లక్ష్మీనారాయణ లేచి, "సరే, నేను వాటాకి సిద్దమే" అన్నాడు. ఆ తరువాత సంభాషణ మిగతా విషయాలవేపు తిరిగింది. అర్థగంట అయ్యేక, వెళ్ళొస్తానని చెప్పి బయటకొచ్చాను.
మా ఇంటి పోర్టికోలో కారు దగ్గిర శంకర్ దాదా నిలబడివున్నాడు. క్వారీ దగ్గరికి అని చెప్పి కూర్చున్నాను. శంకర్ దాదా ముందు సీట్లో కూర్చున్నాడు. కారు నెమ్మదిగా కదిలింది.
అయిదు మైళ్ళు ప్రయాణంచేసి గుట్టని చేరుకొంది. కారు దిగేను.
మానవుడి శక్తిని పరీక్షించడానికా అన్నట్టు ఠీవిగా నిలబడి వున్నాయ్ గుట్టలు. వాటిమీద చీమల్లా వున్నారు కూలీలు- వంగి ఒక్కొక్కరాతినే పగులకొడ్తున్నారు.
సూర్యుడు మండుతున్న కుంపటిలా వున్నాడు. భయంకరమైన నిశ్శబ్దం అక్కడ ఆవరించుకొని వుంది. మనుష్యులు నిశ్శబ్దంగా కీ యిచ్చిన బొమ్మల్లా పనిచేసుకుపోతున్నారు. వరుసలో నిలబడి తట్టలుమోస్తూ, కంకరని గుట్టలుగా పోస్తున్నారు. రాళ్ళని కొట్టే చప్పుడు, చక్కగా అలుముకొన్న నిశ్శబ్దాన్ని పారద్రోలలేక పోతోంది.
ఆ పని అనుకున్నట్టు జరిగితే ఎంత లాభం వస్తుందో శంకర్ దాదా వివరిస్తున్నాడు.
అకస్మాత్తుగా నాకు జైలు జీవితం వచ్చింది. వీళ్ళలో ఒకడిగా, మండుటెండలో నెత్తి నుంచి ధారాపాతంగా కారే చెమటని తుడుచుకొంటూ, శ్రమించిన వైనం గుర్తుకొచ్చింది.
ఇక్కడ ఒక రోజు కూలీ, నేను ఇక్కడికి రావటం కోసం ఖర్చు పెట్టిన పెట్రోలు ఖర్చులో సగం. నా తండ్రి ఒక సంస్థానాధీశుడు అయిన కారణాన నాకీ అదృష్టం!
నా ముందు వున్న జనాన్ని చూస్తే నాకు భయం వేసింది. ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ మౌనంగా నిర్లిప్తంగా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఆ నిశ్శబ్దం- ప్రళయం వచ్చేముందు ప్రశాంతతలా, గొప్ప విప్లవానికి సంకేతంలా వుంది. ఒక పెద్దకోటని పట్టుకోవటానికి నిశ్శబ్దంగా చుట్టుముట్టే సైనికుల్లా నెమ్మదిగా కదులుతున్నారు కూలీలు. అందరిలోనూ నిర్లిప్తత.
దూరంగా కలకలం రేగేసరికి నా ఆలోచన్లనుంచి తేరుకొని అటుచూసేను. ఎవరోపడిపోయినట్టున్నారు- అందరూ - పనులు మానేసి అతడి చుట్టూ చేరుతున్నారు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
"ఏమయింది? ఏమయింది?" అరుపులు.
వడివడిగా అటువైపు నడిచాను.
గుంపు నన్ను చూసి నమ్రతగా దారి యిచ్చింది.
"వడదెబ్బ తగిలింది" అంటున్నారెవరో.
"నిన్నట్నుంచీ జొరం. ఇయ్యేల రావద్దురా పనికి అంటే విన్లేదు".
అతణ్ని చేరుకొన్నాను. వెల్లకిలా పడుకొని వున్నాడు. ఛాతీ ఎగిరెగిరి పడుతోంది. ముందుకు వంగి పరిశీలనగా మొహం చూసి, షాక్ తగిలినట్టు నిశ్చేష్టుడనయ్యేను. అతడు అంతకు ముందు రెండు రోజుల ముందు నా దగ్గిరకు వచ్చిన వృద్ధుడు. డబ్బులిస్తే పని ఎగ్గొడతాడేమోననే సంశయాన్ని మాలో కల్గించినవాడు. ప్రాణం పోవటానికా అన్నట్టు కనురెప్పలు సగం తెరుచుకొన్నాయి. లోపల్నుంచి తెల్లగుడ్డు నాతో మాట్లాడుతోంది.
"సాటి మనిషిమీద నమ్మకం పోగొట్టుకొన్న నీతిహీనుడా- అన్నమాట నిలబెట్టుకోవటం కోసం, నీ సంపదని యింకొంచెం పెంచటం కోసం నేను ప్రాణాలు వదులుతున్నాను చూడు"-
చూడలేక వచ్చి కారులో కూర్చున్నాను. ఆ వృద్ధుడి శరీరాన్ని వేన్ తీసుకు వెళ్ళిపోయింది. కూలీలు మళ్ళీ పని మొదలు పెట్టారు. రాళ్ళు పగులుతున్న ధ్వని వినిపిస్తోంది.
నా వంట్లో రక్తం అంతా పిండేసినట్టు వెనుకసీట్లో జారబడి కూర్చున్నాను. నా స్థితి గమనించినట్టు డ్రయివరు కారు పోనిచ్చాడు.
అరగంటలో ఇల్లు చేరుకున్నాను. చాలా నీరసంగా వుంది.
నెమ్మదిగా మెట్లెక్కిడ్రాయింగ్ రూమ్ లోకి ప్రవేశించటానికి కర్టెన్ తొలగించి లాగే స్థాణువై నిలబడిపోయేను. నా చేతిలో కర్టెన్ బిగుసుకుంది.
చేతులు రెండూ ఒళ్ళో పెట్టుకుని, తలవంచుకొని ఒక మధ్యవయస్కుడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుని వున్నాడు.
11
కర్టెన్ మామూలుగా వేసేసి, నా రూమ్ లోకి వచ్చేసేను. నాగుండె వడి వడిగా కొట్టుకొంటోంది.
అదే అత్యంత క్లిష్టమైన పరీక్ష.
మనసంతా అదో రకమైన నిర్లప్తతతో గూడు కట్టుకుపోయి వుంది. ఆ చనిపోయిన వృద్ధుడు పదివేలమంది నిర్భాగ్యులుగా మారి నా చుట్టూ చేరి వికృతం పరిహసిస్తున్నాడు.
తలుపులన్నీ మూసేశాను. నాలో యీ ఘర్షణని భరించలేక పోతున్నాను. ఠాకూర్ జ్ఞాపకం వచ్చాడు.
దేవుడి ముందు మినుక్కు మినుక్కుమని వెలుగుతోన్న దీపం మానవుడి అస్తిత్వాన్ని పరీక్షిస్తున్నట్టు వుంది. బాసింపెట్టు వేసుకొని కూర్చొని కళ్ళు మూసుకొన్నాను. నెమ్మదిగా ప్రపంచం నానుంచి అదృశ్యమైపోయింది.
నేను ఒక్కణ్నే....
అప్పును నేను ఒకణ్నే వేయి 'నేను' లుగా విశ్వమంతా వ్యాపించి ఈ అంధకార బంధుర పరేతనిలయాన్ని వెలుగుతో నింపి, నా ముందో కొత్తప్రపంచం వుంది.....సహృదయమూ, సౌభ్రాతృత్వమూ, సౌమ్యమూ, సౌజన్యమూ- అనే పంచామృతాలని కలిపి, మానవత్వం అనే పాత్రలో యెవరో అందరికీ పంచుతున్నారు. ఆ వరుసలో నేనూ నిలబడ్డాను.
ఆలోచన్లు నానుంచి విడివడి దూరంగా పరుగెడుతున్నాయి.
ఘర్షణ!
నేను కాని నేను.
ప్రపంచం లేదు. అసలేవీఁలేదు.
అంతా మౌనం.... అంతా నీరసం.... అంతా శూన్యం.
శూన్యం-శూన్యం-శూన్యం.
కళ్ళు విప్పి చుట్టూ చూసేను. అయిదు నిముషాలు ధ్యానంతో మామూలు మనిషి నయ్యేను.
తొందర తొందరగా డ్రాయింగు రూంలోకి వచ్చేను. నన్ను చూసి బాబాయి లేచి నిలబడ్డాడు.
"కూర్చోండి" అన్నాను నేనూ కూర్చుంటూ. ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్ లోకి మారటానికి మనసుని ఎలా కంట్రోలు చేసుకోవచ్చునో ఠాకూర్ నేర్పేడు. మిన్నువిరిగి మీదపడ్డా చలించకుండా వుండటాన్ని యీ ఏకాగ్రత నేర్పుతుంది.
"మీ గురించి చాలా విన్నాను. ఒకసారి మీ దర్శనం చేసుకు పోదామని....." ఆగేడు. ఏవీ మారలేదు. అదే వినయం- అదే నవ్వు!
"మీరు....."
'అబ్బే చాలా చిన్నవాణ్నండి" అన్నాడు. "కలప వ్యాపారం వుంది నాకు. అదీగాక ఓ ఇరవై ఎకరాల పొలం వుంది".
ఇరవై ఎకరాలు కాదు- నలభై ఆరెకరాలు వుంది. అంతేకాదు- కలప వ్యాపారంతోపాటు వడ్డీ వ్యాపారం కూడా వుంది. నాకు వచ్చిన రోజే తెలుసా విషయం.
చిన్నవాడు కాదు పెద్దవాడు, లక్ష్మీనారాయణ కంటె పెద్దవాడు. పోతే లక్ష్మీనారాయణ కొంచెం వుంటే పెద్దదిగా హంగుచేసే విధానం- ఇతడికి ఎంత సంపాదించిన పైకి మామూలుగా కనపడే గుణం.
"క్షమించాలి, మీ గురించి అతడు చెప్పేడు గృహప్రవేశం రోజు మిమ్మల్ని పిలవలేకపోయాను" అన్నాను.
"అబ్బే పర్లేదు- పర్లేదు" అన్నాడు అతడు నొచ్చుకుంటున్నట్టు. చాలా పెద్ద పెద్ద వాళ్లు వచ్చేరుట. అటువంటి దానికి నేనెందుకు" అతని మాటల్లో సెటైర్ ఏమన్నా వుందేమోనని పరిశీలించి చూసేను. అటువంటిదేవీఁ కనబడలేదు- బహుశా యితడు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సుతో బాధపడుతూ వుండి వుండాలి.
మా యిద్దరి మధ్యా మామూలుగా కొద్దిసేపు సంభాషణ జరిగింది.
కిటికీలోంచి బయటకు చూసి, "లక్ష్మీనారాయణ గారింటి నుంచి వస్తున్నట్టున్నారు" అన్నాడు.
"అతనితో కలిసి ఓ కాంట్రాక్టులో పని చేద్దామనే ఉద్దేశ్యంతో వున్నాను" అన్నాను అతనివైపే పరిశీలనగా చూస్తూ. "ఒక పీచు కన్ సైన్ మెంట్ ఎక్స్ పోర్టు విషయంలో-
అతని మొహంలో ఆతృత కనిపించింది.
"ఎంతకి కాంట్రాక్టు?' అడిగేడు.
"పదిలక్షలదాకా ఉండొచ్చు. ఆరు లక్షలదాకా బ్యాంక్ యిస్తుంది. నాలుగు లక్షలు మా పెట్టుబడి- ఇప్పుడే ఓరల్ ఎగ్రిమెంటు జరిగి పోయింది."
అతడు చాలాసేపు మౌనంగా వుండిపోయేడు. కొంచెం నిస్పృహ పొందినట్టు అతడి మొహం వాడిపోయింది. ముందుకు వంగేను.
"మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు".
అతను ఉలిక్కిపడి - ఏవీఁలేదు" అన్నాడు.
"ఫరవాలేదు- చెప్పండి" బలవంతం చేసేను.
కొంచెం తటపటాయించి, "మీతో కలిసి వ్యాపారం చేద్దామను కొన్నాను" అన్నాడు.
నవ్వి, "నాతోనా?" అన్నాను నా కంఠంలో కొద్దిగా హేళన ధ్వనించినట్టు. తలెత్తి "లక్ష్మీనారాయణగారంత పెట్టుబడి పెట్టలేకపోవచ్చు. గానీ, మరీ అంత-" ఆపై మాటలు దొరక్క ఆగిపోయేడు.
"అబ్బెబ్బే- నా ఉద్దేశ్యం అది కాదు" అన్నాను నొచ్చుకుంటూ. "ఇంతకీ మీరు పెట్టుబడి మీవైపునుంచి యెంత పెట్టగలరు?"
ముందుకు వంగి రహస్యం చెబుతున్నట్టు "రెండు లక్షల దాకా పెడితే సరిపోతుందా?" అన్నాడు.
* * *
"నా పేరు రవి. లక్ష్మీనారాయణగారి అబ్బాయిని" అన్నాడు అతను 'కూర్చోండి' అన్నాను షేక్ హేండిచ్చి.
అతడి వయసు యిరవై అయిదేళ్ళు వుండొచ్చు. అమాయకత్వం ఇంకా మొహం నుంచి పోలేదు. లేతగా వున్నాడు. కళ్ళు నిర్మలంగా ఉన్నాయి. తల్లిదండ్రుల పోలిక ఏ కోశంలోనూ కనపడటంలేదు. సాదాబట్టల్లో వున్నాడు- రెండు చేతులూ వళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు. కూర్చోవటంలో నమ్రత కనపడుతోంది.
'మా నాన్నగారు, మీ దగ్గర పని నేర్చుకోమన్నారు' అన్నాడు. నవ్వొచ్చింది. 'ఏం నేర్చుకోంటావు?' అన్నాను నవ్వుతూ. ఒక మూల టేబిల్ మీద వరుసగా పేర్చిన కామర్స్ జర్నల్స్ వైపు చూస్తూ 'ఏదయినా సరే'-' అన్నాడు.
నా వూహ తప్పుకాదు. అతడు చాలా అమాయకుడు.
'అప్పుడప్పుడూ యిలా వస్తూ వుండండి' అన్నాను. తలూపేడు. కొంచెంసేపు ప్రస్తుత రాజకీయాల గురించి, కొత్త కాంట్రాక్టు గురించి సంభాషణ జరిగింది.