Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 19

   
    ముఖం కందగడ్డలా చేసుకొని వచ్చి ఆటో ఎక్కాడు మాధవ్. అడ్రస్ చెప్పాడు ఆటోవాడికి. స్వప్నకి తగలకుండా మడికట్టుకొన్న బ్రాహ్మడిలా దూరంగా వొదిగి కూర్చున్నాడు మాధవ్. పగ్గాలు వేసి పట్టినట్టుగా ఉన్న కోపం అతడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.

    స్వప్న ముఖం తిప్పుకొని అవతలకి చూడసాగింది.

    పావుగంటలో మాధవ్ వుంటున్న రూం ముందు ఆగింది ఆటో. మీటర్ చార్జీ చెల్లించి  రూం తాళం తీశాడు మాధవ్.

    సూట్ కేస్, వైర్ బాగ్  గోడపక్క గా వుంచి అలసటగా ఈజీ ఛెయిర్ లో వాలింది  స్వప్న.

    ఆహ్వానం లేని అతిధిని చూస్తున్నట్టుగా చూస్తున్న మాధవ్ చూపులకు కొంచెం నొచ్చుకుంది.
అభిమానాన్ని నొక్కిపట్టి అంది. స్నానం తరువాత చేస్తాను. ముందు ఒక కప్పుటీ కావాలి!"

    పనికుర్రాడికి ప్లాస్క్ ఇచ్చి పంపాడు మాధవ్.

    "నా దగ్గరికి నువ్వు ఏ ఉద్దేశ్యంతో వచ్చినట్టు?" మళ్ళీ ముఖాముకి ఎదుర్కొన్నాడు.

    "ఉద్యోగస్తులైన భార్యాభర్తలు ఒకేచోట వుండొచ్చునన్న రూల్ ప్రకారం నా కిక్కడికి ట్రాన్ ఫర్ అయింది. మామగారు చాలా శ్రమపడి చేయించారు. రిలీవ్ అయి వచ్చాను. మీ దగ్గరికికాక ఇంకెక్కడికి వెళ్లాలంటారు?"

    "నా నిర్ణయం తెలిశాక గూడా. నా దగ్గరికి రావడానికి సిగ్గేయలేదూ!"

    "మీ నిర్ణయం ప్రస్తుతానికి సమంజసంగానే  వుండవచ్చు! నా సాహచర్యం మీ నిర్ణయాన్ని అసమంజసమని  నిరూపిస్తే?"

    మాధవ్ పరుషంగా, "ఆ అవకాశం నీకు నేను ఇవ్వగలననే అనుకుంటున్నావా?" అన్నాడు.

    "ఇచ్చి చూస్తే తప్పేముంది?"

    "నీ ఉనికి నేను ఒక్కక్షణం కూడా సహించలేను!"

    " సహించకపోతే ఎక్కడికి వెళ్లాలంటారు?" సహనం కూడదీసుకొంటూ అడిగింది స్వప్న.

    "నాకంటే ముఖ్యుడే వున్నాడు. కావాలంటే అడ్రస్ ఇస్తాను. వెళ్లొచ్చు!"

    "ఎవరా ముఖ్యుడు?"

    "స్వరూప్!" ఒక విధమైన కసితో ఉచ్చరించాడా పేరును.

    షాక్ కొట్టినట్టుగా కొద్ది క్షణాలు మ్రాన్పడిపోయిన స్వప్న, స్వరూప్ ఇక్కడే వుంటున్నాడా? ఈయనకి అతడెలా తెలుసు? క్లాస్ మేట్సేమో!

    ఉక్రోషంతో తలెత్తింది. "ఏమిటి మీ ఉద్దేశ్యం? నన్ను అతడి దగ్గరికి పంపించాలనుకొంటున్నారా?

    "పంపించాల్సిన అవసరం నాకేమిటి? నిన్నిక్కడ ఆపేవాళ్లెవరూ లేరని చెప్పడం తప్ప......"

    స్వప్న కటువుగా అంది. "ఆపేవాళ్లు లేనంత మాత్రాన ఆడది అంతగా చెడిపోతుందని  మీ వుద్దేశ్యమా? ఇందాకా "నేనంత చవటననుకొన్నావా" అన్నారే - ఆమాట ఇప్పుడు కరక్టే ననిపిస్తోంది!"

    "నోటికి ఎంతొస్తే అంతా కూస్తే......" మాధవ్ చెయ్యెత్తబోయి విరమించుకొన్నాడు.

    "లేకపోతే ఏమిటండీ? భార్యని ప్రియుడి దగ్గరికి పంపించడం సహృదయత అనిపించుకోదు, మగవాడి చవట తనం నిరూపిస్తుంది."

    "పతివ్రతలా మాట్లాడకు, " కస్సుమన్నాడు.

    "పతివ్రతకీ పతితకీ పూర్తి నిర్వచనం మీకు తెలుసా?"

    "ఓటి కుండకు చప్పుడెక్కువన్న సంగతి నీకు తెలుసా?"

    ఈ మాటతో స్వప్నకి తగిలిన అఘాతం అంతా ఇంతాకాదు, మసిపూసినట్టుగా ఆమె ముఖం నల్లగా మాడి పోయింది.  దుఃఖం గొంతుదాకా ఎగదన్నుకురాగా అతడి ముందు ఏడవడం  ఇష్టంలేక సూట్ కేస్ తెరిచి బట్టలు తీసుకుని స్నానం చేసే నెపంతో బాత్ రూం కనిపించగానే అందులోదూరి తలుపు మూసుకొని మనసార ఏడ్చేసింది.

 Previous Page Next Page