Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 2 పేజి 21


    47. అగ్నీ ! నీకు ఋక్కునే హవ్యముగా సమర్పింతుము. ఋక్ స్వరూపమగు ఆ హవి నీ భక్షణకుగాను వృషభ, గోరూపములుగ మారవలెను.

    (అగ్ని సర్వభక్షకుడు. అతనికి గోవృషభములు లెక్కలోనివి కావు.)

    48. అగ్ని బలశాలి. యజ్ఞవిరోధక రాక్షసులను సంహరించినాడు. అసురుల ధనమును హరించినాడు. అట్టి వృత్రహంత ప్రధాన అగ్నిని దేవగుణములు ఉద్దీప్తుని చేయుదురు.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత నాలుగువ అష్టకము ఆరవ మండలమున అయిదవ అధ్యాయము సమాప్తము)


        ఓం నతామినన్తిమాయినో నధీరావ్రతాదేవానాం ప్రథమాద్రవాణి
        నరోదసీ అద్రుహా వేద్యాభిర్న పర్వతాణి నమే తస్థివాంసః

               ఆరవ అధ్యాయము             పదియేడవ సూక్తము

        ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రా ! నీవు ప్రచండ బలశాలివి. నిన్ను అంగిరులు స్తుతించినారు. నీవు సోమపానము కొఱకు ఫణులు అపహరించిన గోవులను వెల్లడించినావు. రమ్ము. సోమపానము చేయుము. శత్రునాశక, వజ్రధర ఇంద్రా ! బలయుక్తుడవయి శత్రువులనందరిని నాశనము చేసినావు.   

    2. ఋజీషి సోమపాన ఇంద్రా ! నీవు శత్రువుల నుండి రక్షించువాడవు. శోభన కపోలవంతుడవు. స్తోతల కోరికలు తీర్చువాడవు. ఈ సోమరసమును పానము చేయుము.

    ఇంద్రా ! నీవు వజ్రధారివి. పర్వత విదారకుడవు. అశ్వసంయోజకుడవు. మాకు విచిత్ర అన్నమును ప్రకాశితము చేయుము.

    3. ఇంద్రా ! నీవు ప్రాచీనమగు సోమరసపానము చేసినవాడవు. మేము సమర్పించు సోమరస పానము చేయుము. ఇది నిన్ను ప్రసన్నుని చేయవలెను. మా స్తోత్రములను వినుము. వాటివలన వర్ధమానుడవగుము. సూర్యుని ఆవిష్కరింపుము. మాకు అన్న భోజనము చేయించుము. మా శత్రువులను పరిమార్చుము. ఫణులు అపహరించిన గోవులను వెల్లడించుము.

    4. ఇంద్రా ! నీవు అన్నవంతుడవు. దీప్తివంతుడవు. మహానుడవు. అఖిలగుణవంతుడవు. ప్రవృద్ధుడవు. విభవవంతుడవు. శత్రువులను పరాభవించువాడవు. నీవు త్రావిన మాదక సోమము నిన్ను ఆర్ద్రుని చేయవలెను. నీకు అతిశయ హర్షము కలిగించవలెను.

    5. ఇంద్రా ! సోమపానమున ముదమునొందినావు. గాఢాంధకారమును వదిలించినావు. ఉషను, సూర్యుని తమతమ స్థానముల నిలిపినావు. నీ స్థానమునుండి కదలకనే ఫణుల దొంగిలించి, గోవులను దాచిన పర్వతమును బ్రద్దలు చేసినావు.

    6. ఇంద్రా ! నీ బుద్ధియు, కార్యకుశలతతో గోవులను పాలిచ్చునట్లు మార్చినావు. గోవులను బయాటిక్ రప్పించుటకు రాతిగోడలను కూల్చినావు. అంగిరులతో కలిసి గోవులను గోష్ఠమునుండి విముక్తములను చేసినావు.

    7. ఇంద్రా ! మహాకార్యములతో విశాలభువిని విశేషముగ పూరించినావు. మహామహుడవు. ద్యులోకము పడిపోకుండునట్లు దానిని భరించినావు. ద్యావాపృథ్వులను పోషించినావు. దేవతలు ద్యావాపృథ్వుల బిడ్డలు. ద్యావాపృథ్వులు పురాతనములు. యజ్ఞమునకు జలములకు నిర్మాణకర్తలు. అతి గొప్పవి.

    8. ఇంద్రా ! వృత్రసంహారమునకుగాను దేవతలు బయలుదేరినారు. అట్టి సంగ్రామమున దేవతలందరు నిన్ను అగ్రగామిని చేసినారు. అధిపతిని చేసినారు. నీవు అత్యంత బలశాలివి. ఆ సంగ్రామమున మరుత్తులు నీకు సాయపడినారు.

    9. విపుల అన్నముగల ఇంద్రుడు తానుపడుకొనుటకు ఆక్రమించిన వృత్రుని వధించినపుడు ఇంద్రుని క్రోధము, వజ్రపు భయమున ద్యులోకము కంపించినది.

    10. అత్యంత బలశాలి ఇంద్రా ! దేవశిల్పి త్వష్ట నీ కొఱకు వేయిధారలు, వందగంట్లుగల వజ్రము నిర్మించినాడు. ఋజీషి సోమపాన ఇంద్రా ! ఆ వజ్రముననే నీవు నియతాభిలాషి ఉద్ధత పాకృతుడు ధ్వనిచేయు వృత్రుని చూర్ణము చేసినావు.

    11. ఇంద్రా ! సంపూర్ణ మరుద్గణములు సమాన ప్రీతిగలవారయి నిన్ను స్తోత్రము ద్వారా వర్థిల్ల చేయుదురు. నీ కొఱకు పూష, విష్ణువు నూరు మహిషములను వండుదురు-సోమపాత్రను నింపుదురు. సోమపానము చేసిన ఇంద్రుడు వృత్రుని వధించుటకు సమర్థుడు అగును.

    12. ఇంద్రా ! వృత్రునిచే సమాచ్చాదితములు, సర్వత్ర స్థిత నదీజలములను విముక్తము చేసినావు. అందువలన నదులు ప్రవహించసాగినవి. ఉదక తరంగములను విముక్తము చేసినావు. ఆ నదులు నిన్ను మార్గమున ప్రవహించినవి. నీవు వేగవతులగు నదులను సముద్రమునకు చేర్చినావు.

    13. ఇంద్ర ! ఆవిధముగా నీవు ఘనకార్యములు చేయువాడవు, ఐశ్వర్యశాలివి, మహాఒజస్వివి, అజరుడవు, బలదాతవు, శోభన మరుత్తుల సాయము పొందువాడవు, అస్త్రధారివి, వజ్రధారివి అయినావు.

    14. ఇంద్రా ! మాకు బలము, పుష్టి, అన్నము, ధనము కూర్చుము. మేము శక్తి సంపన్నులమగు మేధావులము. మా భరద్వాజులను భక్తులలో చేర్చుకొనుము. నిన్ను స్తుతించు వారిని పుత్ర, పౌత్రవంతులను చేయుము. భవిష్యత్తులో మమ్ము రక్షింపుము.

    15. ఈ స్తుతులతో మాకు ఇంద్రుడు అన్నము ప్రసాదించవలెను. మేము శోభన పుత్రయుక్తులమయి వంద సంవత్సరములు ఆనందించవలెను.

    (జీవించవలెనని మాత్రముకాదు ఆనందించవలెనని ఆశించుచున్నాడు "మదేమ శతహిమాః")

                                         పద్దెనిమిదవ సూక్తము

           ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రుడు అనభిభూత తేజస్కుడు. శత్రుహింసకుడు. అనేకులు ఆహ్వానించువాడు. భరద్వాజా ! అట్టి ఇంద్రుని స్తుతించుము. అనభిభూతుడు. ఒజస్వి, శత్రువిజయ, మానవుల కోరికలు తీర్చు ఇంద్రుని స్తుతులతో సంవర్థితుని చేయుము.

    2. ఇంద్రుడు సంగ్రామమున శత్రునాశకుడు. ముఖ్యుడు. బలవంతుడు. యోద్ధ. దాత. యుద్ధసంలగ్నుడు. సానుభూతి సంపన్నుడు. వర్షము కలిగించి అనేకులకు ఉపకారము చేయువాడు. శబ్ద విధాయకుడు. మూడు సవనములందు సోమపానము చేయువాడు. ఇంద్రుడు మను సంతానమును రక్షించువాడు.

    3. ఇంద్రా ! కర్మవిహీన మానవులను వెంటనే వశీభూతులను చేసికొనును. నీవు ఒక్కడవే కర్మానుష్ఠాన కారకులగు ఆర్యులను పుత్రులను, దాసులను ప్రసాదించినావు. ఆవిధముగా చేయు సమర్థుడవగుదువా? కావా? అప్పుడప్పుడు నీ పరాక్రమమును ప్రదర్శించుచుండుము.

    4. ఇంద్రా ! నీవు బలవంతుడవు. ఓజస్వివి. సమృద్ధి సంపన్నుడవు. అజేయుడవు. జయశీలుడవు. శత్రువినాశకుడవు. అనేక యజ్ఞములందు ప్రాదుర్భవించినావు. నీవు ప్రచండ, ప్రవృద్ధ బల సంపన్నుడవని మేము ఎరుగుదుము.

    5. ఇంద్రుడు, కదలని కొండలను కదిలించినవాడు. మన సఖ్యము చిరకాలపుది. దానిని చిరస్థాయిని చేయుము. నీవు స్తవకారులగు అంగిరులతో కలిసి అస్త్రనిక్షేపకుడగు "బలాసురు"ని వధించినావు. వాని నగరములను, నగర ద్వారములను చెదరగొట్టినావు.

    6. ఇంద్రుడు ఓజస్వి, స్తోతలను సమర్థులుగ చేయువాడు. అతడు మహా సంగ్రామమునకు స్తోత్రముల ద్వారా ఆహూతుడగును. పుత్రలాభమునకు ఇంద్రుని ఆహ్వానింతురు. వజ్రధారి ఇంద్రుడు యుద్ధములందు విశేషరూపమున వందనీయుడు.

    7. ఇంద్రుడు వినాశరహితుడు. శత్రువులను పరాభవించగల బలసంపన్నుడు. మానవ జన్మకు ప్రసిద్ధి కలిగించినాడు. ఇంద్రుడు తన యశస్సువలన సమాన స్థానము కలవాడగును. నేతృతమ ఇంద్రుడు తన ధనము, సామర్థ్యముతో సమాన స్థానము కలవాడగును.

    8. ఇంద్రుడు యుద్ధములందు కర్తవ్యవిమూఢుడుకాడు. ఎన్నడును వృధావస్తువులను ఉత్పన్నము చేయడు. అతడు ప్రఖ్యాతుడు. శత్రునగరములను ధ్వంసము చేయుటకును, శత్రువులను వధించుటకును కార్యరతుడగువాడు.

    ఇంద్రా ! నీవు చుమరి, ధుని, పిప్రు, శంబరి, శిష్ణు అసురులను నష్టపరచినావు.

    9. ఇంద్రా ! నీవు ఊర్ధ్వగామివి. శత్రుసంహారకుడవు. స్తవనీయ బలసంయుక్తుడవు. శత్రుసంహారమునకు రథమును అధిరోహింపుము. కుడిచేత నీ అస్త్రమగు వజ్రమును దాల్చుము. ధనశాలి ఇంద్రా ! నీవు వెడలి ఆసురీమాయను అంతమొందింపుము.

    10. అగ్ని ఎండు చెట్లను కాల్చినట్లు ఇంద్రా ! నీవు వజ్రముతో శత్రువులను పరిమార్తువు. నీవు వజ్రము వంటి భయంకరుడవు. వజ్రముతో రాక్షసులను భస్మము చేయుము. ఇంద్రుడు అనభిభూత మహావజ్రమున శత్రువులను భంగపరచినాడు.

    ఇంద్రుడు సంగ్రామమున గర్జించును. సమస్త దురితములను దూరము చేయును. 

    11. బహుధన సంపన్నుడవు. అనేకులచే ఆహూతుడవు. బలపుత్రుడవగు ఇంద్రా ! నీ మహాబలమును ఎంతటి అసురుడయినను విరువజాలడు. ధనయుక్తుడవయి, అసంఖ్య బలశాలి ఆయుధములతో మా ముందుకు విచ్చేయుము.

    12. ఇంద్రుడు బహుధన - యశోవంతుడు. శత్రునిహంత. ప్రవర్ధమానుడు. అతని మహిమ ద్యావాపృథ్వులను మించినది. మహాబుద్ధిశాలి, శత్రుపరాభవకర్త ఇంద్రునకు శత్రువులు లేరు. ప్రతినిధిలేడు. ఆశ్రయము లేదు.

    13. ఇంద్రా ! శుష్ణునామక రాక్షసుని నుండి కుత్సుని శత్రువులనుండి ఆయువు, దివోదాసులను రక్షించినావు. మా అతిథిఋత్విగ్వులకు శంబరుని నుండి తెచ్చిన చాలధనము ప్రదానము చేసినావు. విజయ వజ్రమున శంబరుని త్రుంచినావు. భూలోకవాసి, శీఘ్రగమనముల వాడగు దివోదాసుని ఆపదల నుండి కాపాడినావు.

    14. ద్యుతిమంతుడవగు ఇంద్రా ! స్తోతలందరు వానకొఱకు నిన్ను పొగడుచున్నారు. నీవు మేధావులలో శ్రేష్ఠతముడవు. స్తోతల పొగడ్తలకు ప్రసన్నుడవగుము. దారిద్ర్య పీడితులగు యజమానులకు వారి పుత్రులకు ధనము ప్రసాదించుము.

    15. ఇంద్రా ! ద్యావాపృథ్వులు, అమర్త్యులు నీ బలమును గుర్తించినారు. బహుకార్య వ్యగ్రుడవగు ఇంద్రా ! అసంపూర్ణ కార్యములను పూర్తిచేయుము. అనంతరము నవీనతమ స్తోత్రములను కల్పించుము.

                                           పందొమ్మిదవ సూక్తము

           ఋషి - భరద్వాజుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. రాజు పగిది స్తోతలగు మానవుల కోర్కెలను తీర్చు మహా ఇంద్రుడు విచ్చేయవలెను. ఉభయ లోకములందు పరాక్రమమును పెంచువాడును, శత్రువులు బాధింపజాలనివాడును అగు ఇంద్రుడు పౌరుష ప్రదర్శనకుగాను మావద్ద వర్ధిల్లును.

    2. ఇంద్రుడు పుట్టజ్ఞే అత్యధిక వర్ధమానుడయినాడు. దానమునకుగాను మా స్తుతి ఇంద్రుని వహించవలెను. ఇంద్రుడు గొప్పవాడు గమనశీలుడు. జరారహితుడు శత్రువు వలన అనభిభూతుడు. ఇంద్రుడు బలమున వర్ధమానుడగును.

    3. ఇంద్రా ! నీవు మాకు అన్నదానము చేయుటకుగాను నీ హస్తములను విస్తీర్ణములను, కార్యకర్తలను, అతిశయ దానశీలములను చేయుము. నీవు శాంత మనస్కుడవు. పశుపాలకుడు పశువులను నడిపించినట్లు యుద్ధమున నీవు మమ్ము నడిపించుము.

    4. మేము స్తోతలము. అన్నాభిలాషులమై ఈ యజ్ఞమున సమర్థ సహాయకులగు మరుత్తుల సహితుడు, శత్రునిహంత ప్రసిద్ధ ఇంద్రుని స్తుతింతుము. ఇంద్రా ! నీవు పురాతన స్తోతలనువలెనే మమ్ము అనింద్యులము. పాపరహితులను అహింసితులను చేయుము.

    5. నదులు ప్రవహించి సముద్రమున పడినట్లు స్తోతల హితకర ధనము ఇంద్రుని చేరును. ఇంద్రు ధనకర్మకారి వాంఛిత ధనస్వామి. సోమరసమున ప్రవర్ధమానుడు అగును.

    6. పరాక్రమశాలి ఇంద్రా ! మాకు ప్రకృష్ట తమ ధనము ప్రసాదించుము. శత్రువులను పరాభవించు ఇంద్రా ! మాకు ఇతరులు సహించలేని, అతిశయ ఓజస్సు దీప్తిని ప్రదానము చేయుము. అశ్వవంత ఇంద్రా ! సేచన సమర్థము, ద్యుతిమంతము, మానవ భోగయోగ్యమగు సంపూర్ణ ధనమును ప్రదానము చేయుము.

    7. ఇంద్రా ! నీవు, మాకు శత్రు సేనలను పరాభవించు అహింసిత హర్షమును ప్రసాదించుము. నీ వలన రక్షితులమై మేము జయశీలురమగుదుము. పుత్ర, పౌత్ర లాభమునకుగాను ఆ హర్షముననే నిన్ను స్తుతింతుము.

    8. ఇంద్రా ! మాకు అభిలాషపూరక సేనారూప బలము ప్రసాదించుము. అ బలము ధనమును రక్షించునది వృద్ధి చెందునది, శుభంకరమగునది కావలెను. ఆ బలముతో యుద్ధమున తెలిసిన, తెలియని శత్రువులను మేము వధించ కలుగవలెను.

 Previous Page Next Page