Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 20

   
    "మా ఆడపడుచుని పెళ్ళిచేసుకొంటారా? అది సాధ్యమనుకొంటున్నారా!" అడిగింది ఆవేశంతో ఊగిపోతూ.


    "ఏం అలా అడుగుతున్నావు! నీ ఆడపడుచు ఏం అప్సరసా! కోటీశ్వరురాలా! నేను తల్చుకొన్నానంటే కో అంటే కోటిమంది అమ్మాయిలు నా ఇంటిముందుకొచ్చి నిలబడతారు. కాని.... పంతానికి నీ ఆడపడుచుని పెళ్ళి చేసుకొంటానంటున్నాను."


    అది మీ తరం కాదంటున్నాను" ఏమాత్రం తొణక్కుండా అంది.


    "చూస్తావుగా నువ్వే" అన్నాడు అదోలా నవ్వుతూ.


    "నా కంఠంలో ప్రాణం ఉండగా మీరు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోలేరు."


    "అంబికా" కోపంగా అరిచేడు.


    "మీ అరుపులకి నేనేం జడిసిపోను. ఇదే మీకు మొదటిసారిగా, ఆఖరిసారిగా చెబుతున్నాను. జాగ్రత్తగా ఉండండి. మా ఆడపడుచు అమాయకురాలు, మా వారికి ప్రాణం, మామగారికి, అత్తగారికి అందరికీ ప్రాణం. ఆ అమ్మాయిని ఎవరయినా ఏమయినా అంటే సహించము! మీరు ఇంటికి ఇలా ఫోను చెయ్యవద్దు! చేస్తే మర్యాద దక్కదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి జాగ్రత్త" అంటూ టపీమని ఫోను పెట్టేసింది.


    ఇంద్రసేన అలా బొమ్మలా చూస్తూ నిలబడింది.


    అంబిక ఆడపడుచు వేపు చూసింది.


    ఇంద్రసేన వదినగారి చెయ్యి పట్టుకుంది ధైర్యం తెచ్చుకోవటం కోసం.


    ఆ చేతిమీద భయంలేదన్నట్టు తట్టింది.


    ఇద్దరూ కొద్ది క్షణాలపాటు ఫోను రింగవుతుందేమోనని అలాగే చూశారు.


    వాళ్ళనుకున్నట్లు ఫోను రింగవలేదు.


    అంబిక, ఇంద్రసేన ఇద్దరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.


    "వదినా నువ్వు అతనికి బాగా చెప్పావు" అంది. ఆమెకు సంతోషం అనిపించింది.


    అంబిక నవ్వింది, ఆ నవ్వు ఎంతో హుందాగా అనిపించింది.


    "నువ్వు సమయానికి రాకుంటే" అంది.


    "రాకుంటే!" రెట్టించింది.


    "మళ్ళీ ఫోనులో ఏదో అనేవాడు. ఇలా చాలాసార్లు ఫోను చేస్తున్నాడు"


    ఆమె నవ్వి ఊరుకుంది.


    ఇంద్రసేనకూడా ఇక ఏం మాట్లాడలేదు.


    ఆ రాత్రి భోజనాలయ్యాక హాలులో గణేష్ రావు గారు, జయరామ్ కూర్చునివున్నారు. అక్కడే సుభద్రమ్మ కూడా కూర్చుంది.


    "మావయ్యగారూ మన ఇందూ వివాహం తొందరలో చేస్తే మంచిది అనిపిస్తుంది" అంది మెల్లగా.


    "అలాగే చేసేద్దాం అమ్మా. కాని మంచి సంబంధం దొరకాలిగా" అన్నారు ఆయన.


    ఆయన ఊహల్లో ఈ ఇంటికి రాబోయే అల్లుడు చాలా ధనవంతుడై ఉండాలి.


    చాలా అందగాడు అయివుండాలి. తన కుమార్తె పక్కన నిలబడితే ఈడూ జోడూ బాగుందని అందరూ మెచ్చుకొని ముచ్చటపడేలా ఉండాలి.


    అబ్బాయి గుణవంతుడు, విద్యావంతుడయి ఉండాలి. ముఖ్యంగా తన కూతుర్ని పువ్వుల్లోపెట్టి చూసుకొనేవాడయి ఉండాలి.


    అత్తగారు, మామగారు మంచివారు కావాలి.


    వాళ్ళు తన కూతుర్ని ఏమి అనకూడదు.


    అంటే తను భరించలేదు.


    అదేమాట తను కోడలితో అన్నారు ఆయన.


    ఆ మాటలువిని అంబిక భర్తవేపు చూసి చిరునవ్వు నవ్వింది.


    "తండ్రి మనసు నేను అర్ధం చేసుకోగలను. మీరు మీ అమ్మాయికి పెళ్ళి తలపెట్టండి. మంచి సంబంధం నేను తీసుకువస్తాను" అంది.


    ఆ మాటలతో గణేష్ రావు గారి ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆయన భార్యవేపు చూశారు, సుభద్రమ్మ సంతోషముతో కోడలివేపు చూస్తూ అడిగింది.


    "మంచి సంబంధము ఏదయినా ఉందా!"


    జయరాం భార్యవైపు గర్వంగా చూశాడు.


    తన భార్య ఎంత తెలివయినది!


    అందరికి ఎంత చక్కగా చెప్పగలుగుతుంది.


    ఇన్ని రోజులు తనకి ఆలోచన అనేది తెలిసేదికాదు. అంబికను చేసుకున్నాక ప్రతి చిన్న విషయానికి ఆలోచించటం నేర్చుకున్నాడు.


    ఏ విషయమయినా భార్యను సలహా అడగనిదే ఏ పనీ చెయ్యటంలేదు.


    గణేష్ రావు గారు కూడా ప్రతీ విషయంలో కాకపోయినా ఒక్కో విషయంలో కోడలి సలహా అడగటం నేర్చుకోసాగారు.


    సుభద్రమ్మకి ఎప్పుడూ కోడలంటే ఇష్టమే.


    "మంచి సంబంధం ఉంది అత్తమ్మగారూ, నాకు వాళ్ళు బాగా తెలిసినవాళ్ళే."


    "అలాగా! ఎవరమ్మా! అబ్బాయి ఏం చదువుకున్నాడు, అందంగా ఉంటాడా, మనకు కలిసిన సంబంధమేనా!" ఆవిడ ఆతృతగా అడిగింది.


    "వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు వాళ్ళకి ఎంత ఆస్తి ఉందో చెప్పలేం. అబ్బాయి ఫారిన్ వెళ్ళి చదివాడు. ఇంజినీర్. ఇక అందం విషయమా! అబ్బాయి పక్కన నిలబడితే మన ఇందూయే వెలవెలబోతున్నట్టు అనిపిస్తుంది.


    "ఆ" అన్నాడు జయరామ్, గణేశ్ రావు గారు ఇద్దరూ ఆశ్చర్యపోతూ, మా ఇందూ అందాలరాశి ఆ అబ్బాయి దగ్గర వెలవెలబోతుందా అన్నట్టు చూశారు.


    అంబిక నవ్వింది "కంగారు పడకండి, ఇందూ బంగారుబొమ్మే. ఇందూ అంత అందంగా ఇంకెవరూ ఉండరు. నిజమేకాని ఆ అబ్బాయి ఇందూకంటే అందంగా వుంటాడు. అంటే ఇంకెంత అందంగా ఉంటాడో ఊహించండి" అంది.


    అప్పుడు సంతోషంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.


    "నీ ఇష్టం అమ్మా ఈ సంబంధం నువ్వు తప్పకుండా మాట్లాడు" అన్నారు గణేశ్ రావు గారు సుభద్రమ్మ.

 Previous Page Next Page