"ఆయన కారదిగి తీసుకోండి." తింటూన్న ముద్ద ఆపి, చైతన్య తలెత్తి చూసేడు. ఆమె చెప్పుకుపోతూ వుంది. "అలాగే ఏ హోటల్లోనో డిన్నర్ చేద్దాం. కొంచెంసేపు తిరిగిరావచ్చు. వెరైటీగా వుంటుంది."
చైతన్య నవ్వేడు. "నేను శంకర్ లాల్ కారు డ్రైవర్ని. ఆయన స్నేహితుణ్ణి కాదు."
"ఫర్లేదుమ్ అడిగితే కాదనడు."
"సారీ, అడగను."
"ఏం, ఎందుకని?" ఆమె రెట్టించింది.
"నాక్కొన్ని ప్రిన్సిపుల్స్ వున్నాయి...."
"అందులో ఒకటి భార్యని బాధ పెట్టటమా-" వెటకారంగా అడిగింది.
"నేన్నిన్నేమీ బాధపెట్టడం లేదు కాంతీ- నువ్వు నా బాధల్లో పాలు పంచుకొంటున్నావ్- అంతే."
"అవును. మీరు చేసిన తెలివితక్కువ పనులవల్ల వచ్చిన బాధలు."
"కాంతీ...." దెబ్బతిన్నట్లు చూసేడు. "ఏమిటి నేను చూసిన తెలివితక్కువ పనులు" తాపీగా అడిగేడు.
ఆ ప్రశ్నకి ఆమెలో ఎప్పట్నుంచో అణిగివున్న అగ్ని పర్వతం బ్రద్ధలయింది. పెద్దగా అరుస్తూ "చెప్పమంటారా? మీకు తెలీదా అదేమిటో? అయితే చెప్తాను వినండి....." అంది. "ఏదో కొంపలు మునిగిపోయినట్లు వున్నవాళ్ళని వున్నట్లు లేవదీసుకొచ్చేరు. చేతిలో చెల్లికానీ కూడా లేకుండా వీధిన పడేసేరు. మీ ఆలోచన్లకి బాబుని బలిచేసేరు. కట్టుకున్న భార్యని నానా కష్టాలు పెడుతున్నారు. ఇదంతా మీరేదో పెద్ద గొప్పవాడిలా చేసేనని మురిసిపోకండి! ఏమీ చేతకానివాడు చేసేపని ఇది. అవును. మీకేం చేతకాదు. ఒక్కసారి ఆస్థంతా పోయేసరికి మీకేమీ చేతకాదనే విషయం అర్థమయ్యింది- ఇప్పుడు నేనేం చెయ్యను, ఇలా తల కొట్టుకుని ఏడవటం తప్ప...." హిస్టీరిక్ గా మారిన రోదన అతణ్ణి కదిలించలేదు. ఆమె నెమ్మదిపడిన తరువాత అన్నాడు.
"నువ్వు చెప్పినవన్నీ నీకు ముందునుంచీ వున్న భావాలని నేను అనుకోవటంలేదు కాంతీ! వచ్చేశామంటే.... రావల్సివచ్చింది. మరి అదే వ్యాపారం అంటే! బాబు మరణం నీకన్నా నన్నే ఎక్కువ కృంగతీసింది. అయితే మనం చేసేది ఏమీలేదు. నీలో మనం చేస్తున్నదంతా 'తప్పు' అన్న భావం- ఇంతకాలం లేనిది- క్రొత్తగా ఏర్పడుతూ వున్నదంటే- మనమున్న దానికి వ్యతిరేకమైన ప్రపంచం ఎదురుగా కనిపిస్తూ వుండటమే దానికి కారణం అయివుంటుందని నేననుకుంటున్నాను..... దీపం దగ్గరగా వెళ్ళకు కాంతీ మసి అయిపోతావు."
అతడి మాటలకి అర్థం ఆమెకు మరో రెండు సంవత్సరాల తర్వాత అర్థమైంది. కాని అతడు మాత్రం ఆ ఉప్పెనని తొందర్లోనే ఎదుర్కోవలసి వచ్చింది.
ఆ రోజు శనివారం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి, ఇంటికి కారు నడుపుతున్నాడు చైతన్య వెనుక సీట్లో చంపాలాల్, మరో వర్తకుడు ఎవరో కూర్చొని మాట్లాడు కుంటున్నారు. స్టాక్ ఎక్స్ఛేంజి గురించి, షేర్ల గురించి సంభాషణ జరుగుతోంది.
ఇద్దరికీ ఆ విషయాల్లో అంత ప్రవేశం లేదనీ, కేవలం మిడి మిడి జ్ఞానంలో, ఒకరికన్నా ఇంకొకరికి ఎక్కువ తెలుసనే నమ్మకం కలిగించటానికి ప్రయత్నిస్తున్నారనీ వాళ్ళు సంభాషణ మొదలు పెట్టిన రెండు నిమిషాల్లో గ్రహించేడు చైతన్య.
బుల్స్ మార్కెట్ కదా. ఓ పదివేల షేర్లు కొందామనుకొంటున్నాను."
దానికన్నా పార్టనర్ షిప్ లో చేరండి. ఇన్ కంటాక్సు తగ్గుతుంది."
అతడికి వాళ్ళ మాటలు వింటుంటే నవ్వొస్తూంది. "ఈ డివాల్యుయేషన్ తో బోస్టన్ కంపెనీ షేర్లు పడిపోతాయి." అంటున్నాడు ఆ వర్తకుడు.
చైతన్య సాధారణంగా ఎక్కువ మాట్లాడడు. కానీ ఆ బలహీనమైన క్షణం అతడితో మాట్లాడించింది. అప్పటివరకూ వింటున్నవాడు ఇక ఆగలేకపోయాడు.
"ఈ డివాల్యుయేషన్ మన దేశానికి, ఎక్కడో వున్న బోస్టన్ కంపెనీకి సంభంధంలేదు" అన్నాడు వెనక్కు తిరక్కుండానే.
కారులో ఒక్కసారి గాఢమైన నిశ్శబ్దం పేరుకుపోయింది. ఆ వర్తకుడి మొహంలో రక్తం చుక్కలేదు. చాలాసేపు మౌనంగా కూర్చుండి, తనింటి దగ్గర దిగిపోయాడు.
ఇంటికొచ్చేక కారు దిగి తలుపు బలంగా వేస్తూ చంపాలాల్ అన్నాడు- "కారుకి ముందుసీటూ, వెనుకసీటూ పెట్టింది ఎందుకో తెలుసా? ముందు డ్రైవర్ కూర్చోవటానికి, వెనుక యజమానులు కూర్చోవటానికి?"
చైతన్య తలెత్తి అతడివైపు చూసేడు. పెదవులమీద అదే స్వభావసిద్ధమైన నవ్వుతో, "కాలప్రవాహంలో వెనుకవాడు ముందుకు కొట్టుకురావొచ్చు.... అదే విధి" అన్నాడు.
అప్పుడే అక్కడకు వచ్చిన నౌఖరు ఈ మాటలకి కిసుక్కున నవ్వటంతో చంపాలాల్ ఆగ్రహం పట్టలేక, "మాటకి మాట చెపుతావురా ఇడియెట్" అంటూ చెంపమీద ఫెళ్ళున కొట్టేడు.
అరక్షణం తర్వాత చంపాలాల్ గులాబి తుప్పల్లో వున్నాడు. ఆ తరువాత అతడి బంతిలాంటి శరీరం గాలిలోకి ఎగిరి మల్లెతీగ కోసం తవ్విన నీళ్ళ కాలువలో పడింది.
"బాస్టర్డ్.... నాన్న రాగానే నిన్ను పనిలోంచి తీసెయ్యక పోతే చూడు" ఇద్దరు నౌఖర్లు లేవదీస్తున్నారు.
అభిమానం చంపుకోలేని చైతన్య అన్నాడు.... "మైండ్ యువర్ టంగ్! నేనే వదిలేస్తున్నాను ఈ ఉద్యోగం...."
అరక్షణంపాటు చంపాలాల్ మొహం వెలిగింది.
అదెందుకో అయిదు నిముషాల తర్వాత చైతన్యకి తెలిసింది.
.....................
ఔట్ హౌస్ లోకి వచ్చేడు. కాంతిమతి లాంతరు వెలిగిస్తోంది.
"కాంతీ" అన్నాడు భారంగా. "ఇక్కడ కూడా మన బుణం తీరిపోయింది పోదాం పద....."
ఆమెకీమాటలు క్షణంపాటు అర్థంకాలేదు. అర్థంకాగానే ఆమె చటుక్కున లేచి నిలబడి, "ఏమి జరిగిందండీ" అంది.
"ఉద్యోగం వదిలేసేను."
"ఎలా? ఏమయింది?" ఆమె మొహం వాడిపోయింది.
"ఏమయితేనేం-- ఉద్యోగం వదిలేసేను. పద పోదాం!"
"ఎక్కడికి పోతాం?" అన్నదామె. "ఏదో చిన్న కొంపా, కడుపుకింత కూడూ దొరుకుతున్నాయి. ఇక్కడ వదిలేసిపోతే..... పోతే. ఒక్కసారి ఆ పాత రోజులు గుర్తుకు తెచ్చుకోండి....."
"ఏం పోయినా ఫరవాలేదు.... అభిమానాన్ని చంపుకోలేను."
"ఆఁ యిలాంటి అర్థంలేని ఆలోచనలతోనే ఇంతవరకూ తెచ్చుకున్నారు. ఇంకా ఎందుకు....." విసురుగా అంది.
క్షణం నిశ్శబ్దం. "కాంతీ" అతడు నెమ్మదిగా అన్నాడు. "ఆ రాత్రి మనం సర్వం కోల్పోయామని తెలిసినప్పుడు 'ఎక్కడికయినా వెళ్ళిపోదాం' అన్నాను. వద్దని నువ్వు వారించావు. అప్పుడు నేనేమన్నానో తెలుసా? 'ఇదేమిటి కాంతీ! ఎప్పుడూ లేనిది మొట్ట మొదటిసారి నా మాటకి ఎదురు చెపుతున్నావ్....' అని. జ్ఞాపకం వుందా?"
"ఉంది, అది మొట్టమొదటిసారి. కానీ.... కానీ ఆమె మాత్రం ఈ మాట అనడానికి సర్వశక్తుల్నీ కూడగట్టుకోవలసి వచ్చింది. తరతరాల సాంప్రదాయాన్నీ. రక్తంలో జీర్ణించుకుపోయిన సంసారాన్ని వదిలిపెట్టడం అంత సులభం కాదు.
కానీ వదలాలి. తప్పదు.
అవసరం వదిలిస్తుంది.
లేళ్ళ మధ్య, సెలయేళ్ళ మధ్య నిర్మించుకొన్న పర్ణశాలలో వుండే సంతృప్తి కోసమేనా రావణుడి రమ్య హర్మ్యల్ని కాదన్నది.....చెప్పు సీతా చెప్పు.....రాముడితో అడవిలో ఏముందని.....ప్రేమా....? నీరసించిన నరాలు, కాలే నుదురూ, ఎండిన నాలుకా, దానికోసం దగాలూ, స్నేహాలూ మనసులు విడిపోవటం -చివరకు మిగిలేదేది? ఒక్క స్త్రీ కోసం అంతమంది వానరుల్ని బలియిచ్చే హక్కు నీ కెవరిచ్చారు రాముడా-నలుడిమీద దమయంతికున్న ప్రేమ గొప్పదా? రాముడిమీద సీతకున్న ప్రేమ గొప్పదా - భావానికీ భావానికీ సంబంధం లేని ఆలోచనలు.......
చంపాలాల్ ఆశ చూపిన స్వర్గానికీ, చైతన్యతో వుంటున్న నరకానికీ మధ్య త్రిశంకుడిలా ఊగుతున్న ఆ స్త్రీ - స్వర్గం అనుకొంటూ అటు జారింది. ప్రతి మనిషికీ జీవితంలో కొన్ని బలహీనమైనా క్షణాలుంటాయి. చైతన్య ఇన్సూరెన్స్ కాగితం గురించి మర్చిపోయిన క్షణం.... కౌసల్య రైలు దిగాలని నిర్ణయించుకొన్న క్షణం.... అయితే వాటి ప్రభావం మనిషి అదృష్ట దురదృష్టాలని బట్టి వుంటుంది. ఎవరూ రెండోదాని గురించి ఆలోచించరు. ఆ తొందరలోనే ఆమె ఒక నిర్ణయానికి వచ్చి భర్తతో "ఇదే ఆఖరిసారి" అనగలిగింది.
అతనికి అర్థంకాలేదు, "అంటే" అన్నాడు.
ఈ లోపున తలుపు దగ్గర చప్పుడయింది.
తల తిప్పి చూశాడు. అక్కడ చంపాలాల్ నిలబడి వున్నాడు. చైతన్యని చూసి పరిహాసంగా నవ్వేడు.
తన భార్యవంక చూశాడు చైతన్య. తల పక్కకు తిప్పుకొని నిలబడి వుంది ఆమె.
మళ్ళీ చంపాలాల్ వైపు చూశాడు.
అతను నవ్వుతూనే వున్నాడు. "ఆమెకిక నీ అవసరం లేదు...." అన్నట్లుందా నవ్వు.
'మొరాలిటీ' కన్నా 'రియాలిటీ' గొప్పది కావచ్చు. అయితే ఏది 'రియాలిటీ' అన్నదే సమస్య. నైతిక విలువల్ని వాస్తవికత జయిస్తుంది అని చైతన్యకి అర్థమైంది. అతడికి ఏది వాస్తవికతో స్ఫురణకు వచ్చింది.
"..... నాతి చరామి.....!!!" ఎటువంటి పరిస్థితుల్లో ఇందరు దంపతులు భవంతుల్లో నయితేనేం, మురికికూపాల్లో నయితేనేం- ఏదో ఒక నరకంలో ఒకరొకరి తోడుగా, కాలం వెళ్ళదీస్తున్నారన్న మాటేగాని మనసా వాచా ఎందరు పరస్పరం ప్రేమించుకొంటూ కాపురాలు చేస్తున్నారు?
ప్రియమైన పాఠకుల్లారా! కాపురం పరస్పర అవసరాలు తీర్చుకోవటానికే కాదూ అన్నట్లైతే అనుబంధం పెరగవలసింది అవసరార్థం కాదు అన్నది కూడా కనిపిస్తుందేమో....
విధిచేత పేకముక్కల్లో ఒక్కొక్కటే రాలిపోతోంది. అతను మిగిలేడు. నెమ్మదిగా తాపీగా ఆ భవంతి కాంపౌండులోంచి బైటికి వచ్చేడు. దారికిరువైపులా వున్న మొక్కలు వీడ్కోలు చెబుతున్నాయి. రోడ్డుకవతల చెత్తకుండీ దగ్గర కుక్క అతడిని విచిత్రంగా చూస్తోంది. సృష్టి మౌనంగా, స్థబ్దంగా వుంది. అతడు రోడ్డు మధ్యగా నిలబడి చేతులు రెండూ గాలిలో చాచి, తల పైకెత్తి ఆకాశం కేసి చూస్తూ, బిగ్గరగా "ఇప్పుడు నేను అన్ని బంధాలూ తెంచుకున్న సర్వస్వతంత్రుణ్ణి" అని అరిచేడు.
12
"ఒసేయ్ శారదా!
ఇన్నాళ్లూ ఉత్తరం వ్రాయలేదని నీకు కోపంగాని వచ్చిందా? రాదులే. నా సంగతి నీకు తెలుసుకదా?! నువ్వు వెళ్ళిపోయిన తరువాత ఇక్కడ పరిస్థితులు మరింత దిగజారేయి. ఈ రవి అనబడే మహనీయుడు నాకు ఎప్పటికీ అర్థంకాడు. అమాయకుడో తెలీదు..... మానసికంగా బలహీనుడో తెలీదు. బహుశా రెండూ కరక్టే అయివుంటాయిలే. లేకపోతే బిజినెస్ లో నష్టం వచ్చిందని తెలిసి. తాగేసి ఇంటికొచ్చి నీ చేతులు పట్టుకొని ఏడవటం ఏమిటి ఏడవమను కాదన్నదెవాడు! కానీ నా చేతులు పట్టుకుని ఏడవొచ్చుగా. పోతే నువ్వో ఫూల్ వి.