Read more!
 Previous Page Next Page 
మోడల్ పేజి 2


    "ఎస్ సార్!"

    "ఓ.కె.నౌ......కమలినికి ఒకసారి ఫోన్ చేస్తారా?"
   
    "ఎస్ సార్!"

    మనోహర్ ఇంటర్ కమ్ రిసీవర్ హుక్ చేసి టేబిల్ మీదున్న 'రెడ్ స్టార్' మాగజైన్ చూస్తున్నాడు.

    రెండు నిమిషాలు గడిచాయి ఫోన్ మోగింది.

    "కమలిని లైన్లో ఉన్నారు, సర్"......మిలీ గొంతు.

    ఫోన్ రిసీవర్ ఎత్తాడు మనోహర్.

    "గుడ్ మాణింగ్ మనోహర్....." అవతలినుంచి సన్నగా వీణతీగ మోగినట్లు కమలిని గొంతు.

    "బిజీగా ఉన్నారా......?"

    "నో.......అయామ్ వెయిటింగ్ ఫర్ యు ఓన్లీ......"

    "థాంక్యూ."

    "అయిదు నిముషాల్లో మీ ముందుంటాను" మనోహర్ అన్నాడు.

    "ముందు జాగ్రత్తచర్యగా ఐదు నిముషాల్లో అంటున్నావు.....కాని......నువ్వు రెండు నిముషాల్లో ఇక్కడుంటావు....అవునా?" కమలిని నవ్వు తరంగాల్లో తెరలు తెరలుగా వినబడింది.

    మనోహర్ కూడా నవ్వాడు. అది శబ్దంలేని  నవ్వు.

    రిసీవర్ హుక్ మీద పెట్టేశాడు.

    గదిలోంచి బయట కొచ్చాడు. గబగబా నడుచుకుంటూ మెట్లవైపు వెళ్ళాడు. ఒక్క నిముషంలో అతను పోర్టికోలో ఆపిన తన కుంకుంరంగు కారులో ఉన్నాడు.

    కమలిని:

    రాష్ట్రంలో మోడలింగ్ చేస్తున్న వాళ్ళలో ఆవిడకు ప్రత్యేకమైన పేరుంది. ఆవిడకు నలభై ఏళ్ళుంటాయి. కాని 25 ఏళ్ళ  అమ్మాయిలా వుంటుంది. ఆవిడ గత పదిహేనేళ్ళుగా మోడలింగ్ వృత్తిలో వుంది.

    ఆవిడతో మాట్లాడటానికి ఎక్కువమంది భయపడతారు. ఎందుకంటే ఆవిడ ఏ విషయాన్నయినా కుండ బ్రద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది.

    ఆవిడ ఇటీవలి కాలంలో రెండు వ్యాపార ప్రకటనల చిత్రాల్లో నటించింది. ఒకటి కొత్తగా విడుదలైన "సుగంధి' సబ్బు__రెండోది 'షా' టాల్కం పౌడర్. ఆ రెండు అతి తక్కువకాలంలో ఎక్కువ మార్కట్ చేసుకున్నాయి. అందుకు కమలిని పబ్లిసిటీ చిత్రాలే  ఎక్కువ కారణమని అందరికీ తెలుసు. కమలిని అమీర్ పేటలోని ఓ విశాలమైన స్వంత భవనంలో ఒంటరిగా వుంటోంది.


                                    *    *    *

    హొటల్ ఓపేరా భాగ్యవంతుల స్వర్గం. హొటల్ వెనుక కొద్ది దూరంలో స్విమ్మింగ్ ఫుల్___స్విమ్మింగ్ ఫుల్ లో ఈతకొడుతూ ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.

    మనోహర్ అసోసియేటెడ్ ఫోటోగ్రాఫర్ గిరీష్ దగ్గరుండి అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ మధుచక్రవర్తితో ఆ రోజు తీయాల్సిన యాడ్ ఫిల్మ్ కి సంబంధించిన అరేంజిమెంట్స్ చేయిస్తూనే, మోడలింగ్ ఆర్టిస్టులతో రిహార్సల్ చేయిస్తున్నాడు.

    సమయం ఉదయం తొమ్మిది గంటలు కావస్తోంది. బికిని డ్రస్ లో వున్నా మోడలింగ్ అమ్మాయిల్ని చూసేందుకు హొటల్ కస్టమర్ల తో పాటు స్టాఫ్ కూడా అక్కడ గుమికూడారు.

    గిరీష్ పూనా ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ లో ఫోటోగ్రఫీ డిప్లోమా చేశాడు. ఆ తరువాత ప్రసిద్ద ఇండియన్ యాడ్ ఫోటోగ్రాఫర్ల వద్ద కొంతకాలం అసిస్టెంటుగా పనిచేసి ఇటీవలే హైదరాబాద్ వచ్చి మనోహర్ దగ్గర  పని చేయడమంటే కత్తిమీద సాము అని. ప్రతిదీ ఠంచన్ గా జరగాలి. ఏది పొరపాటు జరిగినా సహించడు మనోహర్. సొంత విషయాల్లో ఎంత పరధ్యానంగా వుంటాడో వృత్తిలో అంత ఎలర్ట్ గా వుంటాడు.

    ఆ రోజు యాడ్  ఫిల్మ్ షూటింగ్ కోసం మెయిన్ మోడల్ తోపాటు ఇటీవలే మోడలింగ్ లోకి దిగిన మరో ముగ్గురు అమ్మాయిల్ని, ఇద్దరు అబ్బాయిల్ని తీసుకొచ్చారు.

    షూటింగ్ అంతా మెయిన్ మోడల్ పైనే. మిగతా జూనియర్  మోడల్స్ బ్యాక్  డ్రాప్ లో ఎట్మాస్ఫియర్ క్యారక్టర్స్ మాత్రమే. వీళ్ళనే సినిమాల్లో ఎక్స్ ట్రా ఆర్టిస్టులంటారు.

    ఆ అమ్మాయి పొడవు దాదాపు అయిదు అడుగుల మూడంగుళాలు వుంది. ఆమె వంటిమెరుపు సంపెగ పూవు రంగులో వుంది. ఆ సమయంలో ఆ అమ్మాయి వంటిమీద పైభాగంలో నైలాన్ బ్రా, క్రింది భాగంలో పల్చటి బికినీ మాత్రమె వున్నాయి.

    ఆ సమయంలో ఆ అమ్మాయి ఆకుపచ్చని లాన్లో పోక చెట్టుముందు అతి ఖరీదైన కుర్చీలో అతిషోగ్గా కూర్చుంది.

    ఆమె ఎదురుగా____

    అందమైన విశాఖపట్నం సముద్రాన్ని రెండుగా విడగొట్టి ఒక భాగాన్ని అక్కడకు తీసుకొచ్చి అమర్చినట్టుగా స్విమ్మింగ్ ఫుల్.

    ఆ నీళ్ళు ఆకుపచ్చగా మెరుపుకోసం పైన నీలపు తళుకును అతికించుకున్నట్లు వున్నాయి.

    ఆమెకు దూరంగా ఓ ఆంగ్లో ఇండియన్ జంట ఒడ్డునపెట్టిన పాలమీగడల్లా వున్నారు. వాళ్ళిద్దరూ దాదాపు ప్రపంచానికి అంతా వదిలేసినట్లుగా స్వేచ్ఛగా, హాయిగా భారతదేశపు స్వాతంత్ర్యానికి గుర్తులా వున్నారు.

    అంతవరకూ దూరంగా ఎరిప్లెక్స్.......35ఎం.ఎం. కెమేరాముందు డిసాల్వింగ్ లెన్స్ చూస్తున్న మనోహర్ స్విమ్మింగ్ ఫూల్ లోకేషన్ వైపు చూశాడు ప్యూపైడర్ లోంచి. మధు చక్రవర్తి ఆ అమ్మాయి దగ్గర కొచ్చాడు.

    ఆ అమ్మాయి రోమాకౌర్.

    "షాట్ రెడీ, మిస్ రోమా" అని మధుచక్రవర్తి అనగానే రోమాలేచి నిలబడింది.

    "సార్ షాట్ రెడీసర్" అన్నాడు మనోహర్ తో మధుచక్రవర్తి. క్రొత్త సబ్బును తీసుకెళ్ళి ఆమె చేతిలోపెట్టాడు. అసోసియేటెడ్ ఫోటో గ్రాఫర్ గిరీష్ ఆమె దగ్గరకెళ్ళి ముఖమ్మీద నీళ్ళు చల్లాడు. ముఖమ్మీద తడి ఎఫెక్టు కోసం.

    నిశ్శబ్దంగా వున్న గంభీరమైన వాతావరణంలో, ఏక్షన్" అని అనగానే మనోహర్ చేతిలో కెమేరా స్టార్టయింది. రోమా యాక్షన్ మొదలుపెట్టింది. అప్పుడు న్యూక్లియర్ వార్ మొదలైందన్నా కదలడు మనోహర్. వృత్తిపట్ల సిన్సియారిటీ అలాంటిది. కెమేరాను ముట్టుకున్నాడంటే ఓ అద్భుతమైన యాడ్ ఫిల్మ్ తయారుకావాల్సిందే! కెమేరా ముందు వుంటే అతని మెదడు, కళ్ళు, చేతులు అద్భుతాల్ని సృష్టించేందుకు ఉరుకులు, పరుగులు పెడుతూ వుంటాయి.

    వివిధ రకాలైన హావభావాల్తో నాలుగో క్లోజప్ షాట్స్___

    మొదట ఆ అమ్మాయి రెండు చేతుల్లో సబ్బుని వుంచుకుని తన్మయత్వంగా వాసన చూడడం.

    "రెండోది____బుగ్గకి అనించుకోవడం.

    మూడు___కంఠం కిందుగా సబ్బు బిళ్ళని జార్చటం.

    నాలుగు___కుడి అరచేతిలో సబ్బుబిళ్ళని ఉంచి ఒకసారి నీట్లో ముంచి తీయడం.

    ఈ నాలుగు షాట్లు తీయడానికి గంటకుపైగా పట్టింది.

    అంతుముందు కోయంబత్తూరు జలపాతం దగ్గర ఆ క్రొత్తగా  వచ్చిన సబ్బు ఎడ్వర్డయిజ్ మెంట్ కు సంబంధించి ఎక్కువభాగాన్ని మనోహర్ షూట్ చేశాడు.

    ఆ తర్వాత కొన్ని క్లోజ్ షాట్స్ పెడితే బావుంటుందని అన్పించింది అతనికి____

    ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత మంచిదన్న ఉద్దేశ్యంతో వున్నాడతను. ప్రస్తుతం......

    తను చేపడుతున్న కొన్ని లక్షల ఆదాయం చేజిక్కే 'యాడ్ ఫిల్మ్స్' మీదే మొత్తం అతని ఆలోచనలన్నీ కేంద్రీకృతమయ్యాయి.

    అతను మంచి యాడ్ ఫోటోగ్రాఫరన్న పేరు ఇప్పటికే జాతీయ స్థాయిలో సంపాదించాడు. కానీ అది చాలదు అంతర్జాతీయ స్థాయిలో అతనికిప్పుడు పేరు కావాలి. యాడ్ ఫిల్మ్స్ తనంత గొప్పగా వేరెవరూ తీయలేరన్న పేరు కావాలి.

    దాంతోపాటు___

    తను చేసిన 'ఛాలెంజ్' అనుక్షణం గుర్తుకొస్తుంది.

    తను వ్యాపారంలో ఉనికిని పటిష్టం చేసుకోవాలంటే 'ఇదే' ఏకైక మార్గం. వ్యాపారంలో  మెలకువలు తెల్సు. ఆ వ్యాపారం మీద అదుపు సంపాదించాల్నదే అతని కిప్పుడున్న ఏకైక పట్టుదల.

    ఆ అదుపు రావాలంటే......

    ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవాలి.

    తప్పుదు, అందుకు సిద్ధపడుతున్నాడు.

    ఈ ప్రయాణంలో శత్రువులే ఎక్కువమంది. ఎవర్నీ స్నేహితులుగా నమ్మకూడదు. నమ్మినట్లు నటించాలి. నటింపజేయాలి.

    అందుకు కూడా సిద్ధపడుతున్నాడు.

    తను చేపట్టిన ఈ వ్యాపార సినిమాలవృత్తి విషయం ఆలోచిస్తే మనోహర్ కి సింద్ బాద్ సాహస గాధలో ఒక సన్నివేశం జ్ఞాపకానికొస్తుంది.

    కొండ దిగువన లోయలో మణులు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం వుంటాయి. వాటిచుట్టూ భయంకరమైన విషసర్పాలు నివాసం ఏర్పరచుకుంటాయి. దిగి తీసుకోడానికి వీలుకాని పరిస్థితి అవి రావాలంటే వ్యాపారులు మాంసం ముద్దల్ని విసురుతారు. ఆ మాంసం ముద్దలకు వైన ఆ మణులు అంటుకుంటాయి. మాంసం ముద్దలకోసం డేగలు ఆ లోయల్లోకి దిగుతాయి. ముక్కున మాంసం ముద్దల్ని కరచుకొని ఎగురుతుంటాయి. అప్పుడు.......

    వాటిని కొడితే, లేక భయపడితే అవి మణులు అంటుకొని వున్న ఆ ముద్దల్ని కొండలమీదకి వదిలేసి ప్రాణభయంతో ఎగిరిపోతాయి.

    మణుల్ని వ్యాపారులు చేజిక్కించుకుంటారు. మరలా మాంసం ముద్దల్ని విసిరేందుకు సిద్ధంగా వుంటారు___అదే ఆశ తెలివిలోంచి పుట్టే ఆశ. అందులోనూ బలవంతులదే రాజ్యం.'

    అక్కడా హింస తప్పదు.

    ఐశ్వర్యం కోసం హింస.

    ఒకడికంటే ఇంకొకడు ఎక్కువ డబ్బు సంపాదించాలంటే హింసతప్పదు.

    నిలదొక్కుకోవాలంటే హింస తప్పదు.

    ఒకడిని మరొకడు నాశనం చేసుకోవడం, చేసి నిలవడమనే ఆటవిక న్యాయమే ఆధునికన్యాయంగా  కూడా చాలామణి అవుతోంది.

    ఈ వ్యాపారంలో-

    అక్కడ జంతువుల్ని చంపి వాటి మాంసం ముద్దలను డేగలకు ఎర-

    ఇక్కడ మనుషుల మాంసం ముద్దలు ఈ వృత్తికి ఎర___

    అందులోనూ___

    అందమైన ఆడపిల్లల సోయగాలు ఎర.

    తప్పదు,

    అందుకు సిద్దపడక తప్పదు.

    తను ఛాలెంజ్' చేశాడు.

    ఆ 'ఛాలెంజ్' ని నిలుపుకుని విజయం సాధించాలంటే,

    వ్యాపార ధర్మాలు పాటించక తప్పదు.

    షూటింగ్ అయిపోయాక రిలాక్స్ కోసం చెట్టుక్రింద రెండు నిముషాలు కూర్చున్న మనోహర్  మనసులో మెదుల్తున్న ఆలోచనలివి.

    అసిస్టెంట్లు సరంజామాతో వెళ్ళిపోయారు. రోమాకౌర్ డ్రెసింగ్ రూంలో బట్టలు మార్చుకోడానికి వెళ్ళింది.

 Previous Page Next Page