Previous Page Next Page 
పర్ణశాల పేజి 18


    "కారు మా అబ్బాయి పట్టుకెళ్ళినట్టున్నాడు. వస్తాడు...." ఆయన మాటలు పూర్తికాకుండానే 'కాంటెస్సా' గేట్లోంచి దూసుకొచ్చి ఆగింది. అందులోంచి ముఫ్పైఏళ్ళ యువకుడు దిగేడు. చేతికి ఉంగరాలు, ముఖంలో దర్పమూ వున్నాయి.

    "నా కొడుకు చంపాలాల్" అన్నాడు. ఇంతలో అతడు దగ్గరగా వచ్చాడు.

    "ఎవరు వాళ్ళు?" అడిగేడు ఇంగ్లీషులో.

    "నేనే తీసుకొచ్చేను. మద్రాసీలు. ఏ ఉద్యోగమూ లేకపోతే మనకెలాగూ డైవర్ కావాలిగా, అందికని."

    "సంభాషణంతా ఇంగ్లీషులోనే జరుగుతోంది. "ఇలా అడ్డమైన వాళ్ళనీ తీసుకొచ్చి పెడితే కొంప గుల్ల చేస్తారు."

    "కాదు, నమ్మకస్తుల్లానే వున్నారు."

    "ముందు అందరూ అలానే కనపడతారు" అని లోపలికి వెళ్ళిపోయాడు.

    శంకర్ లాల్  తిరిగి, "కారు తీసికెళ్ళి శుభ్రంగా తుడువ్. ఈ రోజునుంచీ నువ్వు పనిలో చేరినట్టే లెఖ్క" అన్నాడు.

    చైతన్య తలూపి, తాళాలు తీసుకోబోతూ వుంటే ఏదో అనుమానం వచ్చినట్లు "ఏం చదువుకున్నావు నువ్వు?" అడిగేడు.

    "తక్కువ- చాలా తక్కువ" అని అక్కణ్ణుంచి కదిలేడు చైతన్య. కాంతిమతి అతణ్ణి అనుసరించింది.

    పైనబాల్కనీలోంచి చంపాలాల్ వాళ్ళనే చూస్తున్నాడు.


                              *    *    *

    జాయినింగ్ రిపోర్టు ఇచ్చింది శారద. ఆమె చెయ్యవలసిన పనిని వివరించేడు హెడ్క్లర్క్.

    పోస్టు రాగానే పుస్తకంలో వ్రాయటం, నెంబరింగ్ ఇవ్వటం- అదీ ఆమె పని. దానికి జీతం నూటడెభ్బై అయిదు రూపాయలు. ఒక మనిషి మామూలుగా బ్రతకటానికి అది చాలు.

    ఆమెకి ఎంతో రిలీఫ్ గా , ఒక పెద్ద బోనులోంచి తప్పించు కొన్నట్టు వుంది.

    నిజంగా ఈ ఉద్యోగం దొరకటం తన అదృష్టం. ఆలోచిస్తూనే పనిచేసింది.

    లంచ్ అవర్లో ఎవరో ఒక కోక్లర్క్ దగ్గరకొచ్చాడు. యువకుడు పాతికేళ్ళుంటాయి.

    "లంచ్ అవర్లో పనిచేస్తున్నారేమిటి?"

    ఆమె తలెత్తి చూసింది. "రండి, కాఫీ తాగొద్దాం."

    "కాంటీన్ ఎక్కడ?"

    అతడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. "ఆఫీస్ కాంపౌండ్ లోనే, రండి" అన్నాడు.

    "అహఁమీతో రావటానికి కాదు. నేను వెళతానులెండి" అని తిరిగి పేపర్లు చూసుకోసాగింది. మాడిపోయిన బల్బులా మారింది అతడి ముఖం. అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.

    శారదకి ఆశ్చర్యం వేసింది. తనేనా అంత మాట్లాడింది. మగవాడు కనబడితే సిగ్గుతో కుంచించుపోయే తనకి అంత ధైర్యం ఎలా వచ్చింది?

    థీయరీ ఆఫ్ ఎవల్యూషన్ గురించీ, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కోసం ప్రకృతి ప్రసాదించే వరాల గురించీ ఆమెకి తెలీదు.


                              *    *    *

    అప్పటికి చైతన్య శంకర్ లాల్ తో కలిసి బెనారస్ వెళ్ళి రెండురోజులయింది. బిజినెస్ పనిమీద శంకర్ లాల్ అలా వూళ్ళు తిరుగుతూ వుంటాడు. ఆఫీసుపని అంతా కొడుకు చూసుకొంటూ వుంటాడు. వాళ్ళు రావటానికి ఇంకో రెండురోజులు టైముంది.

    కాంతిమతి వంట పూర్తి చేసింది. ఒక్కదానికి కాబట్టి పెద్ద ఆలస్యం అవలేదు. సాయంత్రం అయిదయింది.

    అవుట్ హౌస్ గుమ్మంలో నిలబడి తోటలో ఆడుకొనే పిల్లలకేసి చూడసాగింది. అప్పటికి వాళ్ళు పనిలో చేరి రెండు నెలలయింది. శంకర్ లాల్ రెండొందలు ఇచ్చేవాడు. కరక్టుగా ఫస్టు తారీఖు సాయంత్రానికి జీతం అందేది.

    ఆమె పూర్వపు సౌందర్యం మళ్ళీ తిరిగి వచ్చింది. ఏ ఆభరణాలూ లేకపోయినా - ఆమెలో ఏదో ఠీవి అంతర్లీనంగా ప్రతిబింబిస్తూ వుంటుంది. ఆమె శరీరచ్ఛాయ తెల్లటి తెలుపు. దానికి తోడు పెద్ద పెద్ద కళ్ళు.

    కుర్రవాడు కొట్టిన బంతివచ్చి ఆమె కాళ్ళముందు పడింది. వంగి తీసి అందివ్వబోయింది. "మీరెందుకు, వాళ్ళు తీసుకుంటార్లెండి" హిందీలో అన్న మాటలు వినిపించినయ్, తలెత్తి చూడగానే చంపాలాల్. ఆమె అడుగు వెనక్కి వేసింది.

    "మీకు హిందీ వచ్చా?" అడిగేడు. ఆమె రాదన్నట్లు తలూపింది.

    "మరెలా?" తనలో తనే అనుకొంటున్నట్టు అన్నాడు.
    "ఇంగ్లీషులో చెప్పండి, ఫరవాలేదు" అందామె ఇంగ్లీషులో.

    "మీకు ఇంగ్లీషు వచ్చా" అతడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయ్. ఆమెకి లోలోపల కొద్దిగా గర్వం కలిగింది. ఏమనుకుంటున్నాడు ఇతడు తన గురించి?.....

    కానీ అది ఎక్కువకాలం ఉండలేదు. "మరి మీ ఆయనకి ఇంగ్లీషు రాదన్నాడు."

    ఉలిక్కిపడింది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇంకో అబద్ధం "ఆయనకీ రాడు" అంది.

    "ఓ-లవ్ మారేజ్...." అన్నాడు.

    ఆమె మాట్లాడలేదు.

    "మీరూ ఇతనితో కలిసి వచ్చేయటం చూసి. మీ తల్లి దండ్రులు చాలా దుఃఖిస్తూ వుండి వుంటారు."

    ఇంతలో ఇద్దరు పిల్లలూ తండ్రి దగ్గరకొచ్చి బయటకెళదామని గొడవ చేయసాగేరు. "వీళ్ళకి కొంచెం తలదువ్వండి! వీళ్ళ అమ్మ రేపుగాని రాదు" అన్నాడు. ఆమె తన ఇంట్లోంచి దువ్వెనతెచ్చి దువ్వేలోపులో కారు గ్యారేజిలోంచి తీసేడు.

    పిల్లలిద్దరూ తండ్రి ప్రక్కన కూర్చొన్నారు.

    "మీరూ రండి" అని ఆహ్వానించేడు.

    "నేనా-" అందామె ఆశ్చర్యంతో.

    "అవును. పది నిమిషాలలో తిరిగి వచ్చేద్దాం. ఈ లోపులో పిల్లలకి ఏదయినా కావల్సివుంటే కష్టం."

    ఆమెకి కారు ఎక్కక తప్పలేదు. ఎయిర్ కండిషన్డ్ రెస్టారెంట్ ముందాగింది కారు. ఆమె గ్లాస్ ఎత్తి లోపలివేపు లాక్ చేసి, కారు తలుపు తీసింది.

    అందరూ లోపలికి వెళ్ళేరు. డిన్నర్ కి ఆర్డరిచ్చాడు.

    పియానో రికార్డు సన్నగా వినిపిస్తూంది. గదంతా సబ్ డ్యూట్ లైటింగ్ వ్యాపించి వుంది.

    అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నవ్వుతున్నారు. ఆనందం అంతా తమసొత్తే అన్నట్టు హాయిగా వున్నారు. వీళ్ళ ప్రపంచంలో డబ్బో సమస్య కాదు- అనారోగ్యం లేదు. కసురుకోవటాలూ తిట్టుకోవటాలూ లేవు. అంతా ఆనందమే.

    "ఏమిటీ ఆలోచిస్తున్నారు? డిన్నర్ వచ్చి ఐదు నిమిషాలయింది" అన్నాడు. ఆమె ఉలిక్కిపడి నెప్ కిన్ తీసుకొంది. కత్తీ ఫోర్కులతో ప్లేటుమీద శబ్దం చెయ్యకుండా మిక్డ్స్ నోడూల్స్ తినసాగింది. ఎంత లేదనుకొన్నా ఆత్రం కనపడుతూనే వుంది. ఐదు నిమిషాల్లో డిన్నర్ పూర్తయింది.

    "ష్ ల్ ఐ ఆస్క్ ఫర్ కెసెట్టా?"

    "నో. ఐ ప్రిఫర్ పుడ్డింగ్"

    అతడికి సంతోషంగా వుంది. ఆమెని చూస్తుంటే డబ్బున్న కుటుంబంలోనుంచి వచ్చినదని తెలుస్తూనే వుంది. ఒక్కచిన్న తప్పుచేసి తనవాళ్ళని వదిలిపెట్టినట్లుంది.ఆ ప్రేమ తాలూకు మత్తు ఈపాటికిపూర్తిగా తగ్గిపోయి వుంటుంది. ఏం కోల్పోయిందో చూపించాలి.

    డిన్నర్ పూర్తయ్యేసరికి తొమ్మిదయింది. కారు నెమ్మదిగా వెళుతోంది.

    కిటికీలోంచి గాలి అలలు అలలుగా వీస్తూంది. సీట్లు మెత్తగా వున్నాయి. గాలికి పైటచెంగు ఎగిరెగిరి పడుతోంది. కారులో కూర్చొని చెవి క్రిందకి జారిపోయి ఎగురుతోన్న ముంగురుల్ని మాటిమాటికీ సర్దుకోవటం ఒక వింత అనుభూతి.

    ఎన్నాళ్ళకి మళ్ళీ!!

    పిల్లలతో కలసి అలా వెళ్ళటం ఎంతో బాగుంది.

    మరుసటి రోజు అంత స్టాకూ మాకు పంపగలనంటారు" అన్నాడు జపాన్ నుంచి వచ్చిన ప్రతినిధి.

    "ఓ తప్పకుండా"

    షీవాజీ రీగిల్ పెగ్గూ గ్లాసులో పోసేడు.

    "మిస్టర్ రవీ!"

    "యస్-"

    "మీరీ కాంట్రాక్టు వప్పుకోవటం చాలా బావుంది. మామూలు రేట్ కన్నా పదిశాతం ఎక్కువ ఇవ్వటానికి మా కంపెనీ వప్పుకొంది."

    "దట్స్ రియల్లీ నైస్ఆఫ్ యూ"

    ఇదిగో కాంట్రాక్టు ఫారం. ఫెయిల్యూర్ క్లాజ్ నలభైశాతం, పార్టీ పెర్సెంట్ ఆఫ్ ది టోటల్ వేల్యూ."

    "నో ప్రాబ్లెమ్" ఇద్దరూ సంతకాలు చేసేరు.

    రాత్రి పదింటికి అతడు ఇంటికి చేరుకొనేసరికి మానేజరు అప్పుడే కిరణ్మయితో మాట్లాడి వెళుతున్నాడు. శత్రు గూఢచారిని చూసినట్లు రవి అతడిని చూసుకొంటూ లోపలికి వెళ్ళేడు.

    కిరణ్మయి సోఫాలో కూర్చొని వుంది. హుషారుగా 'కిరణ్' అన్నాడు. "ఐదు లక్షలకి కాంట్రాక్టు సంపాదించేను." ఆమె ముఖంలో ఆనందం కనబడలేదు. "తెలిసింది" అంది కామ్ గా.

    "రేపట్నుంచీ పని ప్రారంభించాలి" వుత్సాహంగా అన్నాడు.

    "అక్కర్లేదు రవీ! మానేజర్ గారికి ఇప్పుడే చెప్పేను - పుస్తకాల్లో లక్షా పాతికవేలు నష్టం రాసుకొమ్మని."

    రవి నీళ్ళుగారిపోయి "అదేం" అన్నాడు.

    "నువ్వు ఈ సంస్థకి ఏ విధంగానూ ప్రతినిధివికావు అని ప్రకటించి ఈ నష్టం రాకుండా చేసుకోవచ్చు. కానీ అది ణా కిష్టం లేదు. అందుకే లక్షరూపాయలూ నష్టపోవటానికే సిద్ధపడాల్సి వచ్చింది."

    "నేను చేసే ప్రతి పనీ తప్పకుండా నష్టానికి దారితీస్తుందన్న ప్రగాఢ విశ్వాసం మీ అందరికీ ఎందుకు కలిగిందో కాస్త చెబుతావా?" ఎర్రబడ్డ ముఖంతో అడిగేడు.

    "తప్పకుండా? సీజన్ కాని సమయంలో, నెలరోజుల్లో ఐదు లక్షల విలువగల రొయ్యల్ని ఎలా సంపాదిద్దామనుకున్నావు? ఏ ప్రగాఢ విశ్వాసంతో?"


                           *    *    *

    "ఈ రోజు సినిమాకి వెళదాం" అంది కాంతిమతి.

    "సరే...." అన్నాడు చైతన్య భోజనం చేస్తూ. 

 Previous Page Next Page