
ప్రశ్న : సైంటిఫిక్ ఫిక్షన్ కీ, సూడో సైంటిఫిక్ ఫిక్షన్ కీ తేడా ఏమిటి?
(కె. నిరంజన్ రెడ్డి, నిజామాబాద్)
జవాబు : నిరూపణ ఐన శాస్త్రీయ సిద్ధాంతాలపైన, తర్కానికి విలువనిస్తూ ఊహించి వ్రాసింది సైంటిఫిక్ ఫిక్షన్. అశాస్త్రీయమైన, నిరూపించబడిన విషయాలకి వ్యతిరేకంగా(Against Alredy Prooved) వ్రాస్తే అది సూడో....ఉదాహరణకి, అంతరిక్షనౌక సూర్యుడి "మీద" దిగింది అని వ్రాస్తే అదో అశాస్త్రీయం. మరే శక్తి ఆధారమూ లేకుండానే, కేవలం సూర్యుడి ఆధారంగా అంతరిక్ష నౌక వేగం సెకనుకి రెట్టింపు అవుతూ వెళ్ళింది అని వ్రాస్తే అది ఫిక్షన్.
ప్రశ్న : "పల్సర్ " అంటే ఏమిటి? (ఓంకార్ శంకర్, కరీంనగర్; ఉషశ్రీ దేవరకొండ; ఇంకా ఎంతోమంది పాఠకులు)
జవాబు : అనుకోని విధంగా 1967లో గమ్మత్తయిన విషయాన్ని మన శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. ఆకాశం మీదనుంచి భూమివైపు రేడియో ఎమిషన్స్ ప్రతీ 1.33 సెకనుకీ ఒకసారి వస్తున్నాయని! దీన్ని బహిర్గతపరిచే నక్షత్రాలకి (?) పల్సర్ అని పేరు పెట్టారు. కొన్ని విశాలమైన తోటల్లో గిర్రున తిరుగుతూ నీటిని నాలుగువైపులకీ వెదజల్లి గడ్డిని తడిపే పరికరాల్లా ఈ పల్సర్ వేగంగా తిరుగుతూ ఎలక్ట్రాన్స్ ని వెదజల్లితే, భూమివైపు పయనించేవి, ఈ రేడియో తరంగాల్ని సృష్టించాయని ధృవీకరించారు. సూర్యుడికన్నా కోట్ల కోట్ల రెట్లు శక్తివంతమైన న్యూట్రాన్స్ స్టార్సే ఈ విధంగా 'మినిక్కు' మినిక్కు' మంటూ పల్సర్ ని విడుదల చేస్తున్నాయని శాస్త్రజ్ఞుల అంచనా. అదే నిజమైతే, ఈ చిన్న దీపావళి భూచక్రల్లాంటి నక్షత్రాల్ని ఇప్పట్లో మనం మనకున్న పరికరాల ద్వారా గుర్తించలేము. మన శాస్త్రీయ విజ్ఞానం ఇంకా పెరగాలి.