కొంతసేపటికి లలిత మళ్ళీ మాట్లాడినప్పుడు ఆమె ముఖం చాలా నిర్మలంగా అతి మాములుగా వుంది.
"మీరు నన్ను చూడటానికే వచ్చారా?"
"ఇక వెళ్ళండి" అన్నట్లుగా వుంది ఆ ప్రశ్న.
అంతేకాదు. మీ కార్యక్రమాలు తెలుసుకోవాలని వచ్చాను."
లలిత పెదవుల మీద కనీకనపడని చిరునవ్వు విరిసింది. 'ఇలాంటి ప్రశ్నలకు అలవాటు పడ్డాను లేవోయ్!" అన్నట్లుగా వుంది ఆ చిరునవ్వు. "మా కార్యక్రమాలకేముంది ? ప్రధానంగా స్కూలు నడుపుతున్నాం. అభాగ్యులను, స్త్రీ లను వీలైనంత వరకూ ఆదుకుంటాం! ఈరోజు వుండండి. చూద్దురు గాని?" అంది.
తమ స్కూల్ చూపించించింది. రెండు గదుల చిన్న బడి అది. ఆ పిల్లల వాలకం చూస్తేనే చాలా అడుగు వర్గాలలో పిల్లలని తెలుస్తుంది. బీదరికం ప్రతి పసిముఖంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది.
కూలి జనుల పిల్లలకు ఉచిత భోజన సదుపాయాలతో పగటివేళ చదువు చెప్తాం. రాత్రి వేళ వయోజనులకు చదువు చెప్తాం!" వివరించింది లలిత.
"మరి, వీటన్నిటికి డబ్బెలా వస్తుంది?"
"కష్టపడి చందాలు వసూలు చేస్తాం. మీలాటి పుణ్యాత్ములిస్తారు."
జైలు నుంచి వచ్చేటప్పుడు జైలు అధికారులు తన కిచ్చిన డబ్బును లెక్కపెట్టకుండా లలిత చేతిలో పెట్టాడు యతి. చిరునవ్వు నవ్వి "థాంక్స్" అంది లలిత. ఆ తరువాత ఇద్దరూ మరో గడిగుండా బయటికి వస్తుండగా , అక్కడ కొందరు మొగవాళ్ళు ఆడవాళ్ళు ఏదో సీరియస్ గా చర్చిందు కుంటున్నారు. వీళ్ళను చూడగానే వాళ్ళ చర్చలు ఆగిపోయాయి.
"వీళ్ళంతా మా స్టాఫ్" అంది లలిత. నమస్కరించిన యతి కి అందరూ ఫార్మల్ గా నమస్కారాలు చేశారు.
అక్కడ కుట్టుమిషన్, ఎంబ్రాయిడరీ ప్లాస్టిక్ బుట్టల అల్లకం ఇలా రకరకాల పనులు నేర్చుకుంటున్న ఆడవాళ్ళు కొందరున్నారు.
"మిమ్మల్ని కలుసుకోగలిగినందుకు చాలా సంతోషంగా వుంది" అని చేతులు జోడించాడు యతి.
'అప్పుడప్పుడు వస్తుండండి" అంది లలిత సాగనంపుతూ.
ఆ మాత్రం అభిమానానికే పొంగిపోయాడు యతి. వీరయ్య చెప్పిన కధను బట్టి పులితో ఈ కస్తూరిబా మహిళా సమాజానికి సన్నిహిత సంబంధం వుందని ఊహించాడు. 'పాఠశాల' పేరుతొ అది రహస్య సమావేశాలకు ఆధారంగా వుండేదని కూడా ఊహించగలిగాడు. అన్నీ అతని ఊహలే! ఎవరు యే విధంగానూ ఏదీ పైకి తేలటం లేదు. రహస్యం అంత జాగ్రత్తగా కాపాడబడుతోంది!
ఏ విషయం ఎలా గున్నా లలిత నిరాడంబరత , కార్యదీక్షత , అణువణువునా వుట్టిపడే సంస్కారం మాత్రం యతిని ముగ్దుడ్ని చేసాయి.
15
యతి ఇంటికి రాగానే మంచంలో వున్న తల్లి యతిని కౌగలించుకుని బావురుమంది. తండ్రి కూడా గుడ్డివాడు తడిమినట్టు శరీరం తడిమి తడిమి ఆనందించాడు.
"ఇంక నన్ను విడిచి వెళ్ళిపోవు కదురా!" అంది తల్లి. సంతోషానికి, దుఃఖానికీ మధ్య ఉక్కిరి బిక్కిరవుతూ . యతి ఏ సందానమూ చెప్పకముందే "నాకు తెలుసు! నన్ను విదిచిపోవు" అంది తనే.
"నువ్వేలాగైనా బ్రతికి బట్టకడితే చాలని సన్యాసుల పేరు పెట్టనురా? నిజంగా సన్యాసివై పోకురా!" అన్నాడు బెంగగా తండ్రి. ఆ మాటలకు నవ్వుకున్నాడు యతి. సన్యాసానికీ మార్గానికి భూమ్యాకాశాలకున్నంత భేదం వుంది. కానీ ఇది ఒక రకమైన సన్యాసమేనెమో! వాళ్ళు కోరేది ముక్తి - తాను కోరేది పీడితుల విముక్తి. పదిరోజుల వరకు తల్లిదండ్రుల ప్రేమలో కొట్టుకుపోయాడు యతి. ఈ సమయంలోనే మయూర సంగతులన్నీ తెలిసాయి. ఈ దెబ్బ అతడిని మరింత కర్తవ్యోన్ముఖుడ్ని చేసింది. తలిదండ్రులకు ఏలా నచ్చచేప్పాలా అన్నదే అతడి ప్రధాన సమస్య అయింది.
"నా చదువు పాడయితే , నా జీవితమే నాశనమవుతుంది - నేను మళ్ళీ చదువుకుంటాను -' అని అతి కష్టం మీద తన ప్రయాణానికి ఒప్పించాడు తలిదండ్రుల్ని. వాళ్ళ కన్నీళ్లు చూసినప్పుడు వృద్దాప్యంలో వాళ్ళని ఎడిపిస్తున్నానా , అని బాధ కలగకపోలేదు. చిన్నప్పుడు నాటకంలో పరిహాసంగా అనుకున్న "చెలీ ......కర్తవ్య దీక్షా బద్దుడనై....." అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. విషాదంగా నవ్వుకున్నాడు. ఇద్దరి పాదాలను నమస్కారం చేసి , చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకొని , వెంకటయ్య దగ్గరకు బయలుదేరాడు.
వెంకటయ్యది చాలా పెద్ద భవనం. అందంగా ఆధునాతన పద్దతులలో కట్టబడి వుంది. ముందు బాల్కని కి కుడిచేతి వైపుగా ఆఫీసు గది వుంది. ఆ గది ఎప్పుడూ రకారకాల మనుష్యులతో కిటకిట లాడుతూ వుంటుంది. చూసీ చూడగానే వాళ్ళెవరో ఆందోళన కారులు కారని అర్ధం చేసుకోగలిగాడు యతి. వాళ్ళంతా రకరకాల పనుల మీద వచ్చిన వాళ్ళని మాటల ధోరణిని బట్టి ఊహించుకోగాలిగాడు. కొందరు ట్రాన్స్ ఫర్స్, మరికొందరు ప్రమోషన్స్ కోసం, మరికొందరు ఉద్యోగాల కోసం వచ్చినట్లు వాళ్ళ మాటలను బట్టి తెలుస్తోంది. వాళ్ళు తమ మాటలను రహస్యంగా ఉంచాలని కూడా ప్రయత్నించటం లేదు. అదేదో అతి సామాన్యమైన విషయమన్నట్లుగా మాట్లాడేసుకొంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిపే వెంకటయ్య ప్రభుతానికి సంబంధించిన అన్ని పనులు ఎలా సాధిచంచగలడో అర్ధం కాలేదు యతికి. యతి చూస్తున్నడనీ , వింటున్నాడనీ వెంకటయ్య ఏ మాత్రమూ సంకోచించలేదు సరి కదా ఎదురు "చూస్తున్నావా? నేనెంత గొప్పవాన్నో ?" అన్నట్లు చూసాడు. వాళ్ళందరినీ పంపించేసాక "నీకు వివేకానంద కాలేజిలో సీటు రిజర్వు చేసి వుంచానోయ్? వెంటనే వెళ్ళి బి.ఏ. లోనో, బి.యస్. సి లోనో ఎందులో కావాలంటే అందులో చేరిపో!" అన్నాడు. నిర్ఘాంత పోయాడు యతి. తనకు- ఆందోళనలో, జైలులో పాల్గొన్న తనకు, ఒక కాలేజి టి.సి యిచ్చి పంపేసిన తనకు, రెడీగా సీట్! అది కూడా ఎందులో కావాలంటే అందులో!