ఆలస్యం
సౌదామిని రిక్షా దిగి, సిద్ధంగా ఉంచుకొన్న డబ్బు రిక్షావాడి చేతిలో పెట్టి, హడావుడిగా బస్ స్టాండ్ లోకి నడిచింది. డీలక్స్ లాంజ్ వేపు చేరుకొనేసరికి ఒళ్లంతా చెమటలు పట్టేసినయ్.
అక్కడ హైదరాబాద్ వెళ్లే బస్ కోసం వెదికింది. మరేదో ఊరువెళ్లే బస్ నిలబడి వుంది. కాని హైద్రాబాద్ బస్ కనిపించలేదు. ఆమెని ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించేసింది. అయినా కొన ఊపిరితో ఉన్న ఆశతో, పక్కనే నిలబడి మాట్లాడుకొంటున్న కండక్టర్ల దగ్గరకు నడిచి "హైదరాబాద్ బస్ వెళ్లిపోయిందా?" అనడిగింది ఆత్రుతగా.
"రెండు నిమిషాలయింది వెళ్ళిపోయి. జస్ట్ మిస్ డ్!"
సౌదామినికి దుఃఖం నవ్వూ రెండూ వచ్చినయ్.
"జస్ట్ మిస్ డ్." తిరిగి అనుకొందామె.
ఎన్నిసార్లు వింది తనీమాట! ఇప్పుడే కాదు. చిన్నప్పటినుంచీ ఈ ఆలస్యం మూలాన ఎన్ని పోగొట్టుకొంది? పరీక్షలు - ఉద్యోగాలు - ఇంకా ఎన్నెన్నో -
నిస్పృహతో తనకోసం ఎంతో ఎదురుచూసి ఉంటుంది మీరా.
బస్ స్టాండ్ లో తను కలుస్తేనే, అక్కడ దిగి తనతో రెండ్రోజులు గడుపుతాననీ - లేకపోతే హైద్రాబాద్ వెళ్లిపోతాననీ - ఉత్తరంలో రాసిందామె.
మీరాను చూడాలనీ - ఆమెతో రెండు రోజులు ఆనందంగా గడపగలదనీ అనుకొంది తను. అందుకే ఎంతో ఆశతో వచ్చిందిక్కడికి. బస్ స్టాండ్ కి చేరుకోడం ఆలస్యం అయితే మీరా వెళ్ళిపోతుందని తనకు తెలుసు. అయినా ఆలస్యమయిపోయింది. దారిలో సిటీబస్ ఫెయిలయి పోయింది. అక్కడినుంచి మెయిన్ రోడ్డువరకూ మైలుదూరం నడిచి వేరే బస్ లో మార్కెట్ చేరుకొని, అక్కడినుంచి రిక్షాలో వచ్చేసరికి ఈ ఆలస్యం అయిపోయింది.
"జస్ట్ మిస్ డ్."
కోపం, ఉక్రోషం ఒకేసారి కలిగినయ్యామెకి. కాని ఎవరిమీద అలుగుతుంది తను? బస్ చెడిపోడానికి బాధ్యులెవరు? బాంక్ లో ఉద్యోగానికి ఇంటర్వ్యూ కెళ్లేప్పుడు రైలు ఆరుగంటలు లేటయి ఇంటర్వ్యూ టైమ్ కాస్తా దాటిపోయినప్పుడు- అందుకు బాధ్యత ఎవరిది?
"రిక్షా కావాలామ్మా?"
"వద్దు."
ఇంతకూ ఇప్పుడే తనేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్లాలి? తమ ఊరు వెళ్ళే సిటీబస్ సాయంత్రం నాలుగింటికి. ఈ నాలుగ్గంటలూ ఎలా గడపాలి?
ఏమీ తెలీలేదామెకి. పుట్ పాత్ మీద నెమ్మదిగా నడువసాగింది.
"పోనీ, ఏదయినా సినిమా కెళ్తే?"
ఆ ఆలోచన బాగానే ఉందనిపించిందామెకి.
కాని - మార్నింగ్ షో అందుతుందా? టైమ్ పదకొండు దాటింది.
రోడ్డు ప్రక్కనే గోడలమీద వాల్ పోస్టర్స్ చూస్తూ నడువసాగిందామె. రెండు ఇంగ్లీష్ సినిమాలున్నాయ్, కాని అవి పదకొండింటికే మొదలు. కొత్తగా రిలీజయిన తెలుగు సినిమా కూడా సరిగ్గా పదకొండింటికే అని ఉంది. రిక్షా ఎక్కి ఆ హాలు దగ్గరకు చేరుకొంది సౌదామిని.
బయట విపరీతమైన జనం!
స్త్రీల క్యూలో నుంచుందామె.
పన్నెండయిపోయినా ఇంకా టిక్కెట్లివ్వడం మొదలుపెట్టకపోయేసరికి అనుమానం వచ్చి ముందున్నామెని అడిగింది.
"ఇది మాట్నీ క్యూ. మార్నింగ్ షోకి ఇంతకుముందే అయిపోయినయ్ టిక్కెట్లు."
సౌదామినికి నవ్వొచ్చింది.
మళ్లీ ఇక్కడ కూడా ఆలస్యం!
"జస్ట్ మిస్ డ్."
సినిమాహాల్లోంచి బయటి కొచ్చిందామె.
ఇప్పుడేమిటి చెయ్యటం?
తను పదేళ్ళక్రితం మీరాతోపాటు అద్దెకున్న ఇల్లు చూడాలనిపించిందామెకి. పూర్ణానందం పేటలో ఉందది.
కానీ ఎందుకా ఇల్లు చూడటం? ఏవేవో పాత స్మృతులను మననం చేసుకోడం తప్ప ఇంకేముంటుందీ?
ఎటూ నిర్ణయించుకోలేక అక్కడే నిలబడిపోయిందామె.
హఠాత్తుగా ఆమె కళ్లు ఎదురుగా ఉన్న పెద్ద సినిమా బోర్డుమీద పడినయ్. శతదినోత్సవ సందర్భంగా - నటీనటుల ఆగమనం ! నటీనటుల పేర్లలో వినోద్ పేరుంది. హీరో వినోద్-
మొదటిసారిగా వినోద్ ఇప్పుడు ఆ హాలు కొస్తాడన్నమాట! కొద్ది క్షణాలు ఆమె మనసంతా ఆనందంతో ఊగిపోయింది.
ఎంతకాలమైపోయింది- వినోద్ ని చూసి!
పదేళ్లు పైగానే!
తను, మీరా ఉన్న ఇంటి ఎదురుగ్గానే గదిలో ఉండేవాడు.
ఆ సినిమాహాలు వేపు నడువసాగింది సౌదామిని.
వినోద్ కార్లో వస్తాడు కాబోలు! అతన్ని చూడడానికి బయట జనం! నవ్వు వచ్చింది సౌదామినికి.
అతను తనకెంతో సన్నిహితుడనీ - తను ఎదురురాందే ఇంట్లోంచి బయటకు కదిలేవాడు కాదనీ- ఎంతమందికి తెలుసు?
అతను చెప్పేవరకూ తనకూ తెలీదు. రోజూ తన ఆఫీస్ కెళ్ళడానికి బయటకు వస్తూంటే - అతనూ అప్పుడే గదిలోనుంచి బయటికొచ్చేవాడు. తను ఎదురొస్తే అతనికి ఎంతో మంచి జరుగుతుందని నమ్మకం ఉందట.
అసలా రోజులు ఎంత సరదాగా గడిచేవి?
మీరా స్కూల్లో టీచర్ గా చేరింది. తనూ అక్కడే ఓ ఆఫీసులో టైపిస్ట్ ఉద్యోగంలో చేరింది. మీరాతోపాటు తనూ ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. ఇద్దరికీ మీరావాళ్ల అమ్మమ్మ వండిపెడుతుండేది.
రోజూ రాత్రి పన్నెండింటివరకూ వినోద్ గట్టిగా డ్రామా పోర్షన్ చదువుతూండట తమకు వినపడుతుండేది.
కొద్దిరోజుల వరకూ అతను తమవంక కన్నెత్తి చూడలేదు.
ఓ రోజు సాయంత్రం, తను ఆఫీసు నుంచి వచ్చి టీ తాగుతూ కూర్చుంది హాల్లో! వినోద్ తలుపుదగ్గర నిలబడి "ఏమండీ!" అని పిలిచాడు.
"ఏమిటి?" లేచి అతని దగ్గరగా వెళ్తూ అడిగింది తను.
"నేను డ్రామాలో కొద్దిసేపు 'స్త్రీ' లాగా నటించాలి! రేపు రాత్రికి డ్రామా ఉంది. మీరు ఒక చీరా -జాకెట్టూ ఇస్తే - ఎంతో సహాయం చేసిన వారవుతారు-" అన్నాడు బ్రతిమాలుతూ.
తనకి నవ్వు వచ్చింది. ఇతగాడు ఆడవేషం వేస్తాడా? ఇక జనం బ్రతికినట్లే! ఎంచేతో కాదనాలనిపించలేదు. వెంటనే తన చీర ఒకటి, జాకెట్ ఒకటి - అతని కందించింది.
"చాలా థాంక్సండీ! ఎల్లుండి మళ్ళీ మీకిచ్చేస్తాను!" అంటూ అవి తీసుకొని వెళ్ళిపోయాడు.
మర్నాడు సాయంత్రం తనూ, మీరా ఆ విషయమే తల్చుకొని నవ్వుకొంటూండగా త్వరత్వరగా వచ్చాడతను.
"ఇవిగోండి! ఈ రెండు పాసులూ తీసుకోండి! రాత్రికి డ్రామాకి మీరు తప్పక రావాలి!" అన్నాడు నవ్వుతూ.