Previous Page Next Page 
జీవనయానం పేజి 2


    భారత భూమి ఆఫ్రికాను అంటి ఉండేదట! ఇప్పుడు లేని సరస్వతీనది ఒకప్పుడు ఉందట.

 

    సృష్టి సమస్తం వలయం వంటిది. వలయంలో ఒక బిందువువద్ద వృద్ధి ప్రారంభం అవుతుంది. వలయపు ధృవంవరకు సాగుతుంది. అక్కడ క్షయం ప్రారంభం అవుతుంది. బయలుదేరిన బిందువువద్ద అంతం అవుతుంది.

 

    అది మళ్లీ వృద్ధి చెందుతున్నదా? అదొక మహత్తమ మయిన ప్రశ్న. సమాధానాలు సిద్ధాంతాన్నిబట్టి ఉంటాయి. ఇంతకూ మార్పులేనిది లోకంలో ఏదీలేదు. ఇది జీవితపు నగ్నసత్యం. ఈశ్వరుడు తప్ప సమస్తం అశాశ్వతం.

 

చారిత్రక సాక్ష్యాలు:

 

    1. ఒకనాటి బ్రిటిష్ సామ్రాజ్యం మీద సూర్యుడు అస్తమించలేదు. ఈనాడు ఆ అనంత సామ్రాజ్యం అస్తమించింది. ఆ సామ్రాజ్యం ఒక చిన్నదీవికి పరిమితం అయింది.

 

    2. హిట్లరు సమస్త విశ్వాన్ని చాపచుట్టి చంకలో పెట్టదలచాడు. తాను ఆత్మ హత్య చేసుకున్నాడు.

 

    3. తన ధనమదంతో ప్రపంచాన్ని తన జేబులో పెట్టుకోవాలనుకుంది అమెరికా. సోషలిస్టు రష్యాను చూచి గిజగిజలాడింది. వెనక్కు తగ్గింది.

 

    4.సామ్రాజ్యవాదానికి సమాధి నిర్మించగలదు అనుకున్న సోవియట్ యూనియన్ ఛిన్నాభిన్నం అయింది. అక్కడి సోషలిజం అంతరించింది.

 

    5.నల్లమందు భాయీలు అనుకున్న చైనా, సోషలిజం సాధించి - ప్రపంచంలో అగ్రరాజ్యంగా పయనిస్తూంది.

 

    6.భారతదేశం ఈ శతాబ్దంలోనే ఇటు బర్మానుంచి అటు అఫ్గనిస్తాన్ వరకు వ్యాపించి ఉండింది. క్రమంగా బర్మా పోయింది. ఆఫ్ఘనిస్తాన్ పోయింది. పాకిస్తాన్ కూడా పోయి, ఇప్పటి భారతదేశం మిగిలింది!

 

    7.1947లో ఏర్పడిన పాకిస్తాన్ పాతిక సంవత్సరాలయినా నిలువలేదు! అందులోంచే బంగ్లాదేశ్ పుట్టింది.

 

    ఇవన్నీ మనం ఎరిగిన పరిణామాలు.

 

    దేశాల హద్దులు - సముద్రాలు - పర్వతాలు - నదులు సమస్తం మారుతూనే ఉంటాయి.

 

    ఏ వ్యక్తీ - ఏ రాజ్యమూ - ఏ సిద్ధాంతమూ - ఏ మతమూ పరిపూర్ణం కాదు. అన్నీ ఒక దశలో ఉన్నత ఆదర్శాలతో ప్రారంభం అయినవే. అన్నీ స్వప్రయోజనపరుల దివ్యహస్తాలతో ఆదర్శాలు అడుగంటినవే!

 

    మానవ జాతి ప్రగతికి ఒక నిర్దిష్టలక్ష్యం లేదు. మానవుడు జన్మించినదాదిగా అది గంగవలె - నైలువలె - వోల్గొవలె - యాంగ్ ట్సీవలె - అమెజాన్ వలె నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. ప్రవహిస్తూనే ఉంటుంది.    

 

    ఆసిఫ్ జాహీలు:

 

    ఔరంగజేబ్ మొగలు సామ్రాట్టులలో చివరివాడు. ఎంచాతంటే, తరువాత సామ్రాట్టులు లేరు. ఔరంగజేబు అత్యంత సమర్థుడు. దురాశాపరుడు. అంతులేని రాజ్యకాంక్ష కలవాడు. వీరుడు. మాట దురహంకారి. మహాగర్వి. నియంత.

 

    ఇన్ని దుర్లక్షణాలున్న ఔరంగజేబు వ్యక్తిగత జీవితం అతిసాధారణం. అతడు సాధారణ పౌరునివలె జీవితం గడిపాడు. అతడు ఖురానులు వ్రాసి అమ్మి జీవితం గడిపేవాడు.

 

    ఔరంగజేబు అత్యంత సాధారణ జీవితానికి సజీవ సాక్ష్యం 'ఖుల్దానా' లోని అతని సమాధి. ఔరంగజేబు తాను నిర్మించుకున్న ఔరంగాబాదులో మరణించాడు. అతని సమాధిని గురించి అతడు వ్రాసిన వీలునామాలో అందుకు పదిహేనురూపాయలు మాత్రం ఖర్చుపెట్టమని వ్రాశాడు. సమాధిమీద ఎలాంటి నిర్మాణం చేయరాదన్నాడు. గోరీ మట్టిది కావాలి తప్ప రాతితో కట్టరాదన్నారు. మట్టి సమాధిమీద ఎప్పటికీ ఒక 'సబ్జా'కు మొక్క ఉండాలన్నాడు. తెల్లని చద్దరు తప్ప గోరీమీద ఎలాంటి అచ్ఛాదనా ఉండరాదన్నాడు.

 

    ఖుల్దానాలో ఔరంగజేబు సమాధి ఇవ్వాళ్టికీ అలాగే ఉంది.

 

    ఒక వైస్రాయ్ వచ్చి అది చూచాట్ట. ఒక సామ్రాట్టు సమాధి ఉండవలసిన తీరు అది కాదన్నాడు. అప్పటికి ఆ ప్రాంతం నిజాముల పాలనలో ఉంది. వైస్రాయ్ నిజాముకు వ్రాశాడు. మంచి నిర్మాణం చేయవలసిందని వ్రాశాడు. నిజాముకు నవాబు ఔరంగజేబు వీలునామా ప్రతిని వైస్రాయ్ కు పంపాడు. సమాధి చుట్టు పాలరాతి గోడమాత్రం నిర్మించాడు.

 

    ఔరంగజేబు కొడుకు తన తల్లి సమాధిని తాజ్ మహల్ వలె ఔరంగాబాదులో నిర్మించాడు. దాని పేరు 'బీబీకా మఖ్భరా.' అది తాజ్ మహల్ వలె ఉన్నది కాని కళాకాంతులు లేవు.

 

    ఔరంగజేబు దుష్టత్వాన్నీ - దుర్మార్గాన్నీ - దురహంకారాన్నీ - మతమౌఢ్యాన్ని మరిపించడానికి ఈ విషయం వ్రాయడం లేదు. అతడు రాజ్య కాంక్షతో సోదరులను చంపడం - తండ్రిని కారాగారంలో పెట్టడం - మందిరాలను కూల్చడం జగద్విదితం.

 

    ఔరంగ్ జేబ్ రాజ్య కాంక్షకు దక్షిణాపథం - దక్కన్ గురి అయింది. అతడు గోలకొండను - దక్కనును జయించాడు. ఔరంగాబాదును రాజధానిగా చేసుకుని పాలించాడు.

 

    మీర్ ఖమ్రుద్దీన్ చిన్ ఖిల్జ్ ఖాన్, ఫతెహ్ జంగ్, నిజామ్ - ఉల్ - ముల్క్ ను ఔరంగజేబు దక్కను సుబేదారుగా నియమించాడు. ఖమ్రుద్దీన్ దక్కనులోని ఔరంగాబాదు - బెరార్ - బీదర్ - బీజాపూర్ - హైదరాబాదు - ఖాందేశ్ అనే ఆరుసుబాలకు సుబేదారు.

 

    ఖమ్రుద్దీన్ తల్లి షాహజహన్ దర్భారులో మంత్రియైన సాదుల్లాకు ఏకైక పుత్రిక. అతని తండ్రి ఘయాజుద్దీన్ ఫిరోజ్ జంగ్. ఔరంగజేబుకు సేనాధిపతి. గోలకొండ ముట్టడికి అతడే నాయకత్వం వహించాడు. అతని తండ్రి వంశం - అబూబూకర్ మొదట ఖలీఫాకు చెందింది. తల్లి తరపున మహమ్మదు ప్రవక్త వంశం.

 

    ఖమ్రుద్దీన్ అసాధారణ ప్రతిభావంతుడు. సమర్థుడైన పాలకుడు. అసమాన ధైర్యసాహసాలు కలవాడు. రాజకీయ చాతుర్యం కలవాడు. సాహసి.

 

    ఔరంగజేబు మరణించాడు. మొగలు దర్భారు నీరసించింది. అదీకాక ఢిల్లీనుంచి దక్కన్ను పాలించిన ఉదంతాలు తక్కువ. వీటిని అన్నింటినీ గ్రహించిన ఖమ్రుద్దీన్ స్వాతంత్ర్యం ప్రకటించాడు. నర్మద నుంచి కావేరి వరకు, మచిలీపట్నం నుంచి బీజాపూర్ వరకు దక్షిణ పీఠభూమిని అంతటినీ వశపరుచుకున్నాడు.

 

    1724 వ సంవత్సరంలో ఆసిఫ్ జాహీ వంశాన్ని స్థాపించాడు. ఆ వంశానికి ఆద్యుడు అయినాడు.

 

    ఇంతటి పెను తిరుగుబాటును చూస్తూ ఉండిపోయింది తప్ప మొగల్ దర్బారు ఏమీ చేయలేకపోయింది. మరీ చూస్తూ ఉండలేకపోయారు. ముబారిజ్ ఖాన్ అనే ఒక ఛోటా సుబేదారును ఉసికొల్పారు. షకర్ ఖేల్డా వద్ద యుద్ధం జరిగింది. ఖుమ్రుద్దీన్ ముబారిజ్ ఖాన్ను అణచేశాడు. ముబారిజ్ ఖాన్ తలను ఢిల్లీకి బహుమానంగా పంపాడు.

 

    అంతటితో ఖమ్రుద్దీన్ నిజామ్ -ఉల్ - ముల్క్ దక్కనుకు సర్వతంత్ర స్వతంత్రుడయిన ప్రభువు అయినాడు. అతను చిన్న చిన్న తిరుగుబాటులను అణచి వేయడమేగాక రూపుమాపాడు.

 

    ఖమ్రుద్దీన్ మహారాష్ట్రులను మాత్రం అణచలేకపోయాడు. వారి దాడులు పెచ్చుపెరిగాయి. ఔరంగాబాదు మహారాష్ట్రంలో ఉంది. వారి దాడులకు విసిగిన ఖమ్రుద్దీన్ తన రాజధానిని తెలంగాణంలోని హైదరాబాదుకు మార్చాడు. అందువలన ఆసిఫ్ జాహ్ కు మహారాష్ట్రుల ప్రత్యక్షప్రహారం తప్పింది.

 

    తొలి అసిఫ్జాహ్ ఖమ్రుద్దీన్ తన భుజబలం - బుద్ధిబలం - సామర్థ్యంతో దక్కన్ సామ్రాజ్యం మీద ఈగ వాలకుండా కాపాడాడు. ఉద్రిక్త మహారాష్ట్రులను అదుపులో ఉంచాడు. భారతదేశాన్ని ముక్కలుగా మింగాలని పొంచి ఉన్న బ్రిటిష్ పోర్చుగీసు, ఫ్రెంచివారిని తన ఛాయలకు రానివ్వలేదు. ఒక విశాల సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఒక సుదృఢమైన ప్రభుత్వాన్ని ఏర్పరచాడు.

 

    ఖమ్రుద్దీన్ను గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. అతడు ఒకసారి వేటకు బయలుదేరాడు. వేట చాలాసేపు సాగింది. పులులనూ, సింహాలనూ వధించాడు. ఒక జంతువు వెంటపడ్డాడు. అది అందలేదు. దానివెంట పరిగెత్తాడు. తన శిబిరానికి దూరం అయినాడు. మృగం దొరకలేదు. కాని, ఆకలి దప్పులు అతన్ని కృంగదీశాయి. అడవిలో దూరంగా అతనికి ఒక కుటీరం కనిపించింది. అంతట నవాబూ అక్కడికి చేరాడు. అది ఒక పడేరు కుటీరం ఫకీరును నీళ్ళుపోయమని అర్థించాడు సామ్రాట్టు! ఫకీరు నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. ఖమ్రుద్దీన్ నీళ్ళు త్రాగాడు. నీడలో కూర్చున్నాడు. ఆకలి మండిపోతుంది.

 

    "ఆకలిగా ఉందా నాయనా?" అడిగాడు ఫకీరు.

 

    "అవును. ఆకలి మండుతున్నది. ఆకలి ముందు సామ్రాజ్యాలు ఎందుకూ కొరగావని అర్థమైంది. అన్నం పెట్టండి, బడ జాగీరు ఇస్తాను."                       

 Previous Page Next Page