నిన్న ఉపన్యాసం ఫలితం దీక్ష రాగానే మండిపడుతూ వచ్చింది మందారవర్దని. ఆవేశం, కోపం కళ్ళు మూతలు పడేలా చేస్తాయి. సరిగ్గా మందారవర్దని విషయంలో అదే జరిగింది.
కాస్త కబుర్లు వారి మధ్య జరిగి మందారవర్దని చల్లబడే సరికి కళ్ళ మసకలు కాస్త తగ్గి దీక్ష ప్రత్యేక అలంకరణా కానవచ్చింది.
ఇప్పుడు దీక్ష పెద్దింటి పిల్లలా వుంది.
ఇప్పుడు దీక్ష సూదంటురాయి చూపులతో చురుకుగా వుంది.
ఇప్పుడు దీక్ష ఎదుటి వారిని ఆకట్టుకునే లాగుంది.
ఇప్పుడు దీక్షని చూస్తే పవిత్ర భావంతో వుంది.
మందారవర్దని వెనక్కి తగ్గింది. పూర్తిగా చల్లబడిపోయింది.
రేపు తప్పక రమ్మని మరీమరీ కోరి అసలు విషయం దాటేసి దీక్ష ఆ యింటి మెట్లు దిగింది.
మందారవర్దని వెళుతున్న దీక్షని అలా చూస్తూ వుండిపోయింది.
- 11 -
సరిగ్గా రెండుగంటలు.
దీక్ష తిరిగింది తిరిగినట్లే వుంది. అయినా కర్తవ్య నిష్ఠా పరాయణురాలు. అనుకున్నది సాధించాలన్న పంతం, పనిలోదీక్ష, ఇవన్నీ కలసి దీక్షని అలసిపోకుండా చేశాయి.
రోజూ వేరు ఈ రోజు వేరు.
మూడు కొప్పులు ఒకచోట చేరితే ఘర్షణ తప్పదన్న ఘనమైన పేరు బడసిన స్త్రీ జాతి ఆ పేటలో వుంది. మూడు కొప్పులు కాదు ముప్పైఆరు కొప్పులు మళ్ళీ మాట్టాడితే దాదాపు మూడొందల కొప్పులు కొత్తపిల్ల దీక్ష అమీతుమీ తేల్చటానికి ఒకమాటగా సమాయత్తం అయాయి.
దీక్ష అనే ఇరవై మూడేళ్ళ అందమైన అమ్మాయిపై మూకుమ్మడి
దాడి చేయటానికి.
సమర శంఖారావం పూరించటానికి!
రణభేరి మోగించటానికి!
జడలు కొప్పులు ముడులు సిగలు రెడీ అయ్యాయి.
ఇదేరోజు అటో యిటో తేల్చుకోవాలను కున్నారు వాళ్ళంతా.
ఈ రోజే దీక్ష కణ కణలాడే నిప్పుల మీద నీళ్ళు చల్లేసింది.
ఇప్పుడు వాళ్ళందరిలో కోపం, భయం, అనుమానం తగ్గి కేవలం కుతూహలం, రేపు సాయంత్రం ఏమి చూడబోతున్నామోనన్న ఆతృత, అదేదో తెలుసుకోవాలన్న తపన, తెలిసిపోతే తపన. తెలిసిపోతే బాగుండునన్న ఆరాటం చోటు చేసుకున్నాయి.
దీక్షని చూడగానే ఈ రోజు ప్రతి వాళ్ళూ ముందు ధుమ ధుమ లాడారు. విసుగు, కోపం. బెదిరింపు, హేళన, వ్యంగ్యం అన్ని రకాల కళలు ప్రదర్శించారు.
దీక్ష ఈ రోజు పాంప్లెట్ యివ్వలేదు. ఆహ్వానం అందించింది. మీ అంతటి వారు లేరు. మీరు లేకపోతే ఎట్లా? మీ మీద ఆశలు పెట్టుకున్నాను. మీరు రాకపోతే మనుగడే లేదు అన్నట్లు మాట్లాడింది.
మగవాళ్ళలో రారాజులు, భోళాశంకరులు, కామాంధులు, కఠినులు, అనుమానం రాముళ్ళు, శాడిస్టులు, మృదుమనోహరులు, పురుష సింహాలు, అల్పులు ఇలా సవాలక్ష రకాలుంటారు.
ఆడవాళ్ళు అలాకాదు.
రెండే రెండు.
అమృతమూర్తులు, ఆది శక్తులు.
క్షమ, దయ, మాతృహృదయం, అబల ఈ లక్షణాలు గల వాళ్ళు అమృతమూర్తు లయితే, సబల, రాక్షసత్వం, కసి, పట్టుదల, క్రోధం మొదలైనవి ఆదిశక్తి అంశలే. మృదు మధుర రమణీలలామ రణరంగంలో చండికయై శక్తియై సర్వనాశనం సల్పగలదు. అందుకే వాళ్ళు రెండే రకాలు.
దీక్ష పని పట్టాలని అందరూ ఆదిశక్తులయ్యారు.
మీ అంతటి వారులేరు. మీ అమృత హృదయంతో నాకు సహకరించాలి అనేసరికి చల్ల (చప్ప)బడి పోయారు.
దీక్ష చాలాముందు చూపుతో తెలివిగా వ్యవహరించింది. ముఖ్యంగా సస్పెన్స్ క్రియేట్ చేయటంలో పూర్తి సక్సెస్ అయింది. మూసివున్న గుప్పెటలో ఏముందో నన్న కుతూహలం ప్రతివాళ్ళకి వుంటుంది.