Previous Page Next Page 
చీకటి తొలగిన రాత్రి పేజి 19

 

                                                   వంకర గీతలు

    పొడుగాటి వాలుజడా, జడలో కదంబమాల, కళ్ళకు కాటుక, కుంకుమ బొట్టు, మెడలో నల్లపూసలు , కంచి పట్టుచీర , అదేరంగు బ్లౌజు, సాదా చెప్పులు, పమిట బుజం నిండా కప్పుకుని తెలుగుతనం ఉట్టిపడుతున్నా వేషంలో పచ్చగా, నాజూగ్గా వున్న శాంతి, రావు వెనకాలే హల్లో అడుగు పెట్టింది.
    కళ్ళు జిగేలుమన్నాయి. రంగురంగుల కాంతులు చిమ్ముతూ రకరకాల ఆకారాల్లో దీపాలు, నున్నగా మెరిసే ఫ్లోరింగు, చుట్టూ సోఫాల నిండా ఆధునిక దుస్తుల్లో ఆడవాళ్ళు , వాళ్ళ కెదురుగా నిలబడి కబుర్లు చెబుతూ మగవాళ్ళూ, చేతుల్లో రంగురంగుల పానీయాలు, నవ్వులు మాటలు, అంతా హట్టహసంగా ఉంది. మగవాళ్ళంతా ఒకలాగే కనబడుతున్నారు. వైవిద్యమంతా ఆడవారిలోనే.
    చుట్టూ వో డజను జతల కళ్ళు కుతూహలంగా యిటు తిరిగాయి. శాంతి బెదురుగా చుట్టూ చూసి కొద్ది క్షణాలు తల దించుకుంది. రావు మందులో మునిగిపోయాడు.
    పెళ్ళయి మూడేళ్ళయినా రావు సిక్కింలో ఉండిపోవడం మూలాన శాంతికి సైనికుద్యోగి భార్యగా సాంఘిక జీవితం అనుభవంలోకి రాలేదు. రావుకి ఈ ప్రాంతానికి బదిలీ అయి నెల కావస్తూంది. అది ఆమెకి మొదటి అనుభవం.
    జనరల్ భగవత్ గౌరవార్ధం ఆ రాత్రి మేస్ లో 'సోషల్ నైట్' ఏర్పాటు చేయబడింది. బిఫే డిన్నరు, ఆతర్వాత డాన్స్, బయట రేడిమేంటల్ బాండ్ వాద్యాలు వినపడుతున్నాయి.
    "నమస్తే జీ" తెల్ల షార్క్ స్కిన్ కోటు, నల్ల బౌ, నల్ల పాంటు , పచ్చగా, పొడుగ్గా ఒకతను కనపడి చేతులు జోడించాడు.
    "నమస్తే!' ఉలిక్కిపడింది శాంతి.
    "నేను లేప్టినెంట్ మెహ్రా" పరిచయం చేసుకున్నాడు మెహ్రా.
    'శాంతి" మొహమాటపడుతూ చెప్పింది శాంతి.
    "రండి" మర్యాదగా దారి చూపించి తీసుకు వెళ్ళి ఒక సోఫా మీద కూర్చోబెట్టాడు మెహ్రా.
    అంతకుముందు కూర్చున్న యిద్దరు చెరో వైపు జరిగి ఆమెకి చోటిచ్చారు.
    "ఏం తీసుకుంటారు?" అడిగాడు మెహ్ర్రా ఇంగ్లీషులో.
    "నాకేం వద్దండి."
    "మీకు కావాలా, వద్దా అని అడగలేదు నేను" ఆమె జవాబు వినకుండానే వెళ్ళిపోయాడు మెహ్ర్రా.
    "మనం యింతకు ముందు కలుసుకోలేదు. నేను మిసెస్ అరోరా" కుడివైపు ఆమె తనని తాను పరిచయం చేసుకుంది.
    "మిమ్మల్ని కలుసుకోడం ఆనందంగా వుంది, నేను శాంతి."
    "యీమె మిసెస్ తివారి."
    "నమస్తే , చాలా సంతోషం! నా పేరు శాంతి." మిసెస్ తివారి వంక తిరిగి అంది శాంతి.
    "ఇంక ఆ పేరు మరిచిపోవాలి మీరు , ఇకమీదట ఇక్కడున్నంత కాలం మీరు మిసెస్ ఎవరో ఒకరు?' నవ్వుతూ సరిదిద్దింది మిసెస్ తివారి.
    "క్షమించండి, మిసెస్ రావు" సిగ్గుపడింది శాంతి. అది ఆమెకి మొదటి పాఠం. ఏదో పెద్ద నేరం చేసి పట్టుబడ్డ దొంగలా అదోలా అనిపించింది.
    "మేజర్ రావ్ క్రొత్తగా వచ్చారు గదూ?----" మిసెస్ తివారి.
    "అవును , వచ్చి నెలవుతుంది.'
    మిసెస్ అరోరా పొట్టిగా , లావుగా , తెల్లగా ఉంది. పల్చటి నైలాన్ చీర, నెరుస్తున్న వెంట్రుకుల్ని చుట్టిన బర్మాముడి, స్లీవ్ లెస్ బ్లౌజ్, లిప్ స్టిక్ , వయస్సు పెద్దదయినా, వేషం చాలా అధినికంగా ఉంది. ఇంగ్లీషులో మాట్లాడాలన్న తాపత్రయమైతే ఉంది గాని అంతగా వచ్చినట్టు కనపడదు.
    మిసెస్ తివారి పొడుగు పొట్టీ, కాకుండా ఉన్నా, లావాటి శరీరం వయసు కి మించిన వేషం, మితభాషి , మాట్లాడినప్పుడు కల్నల్ భార్య నన్న ఠీవి, అధికారం కనపరుస్తూ మాట్లాడుతుంది. కప్పుకున్న షాల్, పెదాలకి రంగు, వగైరా లన్నింటిలాగే యింగ్లీషు మాటలు తరచు వదలడం కూడా ఆమెకొక ప్యాషన్.
    మిసెస్ దారువాలా ముప్పై ఏళ్ళ మనిషి. మంచి గులాబి రంగు ఛాయ. మంచి విగ్రహం వంటి రంగులో కలిసే చీర, చేతులు , వీపు లేని జాకెట్టు, చెవులు కనపడకుండా నడినెత్తిన చుట్టిన ముడి, లిప్ స్టిక్ ---- వయ్యారంగా ఒరిగి కూర్చుని ఎవరితోనో ఉల్లాసంగా మాట్లాడుతుంది.
    శాంతి బెదురుతూ చుట్టూ చూసింది.
    మిసెస్ రంజిత్ సింగ్, పొడుగ్గా , లావుగా , మోటుగా , పంజాబీ దుస్తుల్లో , అదోలా కనిపించే ప్రక్క పాపిడితో, చుట్టూ ఉన్నవాళ్ళంతా ఒక మేతట్టు తక్కువ అన్నట్లు చూసి మాట్లాడుతుంది.
    మిసెస్ థామస్ పొడుగు. ఫ్రాక్ మీద పుల్ వోవరు, ఎత్తు మడమల జోళ్ళు, కత్తిరించిన జుట్టు, నలుపు మీద వికారంగా కనిపించే పెదాల రంగు, తనదీదేశం కాదని అందరూ అనుకోవాలన్నట్టుంది.
    మిసెస్ తులాబీ సన్నగా , పొడుగ్గా , తెల్లగా ఉంది. పల్చటి సిల్కు చీర, దానికి మేచయ్యే స్లీవ్ లెస్ బ్లౌజు, నడినెత్తిన చుట్టిన సిగలోంచి వెండి ఫిరిగ్రీవర్కుతో చేసిన కుచ్చులు వేలాడుతున్నాయి. చెవులకి పొడుగాటి జూకాలు, పొడుగాటి లాకట్ గొలుసు, గాజులు నగలు, చెప్పులు, హేండ్ బాగ్ అన్ని చీరకి మేచయ్యేటట్టు ఉన్నాయి. కార్డిగాన్ తొడుక్కుని, మధ్య మధ్య షోగ్గాసిప్ చేస్తూ , "ఈ కాలంలోనూ ఇలాంటి వాళ్ళుంటారా?" అన్నట్లు వింతగా చూసింది శాంతి వంక.
    ఇంకా ఆ ప్రక్క మిసెస్ దేశముఖ్----- ఇంచుమించు పై మాదిరి వాళ్ళలానే వేషం, ఆధునికత ఉట్టి పడుతూ.
    వీళ్ళందరికీ అతకని మనిషి మిసెస్ మీనన్ ఒకతే'. మంచి కళ గల మొహం, జరీ లేని కంచి చీర, అదే రంగు జాకెట్టు, రింగు చుట్టిన ముడి, కుడిచేతికి బంగారు గాజులు, ఎడం చేతికి వాచి, కేపు కప్పుకుంది.
    శాంతిని చెప్పలేని దిగులు ఆవహించింది.
    "తీసుకోండి" నల్లరంగు డ్రింక్ ఒక గ్లాసు లో తెచ్చి అందించాడు మెహ్రా. మొహమాటపడి ఇబ్బందిగా చూసింది శాంతి.
    'అందరూ తాగుతున్నప్పుడూ మీరు త్రాగకపోవడం ఆచారం గాదు'. మీకింకా క్రొత్త. కొన్నాళ్ళు పొతే మీకే అలవాటు అవుతాయి. ఈ కట్టుబాట్లు ' మిసెస్ అరోరా చిన్నపిల్లలకి చెప్తున్నట్లు నవ్వుతూ అంది.
    "కోకోకోలా తాగడానికి అభ్యంతరం ఏమిటండి" నవ్వాడు మెహ్రా. శాంతి మెల్లిగా గ్లాసు అందుకుంది. నలుగురి మధ్య క్రొత్తధనంతో మధన పడడంకన్నా, అలా క్రొత్త దానిలా , తెలియని దానిలా అందర్లోనూ తేలిపోవడం మరింత బాధకరంగా ఉంది.
    కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయాడు. మెహ్రా, మిసెస్ తివారి, మిసెస్ అరోరా ఎవరితో నో కబుర్ల లో పడ్డారు. శాంతి గ్లాసు ఖాళీ చేసి చుట్టూ చూసింది. ఎవరి చేతుల్లోనూ గ్లాసు ఖాళీగా లేదు. మిగతా అంతా తాగడం మానేసి ఉత్తినే చేతుల్లో పట్టుకుని మధ్య మధ్య కొద్దిగా గుటక వేస్తున్నట్లు ఉంది. క్షణ క్షణం తప్పులు చేస్తున్నట్లనిపించింది శాంతికి. మిగతా అందరి వేష భాషలకి, తనకీ మధ్య నున్న అంతరం, తన ప్రవర్తన మూలాన మరీ ఎక్కువౌతుందన్న భయమొకటి ఆమెని క్రొత్తగా వెంటాడసాగింది.
    సరిగ్గా ఎనిమిదిన్నరకి హాలు నిండా కలకలం ఆగింది. మగవాళ్ళంతా గుమ్మం ముందు గుమిగూడారు. కరచాలనం జరుగుతోంది. జనరల్ దిగాడన్నమాట. బాండ్ వాద్యం ఎక్కువగా వినబడుతోంది. ఆడవాళ్ళ మాటల సద్దు కొద్దిసేపు ఆగింది. అందరూ అటువైపు చూడసాగారు.

 Previous Page Next Page