"ఈ అమ్మాయి కూడా విజయనగర్ కాలనీలో ఉంటుందా ఏంటి?" అనుకున్నాడు.
కానీ ఆ ఆటో ఎడమ పక్కకి శాంతినగర్ లోకి తిరిగింది. శాంతినగర్ విజయనగర్ కాలనీకి అనుకునే ఉంటుంది.
ఆ ఆటో ఒక పెద్ద బంగళా ముందు ఆగింది.
"ఏయ్ ఏయ్ నువ్విక్కడే ఆపెయ్... ముందుకి వెళ్లొద్దు..." అన్నాడు చిట్టబ్బాయి.
చిట్టబ్బాయి వాళ్ళ ఆటో ఆ ఆటోకి కాస్త దూరంలో ఆగింది.
ఆ అమ్మాయి ఆటోలోంచి దిగి ఆ బంగళాలోకి చకా చకా నడుచుకుంటూ పోయింది.
"అయితే ఆ అమ్మాయి ఇల్లు యిదన్నమాట!" అన్నాడు కన్నారావు.
"ఓహ్... మనింటికి చాల దగ్గర్లోనే ఉంటుంది. నేనెంత లక్కీనో?!....." మురిసిపోతూ అన్నాడు చిట్టబ్బాయి.
"ఇప్పుడే కాదు... నువ్వు ఆ అమ్మాయి చేత ప్రేమింపబడ్తే... అప్పుడు లక్కీ... విజయనగర్ కాలనీ పదవోయ్ ఆటో" అన్నాడు కన్నారావు.
ఆటో ముందుకు కదిలింది.
ఇంటికెళ్ళిన తరువాత చిట్టబ్బాయి తెగ గోల పెట్టేసాడు.
"ఆ అమ్మాయి గురించిన వివరాలు వెంటనే తెలుసుకోవాలి!.... ఎలా?... ఎలా?" అన్నాడు గదిలో అటూ ఇటూ తిరుగుతూ.
"ఎలాగోలా తెల్సుకుందాంలే... నువ్వు కాస్సేపు కూర్చో, అలా తిరక్కు కాళ్లు నెప్పులేస్తాయి" అన్నాడు కన్నారావు.
కానీ చిట్టబ్బాయి కూర్చోలేదు. ఆ అమ్మాయి గురించి వెంటనే తెలుసుకోవాలని చిందులు వేసాడు. చిట్టబ్బాయి అలా గంతులేస్తుంటే కన్నారావు కేకలేసాడు. ఇప్పటికిప్పుడు తెలుసుకోవాలంటే ఎలా కుదుర్తుంది? తీరుబడిగా ఆలోచించుదాం అన్నాడు.
రాత్రి పడుకునే ముందు చిట్టబ్బాయి అన్నాడు.
"పోనీ ఇద్దరం వెళ్ళి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాకబు చేస్తేనో?"
ఇద్దరూ వెళ్ళివాళ్ళని అడిగితే అందరి అటెన్షన్ వాళ్ళమీదే ఉంటుంది, కాబట్టి అలా వద్దనీ తనొక్కడే వెళ్ళి గప్ చిప్ గా వివరాలన్నీ కనుక్కుని వస్తాననీ చెప్పాడు కన్నారావు. ఆ రాత్రంతా చిట్టబ్బాయికి కలత నిద్రే!
* * *
ఇది క్రితం రోజు జరిగిన తంతు.
ఆ రోజు ఆఫీసునుండి వచ్చాక మొహం కడుక్కుని కాస్త కాఫీ పెట్టుకుని తాగాక కన్నారావు శాంతినగర్ కి బయలుదేరాడు.
"ఒరేయ్... ఆ అమ్మాయి వివరాలే కాకుండా ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు? వాళ్ళ వివరాలూ అవీ కూడా కనుక్కో" అన్నాడు చిట్టబ్బాయి.
"అలాగే... ఎంతవరకూ సాధ్యమో అంతవరకు కనుక్కుంటాను..." చెప్పాడు కన్నారావు వీధి గుమ్మం దాటుతూ.
"జాగ్రత్తరొరేయ్...."
"అలాగలాగే...."అంటూ వీధిలో పడ్డాడు కన్నారావు.
అలా వెళ్ళిన కన్నారావు ఇంకా రాలేదు. అతను వెళ్ళి గంటపైగానే అయింది.
అసలు వీడు ఏమైనా కనుక్కున్నాడో లేదో?.... ఇంకా ఎంతసేపు ఇలా ఎదురు చూడాలో??- ఈ సస్పెన్సు భరించలేకుండా ఉన్నాను!! అనుకున్నాడు చిట్టబ్బాయి.
అతనిలా అనుకుంటుండగానే డోర్ బెల్ మోగింది.
చిట్టబ్బాయి సంతోషంగా ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు.
"కన్నారావ్ వచ్చేసాడు! నా కోసం కష్టపడి ఆ అమ్మాయి వివరాలన్నీ కనుక్కుని వచ్చేసాడు. నా బెస్ట్‌ఫ్రెండ్, నా ఆత్మీయుడు, నా శ్రేయోభిలాషి, నా ప్రేమసామ్రాజ్ఞి వివరాలన్నీ తీస్కుని నాకోసం వచ్చేసాడు. హాయ్"అనుకుంటూ పరుగున వెళ్ళి తలుపులు తీసి పరవశంగా కళ్ళు మూసుకుని గట్టిగా కౌగిలించుకుని"వచ్చేశావా?" అన్నాడు చిట్టబ్బాయి.
"ఆ"
"ఎందుకింత ఆలశ్యం అయ్యింది? ఇందాకట్నుండీ నీ కోసమే ఎదురు చూస్తున్నా" కౌగిలి బిగించి వీపు నిముర్తూ అన్నాడు చిట్టబ్బాయి.
"ఏం?... మళ్ళి పప్పగిట్ట నల్లగా మాడింది?"
"అసలు నేను వంట మొదలు బెడ్తేకద పప్పు మాడటానికి! ని కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నా సరేగాని ఏంటి ని దగ్గర ముక్క వాసనొస్తుంది?"
కళ్ల మూస్కునే ముక్కుతో శ్వాస ఎగపిలుస్తూ అడిగాడు చిట్టబ్బాయి.
"ముక్కువాసన రాక సెంటు వాసనోస్తదా? మేం మిలేక్క దినం స్నానం జేస్తమా ఏంది?"
చిట్టబ్బాయి మత్తు వదిలింది. చటుక్కున కౌగిలి వదలి వెనక్కి జరిగి ఎదురుగా ఎవరున్నది చూశాడు.
బిచ్చగాడు!... ఆ రోజు మాడిన పప్పువేస్తే వాడి అన్నం అంతా పాడ్తేందని, హొటల్లో తింటానని డబ్బులు వసూలు చేసిన బిచ్చగాడు.
"నువ్వా?... ఎందుకొచ్చావ్!" చిరాకుగా అడిగాడు చిట్టబ్బాయి.
"గదేం పెశ్న...నే నెందుకోస్త? అడుక్కోనికి వచ్చిన!... ఏమన్న వెయ్ దొర. బాంచన్ ని కాల్మొక్తా" అన్నాడు బిచ్చాగాడు చిట్టబ్బాయి మొహంమీదికి బొచ్చేగాడు.
"ఏం లేదు....వెళ్లు వెళ్లు" చికాకుగా అన్నాడు చిట్టబ్బాయి తలుపు వేసేస్తూ.
బిచ్చగాడు తలుపులు వెయ్యనియకుండా ఒక ల\కాలు తలుపు మధ్య పెట్టాడు/
"బాంచన్... ఆ రోజు లెక్కన నల్లపప్పెయ్యి దొర... కాల్మొక్త" అన్నాడు మళ్ళి బోచ్చేని ముందుకు చాపుతూ,
చిట్టబ్బాయి ఆశ్చర్యంగా వాడివంక చూశాడు.
"ఆరోజు నీ బొచ్చెలో పప్పేస్తే అంతగోల చేశావ్?... ఈవేళ మళ్ళి వెయ్యమంటావేం?"
బిచ్చగాడు ముసిముసి నవ్వులు నావ్వుతూ తల వోంచుకున్నాడు.
"అప్పటి లెక్కనే ఈ దినం భీ హొటల్లో భోంచేస్త... బాంచన్ కాల్మొక్త. నల్లపప్ప నా బొచ్చెల వేసి నా బువ్వ ఖరాబ్ చెయ్ దొర... నేన్ ప్తెనల్ వసూల్ జెస్కుని హొటల్ కి బొత.... బాంచన్"
అది వింటూనే చిట్టబ్బాయికి అరికాలు మంట నెత్తికెక్కింది.
ధడేల్ మని తలుపు మూసాడు.
బిచ్చగాడి కాలు తలుపు సండులోపడి నలిగింది. వాడు చటుక్కున కాలు వెనక్కి లాక్కున్నాడు. చిట్టబ్బాయి తలుపు గోళ్ళం పెట్టేశాడు,
"వామ్మోవ్ సంపిండే... బిచ్చమడిగితే నా కాలు ఇరక్కోట్టిండే!"
బయట నుండి కుయ్యో మొర్రో అంటూ బిచ్చగాడు అరుస్తున్నాడు. వాడి అరుపులని చిట్టబ్బాయి పట్టించుకోలేదు. కాస్సేపు అలా అరిచి అరిచి వాడు వెళ్ళిపోయాడు.
చిట్టబ్బాయి విసుగ్గా మరోసారి వాచ్ వంక చూశాడు.
"ఇంతసేపు విడేం చేస్తున్నాడబ్బా?!" అనుకున్నాడు. "పోనీ నేను కూడా అక్కడికి వెళ్తేనో?!"
ఇలా అనుకుంటున్నప్పడే దొర బెల్ మోగింది. చిట్టబ్బాయ్ ఒక్క ఉదుటున తలుపు దగ్గరికి వెళ్ళి గడియతిసి కన్నారావుని గట్టిగా కౌగలించుకుని మళ్ళి ఎందుకో అనుమానంవచ్చి కౌగిలివిడి వెనక్కి జరిగి చూసి తను కౌగలించుకున్నది కన్నారావుననే నిర్ధారణ చేసుకుని తృప్తిగా ఓసారి నవ్వి మళ్ళి కన్నారావుని మరింత గట్టిగా కౌగిలించుకుని "వచ్చావా కన్నా... ఇందాకట్నుండి ని గురించి ఎదురుచూసి పిచ్చేక్కిందనుకో ... ఇంతకి వివరాలు కనుక్కున్నావా?" అన్నాడు.
"నన్ను కాస్త లోపలి రానిస్తావా?" చిట్టబ్బాయ్ కౌగిలిలో ఇబ్బందిగా కదుల్తూ అడిగాడు కన్నారావు.
చిట్టబ్బాయి కన్నారావుని వదిలేశాడు. కన్నారావు గదిలోకి అడుగుపెట్టాడు. చిట్టబ్బాయి తలుపు గడియవేసి గబగబా వచ్చి కన్నారావు భుజాలు పట్టి కుదుపుతూ అడిగాడు "ఏమ్తేనా వివరాలు తెలిశాయా?"
"ఆ... చాలా వివరాలు కనుక్కున్నాను. ఆ అమ్మాయి పేరు రజని!" నావ్వుతూ చెప్పాడు కన్నారావు.
చిట్టబ్బాయి ఆనందం పట్టలేకపోయాడు.
కన్నారావుని రెండు చేతుల్తో ప్తెకేత్తి గిరగిరా తిప్పి కిందకు దింపాడు.