అంతరిక్ష విహారంలో అడ్డంతగిలే యక్షప్రశ్నల నివృత్తిక్లై కొంతసేపు.....
ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలకు యండమూరి జవాబులు
ప్రశ్న : స్పేన్ సూట్ అంటే ఏమిటి? అది ఏ విధంగా నిర్మింపబడుతుంది.(రాజా, విజయవాడ)
జవాబు : శూన్యంలో మనిషి ప్రవేశించాలంటే శరీరంచుట్టూ ఒక కృత్రిమమైనపోర చాలా అవసరం! ఆక్సిజన్ అందజేయటానికీ, రక్తం, శూన్యపు వత్తిడికి సలసలా మరిగిపోకుండా వుండటానికి ఈ పొర (సూట్) ఉపయోగపడుతుంది. మెడ వెనుకనుంచి వచ్చే ఒక గొట్టం నీటిని అందజేస్తుంది. అలాగే టాయిలెట్ పరికరాలు కూడా ఈ సూట్ లోనే అమర్చబడి వుంటాయి. ఈ సూట్ లో ఎప్పుడూ చల్లని నీరు ప్రవహిస్తూ శీతలం కలుగజేస్తుంది. రేడియేషన్ నుంచీ మైక్రోమెటీరాయిడ్స్ నుంచీ రక్షించటానికి, రేడియో సంబంధం ద్వారా మాట్లాడటానికి వీలుగా ఏర్పాట్లు వుంటాయి. అల్యూమినియమ్, టెఫ్రాన్, నైలాస్ దారాలతో ఈ సూట్ అల్లటం జరుగుతుంది. 1965మార్చిలో అలెక్సీలేనోవ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా శూన్యంలో ఈ సూట్ ధరించి నడక సాగించాడు. 1986 వరకూ కొద్ది మార్పులతోనే ఈ సూట్ నిర్మాణం కొనసాగుతూంది. 'చీకట్లో సూర్యుడు' మరో యాభై సంవత్సరాల తరువాత జరిగే చరిత్ర. అప్పటికి ఈ 'స్పేస్ సూట్లు' అవసరం లేకుండానే- మనిషి శూన్యంలో అడుగు పెట్టగలడన్నది శాస్త్రీయ పరిజ్ఞానంగల ఎవరి వూహకైనా తోస్తుంది. ఆ రోజు వచ్చేసరికి రాకెట్లలో కూడా మనిషి తన యింట్లోలాగే నడుస్తాడని శాస్తజ్ఞుల అంచనా! ఆ ధియరీయే నవలలో ఉపయోగింపబడింది.
ప్రశ్న : భూమికి ఒక నక్షత్రం ఎంత దూరంలో వుందో ఎలా కనుక్కుంటారు?(జయవిజయ, పటాన్ చెర్వు)
జవాబు : మీ ఇంట్లో ఒక మూల నిలబడి, డైనింగ్ టేబుల్ మీద అన్నంగిన్నెకీ, కూరగిన్నెకీ మధ్య ఎంతదూరం వుందో చూడండి. గదిలో మరో మూలకి వెళ్ళి చూస్తే, ఆ దూరంలో వ్యత్యాసం కనబడుతుంది. మీరు దానికి ఎంతదూరంలో వున్నారో గ్రహించవచ్చు. అలాగే భూమి తనువున్న స్థానానికి ఆర్నెల్ల కాలంలో కొన్ని కోట్ల మైళ్ళదూరం ప్రయాణం చేస్తుంది. నక్షత్రం కనబడే స్థానపు మార్పునిబట్టి దాని దూరాన్ని ఆ విధంగా లెక్కకట్టవచ్చు. ఈ రోజు నాటికి మనకి సుమారు అయిదు వేళ నక్షత్రాల దూరాలు తెలుసు. చీకట్లో సూర్యుడు కధాకాలం నాటికి 60,000 నక్షత్రాల దూరం తెలుస్తుంది.
ప్రశ్న : 5వ జనరేషన్ కంప్యూటర్లోనే, మాటల్ని అర్థంచేసుకోగల శక్తి. తిరిగి- మాట్లాడగలిగే శక్తి వున్న కంప్యూటర్ లు వస్తాయని వ్రాసివున్న పేపర్ కటింగ్ ని మీకు పంపుతున్నాను. చీకట్లో సూర్యుడు నవలలో 8వ జనరేషన్ కంప్యూటర్ కూడా ఇంకా 'బటన్స్' వాడటమేమిటి? భవిష్యత్తుకాలంలోకి అంతటా దూసుకెళ్ళినప్పుడు ఇంకా 'భూతకాలం' వాసనలు కనపడటం న్యాయమా? ఈ శాస్త్రంలో ఎక్స్ పర్ట్స్ సలహాలు తీసుకొని వ్రాస్తే ఇంకా బావుండేది?
(జొన్నలగడ్డ అనంతజ్యోతి. భరత్ నగర్ కాలని-18)
జవాబు : మనకు తెలిసిన విషయం మరొకచోట వేరేలా కనపడగానే మరీ అంత ఉద్వేగపడిపోనవసరం లేదు అనంతజ్యోతిగారూ, రచయిత ఎవరి సలహాలు తీసుకొని వ్రాస్తున్నాడో మనకి అనవసరంగానీ, 'మాట్లాడే' కంప్యూటర్ల గురించి క్రితం సంచికలోనే ప్రస్తావించాడు కదా ఇక మీ ప్రశ్న ఎలా వుంటుందంటే, కార్లు వచ్చాయి కదా సైకిళ్ళు దేనికి? 'సైకిళ్ళు భూతకాలం వాసనలు కదా' అన్నట్లు వుంది. మాట్లాడే కంప్యూటర్లు వస్తే బటన్స్ నొక్కే కంప్యూటర్లు పరిశోధనా శాలలోంచి తొలగిపోవు.
ప్రశ్న : మీకు అన్ని విషయములు తెలుసన్నది నాకు అనుమానమే. కావున తెలుసుకుని వ్రాయండి.
ఎ) కలియుగం ప్రారంభం ఎప్పుడు జరిగింది? తారీఖులతో సహా తెలియజేయండి.
బి) గాలక్సీకీ భూమికి దూరం ఎంత? (డా||ఆనందరావు, మంథని)
జవాబు : అన్ని విషయాలూ తెలిసినవారు ఈ భూమ్మీద ఎవరూ లేరు. ఆర్థర్ క్లార్క్ కి, అసిమోవ్ కీ కూడా తెలియదు. మీరడిగిన పదకొండు ప్రశ్నలకీ సమాధానం నవలలోనే వుంది. మరొక సారి చదవండి.
ఎ) కలియుగం అన్నదేదీ సైన్సులో లేదు. అది ప్రారంభమయ్యేనాటికీ తారీఖులూ, పంచాంగాలూ లేవు.
బి) భూమికూడా గాలక్సీలో భాగమే కాబట్టి దూరం ప్రసక్తి లేదు.
ప్రశ్న : ప్రపంచంలో అందరికన్నా గొప్ప నెంబర్ వన్ సైంటిస్ట్ ఎవరు?(నిరంజన్ రెడ్డి, కరీనంగర్)
జవాబు : అసిమోవ్ మాటల్లో చెప్పాలంటే 'నెంబర్ టు' ఎవరు అన్నది మీ ప్రశ్న అయితే సమాధానం చాలా కష్టమై వుండేది. ఆ స్థానంకోసం చాలామంది నిలబడతారు. ఐన్ స్టీన్, లూయీపాక్చర్, డార్విన్, గెలీలియో, ఆర్కిమెడీస్, వగైరా వగైరా. వీళ్ళలో ఎవరు రెండోస్థానం ఆక్రమిస్తారో చెప్పటం చాలా కష్టం. ఆయా రంగాల్లో వీరి కృషి అపూర్వం అనూహ్యం. కాగా నెంబర్ వన్ ఎవరూ అంటే అవును- అతడే.....ఐజాక్ న్యూటన్! సంఖాశాస్త్రంలో కాలిక్యులస్ కనుక్కుని, కాంతిని విభజించటం ద్వారా ఫిజిక్స్ కి సేవచేసి, వేగం తాలూకు సూత్రాలు కనుక్కుని ఆస్ట్రానమీకి సాయం చేసాడు. ఈ రంగాల్లో ఏదో ఒకటి చాలు అతడిని రెండో స్థానంలో నిలబెట్టటానికి. మూడు కలిస్తే మొదటి స్థానమే! వ్యక్తిగతంగా అతడు గొప్పవాడు కాదు. మాట్లాడం సరిగ్గా చేతకాదు. నమ్మినదాన్ని నల్గురి ఎదుట అయినాసరే- చరిత్ర సృష్టించిన నెంబర్ వన్ సైంటిస్ట్ అతడు.
ప్రశ్న : చంద్రుడిమీద మనుష్యులు నివసించే రోజు తొందర్లో వస్తుందా?(ఆనందజ్యోతి, విశాఖపట్నం)
జవాబు :రాకపోవచ్చు, దానివల్ల మనిషికి ఎ ఉపయోగమూ (ఇప్పట్లో) లేదు కాబట్టి! అంతరిక్ష నగరాల్లో (స్పేన్ సిటీ) నివసించే రోజు మాత్రం తొందర్లోనే వస్తుంది.
ప్రశ్న : సీరియల్ నవలలో స్టార్ వార్స్ ని గురించి ప్రస్తావించటం జరిగింది. అణుబాంబు కన్నా దీనికి ఎక్కువ ఖర్చవుతుందా? అణుబాంబు కన్నా స్టార్ వార్స్ వల్ల ఉపయోగం వుందా?
(పిన్నమనేని మందాకిని, గోదావరిఖని)
జవాబు : మీ ప్రశ్న నాకు సరిగ్గా అర్థంకాలేదు. 'ఉపయోగం వుందా?'-అంటే ఎవరికి? యుద్ధదాహం వున్న దేశానికి, అణుబాంబుకన్నా స్టార్ వార్ ని తయారు చేసుకోవటంలో ఎక్కువ ఉపయోగం వుందా? అన్నది మీ ప్రశ్న అయితే వుంది! అణుబాంబువల్ల కేవలం ఒక ప్రదేశాన్ని ఏకకాలంలో నాశనం చెయవచ్చు. స్టార్ వార్స్ తో కొన్ని వందల ప్రదేశాల్ని ఏకకాలంలో నాశనం చేయవచ్చు. (రక్షించుకోవచ్చునని కూడా అంటాడు ప్రెసిడెంట్ రీగన్) పోతే ఒక దేశం పూర్తిగా స్టార్ వార్ కి తయారవ్వాలంటే 2,400 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇది వెయ్యి అణుబాంబులు తయారు చెయ్యటానికన్నా ఎక్కువ ఖర్చు.(క్రింద ప్రశ్న కూడా మీరు చదవండి.)
ప్రశ్న : భూమి ఎలా అంతమవుతుంది? (రాజశేఖర్, అడ్డతీగెల)
జవాబు : ప్రస్తుతం ఈ రకమైన షేపుకి వచ్చి అయిదుకోట్ల సంవత్సరాలయింది. రకరకాల వాయు సముదాయం, క్రమక్రమంగా గట్టిపడి లోహాలు, నీళ్ళు, గాలి, మనుష్యులు, జీవులు ఈ రకం పరిణామం చెందింది. సూర్యుడున్నంతవరకూ భూమి ఇలాగే వుంటుంది.(యుద్ధాలవల్ల మానవజాతి అంతరించవచ్చు అది వేరే సంగతి) 1930 వరకూ శాస్త్రజ్ఞులు సూర్యుడు క్రమంగా చల్లబడతాడని, జల ప్రళయం వస్తూందని భావించేవారు. కానీ 1930లో సూర్యుడు, బూడిదవబోయే ముందు ఎర్రరాక్షసుడుగా వెలిగి, వేడి వెదజల్లుతాడని శాస్త్రజ్ఞులు కనుక్కొన్నారు. అందువల్ల ఆ సమయం వచ్చేసరికి భూమిమీద లోహలన్నీ కరిగి ఒక అగ్నిగోళంగా మారిపోతుంది. ఆ తరువాత క్రమంగా చల్లబడి, ఘనీభావించిన వాయు సముదాయం అవుతుంది. ఇది జరగటానికి ఎనిమిదికోట్ల సంవత్సరాలు పడుతుంది. ఇది నాణేనికి ఒకవైపు. ఇక మనుష్యజాతి గురించి అయితే వాయు కాలుష్యంవల్ల, వాతావరణలో మార్పు వల్ల ఈ లోపులోనే, మరో వెయ్యి సంవత్సరాల్లో అది అంతరించిపోవచ్చు.
ప్రశ్న : ఇతర గ్రహాలమీద జీవకోటి వుందా? ఒకవేళ వున్నా ఆ సూక్ష్మ ఏకకణ జీవులకోసం కుజుడి వరకూ వెళ్ళటం మనకి లాభదాయకమేనా? అంత ఖర్చు అవసరమా? (నర్మదారాణి, రాజమండ్రి)
జవాబు : ఇతర గ్రహాలమీద జీవరాసి వుందనే (కనీసం కుజుడిమీద) మనవారు భావిస్తున్నారు. ఇది మీ మొదటి ప్రశ్నకు సమాధానం. ఇక, రెండో ప్రశ్న..... భూమ్మీద జీవాలు పోటీన్స్, అమినో ఆసిడ్స్ మొదలైన వాటితో నిర్మింపబడ్డాయి కదా. కుజుడిమీద జీవరాసి అది మీరన్నట్టు ఎంత సూక్ష్మజీవులైనా సరే, వేరే విధంగా నిర్మింపబడి వుండవచ్చు. అదే నిజమైతే 'ప్రాణం' అనేదానికి వేరే అర్థం మనకి దొరుకుతుంది. భూమ్మీద మొట్టమొదటి జీవరాసి ఎలా ఉద్భవించింది అన్న ప్రశ్నకు కూడా ఇది సమాధానం చెపుతుంది. మరణం లేకపోవటం అన్నదేదైనా వుంటే ఆ రహస్యం భూమ్మీద దొరకదు. వేరే గ్రహాలమీదున్న జీవుల వల్లే తెలియాలి. మన అంతరిక్ష నౌకలు తీసిన ఫోటోల వల్ల, కుజుడిమీద జీవరాసి లేదని తేలింది. కానీ ఏ ఇతర గ్రహం వాళ్ళయినా మనని అంత దూరం నుంచి తీస్తే, మన భూమ్మీద కూడా జీవరాసి లేనట్టే ఆ ఫోటోలు వస్తాయి కాబట్టి నిర్థారణంగా తేలేవరకూ మన శాస్త్రజ్ఞులు ఇంకా కుజుడిమీద జీవరాసి వుందనే నమ్మకంతోనే అంతరిక్ష పరిశోధనలు జరుపుతున్నారు.
ప్రశ్న : ఈ విశ్వం ఎలా పుట్టింది? విశ్వం తరువాత ఏముంది? మనిషి పయనిస్తూ పోతే ఎక్కడకు చేరతాడు? (వేదాంతశర్మ, కేసముద్రం)
జవాబు : మీ పేరు, ఊరి పేరు చూస్తూంటే కేవలం మమ్మల్ని ఏడిపించటానికే ఈ ప్రశ్నలు అడిగినట్టు తోస్తోంది. అయినా సమాధానాలు చాలా మందికి ఉపయోగపడవచ్చు. పుక్కిటి పురాణాల మీద నమ్మకం వదిలేసుకోగలిగితే మీరు దీన్ని చదవండి. విశ్వం ఎలా పుట్టింది అన్నది మీ మొదటి ప్రశ్న. చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. అందులో మేము నమ్మిన సిద్ధాంతం ఇది : 0 = +1 -1కదా! కొన్ని కోట్ల టుది పవర్ ఆఫ్ కోట్ల సంవత్సరాల వెనుక, శూన్యం నుంచి పాజిటివ్, నెగిటివ్ శక్తులు విడివడి, చెరోవైపుకి సర్దుకున్నాయి. అలా పుట్టిన మొట్టమొదటి అణువు, సముదాయమై తద్వారా నక్షత్రాలు, వగైరా, వగైరా.....ఇక మీ ప్రశ్న....విశ్వం తర్వాత ఏముంది?......అని! పై థియరీ మీరు వప్పుకున్న పక్షంలో నెగిటివ్ విశ్వం వుంటుంది.
ఇక మీ చివరి ప్రశ్న. మీరూ మీ కుటుంబమూ ఒక రాకెట్ ఎక్కిమీ కేసముద్రం నుంచి బయలుదేరి కాంతివేగంతో పయనిస్తే చంద్రుణ్ణి చేరుకోవటానికి1.3 సెకన్లు సూర్యుణ్ణి చేరుకోవటానికి 8 నిముషాలు. మన గాలక్సీ దాటటానికి లక్ష సంవత్సరాలు; విశ్వం దాటటానికి వందకోట్ల సంవత్సరాలు పడుతుంది. విశ్వం వృత్తాకారంలో వుందన్న ఐన్ స్టీన్ థియరీ నిజమైతే అప్పుడు మీరు తిరిగి కేసముద్రం చేరుకుంటారు. కాంతివేగంతో వెళతారు కాబట్టి మీ వయసులో కూడా మార్పు వుండదు అని ఫిక్షన్ రచయితలు అంటారు.
ప్రశ్న : 'మాయాస్' అంటే ఏమిటి? ఎగిరే గాలిపళ్ళేలు వున్నాయా? (యం.గంగాధరరావు, ఇరగవరం పోస్టు; కృష్ణశ్రీ, తెనాలి; టి నర్సింగరావు, ఖమ్మం; ఎన్. రాజకుమార్ రెడ్డి, తిరుపతి; శ్రీశ్రీశైలం, బోయినపల్లిగేట్; శ్రీనివాసులు, పెబ్బియర్)
జవాబు : ఇతర గ్రహాలనుంచి వచ్చే జీవులకు 'మాయాస్' అని పేరు పెట్టారు మనవాళ్ళు. వీళ్ళు మన భూమికి ఎగిరే పళ్ళేల్లో వస్తారని అంచనా. నిజానికి ఎగిరే పళ్ళేలు అనేవి ఏమీలేవు అద్భుత రసాన్ని పోషించే కొందరు అడ్వెంచరిస్టులు రకరకాల ఫోటోలని సృష్టించి, అటువంటి గాలి పళ్ళేల్ని (ప్లయింగ్ సాసర్స్) చూశామని ప్రకటిస్తూ వుంటారు. ఇంతవరకూ ఏ గ్రహంనుంచీ అటువంటి వాహనాలు మన భూమివైపు వచ్చినట్టు శాస్తపూరితమైన దాఖలాలు లేవు. ఊహాగానాలు తప్ప, భవిష్యత్తులో అలాటి ప్లయింగ్ సాసర్స్ భూమిమీదకు రావచ్చు. ఆ ఊహ ఆధారంగానే ఈ ఫిక్షన్ నవలని వ్రాసాను.
ప్రశ్న : వెన్నెల్లో ఆడపిల్లలాంటి అపురూపమైన నవలా చిత్రికను వదలి అంతరిక్ష నవలలు ఎందుకో? బహుశా ఆహా ఏమి యండమూరి పరిజ్ఞానం అనుకోవడానికా? మాతోనే వుండండి. మా మధ్య నిలబడి వ్రాయండి. అది మరణమృదంగాలైనా వినసొంపుగా వుంటాయి. స్పూర్తిని ఇస్తాయి.
(పి.ఆర్. బాంధవి, విశాఖ)