Previous Page Next Page 
శుక్ల యజుర్వేద సంహిత పేజి 21


    29. అగ్ని ధనవంతుడు. రోగనాశకుడు, ధనప్రాపకుడు. అన్నాదులందు పుష్టి పెంచువాడు. క్షిప్రకారి. అతడు మమ్ము కూడవలెను.

    30. మంత్ర రక్షక బృహస్పతీ! అదాతలగువారి నిందలు, హింసల నుండి మమ్ము రక్షింపుము. మమ్ము కాపాడుము.

    31. మిత్ర, ఆర్యమ వరుణులు ముగ్గురు మహామహుల ద్యుతియుక్త ధనవంతము మరియు దుష్ట ధర్షణల రక్షణలు మాకు కలుగవలెను.

    32. ఆ ముగ్గురు దేవతల రక్షణలందున్న యజమాని సుఖముగా ఇంట ఉండును. బహుళ మార్గములందు దొంగలు బందిపోటులు అతనిని బాధించరు. పాపియగు శత్రువు అతని మీద ఆధిపత్యము చేయడు.

    33. ఆ ముగ్గురు అదితి పుత్రులు. మానవుల జీవనార్థము నిరంతరము జ్యోతిని ప్రసాదించువారు.

    34. ఇంద్రా! నీవు ఎన్నటికి హింసకుడవు కావు. హవిర్దాత యజమానిని మరల మరల కలసి కొందువు. నీవు ఇచ్చు అధికాధిక దానము అతనికి అందుచునే ఉండును.

    35. సవితది వరణీయ తేజము. దానిని మేము ధ్యానింతుము. అతడు మా బుద్ధులను అనుకూలము చేయవలెను.

    36. అగ్నీ! నీ రథము దుర్దమనీయము. దాని వలననే నీవు యజమానులను రక్షింతువు. అట్టి రథము మాకు సంప్రాప్తము కావలెను.

    బృహదుపస్థానము సమాప్తము.

    37. సచ్చిదానందస్వరూప అగ్నీ! నీ దయ వలన నేను ఉత్తమ సంతానము కలిగి సంతానవంతుడను కావలెను. సువీరులవలన వీరులు గల వాడను, అన్నాది పోషకుల వలన సుపోషకుడను కావలెను.

    ఆహవనీయాగ్నీ! మానవహితకరా! నీవు నా సంతానమును రక్షింపుము.

    స్తుత్యగార్హపత్యాగ్నీ! నా పశువులను హింసారుల నుండి రక్షింపుము.

    స్థిర దక్షిణాగ్నీ! నా ధాన్యమునాకు నష్టముకలుగనట్లు రక్షింపుము.

    38. సర్వ ధన ప్రాపకూడును - మాకు ధనము అందించు అభిలాషగలవాడును ఆహవనీయ అగ్ని మాకు లభించినాడు. సర్వమునకు అధిపతివగు అగ్నీ! సువర్ణాది ధనము సాధించుటకును శత్రువును ఓడించుటకును సరిపడు బలమును ప్రసాదించుము.

    39. ఈ గార్హ పత్యాగ్ని మా గృహపతి అగును. ఇతడు మా సంతానమునకు ధనము అందించువాడగును. గార్హపత్యాగ్నీ! సువర్ణాది ధనము సాధించుటకును - శత్రువును ఓడించుటకును సరిపడు బలమును ప్రసాదించుము.

    40. దక్షిణాగ్ని పశువులకు హితకరుడు. ధనవంతుడు. అన్నాదులను వర్ధిల్లచేయువాడు.

    పశుహితకర దక్షిణాగ్నీ! సువర్ణాది ధనము సాధించుటకును శత్రువును ఓడించుటకును తగిన బలమును ప్రసాదించుము.

    41. గృహములారా! భయపడకండి. కంపించకండి. మీరు అన్నము గలవారు. మేము తప్పక మిమ్ము చేరుకొందుము. అన్నము పట్టుకొని, ప్రసన్నమనమున సద్భుద్ధితో ఆనందమయులమై మరల మీలో ప్రవేశించగలము.

    42. విదేశములందున్నప్పుడు ఎడతెగక గుర్తు వచ్చు గృహము- ఆనందములు నిండిన గృహమునే మేము ఆహ్వానించుచున్నాము. గృహమా! మమ్ము గుర్తింపుము. మాకు స్వాగతము పలుకుము.

    43. ఈ ఇంట గోవులు తిరిగినవి. మేకలు - గొర్రెలు సంచరించినవి. ఈ ఇంటనే అన్నము రసవంతమైనది. నీరు మధురమైనది. అట్టి గృహమున సుఖము, శాంతి కలుగుటకు ప్రవేశించుచున్నాను. మాకు ఈ ఇంట సుఖములు, శుభములు కలుగవలెను. భయములు దూరము కావలెను.

    "క్షేమాయ వః శాంత్యై ప్రపద్యే శివం శగ్మం శంయోః శంయోః"

    ఉపస్థాన మంత్రములు సమాప్తము.

    చాతుర్శాస్య మంత్రములు

    (చాతుర్మాస్య యాగమున నాలుగు యాగములుండును)

    1. వైశ్వ దేవము 2. వరుణ ప్రఘాసము 3.సాక మేధము 4. శునాసీరీయము

    44. మరుత్తులు, వరుణ ప్రఘాసయాగమున ప్రఘాస నామక హవిరన్నమును భక్షించువారు. హింసకులగు బందిపోటుల నాశకులు. యవమయ హవిరన్నమునందు ప్రీతి గలవారు.

    అట్టి మరుత్తులను మేము ఆహ్వానించుచున్నాము.

    45. మరుత్తులారా! మేము గ్రామమున పాపములు చేసినాము. అరణ్యమున పాపములు చేసినాము. సభలందు పాపము చేసినాము. ఇంద్రియ లోలులమై పాపములు చేసినాము. ఏవేవో అశేష పాపములు చేసినాము. వానినన్నింటిని ఈ చాతుర్మాస్య యాగము చేసి వదిలించుకుందుము.

    మరుత్తులకు స్వాహా

    46. ఇంద్రుడు దేవతలతో యుద్ధము చేసినపుడు విడివడిన హవిరంశము అతని కొరకై ఉండనే ఉన్నది. ఇది సేచన సమర్థుడగు ఇంద్రుని కొరకగు యవసమార్జిత మహాహొమకర్మము.

    హవిర్యుక్త పవమానస్తుతి మరుత్తులను నుతించును.

    47. పత్నిచే పిలిపించుకొనుట సుఖకరము. అట్టి సుఖకరమగు వచనములతో బుత్విక్కులు కర్మ నిర్వహించినారు. యజ్ఞము సంపూర్ణము చేసినారు.

    దేవతల కొరకు యజ్ఞము పూర్తి చేసిన బుత్విక్కులారా! మీరందరు కలసి ప్రస్థానము చేయండి.

    48.  అవభృతయాగమా! నీవు అత్యంత గతిశీలవు. అట్లయ్యు నీ గతి మందగించును. అట్టితరి నీ ద్వారముననే నేను దేవతల విషయమున చేసిన పాపములను దేవతలచేతనే మన్నింపచేసికొన్నాను మానవుల విషయమున చేసిన పాపములను బుత్విక్కులచే మన్నింపచేసికున్నాను.

    ఇంద్రదేవా! ఇది సకల దుఃఖములు కలిగించు లోకము. దానినుండి నన్ను రక్షింపుము.

    49. దర్వీ! నీవు స్థాళి యందలి అన్నముతో ఇంద్రుని కొరకు సాగుము. అభీష్టఫలమునందుకొని తిరిగి రమ్ము.

    శతక్రతు ఇంద్రా! మూల్య వినిమయము వలె మేము అన్నము వర్షముల వ్యాపారము చేయుదుము.

    (మేము నీకు హవిరన్నము సమర్పింతుము. నీవు మాకు వర్షము ప్రసాదించుము అని తాత్పర్యము. ఇది వినిమయమే అగును కదా! వినిమయము వర్తకమగును కదా!)

    50. ఇంద్రుడు అనుచున్నాడు:-

    యజమానీ! నీవు ముందు నాకు హవిరన్నాము అర్పించుము. తదుపరి నీ కొరకు నేను వర్షము కలిగింతును. నీవు నాకు హవిరన్నము అక్కడ పెట్టుము. నేను నీకు వర్షము ఇక్కడ ఉంచుదును.

    యజమాని అనుచున్నాడు:-

    ఇంద్రా! నీవు వర్షమను సరుకును తెచ్చి ఇమ్ము. దాని మూల్యముగా నీకు హవిరన్నము అందింతును.

    "ఇంద్రాయ స్వాహా"

    51. పితరులు పిండములు భక్షించినారు. ఆనందించినారు. తలలు ఊపినారు.

    ఇంద్రా! బ్రాహ్మణులు స్వయందీప్యమానులు - "స్వభానవో విప్రా' వారు నవీన స్తుతులచే నిన్ను నుతించినారు. ఇహ లెమ్ము, రథమునకు హర్యశ్వములను కట్టుము. "యోజాన్విన్ద్రతే హరీ"

    52. మఘవా! నీవు సుదర్శనీయుడవు. నీకు వందనము. సంస్తుతించబడిన నీవు ప్రదానము చేయు సరుకులు నింపి యజమానిని చేరుము. "యోజాన్విన్ద్రతే హరీ"

    53. మానవ ప్రశంసక స్తవములు చదివి - అన్యగతమైన మా మనస్సును మాలోనికి ఆహ్వానించుచున్నాము. పితరులను స్తుతించు స్తవములతోనూ మా మనమును మాలోనికి ఆహ్వానించుచున్నాము.

    (మనసే స్వాధీనమందున్న సమస్యలు చాలావరకు తీరును)

    54. యజ్ఞము, బలము, జీవనము కొరకు మా మనసు మరల మాలో చేరవలెను. చిరకాలము సూర్యుని దర్శించుటకు సహితము మా మనసు మరల మాలో ప్రవేశించవలెను.

    55. పితరులారా! దేవతలు మరల మా మనసును మాకు ఇవ్వవలెను. వారు మాకు మరల ఇచ్చిన మనసుతో మేము మా భార్యాపుత్రులతో చేరగలము.

    56. సోముడా! నీకుగాను అభిషవాది కర్మలు నిర్వర్తించుటకును శరీరమున మనము నిలువ వలసి ఉన్నది. పుత్రాది సంతానయుక్తులమగుటకు సహితము మనసు నిలుచుట అవసరమై ఉన్నది.

    57. రుద్రుడా! ఈ అతిరిక్త పురోడాశము నీ హవిరంశము. దానిని అంబికా సహితుడవై ఆరగింపుము. రుద్రాయ స్వాహా. ఇది నీ హవిరన్నము. మూషికము నీ పశువగును.

    58. త్ర్యంబక రుద్రునకు వేరుగా భోజము చేయింతుము. అతడు ప్రసన్నుడు కావలెను. మమ్ము వర్ధిల్లు నివాసవంతుని చేయవలెను. వర్థిల్లు యశోవంతుని చేయవలెను. సర్వకార్య సమర్థులను చేయవలెను.

    59. రుద్రదేవా! నీవు స్వయముగా ఓషధి స్వరూపుడవు. మా గోవులు, అశ్వములు, మానవుల కొరకు వైద్యులను ప్రసాదించుము. ఆడ, మగ మేకలకు సుఖము ప్రసాదించుము.

    60. త్ర్యంబకుడు సుగంధయుక్తుడు. అన్నాదులకు సమృద్ధి కలిగించువాడు. అతనిని మేము భజింతుము. పక్వమయిన ఖర్జూర ఫలము వలె మమ్ము మృత్యు బంధము నుండి విముక్తులను చేయుము. అమృతత్వము నుండి మాత్రము కాదు.

    త్ర్యంబకుడు సుగంధయుక్తుడు, భర్తలను కూర్చువాడు. అతనిని మేము భజింతుము పక్వమయిన ఖర్జూర ఫలము వలె కన్యలను వివాహమైనంత పితృ గృహము నుండి విముక్తలను చేయుము. కాని పతి గృహము నుండి ఎన్నటికి విముక్తలను చేయకుము.

    61. రుద్ర దేవా! ఈ అతిరిక్త పురోడాశము నీకు మార్గ భోజనము -చద్దిమూట. దానిని తీసికొనుము. సాగుము. దూరము - మంజు పర్వతము కూడ - దాటి తరలిపొమ్ము. నీ పినాకపు నారిని దింపుము. పినాకమునే చద్దిమూట చేసికొనుము. గజ చర్మము ధరించుము. మమ్ము బాధించక కళ్యాణమూర్తివై అటుగా సాగిపొమ్ము.

    62.రుద్ర దేవా! జమదగ్ని మూడు ఆయువులు, కశ్యపుని మూడు ఆయువులు, దేవతల మూడు ఆయువులు మాకు సహితము కలిగింపుము.

    (బాల్య, యవ్వన, వార్థక్యములు మూడు ఆయువులు అగును)

    63. (ముండన సమయమున కత్తిని ఉద్దేశించి)

    కత్తీ! నీవు "శివము" అను పేరు  గలదానవు. నీ తండ్రి వజ్రమగును. నీకు నమస్కారము నీవు మమ్ము బాధించకుము హింసించకుము.

    మంగలి అనుచున్నాడు:-

    యజమానీ! నేను నీకు ఆయుష్యము, పాచకత్వము, ప్రజోత్పాదకత్వము, ధన సమృద్ధి, సంతానప్రాప్తి, మంచి బలము కలుగుటకు గాను ముండనము చేయుచున్నాను.

   
       
                                         దాశరథి రంగాచార్య విరచిత
                  శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
                           మూడవ అధ్యాయము సమాప్తము.
                                      సర్వేపి సుఖినస్సంతు.

 Previous Page Next Page