Previous Page Next Page 
ఒక తీయని మాట పేజి 21

    "ఉన్నమాటన్నందుకు మీరు థాంక్స్ చెప్పినా నేను  పుచ్చుకొను...."
    నిర్మల కళ్ళు చెమ్మగిల్లాయి. వోణితో ఒత్తుకుంటూ- "నేనంటే మీ కెందుకింత అభిమానం?" అంది.
    "నిర్మలా! నిజం చెబుతున్నాను- వినండి! మనం  రోజూ చూసే  పని మనిషి  పదిళ్ళలో వెట్టిచాకిరీ చేసినా మనసు చలించదు. కానీ ఒక దేవత , ఒక రాజకుమారి తనపనులు తాను చేసుకుంటేనే చూసి భరించలేను. మిమ్మల్ని చూడగానే ఏ రాజాంతఃపురంలోనో హంసతూలికాతల్పఁపైన దాస దాసీల  సేవలందుకుంటూ వైభవంగా జీవించవలసినవారనిపిస్తుంది. మిమ్మల్నిలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఏదో విధంగా మీకు సాయపడాలి. అదే నాకు తృప్తినిస్తుంది. మీ ముఖంలో చెరగని నవ్వుండాలి. అదే నా జీవితాశయం...."
    నిర్మల అతడి మాటలకు కరిగిపోయింది- "మీవంటి స్నేహితుడు లభించడం నా అదృష్టం...." అందామె.
    "అదృష్టం నీది కాదు. నాది. ఎంత డబ్బిచ్చినా తిరుపతి వెంకన్న  దర్శనం అరగంటకు మించిఉండదు. మిమ్మల్ని దగ్గరగా ఇలా ఎంతసేపట్నించో చూడగలగడం నా అదృష్టం...."
    "అది మీ అభిమానం !" అని - "మళ్ళీ  బట్టలు మార్చుకుని వస్తాను. అవతల చాలా పనులున్నాయి...." అంది నిర్మల.
    "అందుకుపాయం చెబుతానన్నానుగా - ఏమిటని అడగరేం?"
    "చెప్పండి-"
    "మీరీ దుస్తుల్లో ఇలాగే ఉండి నన్ను చూస్తూండండి. మీ కళ్ళముందే ఆ పనులన్నీ అయిపోతాయి....." అన్నాడు సాగర్.
    "అంటే ఆ పనులన్నీ మీరు...."అని- "వద్దు...." అంది నిర్మల.
    "ఈ ఒక్కరొజూకూ వద్దనడానికి వీల్లేదు...." అన్నాడు సాగర్.
    అయితే నిర్మల ఓ పట్టాన అంగీకరించలేదు. మంచిమాటలతో సాగర్  ఆమెను ఒప్పించి- "మిమ్మల్ని చూస్తూ కూర్చుంటే నాకు తెలియకుండానే ఆకాశాన్ని పిండికూడా చేయగలనని  నిన్ననే నాకు తెలిసింది...." అన్నాడు.
    నిర్మల నాలిక్కరుచుకుని- "నిన్న మీరు చేసిన సాయానికి కనీసం థాంక్సైనా  చేపాలని ఇంతవరకూ నాకు తోచనేలేదు" అంది.
    "ఎంత చేసినా  దేవి భక్తుడికి బుణపడదు. భక్తుడే దేవికి బుణపడతాడు. పదండి...." అన్నాడు సాగర్.
    ఆ తర్వాత  అతడు పనులు చేస్తూంటే ఆమె నిలబడి చూసింది. అదా ఆమెకు యిబ్బందిగానేఉన్నా తప్పలేదు.
    "ఇలాంటి పనులు నేను మా అమ్మకు చేశాను. నా సేవలందుకునే అర్హత ఆమెకు లేదు. నా పనులకామె సంతోషించనూలేదు. మీకు సేవలుచేసుకుంటే నా కెంతో తృప్తిగా ఉంది" అన్నాడు సాగర్.
    "నాకు  మీరు సేవలుచేయదమెందుకు?
    "రాణిని రాణిలా చూడలనుంది. మిమ్మల్ని మహారాణి హొదాలో చూడాలనుకున్న నా కోరిక తీరడానికింతకుమించిన ఉపాయమేముందో మీరే  చెప్పండి!"
    "మీరు మరీ ఆకాశానికెత్తేస్తున్నారునన్ను...." అంది నిర్మల సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడి అప్పుడే విచ్చుకున్న గులాబిలాఉంది.
    "నేనేమంటున్నానో నాకు తెలియదు. కానీ అది చంద్రుడికో నూలు పోగో, ఉడతాభక్తో అని మాత్రమే అనిపించుకుంటుందని నాకు తెలుసు....."
    నిర్మల మరి మాట్లాడలేదు. అతడు చాలా తెలివిగా  మాట్లాడుతున్నాడని ఆమె గ్రహించింది. అతడి మాటలామెకు నచ్చాయి. అంతేకాదు- అతడి నామె నమ్ముతోంది.
    వరుసగా అతడు పనులన్నీ చేశాక- "ఇప్పుడు మనం కాసేపు తీరికగా కబుర్లుచెప్పుకోవచ్చు" అన్నాడతడు.
    "ఇంక బట్టలు  మార్చేసుకుంటాను...." అంది నిర్మల.
    "అప్పుడే?"
    "అమ్మ వచ్చేస్తే?"
    "ఇంకో గంటదాకా అమ్మరాదు...."
    నిర్మలకా బట్టలప్పుడే విప్పాలనిలేదు. కానీ మాణిక్యాంబ వస్తుందన్న భయమూ ఉందామెకు.
    "ఇంక కబుర్లేముంటాయి?" అంది నిర్మల.
    "దేవీదర్శనమైనప్పుడు కాళిదాసునోట ఆగకుండా కావ్యాలువచ్చాయి"
    "ఒక్కక్షణం మీరాగితే నేను చెప్పవలసిందీ కొంత ఉంది" అంది నిర్మల గంభీరంగా.
    ఉన్నట్లుండి ఆమె అలాగానేసరికి సాగర్ తెల్లబోయాడు. తన కష్టమంతా వృథాకాదుగదా అని భయపడ్డాడతడు.
    "చెప్పండి మీ మాటలు వీణానాదంలా ఉంటాయి. అసలు మిమ్మల్ని  మాట్లాడించాలానే  నేను  మాట్లాడుతున్నది....."
    "నేను చెబుతున్నది విని మీరేమీ అనుకోకూడదు" అంది నిర్మల.
    సాగర్ లో భయం పెరిగింది. వ్యవహారం చంచల్రావు విషయంలో లాగే ఇప్పుడు బెడిసికొట్టదుకదా అనుకున్నాడతను.
    "మీరు నన్ను శపించినా అదే  పరమనుకుంటాను. నేనేమీ అనుకోను. చెప్పండి" అన్నాడు  సాగర్.
    "మీరు నన్ను దేవత అన్నారు. అందుక్కారణం మీ అబిమానం కావచ్చు. కానీ నేను దేవతనుకానని నాకు తెలుసు. నేను  అసహాయురాలిని. ఎవరినీ దేనికీ ఎదిరించలేదు. నా భవిష్యత్తుపైకూడా నాకేమీ పెద్దగా ఆశలు లేవు. దేవుడిచ్చినదానితో సరిపెట్టుకుంటాను. మా అమ్మ నాలో దేవతనుచూడడంలేదు. దెయ్యాన్ని చూస్తోంది. అయినా నేను దెయ్యాన్నన్నీ అనుకోవడం లేదు. వాస్తవజీవితం తెలుసుకుని మసులుతున్నాను. అయితే ఈరోజు నాకు నేను  నిజంగా దెయ్యాన్నే మోననిపిస్తుంది....."
    "ఎందుకు?" అప్రయత్నంగా అడిగాడు సాగర్.
    "రాకుమారి, దేవత మహారాణి అని నన్నంటున్నారు మీరు. కానీ  అది వాస్తవంలోనిజంకాదు. అదంతా మీ ఊహ అయితే మీరు రాకుమారుడు అన్నది వాస్తవంలోకూడా నిజం. నన్ను సానుభూతితో అభిమానించిన మీలో దైవస్వరూపమూఉంది. వయసునుబట్టి రాజకుమారుడనాలి తప్పితే  మీరు  నిజంగా మహారాజవై భోగంలో ఉన్నారు. ఇలాంటి మీరు నన్నభిమానించారు. ఫలితమేమిటి? అంట్లుతోముతున్నారు. బట్టలుతుకున్నారు. కూరలు తరుగుతున్నారు. వంటచేస్తున్నారు...."

 Previous Page Next Page