Previous Page Next Page 
చెంగల్వ పూదండ పేజి 20


    ఇంతలో తలుపు తీసుకొని, ట్రేతో హైమ వచ్చింది. రెండు కప్పులు టీపాయ్మీద పెట్టింది. గులాబీరంగు జార్జెట్ చీర కట్టుకుంది. తలంటుకోవటంవల్ల ఫ్యాన్ గాలికి ముంగురులు ఎగురుతున్నాయి. నిండుగా బొట్టు పెట్టడంతో, అసలే గుండ్రటి మొహం మరింత గుండ్రంగా  కనబడుతోంది. వంగి కప్పులు పెట్టటంలో ఆమె శరీరంమీద వంపులు చిత్రకారుడు గీసిన గీతల్లో వున్నాయి. మెరుపులా లోపలి వెళ్ళిపోయింది.


                                               12


    కార్నివాల్ వ్యాపారం బాగా సాగుతోంది. క్వారీకన్నా -మనుష్యుల మానసిక బలహీనతల మీద ఆడుకొనే ఈ వ్యాపారం ఎక్కువ లాభాన్ని సంపాదించి పెడుతోంది. రూపాయితో లక్షలు సంపాదించాలనే మనస్తత్వం మనిషిలో నుంచి పోనంతవరకూ తెలివయినవాడు వ్యవస్థలోని లొసుగుల్ని ఆధారం చేసుకొని డబ్బు పిండుకుంటాడనేది నిరూపణ అవుతుంది.

    కార్నివాల్ లో డబ్బుకి బదులు 'చిప్స్' పెట్టడం ఎలా ఉపయోగిస్తుందో తెలుసుకున్నాను. సాయంత్రం పూట హుషారుగా వచ్చినవాళ్ళు రాత్రయ్యేసరికి డబ్బంతా పోగొట్టుకొని దిగులుగా వెళ్ళిపోతుంటే జాలి వేసేది. అందరూ సగటు మనుష్యులు. వాళ్ళు యిక్కడ ఇంత నికృష్టంగా పోగొట్టుకొన్న డబ్బు- ఇంట్లో జ్వరంతో పడుకున్న ఓ పసిపాప మందుకోసం తెచ్చింది.....ఒక కాలే కడుపుని అర్దాకాలితో మాడ్చి మిగిల్చింది.

    కొంతమంది గెల్చేవాళ్ళు. అయినా అదేమంత విచారింతతగ్గ విషయం కాదు మాకు. ఈ రోజు గెల్చిన డానికి రెట్టింపు పెట్టుబడితో మరుసటిరోజు తిరిగి వస్తాడని తెలుసు. అంతేకాదు ఈ రోజు గెల్చింది కూడా ఆ ఆనందం ప్రకటించుకోవటం కోసం తీగేసి, ఆ తాగుడు వ్యాపారం పెట్టిన మరోవాడి చేతుల్తో పోసేస్తాడని కూడా తెలుసు. చాలా పటిష్టంగా నిర్మించిన మోసపు వల ఇది.

    డబ్బు దాహం నాలో మానవత్వాన్ని చంపెయ్యటానికి ప్రయత్నించ సాగింది. విపరీతమైన సంఘర్షణ జరిగేది నాలో. ఏ అర్థరాత్రో చప్పున మెలకువ వచ్చేది అస్థిపంజరం లాంటి శరీరాల్తో వికృతంగా- దీనంగా -భయంకరంగా నాచుట్టూ ఎంతోమంది అన్నార్తుల నీడలు నాట్యం చేస్తున్నాట్టు కల. వణికిపోయేవాణ్ని. 'ఒకసారి నీలో ఘర్షణ మొదలయ్యేక నీకు వేదన తప్ప ఇంకేవీఁ మిగల్దు' అనేవాడు ఠాకూర్. ఆ మాటల్లో వుండే సత్యం అర్థమవసాగింది. ఒక్కసారి యీ స్పృహ కలిగాక ఆనందం నా నుంచి దూరమయింది. ఇంత జరిగినా నా గమ్యం మర్చిపోలేదు నేను.

    లక్ష్మీనారాయణ ఇంట్లో బాగా చనువు పెరిగింది. అతడి భార్య కూడా అప్పుడప్పుడు మా ఇంటికొచ్చేది. ఎప్పుడన్నా- నేను, హైమా, లక్ష్మీనారాయణ,  అతడి భార్య, రవీ కలసి కూర్చొని భోజనం చేసేవాళ్ళం- ఒకసారి అలా చేస్తున్నప్పుడు నా కాలు ఆమెకి పొరపాటున తగిలింది చప్పున తీసేసుకొని క్షమాపణ చెపుతున్నట్లు చూసేను. ఆమె కళ్ళతోనే నవ్వింది. ఇలా దాగుడుమూతలుగా సాగేది వ్యవహారం.

    ఒకరోజు నేను వాళ్ళింటికి వెళ్ళేసరికి, ఆమె సోఫాలో కూర్చొని పాకెట్ మిర్రర్ లో లిప్ స్టిక్ దిద్దుకొంటోంది. ఎదుటి సోఫాలో కూర్చొని ఆమె చర్యల్ని చూస్తూ, "లిప్ స్టిక్" రుచి ఎలా వుంటుంది?" అని అడిగాను.

    ఆమె క్షణంపాటు బిత్తరపోయి, ఆ తరువాత గట్టిగా నవ్వి- "వేసుకోండి తెలుస్తుంది" అంది. నన్ను నేను తిట్టుకొంటున్నట్టుగా "ఛీ- ఎంత మూర్ఖుణ్ని నేను" అన్నాను.

    "అదేం" అంది తెల్లబోయి.

    "అందమైన అమ్మాయిని లిప్ స్టిక్ రుచి ఎలా వుంటుందో కేవలం 'అడగటం' ద్వారానే తెలుసుకోవాలకొంటున్నాను" అన్నాను.

    "అడక్కుండానే తెలుసుకోవచ్చు. అభ్యంతరం చెప్పిందెవరు?" అందామె. ఆ విధంగా మా ఇద్దరి మాధ్యా వున్న ఆఖరి పోరకూడా తొలగిపోయింది.

    నేను లేనప్పుడు రవి వస్తే హైమ కబుర్లు చెబుతూ కూర్చొనేది. ఆమెది అద్భుతమైనా సౌందర్యం- అందులోనూ శారీరకంగానూ, మానసికంగానూ తగినంత విశ్రాంతి లభిస్తూ వుండేసరికి మరింత అందంగా , నాజూకుగా తయారైంది. రవి ఆమె ప్రేమలో దాదాపు పిచ్చివాడయ్యాడనే చెప్పవచ్చు. పూర్తిగా  ఇరవై నాలుగు గంటలూ మా ఇంట్లోనే వుండకుండా మనసు అదుపులో పెట్టుకోవటానికి అతడు  చాలా శ్రమపడుతున్నట్టు గ్రహించాను. హైమ వేపు చూసి నవ్వేవాణ్ని, వాళ్ళ సంగతి గ్రహించినట్టుగా. హైమ కూడా నవ్వేది.

    ఆర్థికంగా కూడా ఆ సంవత్సరం చాలా బావుంది. అనుకున్నదానికన్నా క్వారీలో రెట్టింపు లాభాలు వచ్చేయి. కార్నివాల్ సంగతి సరేసరి. ఆ పీచు తాలూకు కన్ సైన్ మెంటులో కూడా మంచి లాభమే వచ్చింది. లక్ష్మీనారాయణకి అతడు  పెట్టుబడిగా పెట్టిన ఇరవై వేలకి ఇంకో అయిదువేలు ఇచ్చేశాను. దాదాపు మూడు  నెలల్లో ఇరవై అయిదు పర్సెంట్ లాభం చూసి, అతడి తల  తిరిగిపోయిందనుకుంటా వెర్రిగా ఆ డబ్బువేపు చూస్తూ వుండిపోయేడు. అతడి భార్య మొహం చాటంతయింది. నేను వచ్చేస్తుంటే అతడు భార్యలో, "ప్రపంచం అంతా తిరిగివచ్చినవాడు, అతడికి తెలిసినన్ని మార్గాలు మనకెలా తెలుస్తాయి?" అనటం వినిపించింది. నవ్వుకొన్నాను. ప్రపంచం అంతా తిరిగినా?" థాంక్యూ ఠాకూర్" అనుకొన్నాను.

    ఇన్ని రకాల వ్యాపారాలు ఒక్కణ్నే నిర్వహించటం, అమితంగా లాభాలు సంపాదించటం, ఊళ్ళో బిజినెస్ వర్గాల్లో సంచలనం కలిగించింది. ఎంతోమంది చేతులు కలపాలని చూశారు. కానీ ఎవ్వర్నీ దగ్గరకు రానివ్వలేదు. లక్ష్మీనారాయణతోనే రెండు మూడు కాంట్రాక్టులు కలిగి నిర్వహించేను. నేను పెట్టుబడి పెట్టినదంతా వచ్చేసింది. దాదాపుఇ  నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఇంత "ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్" మామూలు బిజినెన్సుల్లో రాదు.

    ఎంత డబ్బు వచ్చిపడుతున్నా నాకు మానసింకంగా ఆనందం లేకుండా పోయేది. ఎందుకో తెలీదు. భరించలేనంత  ఒంటరితనం నన్నావరించింది.....ఏమనుకున్నానునేను? .....ఏమిటి నా గమ్యం....ఇవే ఆలోచనలు.....అర్థరాత్రిపూట నిద్రపట్టక-బైటకు వచ్చేవాణ్ని. నా రమ్య హర్మ్యన్ని, కారునీ వదలి-ఆ చీకట్లో వీధులవెంట తిరిగేవాణ్ని. ఊరి చివరనున్న ఆ పూరి గుడిసెల మధ్య ఇరుకు సందుల్లో సంచారం చేస్తూంటే ఆ నీరసపు నిశీధిలో నాకు తోడుగా ఠాకూర్ వచ్చేవాడు. ఎన్నెన్ని చిత్రాలు..... కటిక నేలమీద చలిలో ముడుచుకొని పడుకున్న వాళ్ళు- అస్థిపంజరంలాంటి తల్లి స్తనాన్ని పాలకోసం కుడుస్తూ ఏడ్చే పనివాళ్ళు- చారాలుకట్టి కన్నీళ్ళు లేత చెక్కిళ్ళమీద మాసికలుగా ముద్రపట్టిన పిల్లలు -ఎవరో కవి అన్నట్టు నేను చూసేను. నేస్తం నిజంగా- మూర్తీభవత్ దైన్యాన్ని హైన్యాన్ని క్షుత్రిత్రాశు కల్లోల నీరదుల్ని -గుచ్ఛత్ శ్వాకార వికారుల్ని....ఇది నా నాగరికతకు ఫలశృతి?- ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి?

    ఈ కృత్రిమ వేషాన్ని అభినయించలేకపోతున్నాను. ఫోమ్బెడ్ నాకు సుఖాన్ని యివ్వటంలేదు. జైలు గోడల మధ్య జన్మించి అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేసుకొని ఒక్కసారిగా బయటకొచ్చి నా చుట్టూ ప్రపంచాన్ని చూస్తుంటే- నాకు కనబడిందేమిటి-

    ఠాకూర్! ఎక్కడున్నావ్ ఠాకూర్! నీ యీ చైతన్య చిత్రాన్ని ఇలా ఒంటరిగా ఈ అడవిలో వదిలేసి- ఏం సాధిద్దామని ప్రకృతిలో దాక్కున్నావ్-

    ఒకరోజు రాత్రి పన్నెండింటికి ఆకస్మాత్తుగా మెలకువ వచ్చింది.

    ఆ రోజు పార్టీ యిచ్చాను. డిన్నర్ పూర్తయ్యేసరికి పదయింది. బ్రిటన్ కి పంపే పీచు కాంట్రాక్టుమీద సైన్ చేసింది. ఆరోజే. దాదాపు పదిహేను లక్షలకి కాంట్రాక్టు! అందులో లక్ష నాది: లక్ష లక్ష్మీనారాయణది! మిగతాది బ్యాంకు ఫైనాన్స్ చేసింది .ఆ సందర్భంలో జరిగిన పార్టీ అది. అందుకే కొంచెం గాఢంగా నిద్రపట్టింది.

    బయట ఏదో అలికిడి వినబడితే లేచాను.

    మంచంపక్క జర్నల్స్ పడివున్నాయి. అందులో ఒకటి ముఖ్యమైంది. అందులో వున్న వ్యాసం నిజమైతే- పౌండు అతి కొద్దిరోజుల్లో "డివాల్యూ" కాబోతుంది.

    లైటు వేయకుండా బయటకొచ్చాను.

    బాల్కనీలో నిలబడి చీకట్లోకి చూస్తోంది హైమ. చల్లటిగాలి అలలు అలలుగా వస్తోంది. వెళ్ళి రూఫ్ మీద అల్లుకొన్న మాలతీ తీగె పందిరిక్రింద వేసివున్న చైర్ లో కూర్చున్నాను. ఆమె వెనక్కి తిరగలేదు. కానీ అలికిడిబట్టి నేను వచ్చినట్టు గుర్తించి వుంటుంది.

    ఆ నిశ్శబ్దపు అర్థరాత్రి ఆమె అలా ఒంటరిగా నిలబడి శూన్యంలోకి చూస్తూ వుండటం గమనించగానే నాలో ఆమె పట్ల అనిర్వచనీయమయిన ఆప్యాయత పెల్లుబికింది. అది తండ్రికి, కూతురిపట్ల కలిగేది లాటిది కావొచ్చు. తనకోసం అలసిపోయిన భార్యపట్ల భర్తకి కలిగే లాటిదే కావొచ్చు.

    "థాంక్స్ హైమా" అన్నాను వెనుకనుంచి ఆమెను చూస్తూ. ఆమె మాట్లాడలేదు. నేనే అన్నాను-

    "నీకెలా  కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటంలేదు. ఏ అభిమానంతో నువ్వీ సహాయం చేసేవోగానీ డానికి ప్రతిఫలంగా నీకు ఏం కావాలన్నా నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా తీసుకో".

    ఆమె నెమ్మదిగా నావైపు తిరిగింది.

    మసక వెలుతురులో ఆమె బుగ్గల పై కన్నీటిచారల్ని చూసి, చప్పున లేచి, "హైమా" అన్నాను. విస్మయంతో, ఆమె నెమ్మదిగా వచ్చి నా కుర్చీ ప్రక్కన నేలమీద కూర్చొంది.

    "ఏడుస్తున్నావా హేమా?" అన్నాను కూర్చొని, ఆమె తల మీద చెయ్యివేసి. ఆమె మాట్లాడకుండా ఓ నిముషం వూరుకొని, తరువాత నెమ్మదిగా అంది.

    "నేను బజారుదాన్నే కావచ్చు! హీనతిహీనంగా శరీరాన్ని అమ్ముకొన్నదాన్నే కావచ్చు. అందుకని పాత జీవితాన్ని  వదిలిపెట్టి కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి నాకు అర్హతలేదు బాబుగారు".

    విచలితుణ్నయి "ఎందుకు లేదు! నీకదే కోర్కె అయితే అది చాలా సులభం హైమా! నువ్వు మళ్ళీ ఆ పాపపంకిలంలో అడుగు పెట్టనవసరం లేకుండా జీవితాంతం హాయిగా బ్రతకగలిగేలా ఏర్పాట్లు చేస్తాను" చెప్పాను ఆవేశంగా.

    ఆమె కళ్ళ రెప్పలు బరువుగా పైకెత్తి నా కళ్ళల్లోకి సూటిగా  చూసింది తలదించుకొని నెమ్మదిగా "మనిషి బ్రతకటానికి డబ్బొక్కటే చాలని ఇంతకాలం అనుకునేదాన్ని! కానీ ఆ రోజు అర్థరాత్రి పార్వతి అక్కయ్యకోసం మీరు పడిన  ఆవేదన, మరణశయ్యపై వుండి కూడా మీ వడిలో మరణిస్తున్నప్పుడు అక్కయ్య మొహంలో కనబడిన సంతృప్తీ గమనించిన తరువాత అర్థమైంది- మనిషిక్కావలసింది ఏమిటో..... అప్పుడు తెలిసింది, ఇంతకాలం నేను ఎంత జీవచ్ఛవంలా బ్రతికేనో! అప్పట్నుంచి ఆప్యాయతకోసం నా మనసు తల్లడిల్లిపోసాగింది......ఈ సమయంలోనే మీరు నన్ను తీసుకొచ్చారు. రవిబాబుతో పరిచయం అయింది".

    ఆ జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్నట్టు ఆగింది.

    "మీరు నన్ను  కోరింది చాలా చిన్న కోర్కె అనుకొన్నాను. నాకున్న అనుభవంతో, అందంతో, చాలా సులభంగా అతణ్ని పిచ్చివాణ్ని చేయగలనని అనుకొన్నాను. కానీ నా అంచనా తప్పయింది. రవిబాబు అమాయకత్వం నన్ను ముగ్దురాల్ని చేసింది. కొంచెం కొంచెంగా, నా మనస్సు అతడికి అర్పితమై పోసాగింది. ఏ శక్తి నన్ను అతడివైపు లాగిందో తెలీదు కానీ ఎంతోమందిని కొనగోట ఆడించగలిగిన నేను, అతని అమాయకత్వానికీ,స్వచ్ఛమైన ప్రేమకీ వివశురాల్నయి పోయేను బాబుగారు! నిజమయిన ప్రేమంటే ఏమిటో ఇప్పుడర్థమయింది.....చెప్పండి ....శారీరకంగా పతనమయిన నాలాటి స్త్రీ  ప్రేమించి, ప్రేమించబడి,  కొత్తగా మళ్ళీ జీవితాన్ని ప్రారంభించడానికి పనికిరాదా...."

    కలలో కూడా వూహించలేనంత విషయాన్ని వింటున్న నేను, ఆ ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చినట్టు ఉలిక్కిపడ్డాను.

 Previous Page Next Page