Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 21


    "అలాగేనండి. వాళ్ళకి ఈరోజే ఉత్తరం వ్రాస్తాను. వాళ్ళు అబ్బాయిని తీసుకుని వస్తారు. మనకీ, వాళ్ళకీ నచ్చితే సంబంధం నిశ్చయించుకుని ముహూర్తం పెట్టించేద్దాం" అంది అంబిక.


    కోడలి మాటలు వింటూనే ఆ దంపతులకు నెత్తిమీద బరువేదో తగ్గి పోయినట్టయింది.


    "అలాగే, నువ్వు చెప్పినట్టే చేద్దాం." అన్నారు ఆ దంపతులు ఇద్దరు సంతోషంగా.


    "మీరు ఏమంటారు! మీకు మీ చెల్లెలంటే ప్రాణంగా" అంది భర్త వేపు చూసి నవ్వుతూ.


    "నేను ఏమంటాను అంతా నీ ఇష్టానికే వదిలేశాను" అన్నాడు జయరాం నవ్వుతూ.


    గణేశ్ రావు గారు సుభద్రమ్మ ఇద్దరు మనసారా నవ్వుకున్నార, కోడల్ని కొడుకును చూసి.


    మేడమీదనుండి ఇంద్రసేన వారి మాటలు వినసాగింది.


                                                        *    *    *


    అంబిక మేడమీదకు వచ్చి ఇంద్రసేన గదిలోకి వెళ్ళింది.


    ఇంద్రసేన వారి మాటలన్నీ మేడమీదనుండి విని వదినగారు మేడమీదకు రావటం చూసి వెనుతిరిగి గదిలోకి పారిపోయింది. ఏం తెలీనట్టు గదిలో సోఫాలో కూర్చుంది.


    "ఏమ్మా ఇంకా నిద్రపోలేదా?" అంటూ నవ్వింది అంబిక. తలతిప్పి "లేదు వదినా" చిరునవ్వుతో సమాధానం చెప్పింది.


    ఆమె పక్కగా వచ్చి కూర్చుంటూ "మా మాటలు విన్నావా?" అంటూ అడిగింది.


    "మీ మాటలా! లేదే" తడబడింది.


    "ఇదిగో అమ్మాయి ఇటు చూడు! అంటూ బుజాలుపట్టి తనవేపుకి తిప్పుకుంటూ కళ్ళల్లోకి సూటిగా చూసి ఫక్కున నవ్వింది.


    వదినగారి ముఖంలోకి సూటిగా చూడలేకపోయింది. చూపులు నేలకు అతుక్కుపోయాయి. తను ఆ మాటలన్నీ వినేసింది అని వదిన గ్రహించేసింది అని తన కర్ధం అయిపోయింది.


    "అందంగా ఉన్న అమ్మాయిలు అబద్ధం ఆడినప్పుడు ఇంకా అందంగా కనిపిస్తారు. నువ్వు నా కళ్ళకి ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా! నేనే మగవాడ్ని ఐతే నిన్ను అమాంతం ఎత్తుకుని...."


    "ఛీ పో వదినా" అంది ముఖం పక్కకు తిప్పేసుకుంటూ అటు చూడలేక.


    ఇంద్రసేన ముఖమంతా ఎర్రగా అయిపోయింది సిగ్గుతో.


    "కాస్త సిగ్గు దాచుకోవాలి అమ్మాయి. ఈ సిగ్గులన్నీ మూటగట్టి పెళ్ళయ్యాక మా అన్నగారివద్ద ఒంపాలి" అంది.


    ఇంద్రసేన మాట్లాడలేదు.


    అంబిక ఆమెను పూర్తిగా తనవేపుకి తిప్పుకుంటూ అంది. "ఇందూ నీకు మంచిసంబంధం చెయ్యాలని మీ అన్నగారు కలలు కంటున్నారు. వారి భార్యగా తియ్యని కలలు నిజం చెయ్యటం నా వంతు. ఆడపడుచు పెళ్ళి చెయ్యటం నా బాధ్యత. నువ్వు నవ్వుతూ సుఖంగా ఉండాలనే మా అందరి కోరిక."


    ఇంద్రసేన ఆమె చెపుతుంటే అలా వినసాగింది ఎంత మంచిమనసు వదినది అనుకుంది మనసులో.


    "నీకు ఈ సంబంధం ఇష్టమేనా!"


    ఆమె మాట్లాడలేదు. సిగ్గుతో తలవంచేసింది.


    "చెప్పు ఇందూ నీ ఇష్టమైతేనే వాళ్ళకి ఉత్తరం వ్రాస్తాను"


    "నీ ఇష్టమంటే నువ్వు ఇష్టపడినట్టేగా" అంటూ నవ్వింది అంబిక.


    "వదినా" అంది మెల్లగా.


    "నాకేమిటో భయంగా అనిపిస్తుంది" అంది ఇంద్రసేన ముఖం అదోలా పెడుతూ.


    "భయమా? ఎందుకు!" అర్ధంకానట్టు చూసింది.


    "ఆ కృష్ణమౌళి అస్తమానం ఫోన్ చేస్తుంటే...." అంటూ మాటలు ఆపేసింది.


    "ఊ ఫోన్ చేస్తే" అంది.


    "అలా కాదు వదినా మాటమాటకి పంతం పట్టినట్టు మాట్లాడుతున్నాడు. నన్ను ఎత్తుకెళ్ళిపోయి శ్రీకృష్ణుడిలా పెళ్ళి చేసుకుంటాడట."


    "నీతో అన్నాడా!"


    తలవూపి అంది "అతని అంతస్తు ఎక్కడ! మా అంతస్తు ఎక్కడ! అతను అతని తల్లి మా యింట్లో మా సొమ్ముతింటూ పడివుండేవారు. ఆవిడ మా ఇంట్లో వంటచేసేది. వంటావిడ కొడుకుని నేను పెళ్ళి చేసుకోవటమా, చెప్పు వదినా?" అంబిక క్షణంసేపు అలా ఉండిపోయింది.


    శ్యామలమ్మ, గణేష్ రావు గారి తోడబుట్టిన చెల్లెలు. భర్తపోయిన తరువాత ఆదరించవలసింది పోయి ఇంట్లో పెట్టుకుని చాకిరీ చేయించుకుని తల్లీ కొడుకులకి ఇంత అన్నం పెట్టేవారు.


    అన్నీ భరించి, సహించి ఆవిడ కొడుకుని పెట్టుకుని కన్నీళ్ళు కడుపులో దాచుకుని రోజులు వెళ్ళబుచ్చేది. గుట్టుగా సుభద్రమ్మ ఎంత బాగా చూసినా గణేష్ రావు గారు చూడనిచ్చేవారు కాదు.


    ఆయన అహంకారానికి తగినట్టు నోట్లోనుండి ఊడిపడినట్టు కొడుకు, కూతురు పుట్టారు.


    ఇంద్రసేనకి డబ్బు గర్వం నరనరాల్లోనూ జీర్ణించిపోయి వుంది.


    గర్వంతో కళ్ళు పొరలు క్రమ్మేసివున్నాయి.


    అంబిక పెదవులమీదకు నవ్వు తెచ్చుకుంటూ మెల్లగా అంది. "అతను ఫోన్ చేసి అన్నంతలోనే అతనితో నీ పెళ్ళి జరిగిపోతుందా!"


    "అలా జరగడానికి ఇది సినిమా కాదు, కలలూకావు. అతను నిన్ను ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకోవడానికి ఎంత ధైర్యం కావాలి! మీ అన్నయ్య, నేను పక్కనే ఉంటే అతనికి ధైర్యం ఉండొద్దూ? మనల్ని బెదిరిస్తున్నాడు. అతన్ని కాదని మీ అన్నయ్యని పెళ్ళి చేసుకు వచ్చేశాను. ఏం చేశాడు! నన్ను మీ అన్నయ్యని ఏమైనా అనగలిగేడా? మీ అన్నయ్య అంటే అతనికి హడల్" అంది.


    ఇంద్రసేన బేలగా చూసింది. "నాకు ఎందుకో భయంగా ఉంది వదినా" అంది.


    ఆ పాపం నీకు భయం, అందర్నీ బెదిరించకపోతేనూ అని మనసులో అనుకుంటూ పైకి అంది.


    "నీకు భయం ఏం వద్దమ్మా. నీ పెళ్ళి తొందరగా జరిపించే ఏర్పాట్లు చేస్తున్నాను. నువ్వు చాలా అమాయకురాలివి అని నాకు తెలుసు" అంటూ ఆడపడుచు తల ప్రేమగా నిమిరింది.


    "వదినా! నువ్వు వాళ్ళకి తొందరగా ఉత్తరం వ్రాయి. వాళ్ళతో మాట్లాడి ఈ సంబంధం ఖాయం చేసేయి" అంది.


    "ఆ! నీకు ఇష్టం అయితే ఈ సంబంధమే ఖాయంచేస్తాను" అంది అంబిక.

 Previous Page Next Page