"సరే!" అన్నారు తామిద్దరూ.
ఆ డ్రామాకి వెళ్లాలని ఇద్దరూ అనుకోలేదుగానీ, తీరా పొద్దుగూకాక మీరాకు వెళ్లాలనిపించలేదు.
"సరదాగా చూసివద్దాం! ఎప్పుడో కాలేజీలో చూడటమేగా డ్రామాలు!" అందామె తనకీ కొద్దిగా కుతూహలంగానే ఉంది.
ఇద్దరూ నడుచుకొంటూ వెళ్లారక్కడికి.
లోపల ఏమంత రష్ లేదు. సరిగ్గా అప్పుడే డ్రామా మొదలయింది. వినోద్ హీరో! నిజంగా హీరోలాగానే అనిపించాడు తనకి! అక్రమాలూ, అన్యాయాలూ చేసి ప్రజల్ని మోసగిస్తున్న ఆ ఊరి ప్రెసిడెంటుగారికే ఎదురుతిరిగాడు వినోద్! అతని సంభాషణ, ఉచ్ఛారణ, నటన - తనను కదిలించి వేసినయ్.
తమ ఇంటి కెదురుగా రూమ్ లో ఉండే వినోద్ లో ఇంత గొప్ప ప్రతిభ ఉందా?
రెండో సీన్లో ప్రెసిడెంట్ ని మోసంచేసి, అతని గుట్టంతా బయటకు లాగటానికి "స్త్రీ" వేషంలో వచ్చాడు వినోద్.
అతనిని ఆ వేషంలో చూస్తే తనకూ, మీరాకూ కూడా నవ్వాగలేదు. అతను తిప్పుకొంటూ నడవడం - కులుకుతూ మాట్లాడటం చూస్తూ నవ్వని వారే లేరు. ఆ రాత్రి డ్రామా ముగిశాక ఇంటికొచ్చిన తరువాత కూడా చాలాసేపు అతని గురించే గుర్తు తెచ్చుకొని నవ్వుకొంటూ ఉండిపోయారిద్దరూ.
మర్నాడు సాయంత్రం తను ఆఫీసు నుంచి వచ్చిన కొద్దినిమిషాలకే అతనూ ఇంటికొచ్చాడు.
"ఇవిగోండి, మీ బట్టలు" అన్నాడు నవ్వుతూ.
అందుకొని "కూర్చోండి!" అంది తను.
కుర్చీలో కూర్చున్నాడతను.
"మారు డ్రామాకి రాలేదనుకొంటాను" అన్నాడతను.
"భలేవారే! ఎందుకు రాలేదు? మీ ఆడవేషం చూసి రాత్రంతా నవ్వుకుంటూనే ఉన్నాం!" తిరిగి నవ్వేస్తూ అంది తను.
"థాంక్యూ! మీకూ నాటక కళ అంటే అభిమానం ఉందన్న మాట" అన్నాడతను. తనేమీ మాట్లాడలేదు.
"నాటకం చాలా బాగా వచ్చిందిలెండి! నేనూ హీరోగా నటించడం ఇదే మొదలు! అంతా చాలా బాగా నటించానని అన్నారు! అసలు ఆ నాటకం అంత బాగా రావడానికి కారణం ఏమిటనుకొన్నారు?"
తను అతనివంక చూసింది అర్థం కానట్లు!
"మీరే! నాకో సెంటిమెంటుంది! మీరు నవ్వినా ఫరవాలేదు! ఏ పనిమీద బయల్దేరినా ఇంట్లోంచి బయటి కడుగు పెట్టేప్పుడు - నా మనసుకి నచ్చిన వారెవరయినా ఎదురొస్తేనే బయల్దేరే అలవాటు మా ఊళ్ళో.
మొదటి రోజు అనుకోకుండా నేను గదిలోనుంచి బయటికొచ్చేప్పుడే- మీరూ ఆఫీస్ కెళ్తూ ఎదురొచ్చేరు- ఆ రోజు ఎంత లాభమయిందో తెలుసా? నా బి.ఏ. రిజల్ట్స్ వచ్చినయ్! ఠకీమని పాసయిపోయేను!
అంతే! ఆ రోజు నుంచీ మీరు ఆఫీసుకి బయల్దేరేప్పుడే - నేనూ గదిలోనుంచి బయటి కడుగు పెట్టటం అలవాటయిపోయింది... ఉత్సాహంగా, నిర్మలంగా మాట్లాడుతోన్న అతనిని చూస్తూంటే తమాషాగా ఉంది తనకు!
"నాకు కొంచెం నాటకాల పిచ్చి ఎక్కువలెండి! అందుకే ఉద్యోగం దొరికేలోగానే పూర్తిగా నాటక కళ అంతు చూద్దామనుకొంటున్నాను!" తిరిగి అతనే అన్నాడు.
ఈలోగా మీరా స్కూల్ నుంచి వచ్చేసింది.
"డ్రామాకి వచ్చినందుకు చాలా థాంక్సండీ!" ఆమెతో అన్నాడతను.
"మీరు చాలా బాగా యాక్ట్ చేశారు" అంది మీరా నవ్వుతూ.
మరికాసేపు కూర్చుని అతను వెళ్ళిపోయాడు.
"నమస్తే!" అన్నాడు టేబిల్ మీద రెండు చేతులూ ఉంచుతూ.
"నమస్తే!" అంది తను ఆశ్చర్యంగా.
"మీతో చిన్న పనుండి వచ్చాను!"
"ఏమిటో చెప్పండి!"
"నా సర్టిఫికెట్ ట్రూ కాపీస్ మీద మీ ఆఫీసర్ గారి సంతకాలు కావాలి!"
"కూర్చోండి, చేయించిస్తాను" అంటూ బల్ల చూపించింది.
అతను కూర్చుని ఒరిజినల్ సర్టిఫికెట్లు - ట్రూ కాపీలు ఆమె ముందుంచాడు.
అయిదయిపోయాక ఆఫీసర్ గదిలోకి నడిచి వాటిమీద సంతకాలు తీసుకొంది తను. అవి అందించగానే ఆనందపడిపోయాడతను.
"చాలా థాంక్సండీ! రేపే లాస్ట్ డేట్ అప్లయ్ చేయడానికి! వీటి మీద సంతకాలు ఎలాగా అని ఆలోచిస్తూంటే మీరు గుర్తొచ్చారు. మీకు శ్రమ ఇవ్వక తప్పలేదు."
"ఇందులో శ్రమేముంది లెండి" అంది తను నవ్వుతూ.
అయిదయిపోవడం చేత తనూ అతనితోపాటు బయటకు నడిచింది.
"మీకేం అభ్యంతరం లేకపోతే - అలా హోటల్లో కాఫీ త్రాగి వెళ్దాం రాకూడదూ?" అడిగాడతను.
ఎంచేతో అతని కోరికను తోసిపుచ్చలేకపోయింది తను.
ఇద్దరూ ఏసీ రూమ్ లో కూర్చున్నారు.
"నేను వచ్చేవారం రాజమండ్రిలో జరుగబోతున్న నాటక పోటీల కెళ్తున్నాను. మా సమాజం తరపున మంచి డ్రామా తీసుకెళ్తున్నాంలెండి. సినిమా దర్శకులు, ప్రొడ్యూసర్లు కూడా వస్తున్నారట. కనుక బాగా చేయగలిగితే సినిమాల్లో అవకాశం రావచ్చు. మీరు నాకో సహాయం చేశారంటే తప్పక బెస్ట్ యాక్టర్ ఎవార్డ్ కొట్టేస్తారు" అన్నాడతను.
"నేనేం చేయాలి?" ఆశ్చర్యంగా అడిగింది తను.
"ఆ రోజు సాయంత్రం నాలుగ్గంటలకు నేను స్టేషన్ కెళ్ళాలి. మీరు ఆ టైమ్ లో నా కెదురు రావాలి."
తనకు నవ్వాగలేదు.
"బాగుంది! నా ఆఫీసో?" అంది నవ్వాపి.
"ఓ గంట పర్మిషన్ పెట్టి ముందుగా వచ్చేయకూడదూ? నా కోసం ! ప్లీజ్!"
"సరే వస్తాను! కానీ నాకేమిటి లాభం? ఎదుర్రావటం నా వంతూ, ప్రైజులూ, పొగడ్తలూ మీ వంతూనా?" చిలిపిగా అంది తను.
"పోనీ నాకొచ్చే బహుమతుల్లో మీకూ భాగమిస్తాను!" నవ్వుతూ అన్నాడతను.
రెండు రకాల స్వీట్లు ఆర్డర్ చేశాడతను.
"నేను ఇన్ని తినలేను" అంది తను.
"మీకు లంచం ఇస్తున్నాను ఆ రోజు కోసం!"
నవ్వేసింది తను.
ఇద్దరూ హోటల్లోంచి బయటకొచ్చారు.
"మీరూ ఇంటికేనా?" అడిగింది తను.
"అవును, మీరూ నడిచే వస్తారా?" తలూపింది తను.
తనకి తెలీకుండానే అతని ఆకర్షణకి లోబడిపోతోంది తను!
దారిపొడుగునా ఏవేవో నాటకాల గురించి చెబుతూనే ఉన్నాడతను.
"వీలయితే మీరూ రాజమండ్రి నాటక పోటీలకు సరదాగా రాకూడదూ! మీరు పక్కనుంటే ప్రపంచాన్నే జయించగలననిపిస్తుంది నాకు!"
"సారి! నాకు కుదరదు" అంది తను ఖచ్చితంగా.
"పోనీలెండి! మిమ్మల్ని బలవంత పెట్టను!"