Previous Page Next Page 
అంకితం పేజి 19


    అయితే ఈసారి అరుంధతి నవ్వలేదు. నావైపు సానుభూతితో చూసింది. అంతలో జాన్ అన్నాడు, "దీనికన్నా, ఫలానా టైమ్ లో ఫలానా చోట పదేళ్ళ క్రితం మీరు మీ బిడ్డని వదిలినట్టయితే, ఆ కుర్రవాడు ప్రస్తుతం కిడ్నీ దొరక్క చావు బ్రతుకులమధ్య వున్నాడు" అని ఇవ్వటం మంచిదేమో. కనీసం ఎవరికీ ప్రమాదం వుండదు....."

    నాకీ ఆలోచన బాగానే వున్నట్టు అనిపించిందికానీ, ఆ ఏజెంట్ అన్నాడు "పెళ్ళికిముందు సబంధం పెట్టుకుని పిల్లణ్ని కన్న అమ్మాయి - ప్రస్తుతం సలక్షణంగా కాపురం చేసుకుంటూంటే, ఇప్పుడా  ప్రకటనచూసి ఎందుకు పరుగెత్తుకు వస్తుంది?"

    నేను లేచి నిలబడి....... "వెళ్ళొస్తాను" అన్నాను. ఇక అతడితో మాట్లాడి డిటెక్టివ్ ఆఫీస్ ల గురించి ఎంతో గొప్పగా వర్ణిస్తాము. అందమైన రిసెప్షనిస్టు. ఎయిర్ కండీషన్డ్ రూమ్ లో....... రివాల్వింగ్ ఛెయిర్ లో గంభీరంగా ఒక మధ్య వయస్కుడు. వగైరా! దానికీ ఈ వాస్తవానికీ ఎంత తేడా....."

    అంతవరకూ ఏదో ఆలోచనలోవున్న అరుంధతి తెప్పరిల్లినట్టు ".....ఈసారి నాకో ఆలోచన వచ్చింది" అంది.


                        *    *    *

    "పాత విద్యార్థులు అడ్రసులున్న రికార్డులు కాలేజీ ఓల్డ్ బిల్డింగ్ లోనే కదా వుండేది" అన్నది అరుంధతి, తనకో ఆలోచన వచ్చిందని చెప్పాక.

    "అవును" అన్నాను.

    "మనం ముగ్గురం అందులోకి ప్రవేశిద్దాం".

    నేనూ, జాన్ ఒకరి మొహం ఒకరం చూసుకున్నాం.

    "ప్రవేశించి ఏం చేస్తాం?"

    "సుమద్యుతి ఏ అడ్రసు ఇచ్చిందో చూద్దాం".

    'అమ్మేసిన ఇంటి అడ్రసు ఇచ్చి వుంటుంది. అక్కడికేగా నేను వెళ్ళి ప్రిన్సిపాల్ కంటబడ్డది" అర్థంకానట్టు అడిగాడు.

    "ఒకసారి ప్రయత్నిస్తే తప్పులేదుగా" అంది.

    జాన్ కల్పించుకుని "కొంతకాలం క్రితం ఇదే నీతిసూత్రం నేనూ చెప్పినట్టున్నాను" అన్నాను.

    "నగర పాలక ఉద్యోగులమనీ, భవనం తాలూకు కొలతలు తీసుకోవటానికి వచ్చామని చెప్దాం" అంది.

    నేను ఆమెవైపు విభ్రాంతితో చూశాను.

    జాన్ నవ్వుతూ, "ఇదేదో నా రచనలో సంఘటనలా వుంది" అన్నాడు.

    గంట తర్వాత మేము కాలేజీలో వున్నాం.......

    అరుంధతి ప్రిన్సిపాల్ రూమ్ లోకి ధైర్యంగా ప్రవేశించింది. నా చేతులు వణకసాగాయి.

    రిసెప్షనిస్ట్ మమ్మల్ని పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ప్యూన్ కూడా గుర్తుపట్టలేదు. అరుంధతి రాగానే "ఏమయింది?" అనడిగాను ఆత్రంగా.

    "పర్మిషన్ ఇచ్చాడు. పదండి" అంది.

    నేను కళ్ళజోడు సవరించుకునిమ్ ఫైల్స్ ఆమె చేతికి అందించాను. టేప్ తీసుకుని జాన్ నేనూ బయటికి వచ్చాము. మేము గోడలు కొలుస్తూ కొలతలు చెబుతుంటే ఆమె లెడ్జర్ లో వ్రాసుకోసాగింది.

    ఫ్యూన్ ముందు చాలా సహజంగా ప్రవర్తిస్తున్నా నా కళ్ళు స్టోర్ రూమ్ కోసం వెదుకుతూనే ఉన్నాయి. ముందువేపు కొలతలు తీసుకోగానే ప్రక్కవేపు నడిచాము.

    ముందు రెండు ప్రక్కలా కొలిచాక అప్పుడు  వెనక్కీ వెళ్ళాము.

    అక్కడ కనిపించింది. 'స్టోర్' రూమ్ అని వ్రాసివున్న గది!

    కానీ, డానికి తాళంవేసి వుంది!!

    నిరుత్సాహంగా జాన్ వంక చూశాను. వాళ్ళిద్దరి కళ్ళల్లో అదే భావం కదలాడుతున్నా మామూలుగా మాట్లాడసాగారు. ఏం చేయాలో అర్థం కావటంలేదు. యాంత్రికంగా అక్కడి గోడలని కోలుస్తూనే ఉన్నా నా మనసులో అదే ఆలోచన కదులుతోంది. స్టోర్ రూమ్ తాళం సంపాదించటం ఎలా?

    మేము కొలుస్తున్న గోడ తరిగిపోతోంది.

    ఇంకా పది పదిహేను మీటర్లకన్నా ఎక్కువ లేదు.

    అది కూడా కొలిచి నీరసంగా లేచాను. అప్పుడొచ్చింది నాకా ఐడియా!

    వెంటనే ఫ్యూన్ ని పిలిచి "స్టోర్ రూమ్ విడిగా కట్టలేదా?" అనడిగాను.

    "లేడుసార్ ఈ బిల్డింగ్ లోని ఓ గదిని స్టోర్ రూమ్ గా ఉపయోగిస్తున్నాము" అన్నాడు.

    "దీని తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి?"

    "ఈ బిల్డింగ్ లోని గదులన్నిటి తాళాలూ నా దగ్గరే ఉంటాయండీ" కొద్దిగా గర్వంగా చెప్పాడు.

    నన్నే ఆశ్చర్యంగా గమనించసాగారు జాన్ , అరుంధతి.

    "నీకీ విషయం తెల్సా? స్టోర్ రూమ్ కోసం ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించాలి" అన్నాడు.

    "ఏమో సార్. అవన్నీ మాకెలా తెలుస్తాయి?"

    "సరే. ఆ గది లోపల కొలతలు కావాలి మాకు. స్టోర్ రూమ్ కి ఇంతని కొలతలుండాలి. అవి లేకపోతే, అప్పుడు విడిగా కట్టమని ప్రిన్స్ పాల్ కి చెబుతాం" అన్నాను.

    అరుంధతి ముందుకొచ్చి "తాళాలున్నాయిగా తెరువు" అంది.

    ఫ్యూన్ కి ఆ విషయాలేమీ తెలీదు. నిజానికి నాకూ ఆ విషయం తెలీదు. చీకట్లో బాణం వేసాను. అది వెళ్ళి సూటిగా తగిలింది. ఫ్యూన్ తాళం తీసాడు.

    నేను అదురుతున్న గుండెను చేత్తో పట్టుకున్నట్టు లోపలికి నడిచాను. నా వెంటే మిగిలిన ముగ్గురూ లోపలికి నడిచారు. జాన్ కి కళ్ళతోనే సైగ చేసాను. ఫ్యూన్ ని బయటికి తీసుకువెళ్ళమని.

    జాన్ అర్థం చేసుకున్నాడు. ఓ ఫైల్ తీసుకుని "ఒకసారి మీ బిల్డింగ్ లో వున్న టాయిలెట్ సదుపాయాల గురించి చెబుదువుగానీరా" అంటూ బయటికి తీసుకువెళ్ళాడు.

    అప్పుడు కదిలాము ఇద్దరం- చలనం వచ్చిన మరమనుషుల్లా పాత సంవత్సరపు రికార్డ్ కోసం.

    రికార్డ్ లూ, ఫిల్సూ లెడ్జర్ బుక్కులూ అన్నీ ఐరన్ రాక్స్ లో వరసగా పేర్చి వున్నాయి. ఇద్దరం రికార్డ్స్ ఉన్న రాక్స్ లో చెరో దాంట్లో వెదకటం మొదలుపెట్టాము. అరుంధతి కూడా చాలా ఫాస్ట్ గా వెదుకుతోంది.

    ఒకవేళ ఫ్యూన్ గానీ లోపలికి వస్తే....... ఆలోచించటానికి క్కూడా సమయం ఇవ్వకుండా వెదుకుతూనే ఉన్నాము.

    చాలామటుకు చెదలు తినేసి ఉన్నాయి. యాంత్రికంగా నేను వెదుకుతూనే ఉన్నా, ఒక ప్రక్క నాకు భయంగానే వుంది. ఇంత కష్టపడి ఆ ఫైల్  దొరికినా నాక్కావలసిన వివరాలు కాగితాల్ని చెదలు తినేస్తే ఎలా?

    గాలి రావటం లేదు. మా ముఖాలంతా దుమ్ముతో బూజుతో నిండిపోయాయి. దానికితోడు చెమట. ఎప్పుడూ ఉపయోగించని గది కాబట్టి అదోరకమైన వాసన వేస్తోంది.

    గబగబా లోపలికి వచ్చి, "ప్రిన్సిపాల్ వస్తున్నాడు" అన్నాడు జాన్.

    ఒక్కసారిగా మేమిద్దరం స్థాణువుల్లా ఆగిపోయాం. బూట్ల శబ్దం దగ్గరవుతోంది. నా ముఖంలో నెత్తురుచుక్కలేదు. మిగతా ఇద్దరి పరిస్థితి దాదాపు అలాగే వుంది. బూట్ల శబ్దం గది ముందుకు వచ్చింది.

    అప్పుడు కదిలింది అరుంధతి. చాలా షార్ప్ గా నా దగ్గరికి వచ్చి నా చేతిలో వున్న ఫైల్ అందుకొని అదే వేగంతో గది బయటకు పరుగెత్తింది.

    అంతా లిప్తపాటులో జరిగిపోయింది.

    నాకర్థమయింది ఆమె ఆయన్ని అక్కడే ఆపేస్తుందని!

    ఒక్కక్షణం రిలీఫ్ గా ఫీలయ్యాను.

    మరుక్షణంలో నేనూ జాన్ తిరిగి వెదకడంలో నిమగ్నమయ్యాం. క్రింది షెల్ప్ లో 1980 సంవత్సరపు రికార్డ్ దొరికింది. అంతే. ఇంక మిగిలినవన్నీ బయటకు లాగాను. ఒక్కోటి శరవేగంతో తిరగేయసాగాను.

    టైమ్ లేదు. ప్రిన్స్ పాల్ ని ఎంతోసేపు ఆపలేం. అతనేక్షణంలోనయినా లోపలికి రావచ్చు. ఇంతలో తలుపు దగ్గర శబ్దమయింది. మేమిద్దరం స్ప్రింగ్ లా లేచి వాటికడ్డంగా నించున్నాము. అసంకల్పితంగా టేప్ నందుకుని పట్టుకున్నాను.

    ఫ్యూన్ లోపలికి రాబోయాడు.

    సరిగ్గా అప్పుడు అరుంధతి గొంతు బయటినుండి వినిపించింది.

    "బాబూ! కొంచెం మంచినీళ్ళు తెస్తావా?"

    లోపలికి రాబోయిన వాడు వెంటనే "అలాగేనమ్మా" అంటూ బయటికి వెళ్ళిపోయాడు.

    నా మనసు నిండా అరుంధతిపట్ల కృతజ్ఞత పెరిగిపోయింది.

    తిరిగి నేలమీద పడివున్న రికార్డ్స్ వెతకడం ప్రారంభించాను.

    1981........ 1983...... 1986..... 19.......... 72

    దొరికింది!

    నాక్కావాల్సిన రికార్డ్ దొరికింది.

    "దొరికింది" గట్టిగా అరవబోయి నెమ్మదిగా చెప్పాను.

    గబగబా చూడసాగాను. అక్కడక్కడ మూలలు చెదలు తినేసి జీర్ణావస్తలో ఉన్నాయి కాగితాలు. గబగబా త్రిప్పుతుంటే చిరుగుతున్నాయి. ఒకవేళ ప్రిన్స్ పాల్ లోపలికి వచ్చినా ఇవి చూడందే బయటికి పోను, అని నిశ్చయించుకున్నాక, నాలో ఒక మొండిధైర్యం ప్రవేశించింది.

    చివరలో దొరికింది 'సుమద్యుతి.'

    ఆత్రంగా చదివాను......

    ఆమె తండ్రి పేరు పి. ఫణిభూషణరావు.

    ఆ తరువాత అడ్రస్ వుంది.

    కేరాఫ్ సోమసుందరం, నాలుగోవీధి, గాంధీనగరం.

    నే.....ను వెళ్ళిన అడ్రసు కాదు.

    మాకెందుకో.......సంతోషంతో గట్టిగా అరవాలనిపించింది!!!



                     *    *    *

    కాలేజీ నుంచి బయల్దేరి...... గాంధీనగరం వెళ్ళాం. ఇల్లు సులభంగానే దొరికింది. లోపలికి ప్రవేశిస్తూ వుండగా దేవుడ్ని ప్రార్థించాను. "అంకిత్ తల్లిదండ్రులు ప్రేమమూర్తులుగా నా అనుమానాలు తొలగించు....." అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాను.

    అలికిడికి సోఫాలో కూర్చుని స్వెట్టర్ అల్లుకుంటున్న యువతి తలెత్తింది. మమ్మల్ని చూడగానే లేచి నిలబడి ప్రశ్నార్థకంగా చూసింది.

    నేను ఒకడుగు ముందుకు వేసి, "ఫణిభూషణరావు" అని అడగబోయాను.

    "అయ్యో! ఆయన చనిపోయి ఆరునెలలు దాటింది కదా?" అంది.

    నేను పెద్దగా  బాధపడలేదు. నాక్కావలసింది సుమద్యుతి మాత్రమే. అదే  అడిగాను.

    అర్థంకానట్టు చూసి "ఓ ఫణిభూషణరావుగారి అమ్మాయి గురించా మీరడిగేది?" అంది.

    నేను షాక్ తిన్నాను.

    తిరిగి ఆమె అంది-

    "సుమద్యుతి...... మా మావగారి మేనకోడలు" అంది.

    జాన్ చప్పున ముందుకు వచ్చి "ప్రస్తుతం వాళ్ళెక్కడ వుంటున్నారు?" అనడిగాడు.

 Previous Page Next Page